శ్రీరామ శతకము - రచనఃశ్రీకుందేటి రామచంద్రయ్య - ప్రచురణఃశ్రీ గీతా గ్రంథమాల, తెనాలి-2 (1966) __/\__
క॥వేదమే రామచరిత్రము
వాదంబులుమానిజనులు వాక్కుసుమములన్
శ్రీదయితుడైనరాముని
పాదంబులు గొల్వుడీ శుభంబులుగల్గున్.
శ్రీ మద్రఘు వంశార్ణవ
సోమా సుగుణాభిరామ సురమునినుత నా
మా మహిజా హృదయాంబుజ
ధామ పరంధామ రామ దశరథ రామా! (1)
క॥సారాసార విచారా
ధీరా దురి తౌఘదూర ధీజన సురమం
దారా దీనా ధారా
రారా నను బ్రోవ భక్తరక్షక రామా!(2)
క॥రామా రఘు రామా జయ
రామా శ్రీరామ రామ రాజద్గుణధా
మా మౌనివినుత నామా
భూమిసుతాహృదయధామ బ్రోవుము రామా! (౩)
క॥విను కుందేటి సదన్వయ
మణి వేంకట సుబ్బయకు సుమతి లక్ష్మమకున్
దనయుండ రామచంద్రుడ
ననయము నివసింతు ‘మట్లి’ యందునరమా! (4)
క॥కందంబుల నూటెనిమిది
పొందుగ రచియించి నీకు పూదండగనే
నందియ్యబూనితిని యా
నందముతో గొనుము లోక నయక రామా!(5)
క॥రవినిభ నీపై చెప్పిన
కవనంబుపవిత్రమై యఘంబుల బాపున్
సువిశాలకీర్తి నొసగుచు
నవిరళబాగ్యములనొసగు ననఘా రామా! (6)
క॥నీలీలల వర్ణింపను
చాలరు బ్రహ్మాదులైన జాలుదునా నే
జాలను బాలుడ దయతో
పాలింపుము నన్ను పరమ పావన రామా!(7)
క॥‘శ్రీరామ’ యనెడు మంత్రము
తారక మంత్రంబుగాన తలచెద నెపుడున్
సారవివేకము నొసగుచు
కారుణ్యము తోడ నన్ను కావుము రామా!(8)
క॥‘రామ’ యను భవన్మంగళ
నామము నెవ్వండు తన మనంబున సతతం
బేమఱకదలచు చుండునొ
యామనుజుడుమోక్షపదవి కర్హుడు రామా! (9)
క॥అదిమి సమస్తేం ద్రియముల
వదలక భవదీయ పాద వనజంబుల నా
హృదయంబుననిల్పి నుతిం
చెద గావుముసంతతంబు శివనుత రామా! (10)
క॥దురితంబులు సేయక మది
నిరతముశ్రీరామ యనుచు నీ నామంబున్
స్మరియించుపుణ్య పురుషులు
గురుసుఖములుచాల చూఱ గొందురు రామా! (11)
క॥కొండల శత మఖుడుద్ధతి
ఖండించిన విధము దోప ఖల మస్తకముల్
ఖండించి సాధు జనముల
మెండుదయం బ్రోచినావు మేదిని రామా!(12)
క॥సతతము తావకనామ
స్తుతి జేయగ దలతుగాని తుచ్ఛపు సుఖముల్
మతి కింపు కావు దయనా
మతమును నెర వేర్చిమనుపుమా శ్రీరామా!(13)
క॥ఎంగిలి ఫలములు శబరి యొ
సంగగ భుజించి ఫలరసాస్వాదన కు
ప్పొంగి శబరాంగనకు ము
క్తింగడు బ్రేమమున నొసగితివి శ్రీరామా!(14)
క॥తిరుమణి ధరించి నుదటన్
గరమను రాగంబు బొంగగా నినులో నే
మఱక దలంచెడు వారికి
నరకం బెక్కడిది పాపనాశక రామా!(15)
క॥కామక్రోధము లనబడు
తామస గుణముల వధించి ధన్యపదంబున్
గామించి తావకీన సు
నామంబుజంపిప వలె మనంబున రామా! (16)
క॥కోరికలణంచి తావక
చారు పదాం భోజముల సుసౌఖ్యోన్నతికై
పూరుష వరేణ్యు లెప్పుడు
నూరకనర్చించుచుందు రుర్విని రమా! (17)
క॥ఫలమైన పత్రమైనను
జలమైనంబుష్పమైన జాలిన భక్తిన్
ఫలకాంక్షవిడచి నీపద
ములపైనిడు జనుల నెపుడు బ్రోతువు రామా! (18)
క॥ధర నీకపరాధుం డొక
డరయగలేడెట్టులన్న నాత్మేశుడ వై
పరగుదువుజీవకోటికి
సురనుతవరచరిత సుగుణశోభిత రామా! (19)
క॥దినమున కొకమాఱై నను
మనముననీదైననామ మంత్రంబునుయే
మనుజుడుజపించు వానికి
ఘనముగకైవల్య పదము కల్గును రామా! (20)
క॥నీకరుణ వలన నమరా
నీకముయమృతమును బడయ నేర్చిరి దనుజుల్
నీకరుణలేక చచ్చిరి
కాకోదరశయన భక్త కల్పక రామా! (21)
క॥జగము సృజియింప నజుడవు
జగమునుపోషింప శేష శాయివి తుదనీ
జగముహత మార్చ భవుడవు
తగు తగవరివగుదు మఱియు ధరణికి రామా! (22)
క॥తలపున భవదీయ పదం
బుల నిలిపినుతించునట్టి పురుషుల జన్మం
బిల పావనమైవెలయును
నలినీహితవంశ పావనా శ్రీరామా!(23)
క॥పగలును రాత్రులు సంధ్యలు
తగు భక్తితొ నిన్ను మదిని దలచు జనంబుల్
తెగనఱకి యఘలతా తతి
వగవిడిచి పరంబు గండ్రు వరదా రామా!(24)
క॥తానింద్రియముల తెరువున
బోనొల్లక బుద్ధి నతని భ్రూమధ్యమునన్
బూని కుదిరించి సతతము
ధ్యానింపగ వలయు నిన్ను దశరథ రామా!(25)
క॥నీ వఖిల జీవరూపివి
కావున ప్రతి జీవియందు గారుణ్యమునే
పావన మతి చూపించునొ
యవానికి గల్గు సుఖము లన్నియు రామా!(26)
క॥ఇచ్చితి శబరికి మోక్షము
నిచ్చితి రవి సుతున కభయ మిచ్చితి వహహా
చచ్చిన వానికి నసువుల
నచ్చెరువు భవత్ చరిత్ర మనఘా రామా!(27)
క॥చరణ రజంబున శిలనొక
తరుణిగ నొనరించినట్టి తావక మహిమం
బెరుగక శక్యమె నాకా
కఱ కంఠుని యట్ల మోక్షకారణ రామా!(28)
క॥అనవరతము నీ నామము
మనమున ధ్యానించునట్టి మహనీయులనా
యినజుడు చంప దలంపం
డన తావక మహిమ బొగడనలవియె రామా!(29)
క॥ఎల్ల జగంబుల నేలెడు
చల్లని దొరవీవటంచు సన్మునులు సతం
బుల్లముల నిను దలంతురు
ఫుల్లాబ్జ దళాక్ష భక్తపోషక రామా!(30)
క॥జిత కాములు నీనామా
మృత మెప్పుడుద్రావిత్రావి తృప్తిం గని సం
తత మాత్మానందంబున
క్షితిదన్మయులై చరింత్రు శ్రీరఘు రామా! (31)
క॥పర తత్త్వజ్ఞులు సతతము
పరమాత్ముడవీవటంచు బాయకమదిలో
తిరమగుభక్తిని తావక
చరణంబులగొలుతురయ్య జానకి రామా! (32)
క॥చిరకాలము తావక పద
సరసిజములభక్తి గొలుచు జనములకే శ్రీ
కరమగుముక్తి లభించును
దురితాత్ములకెందు సుఖము దొరుకదు రామా! (33)
క॥హరి భక్తులు పుణ్యాత్ములు
దురితాటవిదహనులంచు తోరపు భక్తిన్
హరి భక్తులసేవించెడు
పురుషులరక్షింతువీవు భువిలో రామా! (34)
క॥కష్టంబనక నిరంతర
మష్టాక్షరమంత్ర రాజ మాదరమున స
న్నిష్ఠజపించెడు వారల
కష్టంబులదీర్చి ప్రేమ గాతువు రామా! (35)
క॥హరి నారాయణ మాధవ
హరి హయనుత చరణ పాపహరణా పీతాం
బరధర యనుచు మనంబున
నిరతము ధ్యానింప వలయు నిను శ్రీరామా!(36)
క॥శరణార్థుల రక్షింపగ
కరుణా నిధివైన నిన్ను కలకాలంబున్
స్మరియింప బూను వారల
గరుణం గాచెదవు భక్తకల్పక రామా!(37)
క॥నిరతంబు నెవ్వడష్టో
త్తర శతనామంబులన్ ముదంబున మదిలో
కరము దలంచునొ వానికి
పరలోక సుఖంబు లెల్ల బాల్పడు రామా!(38)
క॥అనయంబు నీపదార్చన
మునకాలము బుచ్చు నట్టి పుణ్యాత్ముడుస
న్మునుల కిరవైన పురమున
ఘనసుఖములు పొందు మోక్షకారణ రామా!(39)
క॥ధరణి పదంబులు మఱియును
వర మస్తకమే నభంబు వాయువులసువుల్
సురచిరలోచన యుగ్మము
తరణియు చంద్రుండు నీకు తధ్యము రామా!(40)
క॥కలుషముల బాపి నీపద
జలజంబుల జూపి దివ్య సౌఖ్యంబుల నీ
గల వాడ వనుచు నిన్ భ
క్తులు కొలిచెద రెపుడు దురిత దూరారామా! (41)
క॥మీనిలయమునకు నడచెడు
వానికి మిమ్మెపుడు గొలుచు వానికి మిమ్మే
ధ్యానించు వానికే బ్ర
హ్మా నందము గలుగు నండ్రు యతులిల రామా!(42)
క॥పరకాంతను గని నప్పుడు
పరవిత్తము గాంచి నపుడు పరుగిడు మనమున్
నరుడు బిగబట్ట నేర్చిన
పరమ పదము గలుగు పరమ పావన రామా!(43)
క॥వినయము విద్యయు గలిగియు
మనమున ‘శ్రీరామ’ యనుచు మఱువక సతతం
బును నిన్ను దలచుచుండెడు
జనములకే పరముపదము సమ కొను రామా!(44)
క॥పావన మగు నీనామము
భవము నందలచు నట్టి భక్త జనంబుల్
పొవుదురు మోక్ష పదవికి
శ్రీ వర పాపౌఘ దూర శ్రీరఘురామా!(45)
క॥కపివరుల గూడిలంకా
ధిపుడగు రావణుని జంపి దివిజులనెల్లన్
గృప గాచిన నిను దలచిన
నుప హతమౌ పాప సమితి యుర్విని రామా!(46)
క।।నిరతము నిను దలువనిదే
దురి తటవి కలి ముక్తి దొరుక దటంచున్
గిరిజకు గిరిజాపతి ము
న్నెఱి గింపడె విశదముగ నరేశ్వర రామా!(47)
క॥ఏనీనామము నిత్యము
మానక జపియించునట్టిమనుజుండెవడో
వానికి సరి యెవ్వండీ
మానవలోకమున లేడు మాధవ రామా! (48)
క॥తలపగ వలె నీనామము
దొలగగవలె పాపములకు దురితాత్మకులన్
గలయకనుండగ వలెసా
ధులుమోక్షము గోరి యఘవిధూరా రామా! (49)
క॥కరమర్థి నిన్ను గొలిచెడు
నరోత్తములయఘముబాపి నాక సుఖములన్
గురుణించియొసగెదవు వర
తరణికులాంభోధిసోమ దశరథ రామా! (50)
క॥రాగాది దుర్గుణంబుల
నీగినపుణ్యాత్ముడెవడొ నీయిల నతడే
భోగియుత్యాగియుదలప న
రాగియుమఱిముక్తజీవి రాఘవ రామా! (51)
క॥దేహమును విడచు నప్పుడు
‘సో2హం’భావంబునెఱిగి సుస్థిరమతియై
దేహినినీలో జేర్చును
దేహముపైనాశమాని ధీరుడు రామా! (52)
క॥కరమను రాగముచె నీ
చరణంబులగొలుచునట్టి సజ్జనులకు శ్రీ
కరమగుమోక్షము నిత్తువు
ధరణిసుతాచిత్తజలజధామా రామా! (53)
క॥పురహరుని పగిది నిన్నే
పురుషుడుమది దలచునట్టి పురుషుని త్రిపురా
సురఘాతిసమునిగా నా
దరమునరక్షించెదవు కదా శ్రీరామా! (54)
క॥పగలనక రాతి రనకను
జగతింజన్మించి నట్టి జనులేకులులై
న గడున్భక్తిన్ నినుదల
పగ బూనినబ్రోచెదవు శుభ ప్రద రామా! (55)
క॥హరునకు సరసిజ భవునకు
గిరిసుతకు శబరికి జానకీ దేవికి భా
స్కరసూతికి మారుతుకిన్
గరముప్రియము గాదె నీదు నామము రామా! (56)
క॥భూతమయ శరీరంబును
భూతలమునయోగి విడచి పోయెడు వేళన్
భూతిదలిర్పగ నాపర
నాతినిగన చనునులోక నాయక రామా! (57)
క॥తాళద్వంద్వము గరముల
గీలించిసదాత్వదీయ కీర్తనముల నెం
తే లలితంబుగ బాడిన
నాలింతువుముదముతో శివార్చిత రామా! (58)
క॥కూటికి గుడ్డకు నీపై
పాటలుపాడంగనేల భవహరమునకై
పాటలుపాడిన ముక్తికి
బాట కదాయది మునీంద్ర పాలక రామా! (59)
క॥సిరియున్న మాత్రమున నీ
కరుణకుపాత్రుండు గాడు కలకాలము నీ
చరణంబులనర్చించెడు
పురుషునివలె సర్వలోక పూజిత రామా! (60)
క॥అమృతము కన్నను నీనా
మము రుచియనితెలిసి తలచు మనుజుల పలుపా
పముల వెలిద్రోచి యల మో
క్షమునిత్తువు గరుణ తోడ జానకిరామా! (61)
క॥సుందర విగ్రహ దరశరథ
నందనశివచాప ఖండనా భూమిసుతా
కందర్పదర్ప కాంతక
వందితయని నిన్నుదలప వలయును రామా! (62)
క॥శ్రీకర శుభకర ఘనకరు
ణాకరకోదండ ధర యనాథ వరద పృ
ధ్వీకన్యకా ముఖాబ్జ ది
వాకరయని నిన్ను దలప వలయును రామా! (63)
క॥పుట్టితివి దాశరథి యన
బట్టితివలజనకరాజ పట్టినిరిపులన్
గొట్టితివనాథులను చే
బట్టికృపన్ గాచితివి శుభప్రద రామా! (64)
క॥అల శబరి యిచ్చు ఫలములు
సలలితమతితోడదినుచు శబరాన్వయ తొ
య్యలిపైజూపిన వరచూ
పులునాపైజూపరాదె బుధనుత రామా! (65)
క॥నీ కన్న వేల్పు లెవ్వరు
నాకంటికిగానరారు నా నేరములన్
బో కార్చుచు రక్షింపుము
కా కాసురగర్వహరణ కవినుత రామా! (66)
క॥కరి గాచితి వరి గాచితి
హరి దశ్వుతనూజుగాచి తట్టుల శబరిన్
బరి రక్షించితివీవని
స్మరియించెదనన్ను గావుమా శ్రీరామా! (67)
క॥బాలుడ దురిత విచారుడ
కూళ జన ప్రియ సఖుండ గుమతిన్ జెడితిన్
జాలింతు నింక నాపని
పలింపుము నన్ను భక్త పాలక రామా! (68)
క॥మునునా జేసిన నేరము
లను బాపుము నిత్య మోక్ష లక్ష్మీయుతమై
తన రారగ గరు ణింపుము
వన జాక్షా భక్తలోక వందిత రామా! (69)
క॥ఒప్పెడు నీ రూపంబును
తప్పక నా హృదయమనెడు దర్పణమున నే
నెప్పుడు జూడ దలంచితి
నప్పా! కరుణింపవే యఘాంతక రామా! (70)
క॥ఎన్నాళ్లు జీవముల తో
డన్నుందునొ యన్ని నాళ్లడంబత్వము తో
నిన్నే దలచుచు నుండెద
నన్ను గృపం గావుమా యనాథుడ రామా! (71)
క॥నిను మనమున దలచెడు యా
మనుజుల దురితంబువాయు మార్తాండుని ద
ర్శనమున చను చీకటి పగి
దిని గాధి తనూజవినుత ధీరా రామా! (72)
క॥గరుడుని గని నాగాంగన
బరుగిడు నట్ల రయ నిన్ను భజియించెడి యా
నరుల దురితంబు తొలగును
కరుణా కర పపదూర ఖరహర రామా! (73)
క॥నీ నామంబు దలంచెడు
వానికి సౌఖ్యంబు లమరు వసుధనటంచున్
నీ నామంబు దలంపగ
బూనితి రక్షింపుమా సుపుణ్యా రామా! (74)
క॥శ్రీ మత్ఛీతా హృత్సుమ
ధామా సుగుణాభిరామ దనుజ వి రామా
వ్యోమ చర వినుత నామా
కామితముల నిచ్చి నన్ను గావర రామా! (75)
క॥ఈశా సజ్జన పాప వి
నాశా నిజ దాస పోష నగ చర వంద్యా
శ్రీ శా మామక యాశా
పాశంబుల ద్రెంపవే శుభప్రద రామా! (76)
క॥కను చుండగ చను ప్రాయము
కను చుండగ దొలగు సిరులు కను చుండగనే
ఘన పాశ హస్తుడై రవి
తనయుడు కొని పోవు ప్రాణ దశకము రామా! (77)
క॥సార విహీనంబగు సం
సారమునం జిక్కి నీదు చర ణాబ్జములన్
గోరి నుతింపక పోయితి
కారుణ్యము జూపి నన్ను గావుము రామా! (78)
క॥దమ సంపాదన లేక త
పము లేక సురార్చనా సు భాగ్యము లేకన్
శమ మింతే నియు లేక ఘ
న మగు పరం బెటుల గల్గు నయ గుణ రామా! (79)
క॥ఘన మగు గృహస్థ ధర్మం
బున నుండుచు మౌనులట్ల బూని సతంబున్
నిను దలచు వారు సౌఖ్యం
బనవరతము బొంద గలరు హర సఖ రామా! (80)
క॥‘రామ’ పద మరయ బ్రహ్మము
‘రామ’పదం బమృత పదంబు ‘రామ’ పదార్థం
బే మనుజు డెఱిగి దలచున్
ఆమనుజుడు గాంచు మోక్ష మఘహర రామా! (81)
క॥మనమున నించుక సేపై
నను ‘రామా’ యని దలంచి నను జాలు నరుం
డిను డుండుదాక సుగతిం
గని శుద్ధుండై వెలుంగు గద జయ రామా! (82)
క॥పరమ బ్రహ్మం బనినన్
బర తత్త్వంబనిన పరమ పదమనినన్ శం
కరు డనినన్ మఱి దామో
దరుడనినన్ నీవయే కదా శ్రీరామా! (83)
క॥‘రామ’యని నిన్ను దలచని
యామనుజునిజన్మమేల నది కాల్చనొకో
‘రామ’ యని నిన్ను దలచిన
యామనుజుని జన్మ ధన్య మౌనోరామా! (84)
క॥నీనామ ధ్యానంబును
మానను నామనము నందు మానోన్నతి తో
కాన ననున్ గరుణించవె
జానికి ముఖకమల భృంగ జయ రఘురామా! (85)
క॥జనక సుతా వద నాంబుజ
దినకర దివ్య స్వరూప ధీ సంయుక్తా
యనయము బొందక కావవె
యనయము నను బంక్తి కంథరాంతక రామా! (86)
క॥ధర్మము సముద్ధ రింపగ
దుర్మతులన్ భూమి మీద దునుమాడంగా
దుర్మద వృత్తి జరించిన
మర్మ మెఱిగి నిన్ను దలతు మదిలో రామా! (87)
క॥ఖలులం ద్రుంచుచు భూమికి
గల బాధంబాప లోక కళ్యాణార్థం
బిల జన్మించిన నిను నే
దలతుం నను బ్రోవ నీవు దలపుము రామా! (88)
క॥ఓ కారుణ్య పయోనిధి
నీ కారుణ్యంబు జూపి నిరతంబు ననున్
సాకవె యనాథుడను నీ
వే కదె నాథుడవు నాకు విమలా రామా! (89)
క॥జల జాక్ష సతము నిను హృ
జ్జల జంబు న నిలిపి కొలుచు సజ్జనులకు మో
హ లతల్ చుట్టవు చుట్టిన
దొలగింతువు పూర్ణకరుణతో శ్రీరామా! (90)
క॥జనకుని వలె నీప్రజలను
కనికరమున బ్రోచునట్టి కరుణానిలయుం
డను పెద్దల పల్కుల కే
మనమున నుప్పొంగుదును రమావర రామా! (91)
క॥దురి తాత్మకులై నను నిను
నిరతము దలపోతురేని నీవవ్వారిన్
గరుణ దలిర్పగ గాతువు
వరముని హిత సర్వలోకవందిత రామా! (92)
క॥సిరుల కొఱకాసపడి నిన్
స్మరియించుట మానియుంటి మానుగనిపుడే
స్మరియించు చున్న వాడను
కరుణింపుము లోకరక్షకా శ్రీరామా! (93)
క॥చెడిపోయెడి సిరు లేటికి
చెడకుండెడు ముక్తిపదము జేరదలంతున్
జడుడ నుతియించు చుంటిని
కడువడి నాకోర్కె దీర్చు కరుణన్ రామా! (94)
క॥అరయ నయోధ్యా పురమున
వర సింహాసనమునందు వసుధాత్మజతో
గరము వినోదించెడు నీ
చరణంబులు గొలుతునయ్య జానకి రామా! (95)
క॥రాముడిటు వంటివాడని
యేమనుజుడు చెప్పగలడు నేరికివశమో
నీ మహిమ లెన్న శక్యమె
యీ మహిజనములకు నుతమునీంద్రా రామా! (96)
క॥పరిపూర్ణ చంద్రు కైవడి
విరాజిలెడు నీముఖార విందము నెపుడున్
వరదుడవై చూపించుచు
ధరలో నను బ్రోవుమయ్య దశరథరామా! (97)
క॥శౌనక గౌతమ ముఖ్యులు
మానసముల నిన్నునిలపి మఱిమఱి గొలువం
గా నభిలషింతురట ధర
నే ననగా నెంతవాడ నేలుము రామా! (98)
క॥చాలును సంసారంబిక
జాలును భోగములు చాలుసతుల వలపులున్
జాలును ధన ధాన్యంబులు
జాలదు నీభక్తినాకు జానకి రామా! (99)
క॥క్షణకాల మైన నిన్నిక
మనమున నేమఱువ నన్ను మన్నింపుము నీ
ఘన కరుణ జూపి బ్రోవుము
మను వంశాంభోధి చంద్రమా శ్రీరామా! (100)
క॥నరజన్మ మెత్తి నీసుం
దర రూపము జూడనట్టి నరుడు నరుండే
ధరవాడు రక్కసుండగు
నరయంగా నిజము నిజము హరసఖ రామా! (101)
క॥శరణని వేడిన భక్తుల
గరుణం బ్రోచెదవు కల్పకమువలె నని నీ
చరణంబుల నే నమ్మితి
వరదుడవై బ్రోవుమా శుభప్రద రామా! (102)
క॥రంగా రావణ గర్వవి
భంగా సీతాననాబ్జ పావన భృంగా
రంగ ద్విక్రమ సజ్జన
సంగా! ననుబ్రోవరావె సరగున రామా! (103)
క॥మనమందు నీదు నామము
మునుకువతో దలచితే జముని బాధలు బా
యుననిదలంచుచు నుంటిని
కని కరముననన్ను నెపుడు గావుము రామా! (104)
క॥రక్షింపగ భక్తాళిని
దక్షుడవై యుండనీవు ధరనితరుల నన్
రక్షింపుడనుచు వేడను
రక్షింపుమునన్ను భక్త రక్షక రామా! (105)
క॥దండము రఘుకుల సంభవ
దండముగీర్వాణవినుత దండంబభవా
దండముసీతా వల్లభ
దండమయోధ్యానివాస దండము రామా! (106)
క॥ఎవరీశతకము నిత్యము
ప్రవిమలమతితోడజదువ భావింతురొయా
సువివేకులకఖిలార్థము
లవిరళముగనొసగి బ్రోవుమనఘా రామా! (107)
క॥మంగళము జానకీశ్వర
మంగళముమహేశ మిత్ర మాయాతీతా
మంగళముభక్త పాలక
మంగళమిదెగొనుము సర్వమంగళ రామా! (108)
శుభం భూయాత్
ఇది
కుందేటిచిన వేంకటసుబ్బయ్య లక్ష్మాంబల తనూజుండును
శ్రీ విజ్ఞానానందగురుస్వాముల ప్రియశిష్యుండును
నగు రామచంద్రయ్యచేఁజెప్పబడిన
శ్రీరామశతకము
సమాప్తము
___/\___
No comments:
Post a Comment