శ్రీ చిద్విలాస శతకము రచనః శ్రీమతి స్వర్ణ లక్ష్మీకాంతమ్మ, నందనవనము - 523121 ప్రచురణః శ్రీ సాయీ నిలయమ్, చెరువు-522113 (1984)
ఓమ్ శ్రీసాయీ నాధాయ నమః __/\__
శ్రీ చిద్విలాస శతకము
రచనః శ్రీమతి స్వర్ణలక్ష్మీకాంతమ్మ, నందనవనము - 523121
ప్రచురణః శ్రీ సాయీ నిలయమ్, చెరువు-522113(1984)
శ్రీకరంబగు ‘భారత సీమ’యందు
భక్త సంరక్షణార్ధమై పరమపురుష!
రూపుదాల్చితివట నీవరూపివయ్యు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦౦1)గ
అల్పమౌ విద్యనేర్చిన యతివచేత
కవితలల్లించు కొనుచున్న ఘనుడవీవు
నీమహాత్మ్యమువర్ణింప, నేర్పునిమ్ము
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦౦2)
భక్తమందార! ఘనధీర! పాపదూర!
సుజన సంరక్ష! శ్రీవక్ష! సురవిపక్ష!
రక్షమాం పాహిసర్వేశ! రక్ష రక్ష!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦౦3) ||02-07-2014||
తల్లి వగుదువు జగతికి తండ్రివీవ!
గురువు దైవంబు సర్వంబు నీవయగుదు
వనుచు భజియించు చుంటి నియదినంబు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦౦4)
ఏమి సుకృతమొ! నీ కృప యీశరీర
మమరినది, దీనినీసేవ కర్పణముగఁ
జేతు; మోహము విడనాడి చింతలేక
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦౦5)
భక్తనందలాల్ జమున దంపతులకీవు
‘పత్రి’యను పల్లెలో బుట్టి భక్తవరుల
కోర్కె లీడేర్చు చుంటివి కూర్మితోడ
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦౦6) ||03-07-2014||
ప్రేమతో నిన్ను రెండేడ్లు పెంచి వారు
యొక ఫకీరుకు నిన్నీయ యుత్సకతన
పెరిగినా వట మూడేండ్లు ప్రియముమీర
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦౦7)
అంత్యకాలము గుర్తించి యా ఫకీరు
“గురుని కర్పింపు మీసుతుగొంచు బోయి”
యంచు తన భార్యతో బల్కె యాదరమున
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦౦8)
పుణ్యవతియగు యాలేమ పూజ్యుడైన
‘వేంకుశుం’డనుగురుఁజేరి వేడ్కనిన్ను
శిష్యునిగ జేసి యా తల్లిజెందె ముక్తి
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦౦9) ||04-07-2014||
పదియు రెండేడ్లు గురువును భక్తితోడ
సేవజేసిన ఫలముగా సిద్ధపురుష!
దైవమైతివి మముఁగావ ధరణియందు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (010)
ఇటుకరాతిని విసరిన కటికవాని
బారి పడకుండ నిన్ను కాపాడినాడు!
వేంకుశుండెంత పుణ్యుడో పృధివియందు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦11)
నీకు కీడు దలంచిన నీచుడపుడె
మృతినిఁ బొందగ, బ్రతికించి మేలు గూర్చ
గురు కృపామహిమయు భువికెరుక పడియె
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦12) ||14-07-2014||
గురువు నీకిచ్చె నిటుకను గుర్తుగాను
తలకు నొక గుడ్డను రక్షగా తాను గట్టె;
ప్రాణ్సమముగా వాటి గాపాడినావు!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦13)
ఏమి తపములు చేసితో! యెచ్చటెచట
దిరిగి నాడవొ, యేరికి తెలియ రాదు
కనబడితివీవు ‘చాందుబాయ్’ కతన మాకు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦14)
నిప్పు నీరును సృజియించి నీదుశక్తి
దెల్పి యశ్వమునందించి దివ్య కృపను
చేరినావట వానితో షిరిడిపురము
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦15) ||15-07-2014||
“బాబ్! సాయి! ఆయ్!” అనుచు పలికినాడు
నామమే లేని నీకొక నామ మొసగి
ధన్యుడయ్యె “మహల్సాజి” ధరణియందు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦16)
నీ వొక ఫకీరు వంచును నిశ్చయించి
హైందవాలయ మున కేగ నడ్డు పడుచు
తరుము పుజారి నీదు బోధల నెరింగె
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦17)
జాతి, మత, వర్గ బేధముల్ సరకుగొనకు
డందఱును దైవ సంతతి యనుచు దెలిపి
నిర్మల ప్రేమ గరిపిన కర్మ రహిత!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦18) ||16-07-2014||
భక్త జన రక్షణార్ధమై పరమ పురుష!
పాడుపడిన మసీదులో పదిలముగను
అరువదేడులు నివసించిత తనఘ చరిత!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦19)
పంచభూతాత్మకంబగు ప్రకృతి కాంత
సకల జీవుల బెంచుపనన్ సరణి దెలుప
నెలమి యైదిండ్ల లోబిక్ష మెత్తినావు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦20)
వర్తకులు నూనె లేదన వాదపడక
జలము నింపి ప్రమిదలను వెలుగఁజేసి
వారియహమును బాపినవాడవీవు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦21) ||17-7-2014||
నీకు నీడ నొసంగిన నింబవృక్ష
మవని తనచేదువిడనాడి మధురమైన
రుచిని యందించు భక్తవరులకు నేడు!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦22)
అష్ట సిద్ధులు నీ గురునాజ్ఞ చేత
సేవ లొనరింప నినుడాయ చిత్తమందు
వాటి మాటదలంపని వాడవీవు!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦23)
ఎందరెందరొ భక్తులు యిష్టమొప్ప
పూజలొనరించి ముక్తిని బొందినారు
యిహ పరంబుల యిష్టార్ధ మిచ్చెదవట
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦24) ||18-07-2014||
ధునిని వెల్గించి భక్తుల దోషములను
కట్టెలను దానియందుంచి కాల్చివైచి,
నిర్మలుల జేసి! ధర్మంబు నేర్పినావు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦25)
నాల్గువర్ణాలవారికి నాల్గువిధము
లైన పురుషార్ధముల నిచ్చు నట్టి తల్లి
“ద్వారకామాయి” యని నీవు పలికినావు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦26)
మూడునాళ్ళు సమాధిలో మునిగియుండి
“చూచి వచ్చితి ‘నల్లా’ను సుఖముగాను
భయపడకు డంచు” పల్కిన ప్రభుడవీవు!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦27) ||19-07-2014||
గాఢ విశ్వాసమును యోర్పు గలిగియుండి
నిశ్చలంబగు మనసున నిన్ను నిలిపి,
సేవలొనరించు వారికి చెందదఘము
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦28)
సర్వరూపాలు నీవని చాటుకొరకు
శునక రూపముతోడ యచ్చోటకేగి
కాశినాధుకు జ్ఞానము గరిపినావు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦29)
గంగ నాపాదములయందు గలదు రమ్ము
స్నానమొనరింపుమంచును సాదరముగ
దాస గాణూకు నొసగవే దర్శనమ్ము
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦30) ||20-07-2014||
బాహ్య సౌందర్యమందలి భ్రమయదేల
ఆత్మసౌందర్యమును గనుమయ్య యంచు
నీవు ‘నానాకు’బోధించి నావుగాదె
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦31)
మూఢులై షిర్డివాసులు ముప్పదేండ్లు
పిచ్చివానిగ నిన్నెంచి పిదప నెఱిగె
సర్వజగతినిఁ బాలించు సామి వనుచు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦32)
ప్రసవవేదబన జెందెడి భక్తురాలు
“మీనతాయిని” రక్షించి మేలుగూర్ప
బండి నడిపించి, వుధిని జేర్పంగలేదె!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦33) ||21-07-2014||
ఎవ్వరేరీతి యేరూప మెంచి నిన్ను
భక్తి పూజ సల్పుదురొ యవ్వారి బ్రోవ
అట్టి రూపంబు దాల్చితివంట నీవు!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦34)
భక్త ‘కాకాను’ మేకను బలి యొసంగు
మనుచు యాజ్ఞను విధియించి యతని యందు
గల్గు గురినిష్ఠ దెలిపితే ఘనమటంచు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦35)
మేను విడనాడితను భీతి మీకు వలదు
నా సమాధిన వసియించి నమ్మకముగ
రక్షణ మొసంగెదంటివి దీక్షఁ బూని
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦36) ||22-07-2014||
పరిమళము జిమ్ము చున్నట్టి పారిజాత
పుష్పమైనను, మరిగడ్డి పూవునైన
సమముగా స్వీకరించెడి స్వామి వీవు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦37)
సాయి యని పల్కినంతనె సరసజేరి
అభయమిడుచున్న దివ్యాత్మవయ్య నీవు
యిలను నినునమ్ము వారలకేమి కొదువ
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦38)
సచ్చిదానంద సద్గురు సాయినాధ!
నాదుహృత్పద్మ మందు నీపాదములను
నిత్య మభిషేక మునుజేయ నేర్పు నిమ్ము!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦39) ||23-07-2014||
భవ భయంబను వ్యాధిచే బహువిధాల
భ్రమల బొందుచు కుందుచు బ్రతుకుచుంటి
రోగనిర్మూలనముఁ జేసి బ్రోవగదవె!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦40)
జీవితము నిజముగ యండమావి యనుచు
తలపలేక వాస్తవమును తెలియలేక
మరచి చరియించు మమ్ముల మరువకోయి
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦41)
కోర భోగముల్ భాగ్యముల్ కోరబోను
కోర స్వర్గ సుఖంబులు కోరముక్తి;
కోరెదను నీదుపదసేవ కొదువలేక;
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦42) ||24-07-2014||
జగతి సృష్టించి, పోషింపఁ జాలియుండి
చిరుగుచొక్కాను ధరియించి చిత్రముగను
భిక్షగొనుచు జీవించిన విశ్వవంద్య!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦43)
అగ్ని-వాయువు-జలమును-అవని-దివియు
నీదు నాజ్ఞకు లోనయి నిలిచియుండు;
అల్పులగు మానవాళినిన్నరయదకట
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦44)
గుణములను గూడియుండు సద్గుణివినీవు
గుణములెరుగని యట్టి నిర్గుణివినీవు
సగుణ నిర్గుణములలోని సత్యమీవు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦45) ||25-07-2014||
తపము-యజ్ఞము-దానము-ధర్మములను
సలుపగా శక్తిలేకనే సతమతమయి,
నీవె దిక్కని సేవింప నిలచియుంటి
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦46)
ఆదిమధ్యాంతములులేక నలరునట్టి
నిన్ను పూజించి కీర్తించి నిన్ను దెలియ,
నన్యమగు వస్తువున్నదే అవనియందు?
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦47)
కరుణకు నివాస మయ్యె నీ కన్ను దోయి
అవ్యయానంద సాగర మయ్యె హృదయ
మరయ మోక్షమే గూర్చు నీచరణ యుగళి
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦48) ||26-07-2014||
జీవుడే దేవుడంచును చెప్పవింటి
సగుణుడే నిర్గుణుండని చదువవింటి
భావమందున నినుగని బ్రదుకుచుంటి
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦49)
మట్టికుండను బోలినమాయ దేహ
మేక్షణంబున వ్రయ్యలై యిలనుబడునొ
తెలియ జాలని దీనుల దిక్కునీవె!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦50)
విత్తనమునుండి వృక్షము వెలసినట్లు
సర్వజగములు నీనుండి జాలువారు
నీవె జీవము-దైవము-నీవె ప్రకృతి
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦51)||27-07-2014||
కులము-జాతియు-వర్ణమున్-కువలయమున
కల్పనయెగాని నిజమేమి గలదు దాన
సర్వమునకును మూలమౌ సత్యమీవు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦52)
ప్రాణమును-బుద్ధి-దేహము-భావములును
వీని కాధారమై యొప్పు విమలమైన
యాత్మ వీవంచు తెలియగ నదియె శాంతి
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦53)
సత్యముగ కనుపించు నీ జగతియందు
మోహబంధముగల్పించి ముక్తి పథము
దొలగి చరియింప నీయకు తోయజాక్ష
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦54) ||29-07-2014||
నీపదస్పర్శచే రాయినెలత యయ్యె
నీ పదముదాకి గంగ పునీతయయ్యె
నీపదాబ్జమె ముక్తికి నిలయమయ్యె
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦55)
సర్వధర్మాలు వచియించు సత్యమీవు
సర్వజీవుల నివసించు సాక్షివీవు
సర్వమత భావములయందు సారమీవు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦56)
దివ్యతేజోవిరాజ! నీదీప్తులందు
కరగుచున్నది నయహంకారమెల్ల
నిర్మలత్వము నాలోన నింపుమింక
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦57)||30-07-2014||
విశ్వమంతయు నీ ప్రేమవీక్షణముల
ఫలముగా నుద్భవించెను భవ్యచరిత!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦58)
నీదు మది నిక్కముగ దయానిలయమేని
నీవు లోకాల పాలించు నేతవేని
నన్ను నీలోన జేర్చు మపన్న శరణ;
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦59)
నాదు భావము వాక్కును నాదు తనువు
నాదు చేతయు జీవము నాదు శక్తి
అన్నియును నీవె యైన నేనున్న దెచట?
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦60)||31-07-2014||
కరుణ గంగా ప్రవాహమై కనులనుండి
పొంగి పొరలుచున్నదో పుణ్యపురుష
స్నాన మొనరించి దాన ప్రశాంత నగుదు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦61)
కలిమి బలములు దప్పిన కాలమందు
యెదను నెలకొంటి వింత నాకేమికొదువ;
సదమలాత్మ! పరంధామ! సాయిరామ!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦62)
చేయి బట్టుక నన్ను నీ చేంతజేర్చు
కొనగ జూచుచునుంటిని; కుటిలమతిని
పెనుగులాడుదు విషయ సంప్రీతికొరకు
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦63)||01-08-2014||
నీదు దృక్కుల నా దృష్టి నిలువనిమ్ము
నీదు బోధలు న మది నెరవ నిమ్ము
నీదు చేతలు కనుగొను నేర్పు నిమ్ము
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦64)
మధుర మకరందమును గొను మధువ మెట్లు
పొదలదరిజేరి యెంతయు ముదముఁజెందు!
నెమ్మి శాంతి నీపొద సన్నిధిని కందు!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦65)
మకరికిని జిక్కి వెతజెందు మదకరివలె
దేహమును కట్టువడికడు దీననైతి
వేదనను బాపి రక్షింప వేగరమ్ము
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦66)||02-08-2014||
సురుచిరానంద దరహాస సుందరాస్య!
మధురమంజుల శబ్దార్థ మహితవేద్య!
భూతహృదయాధివాస! ప్రభో! పరేశ!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦67)
ఈషణత్రయుములజిక్కి యెల్ల బ్రతుకు
నర్పణముజేసి వంచితనైతినయ్య
దేహమును వీడుతరి నిన్ను దెలియుటెట్లు?
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦68)
మానసంబను గిన్నెలో మధురమైన
ప్రేమయను పాయసంబుంచి వేచియుంటి
స్వీకరింపగ జాగేల? వేగరమ్ము
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦69)||03-08-2014||
కామరోషాదు లనియెడి సామజములు
మానస సరోవరంబున మసలుచుండి
కలతపరచుచు నున్నవి కావుమయ్య
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦70)
అంధకారము బోలు మోహంబునందు
కాంతిగనరాకతిరిగితి, శాంతిలేదు;
జ్ఞానకాంతుల బ్రసరించి సాకుమయ్య
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦71)
ద్వారకామాయి మందిరావరణ మందు
దోయిలొగ్గితి, నిలిచితి, దోషిననుచు
నెంచబోకుము, చేయూత నిమ్ము! రమ్ము!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦72)||04-08-2014||
ఆర్తు-డర్దార్థిజీజ్ఞాసులైన వారి
కోర్కెలు సఫలంబుగ రూపు గొనగ నీవు
సంతసము గూర్చు చుందువు సత్వరముగ
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦73)
ఏమి విద్యలు నేర్పెనో యెఱుగ గుహుడు
ఏమి తపము లొనర్చెనో యెఱుగ శబరి?
నీదుసన్నిధి జేరిరి నేర్పుజూపి;
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦74)
గురువు కృపగల్గ మూర్ఖుడు కోవిదుడగు
గురువు కృపగల్గ భువి శాంతికుదురుకొనును!
గురువు కృపగల్గ జీవికి కొదువయేమి?
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦75)||05-08-2014||
మౌనమే శాంతి నిచ్చునన్ మాటదెల్పి
మౌనమే మోక్షమును జేర్చు మార్గమంచు
మౌనముగ బోధ చేసెడి మాన్యచరిత!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦76)
కరుడు గట్టిననా హృదిన్ కరుణ యనెడి
యమృత వాహిని బారించి యతుల మైన
శాంతి సమకూర్చు చున్నావు సదయ హృదయ!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦77)
సత్తిది యసత్తిది యనుచు చర్చసేయు
జ్ఞానమెఱుగను దేవ! సుజ్ఞానమిచ్చి
సచ్చిదానందమునుబొందు శక్తి నిమ్ము
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦78)||06-08-2014||
భావనామయ సంసార బంధనములు
పట్టి వేధించుచున్నవి బహువిధాల
వీనితొలగింపుమని నిన్ను వేడుచుంటి
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦79)
హంసవై జీవులందున నమరియుండి
సోహమని పల్కుచున్నావు సూక్ష్మరూప!
నిన్ను గుర్తించు నేర్పున్న నీవె “నేను”
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦80)
నీదుచరణాబ్జములసేవ నిఖిలపాప
సాగరము దాటగాజేయు సాధనమని
నమ్మి సేవించుచుంటి ననారతమ్ము
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦81)||07-08-2014||
దాతనాకాదు! వేదవిద్యలనెఱుంగ!
సాధుసత్పురుషులసేవ సలుపనైతి!
ఎట్లుదరిజేర్తువో నన్ను యెరుగకుంటి?
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦82)
అన్నితీర్ధాలు త్రిపుటి యందమరి యుండ
తీర్ధ యాత్రలొనర్చెడి దీక్షలేల?
ఆత్మ తీర్ధాన ముణిగిన నదియె ముక్తి!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦83)
గొల్ల పిల్లల గూడిన గోప్యమేమొ?
గిరిని కొనగోట నెత్తిన కీర్తియేమొ?
రాసలీలల యందలి మోసమేమొ?
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦84)||08-08-2014||
జ్ఞాన దీప్తులు నీయెదలోన నింపి
దారిజూపుచు నడిపెడి దైవమెవరు?
‘నేనె’యని పల్కగావిన నేరనైతి
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦85)
ఎన్ని జన్మల పుణ్యమో యిపుడు నీదు
భక్తి చేకూరినది; దీన భవ్యమైన
పదవి చేకొందు; నీలోన కుదురు పడుదు;
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦86)
నీవె దైవము; జగమెల్ల నీవెయగుదు
నీవె కార్యము కర్తయు నీవెయగుదు
నీవుగాని దేమున్నది నిఖిల భువిని?
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦87)||11-08-2014||
శక్తి గల బిడ్డపై కన్న శక్తి హీను
లైన బిడ్డలపై ప్రేమ యధికముగను
యుంచవలెగద; న్యాయము నెంచుమయ్య
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦88)
పూలనొసగియు బంగరుచేలములిడి
భక్తినిత్యపూజాది సపర్యలెల్ల
జేయజాలని నన్ను పేక్షింపకయ్య
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦89)
అంధులకుదృష్టి నిచ్చిన యమృతమూర్తి
భోగ భాగ్యంబు లొసగెడి పుణ్యమూర్తి
నిలుపుకొనుమునన్ కాపాడి నీదుకీర్తి
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (౦90)|| 12-08-2014||
మబ్బువీడిన వెన్నెలమాడ్కి, దివ్య
సౌరభములీను మల్లియ సామ్యముగను
నన్నునిర్మల జేయుమాపన్న శరణ!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦91)
సర్వభారముల్ నీవని శరణమంటి
దుర్విషాబ్ధిని దాటిమ్చి దుఃఖరహిత
నిర్వికల్ప సుఖంబిచ్చి నిల్పుమింక
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦92)
శేషశయునుడవై యున్న శేషసాయి!
కృపనుజూపగ రావోయి కృష్ణసాయి!
సన్నుతింతునురానిన్ను సత్యసాయి!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦93)||21-08-2014||
తనువు మనసును బుద్ధియు ధనము విద్య
ప్రాణమును నీదు రూపాంతరములె తెలియ
స్వామి!నీకీయ కల్గిన దేమిగలదు?
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦94)
శ్రీగిరి నివాస మునుజేయు “శివుడ” వీవె
అరుణగిరి యందు నెల కొన్న “యర్పి” వీవె
శేషగిరి పైన వెలసిన “శేషి” వీవె
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(౦95)
దేవతాలయ మన్నది దేహ మౌను
దేవుడన్నను జీవుడై తెలియ బడును
దేవదేవుడ వీవని తెలియకుంటి
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(096)||22-08-2014||
అంటియంటక నంతట నమరియుండి
అహమహ మటంచు జగతిపై నధివసించు
అవ్యయానంద సంధాయి వయ్య “సాయి”
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(097)
తెలియు వాడును తెల్వియు తెలియబడెడి
వస్తువును నీవెగా విశ్వవలయమందు
నిన్ను దెలియగానేర్పేరి కున్నదయ్య
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(098)
సర్వజగముల బాలించు సార్వభౌము
డవయు సకల జనుల యవసరముల
ఆదుకొనుచుండ నేనింక యడలనేల?
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(099)||23-08-2014||
ప్రతి నిమేషము నాముందు బహువిధాల
రూపముల దాల్చుచున్నావరూపివయ్యు
నిన్ను గుర్తించి పూజించు నేర్పునిమ్ము
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(100)
మగడుబిడ్డలు బంధులన్ మమతలోన
చిక్కిదొసగుల నెన్నిటిజేసినానొ
ఒక్కరును నన్ను గనరు; నా దిక్కు నీవె!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస! (101)
పుణ్యజనములె భువిలోన పుట్టునెడల
నీవుయవతారమెత్తెడి నియతియేల?
పాపులుండుటవల్ల నీ ప్రాపుగల్గె;
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(102)||24-08-2014||
తల్లినెడబాసి భీతిచే తల్లడిల్లు
బిడ్డచందాన, సంసార భీతిజిక్కి
యుంటి, నభయంబొసంగుము; యుల్లమలర
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(103)
వ్యధలచేక్రుంగ నాకేల? మధురమైన
నీదు నామ సుధారసాస్వాదనమున
మనసు వికసించి, విషయముల్ మరచిపోదు!
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(104)
కలత జెందగ నాకేల? కలుష ముడిపి
మోక్ష సుఖమంద జేయంగ మూలమైన
నీదు పదపద్మ సేవల నియతిఁజేతు;
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(105)||25-08-2014||
పుట్ట జేసితి వేలనో పుడమి నన్ను
ఏమికార్యము చేయింప నెంచినావొ?
నీదు వశవర్తినై యుంచి ఆదుకొనుము;
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(106)
భక్తియను దివ్య జలము బాగుమీర
కడిగి యుంచిన హృదయమన్ కంచమందు
నీదుకరుణామృతమ్మును నింపుమింక
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(107)
స్వర్ణలక్ష్మి కాంతమ్మ యన్వయముదాన,
శతక మిది రచియించి యంకితము నిడితి,
దోషములఁద్రోసి, కొనుము సంతోష మొప్ప
షిరిడి పురవాస! సాయీశ! చిద్విలాస!(108)
మంగళము సాయినాధాయ! మంగళంబు!
మంగళము వేదవేద్యాయ! మంగళంబు!
మంగళము షిర్డివాసాయ! మంగళంబు!
మంగళము చిద్విలాసాయ! మంగళంబు!||26-08-2014||
శ్రీసాయీ నాథ పాద పద్మార్పణమస్తు!
సర్వే జనాః సుఖినోభవంతు __/\__
****************************
No comments:
Post a Comment