Translate

31 March, 2017

శ్రీ సాయీ శతకము






శ్రీ సాయీప్రేమాలయ ప్రచురణ – 2; 
శ్రీ సాయీ శతకము ; (1990) 
రచన: బ్రహ్మశ్రీ నందనవనం వెంకట సుబ్బరామయ్యశర్మ గారు.


శ్రీ సాయినాధాయనమః ; శ్రీ గురువేనమః__/\__


కం||శ్రీ కళ్యాణ గుణాత్ము; శు
       భాకారు; ననాది పురుషు | పరమేశ్వరు; నిన్
       లోకేశు; లోకవందితు
       ప్రాకటముగ మదిని దలతు | భక్తిని సాయీ! (001)

కం||సాకారుడ వై భక్తుల
       సాకగ భువి వెలసినావు| పదయుడవగుచున్
       నాకాధారము నీవని
       చేకొని పూజలనొనర్తు| శ్రీకరసాయీ!(002)

కం||యీధర నీ నామంబే
       సాధకులకు బాధితులకు స్మరణీయంబై
       బాధల నుడిపెడు ఘనమౌ
       బోధయునై వెలసియుండె| భదనుత సాయీ! (003)

కం||నాకేటికి దైన్యంబిక
       ని కరుణా వీక్షణములు నిలచెను నాపై
       “తేకువ” “ధైర్యం” బబ్బెను
       శోక విదూరుండనగుచు శోభిల సాయీ! (004)

కం||ధారుణి ధర్మము చెడ, నా
       నారూపుల జననమంది నాడవు దేవా!
      ఘోరాఘపంక్తి విడివడు
      నోరారగ నీదుపేరు నుడివిన సాయీ! (005)

కం|| “యమ” “నియమ” “శమ” “దమా” దుల
       క్రమమెఱుగని మూఢమతిని కారుణ్యముతో
        నమచిత్తుని జేయందగు
        విమలాత్మా! నీదుపథము! వీడను సాయీ! (006)

కం||’నమమ’ యని దలవనేర్వక
       ‘మమ’యను దేహాత్మబుద్ధి మరువగలేకన్
       తమమున మునిగిన జనులకు
       సముచిత మార్గంబు జూపి సాకుము సాయీ! (007)

కం||మదిలో నీ శుభనామము
       వదలక జపియింతు నెపుడు వరగుణశీలా!
       నదయుడవై రక్షింపుము
       మృదుల హృదయ నీవె దిక్కు మేదిని సాయి! (008)

కం||’సాయీ’యనగనె “ఏరా
        భాయీ”యని బదులు పలుకు బాంధవుడవు; చే
        దోయి తలజేర్చి మ్రొక్కెద
        సాయంబగు మెల్ల కార్య సరణిని సాయీ! (009)

కం||నేఱను శాస్త్రము లెవ్వియు
       చేఱను సద్గురులచెంత| జిహ్వాగ్రమునన్
       జేఱి పలికింపు మీ; చవు
       లూర కవిత్వంబు సొంపు లొప్పగ సాయీ! (010)

కం||’వేంకుశు’ డనుగురు శుభపద
        పంకజముల సేవజేసి ప్రజ్ఞానిధి వై
        పొంకముగా నీ నామము
        పంకజనాభుడని మేము పలుకగ సాయీ! (011)

కం||మహిలో “ద్వారకమాయీ”
       మహిమాతిశయంబు దెలియ మనుజుల కగునా?
       యిహమున వైకుంఠ బై
       రహిమించెన్ మీ పదాబ్జరజమున సాయీ! (012)

కం||సాక్షీభూతుండెవ్వడు
       రక్షకుడైయెల్లభువికి రాజిత హృదయా
       ద్యక్షుండెవ్వడు; జీవుల
       దీక్షామతిఁ నేల నీవె తెలియగ సాయీ! (013)

కం|| గురువును దాయవము నీవే
        ధరతల్లియు దండ్రి వీవె దాక్షిణ్యనిధీ!
        నెరవేర్పు మెల్ల కోర్కెల
        దరిజేర్పుము దీనజనుడ దయతోసాయీ! (014)

కం|| లోకారాధ్యుడ వీవని
        “కాకా “ ‘చందోర్క’ రాది ఘనులు మహాత్ముల్
          వాకొని నిను బూజింపరె!
          చేకొనరే మోక్షపదవి? శ్రీకర సాయీ! (015)

కం|| నమ్మితి లోకేశ్వర! నిను
        నమ్మితి కరుణాలవాల! నమ్మితినయ్యా;
        నమ్మితి సన్ముని వంద్యా!
        నమ్మితి మనసార ముక్తి నాకిడు సాయీ! (016)

కం|| సంతస మొప్పగ భక్తుల
        చెంతన్వసియింతు ననుచు చెప్పగ వింటిన్
        యెంత భజించుచు నున్నను
        సుంతయు నాపైని కరుణ జూపవె? సాయీ! (017)

కం|| దాసాను దాసుడను; నా
        దోసము లెంచంగబోకు దురితాత్ముడనై
        గాసిలి యుంటిని; కృపకై
        దోసిలి యొగ్గితిని వేగ దోడ్పడు సాయీ! (018)

కం|| వ్యర్ధునిఁ జేతువ నను? మును
       యర్ధిజనులు నిన్ను వేడ యతులిత కృప
       సర్వార్థంబుల నియవె? న
       ప్రార్థలను వినవ? షిర్డివాసా! సాయీ! (019)

కం|| సుజ్ఞాను లెఱుగుదురు నిను
        అజ్ఞానావృతుడ తెలియనగునే నాకున్
        విజ్ఞాన మొసగి నన్నును
        ప్రజ్ఞావంతునిగఁ జేయ భావ్యము సాయీ! (020)

కం|| దానము ధర్మము జేయం
        బూనినయెడ నాకు సిగ్గు బొడమును పుడమిన్
        కానగ నాదేమున్నది?
        నేనును నీవాడగానె నిజముగ సాయీ! (021)

కం||కోరికలను పన్నగ తతి
       కోరలకుం జిక్కి స్రుక్కి కుందెడ నాకా
       ధారము నీవే! సుగతిం
       జేరు నుపాయంబు దెలియ జెప్పుము సాయీ! (022)

కం||ఒక్కడవై లోకంబులు
      పెక్కింటిని సృష్టిఁజేసి పెంచెదవట నీ
       కెక్కడిదీ సామర్ధ్యం
       బక్కజమగు నీదు మహిమ లరయన్ సాయీ! (023)

కం||పెరవాడ ననుచు యెంచకు
       సురచిర దరహాసవదన సుగుణాభరణా!
       కరుణాలయు డవుగద! నను
       దరిజేర్పగ నీవె దిక్కు ధారుణి సాయీ! (024)

కం||మత్తుడనై విషయంబుల
       చిత్తము హత్తించి నిన్ను చింతింప నయో!
       మిత్తగలదనుట మరచితి
       నెత్తెరగున మూఢునినను యేలెదొ సాయీ! (025)

కం||తల్లిదండ్రు లన్నదమ్ములు
       వలపించెడి సతులు సుతులు వస్తు చయంబుల్
       గలవని తలచెడు నరునకు
       కలయని సర్వంబు తుదకు కన్పడు సాయీ! (026)

కం||మధుపము నై నీ పద సుమ
       మధువును రుచి చూడనిమ్ము మనసారగ నా
       వ్యధ లన్ని బాపికొందును
       బుధనుత సరసిజ భవాండ పోషక సాయీ! (027)

కం||కాంతా కనకంబుల పై
       భ్రాంతిని కలిగింపనీకు పరమేశా! నీ
       కెంతయు ఋణపడి యుందును
       వంతలకును మూలమనియె వసుధన్ సాయీ! (028)

కం||పట్టితి నీ చరణంబుల
       మెట్టగ కైవల్య పదవి మేలగు రీతిన్
       రట్టొనరింపక నను జే
       పట్టుము దయతోడ భక్తవత్సల సాయీ! (029)

కం||కామాతురతన్ లౌకిక
       ప్రేమలకుం జిక్కి యుండి పెన్నిధివగునిన్
       బ్రేమింప నేరకుంటిమి
        సామాన్యుల మమ్ము బ్రోవ సమయము సాయీ! (030)

కం||కులమేటికి? ధనమేటికి?
       తలబరువగు విద్యలేల?దైవమగునిన్
       దలపగ నేర్చిన వారికి
       నిలపై జీవనము ధన్యమేయగు సాయీ! (031)

కం||రారా! దీనుని మొరవిన
       రారా!కరుణింపవేర! రక్షింపగ రా
       వేరా!పిలిచితిగద! నా
       భారములనుమోయ నీకు భయమా! సాయీ! (032)

కం||సతతము నీ చరితామృత
       మతి రుచ్యంబగుట గ్రోల మనసాయెనునా
       మతియను పాత్రమున; దయా
        మతివై నింపగది యద్దిమరిమరి సాయీ! (033)

కం||దేవుండెవడన నీవే
       జీవుండెవడన్న నీవె చిత్సత్తులనన్
       భావింపంబడు చుందువు
       నీవే యన్నింటజేరి నెగడెదు సాయీ! (034)

కం||పెంపుడు కుక్కలవలె యీ
        కొంపను వీడంగబోవు కోపాదులు; శా
        సింపగ నేర్వను; నే, నను
        కంపామతి చూడదగిన కాలము సాయీ! (035)

కం||బంగరు సౌధ శ్రేణులు
       శృంగారాంగనలు మణులు సేవక తతియున్
       మంగళకర నిను కోరను
       భంగము లేనట్టి ప్రేమ పరపుము సాయీ! (036)

కం||తనయునిపై కినిసెదవా?
       నను దూరము జేయచూచి నవ్వరె లోకుల్
       నిను వీడను యేమైనను
       వనరుహభవ వంద్య నన్ను వదలకు సాయీ! (037)

కం||ఎనిమిది విధముల జగతిని
       గనుపించెను నీదు మాయ కడు చిత్రంబై
       నిను దెలియ జగతి శూన్యము
       నిను దెలియక జగతి నిజము నిజమిది సాయీ! (038)

కం||అప్పడుగువాని గనుగొని
       తప్పించుక తిరుగునట్లు దాగెదవేలా?
       తిప్పలు బెట్టకుమయ్యా
       తప్పదు నా బరువు నీకు తధ్యము సాయీ! (039)

కం||సదయుడవై లోకంబుల
       పదునాలుగు సృష్టిజేసి పాలింతువు; నీ
       యెదలో నేనున్నానని
       ముదమున భావింతు నింక ముక్తుడ సాయీ! (040)

కం||సిరిసంపద లిమ్మంచును
       మరిమరి వేడెదరు నిన్ను మందమతులు నీ
       దరి ప్రేమామృత ముండగ
       మరతురు యిదియేమి వింత మహిలో సాయీ! (041)

కం||సత్యా హింసలు నాయెడ
       నిత్యములై నిల్పురీతి నియమింపుము; నీ
       భృత్యుడవై జీవుల ప్రతి
       నిత్యము సేవించనిమ్ము నేర్పుగ సాయీ! (042)

కం|| చితిపాలగు దేహంబును
        సతమని తలపోసి తుచ్ఛ సాంసారంబున్
        నుతియించుచుంటి సుఖమని
        మతిమాలితి నీవెదీని మాన్పుము సాయీ! (043)

కం|| కర్మల నొనరించితి మును
        కర్మఫలం బనుభవింప కర్మిష్టుడనై
        కర్మ మొనరించు చుంటిని
        కర్మ తొలగు విధము దెల్ప గదవే సాయీ! (044)

కం|| కల్పము లెన్ని యొ; నీ సం
        కల్పముచే జాలువారె కడు చిత్రం బీ
        కల్పన లేటికి చేతువొ?
        అల్పుడగద నీదు మహిమ లరయగ సాయీ! (045)

కం||పసితన మంతయుఁ గ్రీడల
       పసగల యవ్వనము సతుల బంధనములలో
       ముసలితనమందు రుజచే
       మసలుచు నిన్ను తలప జనులు మరతురు సాయీ! (046)

కం||మహి “సాయి” కి సరి దైవము
       “నహినహి”యని లోకమందు నాలుగు దిశలన్
        యహరహమే చాటింతును
        యిహపర దైవంబవంచు నెతుంను సాయీ! (047)

కం||జ్ఞానము, యోగము, కర్మము,
       బూని చరింపంగ నేర్పు బొడమడు, మదిలో
       మానక నీపద భజనము
       నేనొరించెదను ముక్తి నిడుమో సాయీ! (048)

కం||రాగద్వేషములను పెను
       నాగులు నను చుట్టియుండె, నాసిల్లితి నే
       నేగతి బ్రతుకుదు? నీయను
       రాగమె నాకింక జగతి రక్షణ సాయీ! (049)

కం||తనయెడగల దోషంబుల
       గననేరక మూఢ జనుడు గర్వితమతియై
       పనిబూని యొరుల దొసగులు
       మనమున దలపోయు నెపుడు మానక సాయీ! (050)

కం||ధర్మం బెయ్యది నరునకు
       నిర్మల చిత్తంబు నాత్మ నిల్పుటెగద; యీ
       మర్మంబు దెలియనేరక
       దుర్మతులై యుండువార్కి తోడ్పడు సాయీ! (051)

కం||హిందూ, ముస్లీం, క్రైస్తవు
      లందరు మానవులె; వారి యందలి భావం
      బందర కన్ని తెరంగులు
      యందరిలో ప్రజ్ఞ వీవె యరయన్ సాయీ! (052)

కం||ధనమును, బంధులు, మిత్రులు
       తనయులు, భార్యయును, తనువు ధారుణి యందున్
       “గన మూడునాళ్ళ ముచ్చట”
        యని తలచడు మూఢ మనుజు డౌరా! సాయీ! (053)

కం||తెరచాటు నుండి బొమ్మల
       జరిపించెడు సూత్రధారి చాడ్పున జగముల్
       మురిపించుచు నేడ్పింతువు
        పరికింపగ నిన్ను తెలియవశమే? సాయీ! (054)

కం||భౌతిక విషయంబులకై
       నీతివిడిచి చేయరాని నీచపు బనులన్
       బ్రీతి నొనరించినాడను
       చేతము తల్లడమునందు సిగ్గున సాయీ! (055)

కం||ఎటనుండి వచ్చినానో
       యెటకేగవలెనొ తెలియ; ఈగతిమదిలో
        కటకట బడుచుంటిని నా
        కిటుపై శరణంబు నిచ్చి యేలుము సాయీ! (056)

కం||భక్తజన పోష! మోక్షా
       సక్తుడనై యహరహంబు సంసేవింతున్
       యుక్తమగు తెరవు జూపుము
       శక్తినిడుము నిన్ను దెలియ సద్గురు సాయీ! (057)

కం॥జరిగిన కాలము శూన్యము
        జరగంబోయెడిది తెలియజాలము జగతిన్
        జరిగెడి క్షణమే నిజమని
        స్థిరముగ నిను గొల్వ ముక్తి చేకుఱు సాయీ! (058)

కం॥నావారని పెరవారని
        భావింతురు సర్వమునను పరమాత్ముడవై
        నీవుండు టెరుగ నేరరు
        దేవా! వీరలకు బుద్ధి దెల్పుము సాయీ! (059)

కం॥దిక్కెవరు జీవుల కిల
        దిక్కెవ్వరు సాధువులకు దీనుల కెల్లన్
        దిక్కెవ్వరు పురుషోత్తమ!
        దిక్కెవ్వరు నాకు, నీవె దిక్కో సాయీ! (060)

కం||ఇరువది నాలుగు తత్వము
       లెరుగుదు నేనంచుబల్కు నెవ్వడొ యతడే
       పరుడై స్థిరుడై యుండియు
       చరియించును దేహినంచు జగతిని సాయీ! (061)

కం||వాదము లేటికి మనసా!
       వేదాతీత స్వరూపు విజ్ఞానముచే
       మోదమలర భావింపుము
       వేదనలు తొలంగునన్న వినదో సాయీ! (062)

కం||నీ నామ సుధారసమును
       పానమొనర్చుచు సుఖాను భవమానసులై
       మేనులు మరచి చరించెడి
       జ్ఞానుల పద సేవజేతు చక్కగా సాయీ! (063)

కం||కరుణారస సాగరు డను
       బిరుదమును వహించినావు భేషజమునకా?
       మొరవినియు మిన్నకుంటివి
       తెరవే యిది నీకు; కృపను దెలుపుము సాయీ! (064)

కం||“సాయీ ”యని పిలివుడు నను
        సాయమగుదు నెల్లయెడల సత్యమటంచున్
        చేయెత్తి పల్కు ప్రభుడవు
        నాయార్తిని దీర్చరావె! నయమున సాయీ! (065)

కం||“మమత ”ను విడి దేహంబున
       “సమత ”ను మదినిల్పి జగతి సర్వము నందున్
        మిము గనుగొంచును మీపద
        సుమముల నర్చించు నేర్పు జూపుము సాయీ! (066)

కం॥కాయము వాఙ్మనముల నీ
        కే యర్పణ జేసి సుఖము ఖేదము రెండున్
        మాయావృతగుణ దోషం
        బేయని దెలియంగనగును పేర్మిని సాయీ! (067)

కం॥సాయీరాం, సాయీరాం
        సాయీరామా యటంచు సద్భక్తిని నే
        రేయింబవలు దలంతును
        నాయందు పరాకుజూప న్యాయమె సాయీ! (068)

కం॥తప్పిది యొప్పిది యని నే
        నెప్పగిది నెరుంగ నగును యీశ్వర! సర్వం
        బప్పన్ గావించితి నీ
        కొప్పగునటు నన్ను నడుపు మోయీ! సాయీ!

కం॥సప్త ద్వీపములను నా
        కాప్తుండగు భక్తవర్యు ననిశము కృపతో
        దీప్తు నొనర్చెద, పరమ
        ప్రాప్తిని చేకూర్తునంచు పలుకవె సాయీ! (070)

కం॥అణువున బ్రహ్మాండంబున
        ఫణిశయనా! నీదు శక్తి పరికింపనగున్
        గణుతింప నశక్యము నీ
        గుణములు శేషునకునైన గురువర! సాయీ! (071)

కం॥‘నిష్ట’‘సబూరీ’ చేకొని
        కష్ట సుఖము లన్నిమరచి గతివీవనుచున్
        స్పష్టముగ నమ్మియుంటిని
        యిష్టార్థంబులను దీర్చు మిపుడే సాయీ! (072)








కం॥మాయారహితుడ వయ్యును

మాయను ధరియింతు వీవు మహి వెలయింపన్

మాయాతీతా! మోహము

బాయు నుపాయంబు దెలియ బల్కుము సాయీ! (073)










కం॥కామా? నీ దాసుల మో

ప్రేమాలయ! నిన్నె నమ్మి పిలవమ? యిటురా

మోమాటమ? సరిసరి, మరి

మామాట దలంప్ దోస మా శ్రీసాయీ! (074)









కం॥క్షణభంగురమగు తనువే

క్షణమున వీడంగనగునొ సత్కృప, నీ వీ

క్షణముల నాపైని, యను

క్షణముఅను బ్రసరింపజేసి సాకుము సాయీ! (075) ||19-06-2014||








కం॥లోకారాధ్యుడవగు నీ

వీ కరణి “ఫకీరు” వోలె వెలసితి వౌరా!

నీకెన్ని వేసములు గల

వోకద వర్ణింప మాకు యొప్పునె? సాయీ! (076)






కం॥అడిగిన సంపదలెల్లను

వడివడిగా నొసగు ప్రభుడ వయ్యును కబళం

బడిగెదవట యైదిండ్లను

గడవద? వారు తరియింపఁ గాదే? సాయీ! (077)






కం॥మునిజన హృదయ విహారీ!

ఘనతర మోహాంధకార కాలుష్యహరి!

వనజదళనయనశౌరీ!

మనుజార్చిత దివ్యరూప మద్గురు సాయీ! (078)





కం॥నిర్మల శాంతి ప్రదాయీ!

కర్మరహిత దివ్యరూప ఘనసుఖదాయి!

ధర్మార్ధకామ్యదాయీ!

మర్మరహిత భక్తహృదయ మందిర సాయీ! (079)








కం॥పాపాత్ముడ దీనుడ నను

కాపాడక మిన్నకున్న గతి యెవ్వరికన్

నీపాదార్చన సుగతిం

జూపుననుచు నమ్మియుంటి శుభకర సాయీ! (080)









కం॥ధర్మము, సత్యము, హింసయు

కర్మాత్మకములుగ నెచట గానంబడు, నా

నిర్మలు డీవని మ్రొక్కెద

మర్మము లేకుండ సుగుణ మాన్యా సాయీ! (081)









కం॥“తత్వమసి” యంచు దలచెడి

తత్వం బే నెరుగనైతి “తా బ్రహ్మంబన్”

తత్వార్ధంబును దెలియను

సత్య గుణాన్వితునిజేసి సాకుము సాయీ! (082)









కం॥గోపాలుడవై, గోవుల

మేపుచు, లీలను జరించి మేదిని యందున్

కాపాడవె మును భక్తుల

పాపరహిత సర్వజీవ పాలక సాయీ! (083)





కం॥నీపాద పద్మములపై


మోపితి నా శిరము భువన మోహనరూపా!

పాపాత్ముడంచు నెంచక

కాపాడుము నీవె నాకు గతి వో సాయీ! (084)








కం॥నాపాలిటి పెన్నిధివై

దాపున వసియించు నిన్ను దర్శింపక యీ

తాపత్రయమున జిక్కితి

కాపాడగ నీవె దిక్కు గద శ్రీసాయీ! (085)





కం॥గురులకు గురుడవు నీవని

గురితించితినయ్య వేరు గురువేలనయా?

స్థిరమతినై నిన్ను నమ్మితి

సరగున బ్రోవంగరమ్ము సద్గురు సాయీ! (086)





కం॥పాపమను యూబి జిక్కితి

యోపిక నశియించె వెడల నోపను కృపతో

ప్రాపైకర మందిమ్మా


నీపై భారంబు నిడితి నియతిని సాయీ! (087) ||23-06-2014||









కం॥జగముల నేలెడి నాదొర!

జగడంబేలయ్య నాతొ సత్వరముగ నా

వగపుడుపరాదె; తండ్రీ!

పగవాడను గాను నీదు భక్తుడ సాయీ! (088)

కం॥సుందరమగు నీ రూపము

యెందగపడునా యటంచు నిలబరికింపన్

అందిందు నెందు జూచిన

సందేహము లేక నీవె సాక్షివి సాయీ! (089)









కం॥“సాయీ” యను మధురాక్షరి

చే; యవిరళ మూరు సుధను సేవించుచు; నా

యాయాసమెల్ల బాయగ

“హాయి” యనెడు పరమసుఖము నందెద సాయీ! (090) ||24-06-2014||









కం॥ధర్మోద్ధరణకు భువిలో

నిర్మల్ తేజంబెలార్ప నీ వెల్లప్పుడున్

కర్మిష్టివై జనింతువు

దుర్మార్గం బడగఁ జేయుదువు! శ్రీసాయీ! (091)





కం॥జననము మరణము రెండును

కనుగొనగా కర్మవశత గల్గుచునుండున్

తన కర్మ లెల్ల నీవిగ

మనమున భావింప ముక్తి మహిలో సాయీ! (092)





కం॥జీవుడ వగుదువు నీవే

దేవుడవని తెలియలేక దిక్కెవరంచున్

భావింతు నెన్నొ తెరవుల

నీవంకకు దిరిగి చూడనేరక సాయీ! (093) ||25-06-2014||







కం॥నీదరిజేరిన భక్తుని
మోదమలర యార్తి దీర్చి మొక్షపదంబున్
ఆదరమొప్పగ గూర్తువు
నాదాత్మక! నిన్నె మదిని నమ్మితి సాయీ! (094)


కం॥అగణిత గుణగణయుతుడవొ!
సగుణుడవో! నిర్గుణుడవొ! చక్కగ దెలియం
దగు వారెవ్వరు భువిపై
నిగమాంత నిరూపవాక్య నిర్ణయ సాయీ! (095)


కం॥తరమా నిను వర్ణింపగ
పరమేశా నీదుమహిమ భాసిలు జగముల్
స్థిరుడవు నంతర్యామివి
నరుడవె? పరమాత్మ! లోకనాథా! సాయీ! (096) ||26-06-2014||

కం॥మదయుతులై దేహంబే
ముదమున తామంచు నెంచి మోహితమతులై
వదలగలేర జ్ఞానము
యెదలో నివుండుదెరుగ రెన్నడు సాయీ! (097)



కం॥దరిలేని కాలవాహిని
వెరపించుచు క్షణక్షణంబు వెడలుచునుండెన్
స్థిరమని యెంచగ తరమా?
నరునకు జీవనము సుగుణ నాయక సాయీ! (098)


కం॥వలపులు నిండిన సామీ
తలపులు నీపైన నిలపి దైవమవనుచున్
కొలచుచు నుంటిని గాదే
కలతల పొద్రోచి వేగ కావవె సాయీ! (099) ||27-06-2014||




కం॥పలుకులతో వర్ణింపగ
దలచుట నావెఱ్ఱిగాని దైవలలామా
వెలుపల లోపల నీవై
తలపగ రాకుందువంచు దలచను సాయీ! (100)
కం॥నీ చూపులు భవహరములు
నీ చూపులు నిఘిలజీవ నివహాశ్రయముల్
నీ చూపులభయ ప్రదములు
నీ చూపుల చూపు నిలువ నేర్పుము సాయీ! (101)




కం॥అభయము నొసగుచుమాకున్
శుభముల్ జేకూర్పనెంచి సులభుడవగుచున్
ఇభరాజ వరదయిలపై

ప్రభవించితి వయ్య మాకు ప్రభునిగ సాయి! (102) ||28-06-2014||

కం॥పతితుడనో పాతకినో
గతము గతించినది గాదె! కారుణ్య నిధీ!
హితమగు మార్గము జూపియు
సతతము నడిపింపుమింక సద్గురు సాయీ! (103)
కం॥సలలిత “సాయీ” నామము
తలచిన భవబంధమెల్ల తలగునటంచున్
పలికిన పెద్దల పలుకుల
దలచినిన్ను మదిని నిల్పదలచెద సాయీ! (104)
కం॥ఎందరొ! నీ భక్తులు నే
నందరకును వందనముల నర్పించెద నా
యందు దయజూపి వారల
చందము నన్నాదుకొనగ సమయము సాయీ! (105) ||29-06-2014||




కం॥పసివాని ముద్దు పల్కులు
పసగల వాక్యంబు లనుచు భావించినటుల్
దొసగులని యెంచ కీ పద
కుసుమములన్ స్వీకరింప గోరెద సాయీ! (106)
కం॥జయమగు సాయీశ్వరునకు
జయమగు ప్రణతార్తి హరుని శాశ్వత ధునికిన్
జయమౌ ద్వారకమాయికి!
జయమగు సద్భక్తులకును సతతము సాయీ! (107)




కం॥మంగళము దివ్యరూపా!
మంగళమో నిర్వికల్ప! మంగళమయ్యా!
మంగళకర జనులకు శుభ
మంగళములు గల్గజేయుమా! ప్రభు! సాయీ! (108) ||30-06-2014||
*** సత్యం శివం సుందరం ***
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు!

No comments:

Post a Comment