Translate

24 March, 2017

నాకు నచ్చిన కథలు..ఋణానందలహరి...గూడుమారినకొత్తరికం


ణదా! శరధీ! కఋణాపయోనిధీ!
-ముళ్ళపూడి వెంకట రమణ
ఎవ్వనిచే జనించు ఋణ
మెవ్వనిచే భ్రమియించు లోకమం
దెవ్వని బుద్ధియే ఋణద
మెవ్వడు నవ్వుచు నప్పులిచ్చు దా
నివ్వగ జాలనం చనక
నివ్వగ జాలక, దిప్పనట్టి వా
డెవ్వడు_ఆ ఋణాత్ము, ఋణదేశ్వరు
నేను ఋణంబు వేడదన్.
ఒక సూర్యుండు సమస్త జీవులకు
దా నొక్కొక్కడై దోచు న
ట్లొకటే రూక ధనమ్ముగా ఋణముగా
నొక్కొక్కచో శిక్షగా
నొకచో రక్షగ, లక్షగా, తృణముగా
నొక్కొక్కటై తోచుగా
కొకటే సత్యము_ ఒఠ్ఠిరూకసుడి! _
అప్పొప్పుల్ అపోహల్, భ్రమల్.
ఋణ ఋగ్వేదికి వాదికి
ఋణకారణ జన్ముడైన ఋణఖాదికి దా
ఋణబుద్ధికి ఋణసిద్ధికి
ఋణభ్రమాభ్రమరునకును ఋణికిన్ ఘృణికిన్.
వ. ఋణతరుణ వందన సహస్రం బాచరించి, నా యొనర్పం బూనిన శతక ప్రకారంబు…. ఒక్క నిముషం. ముందు నా మనవోటి వినండి. తరవాత అసలు విషయానికి రావచ్చు.
కబ్బము చేయుచుంటి నిది
కాగనె, యచ్చుకు బంపగానే, మా
సుబ్బయ్య డబ్బు పంపగనె_
సుబ్బయ తప్పక పంపులెమ్ము_ నీ
డబ్బుల నిత్తుగాని, యొక డబ్బది_
ఈ యతివల్ల _ నిమ్ము, లే
దబ్బ యనంగబోకు
ఋణదా! శరధీ! కఋణాపయోనిధీ!
అప్పులు చాల చేసితిని యర్హత
లేదనబోకు లోకమం
దప్పులు తప్పులు న్నెరుగనేరని
వారెవరైన నుందురే!
అప్పులస్వామి యా వరుణు; డప్పుల
కుప్పలు మేఘవార్నిధుల్_
తప్పగునా ఋణంబు? ఋణదా!
శరధీ! కఋణాపయోనిధీ!
సాగరు ‘డప్పు’చేసి ఋణసాగరు
డైనను నిచ్చు వాహినుల్
నా గతి చూడవా! యనెడు
నాగటిచలున కీవు; కావునన్
ఈగతి నప్పు, చేసితిని ఇమ్మిక
నమ్మిక నప్పు దాచినన్
దాగని దానశీల ఋణదా!
శరధీ! కఋణాపయోనిధీ!
‘నాకడ నప్పు చేయుటగునా’
యని నవ్వుకొనంగబోకు మీ
లోకమునందు పారు నదులన్నిట
వార్నిధి యప్పుబీల్చగా
నా కడలి నగస్త్యముని యక్కట!
పుక్కిటబట్టి నిల్పలే
దా? కఋణాసముద్రా! ఋణదా!
శరధీ! కఋణాపయోనిధీ!
పూవుల నుండి తేటులును
పున్నమి చందురు నుండి కల్వలున్
గోవులనుండి వత్సములు
కోమలి మోవిని యాని కామియున్_
తావుల తేనె, వెన్నెలను,
తీయని పాలు, సుధారసంబులన్
ఏవిధి నశ్రమంబుగ
గ్రహించెడి_ నట్తుల నిప్పుడేను నీ
తావున నప్పుగొందు ఋణదా!
శరధీ! కఋణాపయోనిధీ!
(తమరు ఋణదానం చేసే పర్యంతం బండి కదలదు. ఋణగుణ ధ్వని చప్పున చల్లారిపోతుంది. గాన వెంటనే వో దేవా! తామీ విషయం బాలోచించ గలరు. -ముళ్ళపూడి వెంకట రమణ)

ముళ్ళపూడి వెంకట రమణ గారి ‘ఋణానంద లహరి’ అను అప్పు కవీయము ఫలశ్రుతిః
“ఋణానందలహరి చదివినవారికి అప్పులుచేసే ట్రిక్కులు కొన్నితెలియును. ఎన్నో స్ఫురించును. కాని ఒక చదివినవారి మీద యింకొక చదివినవారు యిందులో తాము ట్రిక్కులనుకున్నవి ప్రయోగించటం గిట్టుబాటైన పని కాజాలదు. ఒక చదవనివాడు ఇంకొక చదవనివాడు దగ్గిర ఈ ట్రిక్కులు తెలిసి ప్రయోగించే అవకాశం ఉండదు కనుక చెప్పేదేంలేదు. ఒక చదవనివాడు ఒక చదివినవాడి దగ్గిర ప్రయోగించటమూ అంతే కాబట్టి ఒక చదివినవాడు ఇంకో చదవనివాడిదగ్గర (ఉంటే) ప్రయోగించవచ్చు. కాని, అవి చెల్లుబడికాకపోవచ్చు. అందువల్ల ఒక చదివినవాడు ఇంకో చదివినవాడితోచేరినపుడు దీన్ని గురించి, ఇంకా ఇతర ఋణ వాక్యాల గురించీ కాసేపు మాట్లాడి, చలోక్తులాడి, చివర్న సూటిగా అడిగేస్తే మంచిది. అప్పుదొరకడం, దొరక్కపోవడం వేరే సంగతి. ఇది చదివిన వాడు ఒక సుబ్బరమైన అప్పారావును కేకేసుకొచ్చి ఓ అయిదు రూపాయలు ఋణ దక్షిణ ఇవ్వవలెను.”


నాకు నచ్చిన శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ఓ చిన్నకథ – “గూడు మారిన కొత్తరికం” (y)
ఇతివృత్తం: ఓ అగ్రహారీక గారాల పల్లెపడుచు (ముగ్గురు మగపిల్లల తరువాత కలిగిన ఒక్కగానొక్క ఆడపిల్ల, అదీ ద్వితీయ కలత్రానికి) –నరసమ్మ తొలిసారి కాపరానికి వెళ్లడం; ఆ సందర్భంగా ఆమె, ఆమె తల్లితండ్రులు, ఆమె భర్త, ఆమె స్నేహితురాళ్ల మధ్య నడిచిన మమతానురాగాల అనుభూతులు, అనుబంధాలు. సందర్భోచితంగా నాటి (1927) సామాజిక ఆచారాలు, కట్టుబాట్లు, జీవనశైలి మనకళ్లముందు మెదలుతాయి.
నేపధ్యం: అనపర్తి నుండి 4 మైళ్ళదూరంలోఉన్న మహేంద్రవాడ (“అరటితోటలు, బత్తాయితోటలు, సన్నవరి పండే సుక్షేత్రాలు, కొబ్బరిచెట్లు, చుట్టూ గోదావరి కాలవలు, వూరిమధ్య దేవాలయాల నానుకొని చక్కని చెరువు, వీటితో శాంతి, దానికి భంజకం కాని వుల్లాసం-నిగ్రహం, దానికి అభ్యంతర్ం కలిగించని ఉత్సాహం- హద్దులేని విద్యలు-వాటికి వెలుగు తెచ్చే శమదమాలు-నిజంగా ఋషివాటికలా లెదూ ఆవూరూ? ఎవరిహద్దులో వారుంటూ యువయువతు లావూళ్ళొ వున్నంత కలిసికట్టుగా మరే వూళ్ళో వున్నారు? సభ్యత గుర్తించుకొని మసులుకోగలవారికి, సార్ధకనామం అయి ఆవూరు కలిగించే మధురానుభూతి మరచిపోడం శక్యమా?” – ఇది క్రొత్త అల్లుడు, రామారావుకు ఆత్మీయతో కలిగిన అనుభూతి) & రాజమహేంద్రవరము (ప్రస్తుతము రాజమండ్రి)
ముఖ్య పాత్రలుః కథ నరసమ్మ చుట్టూ తిరుగుతుంది ( కథానాయిక); ఆమె భర్త- రామారావు – రిజష్ట్రీ ఆఫీసులో ఉద్యోగం; ఆమె తల్లి- రాజమ్మ- ముప్ఫయ్యో యేట మొదటి పెళ్ళాం కాలం చేయగా , అప్పటికే కట్టుతప్పివుండిన రాజమ్మను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు – నరసమ్మ తండ్రి కల్లూరి సోమసుందరం.
మిగతా పాత్రలుః పాలికాపు సూరిగాడు (ఆ కాలంలో అలాపిలిచినా తప్పుపట్టేవారుకాదన్నమాట); లచ్చమ్మ వదిన- రాజమ్మ స్నేహితురాలు; సోదెమ్మ, గున్నమ్మ, సూర్యకాంతం, జగ్గమ్మ, రమణ, చుక్కమ్మ, విశాలాక్షి, నిమ్మన గారి సీతమ్మ,, … నరసమ్మ చెలికత్తెలు 
ఆడపిల్లను కాపరానికి పంపిన తరువాత తల్లిదండ్రుల భావోద్వేగాలు చదువుతున్నప్పుడు ప్రతిఒక్కరికి వారి, వారి అనుభూతులు ఒక్కసారి స్ఫురణకు రాకమానవేమో…..ఆడపిల్లలు లేనివారు అయ్యో!!! ఆడ పిల్లల తల్లితండ్రులు ఇంత బాధపడుతుంటారా అనుకోక తప్పదేమో… మచ్చుకకి కొన్ని సంభాషణలు…
“వేసవిలో రాజమహేంద్రవరం వేడి మంగలం లాగ మిటమిటలాడిపోతూ వుంటుంది గదా, ఇన్నాళ్ళూ, చుట్టు అరటిబోదెలు నిండివున్న యింట్లో మసిలిన మా చిట్టితల్లి వొక్క మాటుగా అంతమార్పు సహించ గలదా?” అనడిగాడు సోమసుందరం, జాలిగా. { ఇంకో విశేషం నేను గ్రహించింది – రాజమండ్రి మొదటినుంచి వేసవిలో వేడిమంగలం అని-కాలుష్యం వల్ల వేడని మేము (1972-2010) అనుకొనేవాడ్లం}
“అమావాస్య వెళ్ళిన విదియనా డామె రాజమహేంద్రవరం వెళ్లింది. …….. కాని పున్నమి వెళ్ళాటప్పటి కా దంపతులకు ఆమెని చూసి వందసంవత్సరాలయిన ట్టనిపించింది.”
“అమ్మాయి లేకపోతే కాలం గడవడం కష్టమే” అంటాడతను
“పీల్ల లేకపోవడంవల్ల పొయిదగ్గిరకే అడుగుపడ్డం లే”టుం దావిడ.
“నా చిట్టితల్లి నిన్న రాత్రి కల్లోకి గూడా వచ్చిందండీ” అనిన్నీ అంటూ వుంటుందామె అప్పుడప్పుడు.
“మిమ్మల్నీ బాబయ్య గారిని చూడాలని వుందిటండి, అమ్మాయిగారికి” అన్నాడు యాదాలాభంగా, వాడు (పాలికాపు).
“ఏమిటి?” అందామె ఆడనెమలి కేక వేసినట్టు.
“చిక్కిపోలేదు గదా నాచిట్టితల్లి?” అంటూ ఆత్ర పడిపోయింది.
“ఏంచేస్తోందో వెర్రి పిల్ల! మమ్మల్ని చూడా లని వుందట. చిక్కిపోయిందో యేమిటోనాచిట్టితల్లి. అన్నం సయిస్తోందో లేదో? అదేమిటో వెళ్ళిచూసుకోవాలి; గాని, సూరిగాడి వల్ల యేమి తెలుస్తుంది?”
“ఉత్తరం రాసి యిచ్చి, జవాబు తెప్పించుకోవాలిసింది” అంటూ పిసుకున్నాడు కొంతసేపు.
“పోని, పదిరూపాయలు పారేసి రామచంద్రాపురం బదలీ చేయించుకుంటే, రామాన్ని?” (లంచాల బదిలీలు అప్పుడూ ఉన్నవన్నమాట????)
“అదేమిటో చెప్పలేనండి! వుబలాటమో మరొకటో తగ్గడంలేదు. అబ్బా, నుంచోలేను కూడాను” అంటూ అతనికిదగ్గిరసా చతికిలబడింది, పీట దూరంగా తోసేసి.
ఇటుచుస్తే గంపెడు ఉత్సాహమూ, అటు చూస్తే పుట్టెడు బెంగాను, యిద్దరికీ గూడా.
“అట్టేపెట్టుకుంటే యెలాగా?” అని యిటూ “విడిచి పెట్టి వూండడం యెలాగా?” అని అటూ తల్లికయితే; “వెడితే అమ్మ కనబడ” దని యిటూ “వెళ్ళకపోతే వారు కనబడ” రని అటూ కూతురికి.
“వోమాటిలా రావే అమ్మాయీ” అంటూ పడమటింటిలోకి వెళ్ళడం వొకర్నొకరు విడిచిపెట్టుకోలేని బెంగవల్ల తప్ప…..
“వె-డు-తు-న్నా-వా?” అని పైట్కొంగు పెదవులమీదికి తీసుకుంటూ వీధిగుమ్మంకేసి రెండడుగులు వేసింది; కాని నిలిచిపోయింది.
“కష్టమూ సుఖమూ మాట్టాడు కోవాలా బిడ్డా నేనూను?” అంటూ కస్సుమంది, పెనిమిటి మీద ఆమె.
“అమ్మా” అంది మరి మాట్టాడలేక పోయింది
మిడుతూ మిడుతూ చూసుకున్నారిద్దరూ.
కళ్ళున్నూ చెమ్మగిల్లాయి.
ఇటు పెదవులు రావిరేక లయిపోయాయి; కాని అటు కాళ్ళు పాలకీలోకి దారితీశాయి, నరసమ్మకి.
ఇటు చూపులు చేదిరిపోయయి; కాని అటు, కింద జీరాడుతున్న నరసమ్మ కుచ్చెళ్ళుకొంగు పాలకీలో సడ్డాయి, రాజమ్మ చేతులు.
తడబడుతూ వెంటబయలు దేరింది రాజమ్మ.
“అమ్మాయీ ….” అంది మాట తెముల్చుకుని, మరి, ఆమేకి ముందుమాటా రాలేదు, ఆ వచ్చినమాట అయినా నరసమ్మకి వినపడాలేదు.
ఝుంఝూమారుతంలో యేలకీలత అయిపోయింది రాజమ్మ; నుంచోనూలేకపోయింది. ఉసూరుమంటూ వెన్నకిమళ్ళి, తూల్తూతూల్తూ హాల్లోకి వెల్లి, నిట్టూర్పు విడుస్తు కవాచిబల్లమీద వాలిన్నీ పోయిందామె, చివరికి.
సోమసుందరమ్కూడా, మురుగుకాలవ దాటేదాకా యేమిటెమిటో చెబుతూ పాలకీ పట్టుకునడిచి “తల్లి, నాలుగైదు రోజుల్లో వస్తానేం?” అంటూ గరువు మీదికి వెల్లిపోయాడు, కాళ్ళీడ్చుకుంటూ.
(ఇంకోసారి, “క్రొత్తకాపురంలో నరసమ్మ కొత్తరికం గడుసుగా ఎలా పండించుకుందో”… శ్రీపాదవారిమాటల్లో… తెలుసుకుందాము మరి…)

LikeShow more reactions
Comment

No comments:

Post a Comment