తే.గీ|| శ్రీకరుం, డవ్యయుం,డాత్మ, చిద్ఘనుండు,
శోకదూరుడ నంతుడు, శుభచరిత్రు;
డప్రమేయుడటంచు, నిన్నభినుతింత్రు;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (1)
తే.గీ|| భక్తి చే నీదులీలలు పలుకదలచి
మ్రొక్కుచుంటిని నీపాదములకు దేవ!
చక్కనౌభావములయందు సాగిరమ్ము
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (2)
తే.గీ|| వాఙ్మనంబుల కందని వాడటంచు
పలుక వినియుంటి నేరీతి పలుకనేర్తు!
పలుకువాడావు నీవెయై పలుకుమయ్య
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (3)
తే.గీ|| ఇహఫలంబుల నాశించు యిచ్ఛలేదు;
పరసుఖంబుల గోరెడి బాధలేదు;
నిన్నువిడనాడిజీవించు నేర్పులేదు;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (4)
తే.గీ|| వేద వేదాంతములచేత వెదుకబడియు
కానరానట్టి నీవు నాకనులముందు
దిరుగు చున్నావు సౌందర్య దిప్తులెసగ;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (5)
తే.గీ|| సచ్చిదానంద సద్గురు “సాయినాధు”
డొకడె, నాకేడుగడయంచు నుల్లమందు
నమ్మియున్నాడ నన్నెట్లు నడిపెదొగద?
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (6)
తే.గీ|| పలుకు పలుకున తేనియ లొలుకు నీదు
దివ్యబోధల సారము దెలిసిమనెడి
వారిజన్మము ధన్యమై వరలుగాదె?
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (7)
తే.గీ|| “సాయి” యన“షిర్డి” యందలి చలువరాతి
ప్రతిమయా? కాదు; నాలోని ప్రాణమునకు
చేతనత్వము కల్గించు నేతయతడు;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (8)
తే.గీ|| ఓ పరాత్పర! సర్వేశ! యోకృపాళో!
దీనుడను కావరమ్మంచు దినదినంబు
వేడుకొనుచుంటి నామొఱవినవదేల?
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (9)
తే.గీ|| భావమయమైన విశ్వము బహువిధాల
రూపుదాల్చుచునున్న ద రూపమందు
అవ్యమౌ నీవభావివై యలరు దెపుడు
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (10)
తే.గీ|| త్రివిధ గుణచేష్టి తంబగు దివ్యలీల
లవిరళంబుగ జరిపెదవయ్య నీవు;
ఏలయీలీలలో దయాలోలనీకు?
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (11)
తే.గీ|| ఏకమై యొప్పు నీ యందనేకమైన
రీతులై యొప్పుచున్నట్టి భూతజాల
ప్రకృతులెటులబ్బెనో? వీ టిఫలముదేమో?
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (12)
తే.గీ|| దాసులట దేవతల్ నీకు, ధాతమొదలు;
విశ్వమెల్లయు నీదగు విడిదియంట!
జీవులన్నియునీవట! చిత్రముగద!
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (13)
తే.గీ|| కరుణ జాల్వారు నీ నేత్ర కమలయుగ్మ
సోయగముగాంచి, నిన్నెడబాయలేక,
నీదు చరణాబ్జములచెంత నిలిచియుంటి;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (14)
తే.గీ|| శిశిరమందున మ్రోడైన చెట్టునందు
చివురుమొలచు వసంతము చేరువైన;
అట్లె నీ కృపగల్గినయపుడుముక్తి;
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (15)
తే.గే|| “సాయి!” నీనామ మహిమచే సాథకులకు
అందనేరని ఫలమేమి? యైనవారు
నిస్ళృహులవోలెనుందురు, నిన్ను దెలిసి
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (16)
తే.గీ|| నీదు చరణాబ్జముల దాకి,నేలతల్లి
పులకరించినదేమొ యాపుణ్యవేళ
నేడునిస్మృతి మది దాల్చినిలచియుండె
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (17)
తే.గీ|| నీదు గురుభక్తి, దివ్యమౌనీదుశక్తి,
ఇటుకయందున నిల్చుట యెంతయుక్తి;
నిన్ను యోచించి తెలియుటే నిజముముక్తి;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (18)
తే.గీ|| అక్షరంబగు నాత్మగా నలరుచున్న
విశ్వమందున క్షరమేది వెదకిచూడ?
దేహమే “నేను” గాపల్కుతెల్విదప్ప;
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (19)
తే.గీ|| నీదుచెయిదము ధర్మంబు, నీదువాక్కు
వేదమైయొప్పు, నీరూపువిశ్వమగును;
నీవెసత్యము, ధర్మము, నీవెమాయ;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (20)
తే.గీ|| గుణము గుణియందె నెలకొని గూఢమగుచు
కార్యరూపాన నొక్కెడ గాన బడును;
గుణమెలోకము, నీవెయాగుణివిదేవ!
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (21)
తే.గీ|| అనుభవములేక విషయములందు నిజము
తెలియబడరాదు భువినెంత తెల్వియున్న,
అనుభవము నీవ;నిన్నెట్టు లునుభవింతు
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (22)
తే.గీ|| మూడవస్థలకును నీవమూలమగచు,
మూడుగుణములకును నివమూలమగుచు,
మరియు చున్నావు పరతత్వమూలమగుచు;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (23)
తే.గీ|| “ద్వారకామాయి” వైకుంఠ థామమాయె,
గౌతమినది యాకాశ గంగయాయె
వాసుదేవుడ నీవన వంకయేమి?
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (24)
తే.గీ|| ఆత్మయును జీవు డన్యమంచరయుచున్న
యంతవట్టును, దెలియరాదాత్మారూపు;
జీవుడేయాత్మగానెంచ చిక్కువీ డు,
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (25)
తే.గీ|| పంచభూతము లీరీతి కొంచెమైన
బేధమెఱుగక జీవుల బెంచుచుండ
జీవుడే యహంకృతినిదా జెందనేల?
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (26)
తే.గీ|| కులమతములన్న భావాల కూర్పు; దాన
వాస్తవంబే మిగన్పట్టు వసుధలోన?
సర్వమునకును మూలమౌ సత్వమీవు
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (27)
తే.గీ|| వ్యధలచే జివితమబెల్ల కథమిగిలె!
విధిని దూరిన ఫలమేమి వెఱ్ఱీనగుచు?
కర్మఫలమర్మ మీదిగాదె కన్నతండ్రి!
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (28)
తే.గీ|| గాలిచేపండుటాకులు రాలుపగిది
పాపపత్రాళి భక్తి ప్రభంజనమున
దూలిపడునంచు వేడితి దోయిలొగ్గి;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (29)
తే.గీ|| సారహీనము సంసార సాగరంబు
భారమంచును దలచెడి భ్రమనుబాపి
సారభూతముగావించి సాకుమయ్య;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (30)
తే.గీ|| నశ్వరంబగు దేహము నమ్మియుండి
గట్టెలంగాలు దీనిని గాంచుచుండి;
మురిసి పడుచుంటి నేనిట్లు మూఢమతిని;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (31)
తే.గీ|| మనసు శబ్దాదులందున మరలియున్న
విషయములు దోచుచుండును వివిధగతుల;
మనసుతనయందె నిలచిన మాయమౌను
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (32)
తే.గీ|| భక్త కల్పక మంచునిన్ బ్రస్తుతింప
నమ్మియుంటిని భక్తిని; నమ్మకమును
వమ్ముసేయక కాపాడవలెను; దేవ!
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (33)
తే.గీ|| వేదశాస్త్రాదులందున వేత్తగాను;
యోగవిద్య లెఱింగిన యోగిగాను;
ఎట్లు దరిజేర్తువో నన్ను యింకపైని?
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (34)
తే.గీ|| నామనో బుద్ధి చిత్తముల్, నాదు దేహ
మెల్ల నీకర్పణముజేసి యుల్లమందు
శాంతిబొంది చరించెడి శక్తినిమ్ము;
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (35)
తే.గీ|| నీ దయాదేవి మహిమచే నీదు కీర్తి
దశదిశల వెల్గుచున్నది ధరణియందు;
నీదయాదేవి పాదాల నిడెదశిరము;
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (36)
తే.గీ|| “నాది” “నేన”ను మాయచే నష్టమైన
భాగ్యనిధిగాన బడెనేడు భక్తివశత;
వీ డెమోహము, నిజము నీవాడనైతి;
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (37)
తే.గీ|| విషయములబొంది నాబుద్ధి విడువదెపుడు;
విషమయములంచు దెల్పిన వినదిదేమి?
దీనిమౌఢ్యము నెడలించు దిక్కునీవ
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (38)
తే.గీ|| ఘోరదావాగ్నిచేజిక్కి గోడుజెందు
జీవిపోల్కి భవాగ్నికిన్ జిక్కినాను;
నిరుపమాన కృపావృష్టి బరువుమయ్యా!
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (39)
తే.గీ|| నీ కృపావార్ధి పొంగుచునింగి నొరసి
పారుచున్నది; దాననాపాపసమితి
గొట్టికొనిపోక నిలుచునే? కోమలాంగ!
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (40)
తే.గీ|| పాపులందునననుమించు పాపిలేడు;
అవని నీవంటిపాప సంహర్తలేడు;
నీకు దయగలరీతిని నిల్పుమింక;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (41)
తే.గీ|| నిన్ను దర్శించి, సేవించి, నీదుపల్కు
విన్నవారలు భువిలోన మన్నవారె;
ఎన్నమిగిలిన వారెల్ల చన్నవారె;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (42)
తే.గీ|| స్వార్ధపరతనశించిన జగతియందు
వ్యర్ధమా జీవితము దయావార్ధి? కాదు;
సార్ధకంబయ్యె ననవచ్చ సత్యముగను;
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (43)
తే.గీ||“సో2హ” మనుమంత్ర మునువిని, మోహముడిగి
దేహధర్మము మన్నించి, తెలివిగల్గి,
జగతివర్తించు వాడెబో సుగతిగనును
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (44)
తే.గీ|| క్షీరమునుగొని నీరము వేరుబరచు
“హంస” యనజీవుడేయని యరయనగును;
“పరమహంస”వు దెలియంగ బలుకుమయ్య
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (45)
తే.గీ|| కామరోషాది శత్రువుల఼్ గలసినన్ను
పట్ట జూచుచునున్నవి జుట్టు ముట్టి;
గట్టి సామర్ధ్య మిడువీ ని గొట్టివేతు;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (46)
తే.గీ|| అమలు, డవ్యయు, డద్యు, డనంతు, డాత్మః
స్థిరుడు, పరుడును, సత్తును, జిత్తు, నతడె
యంచు పలుకంగ వింటినో యయ్య! నిన్ను
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (47)
తే.గీ|| బిడ్డవేధింపగా తల్లి భీతిగరుప
గొట్టితిట్టిన కాళ్ళకుజుట్టు కొనెడి
రీతి, విడజాలనిను మది నీతిమాలి;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (48)
తే.గీ|| నిరుపమాన కృపాబ్ధివి నీవునిజము;
నిరుపమాన దురాత్ముడ నేను నిజము;
నిరుపమానముగా కరుణింపవలదె;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (49)
తే.గీ|| పూర్వకర్మవశంబున బుట్టినాను
నేడు కర్మంబోనర్చుచు నిలచినాను
కర్మబంధముబాపినన్ గావుమయ్య
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (50)
తే.గీ|| ప్రమిదదేహము, ప్రాణము చమురుగాగ,
జీవియును దీపశిఖ వెల్గు చిత్రముగను
వెల్గు లొసగెడి తన్నుదా వెదుకుటెట్లు?
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (51)
తే.గీ|| భక్తిసంభరితాత్ములై ముక్తిబొందు
కోర్కెయేలేక జీవించు గొప్పవారు
నిత్యముక్తులు; వారలే నీవుగాద?
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (52)
తే.గీ|| చరణమొక్కటి భూమిపై చక్కనుంచి
శిలనుగూర్చున్న నీయొక్క చిత్రముగన
పాదమొక్కింట యీ విశ్వవలయమెల్ల
వెలసెనను వేదవాక్యము విదితమయ్యె
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (53)
తే.గీ|| సాయిచరణంబు సకలార్ధ సాధకంబు
సాయినామంబు దివ్యరసాయనంబు
సాయితత్వంబు ముక్తి ప్రదాయకంబు
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (54)
తే.గీ|| కోటియజ్ఞ ఫలంబుల గూర్చునట్టి
సాయినామాక్షరద్వయి జగతిగల్గ
కలతజెందెద రేలనో కలినిజనులు?
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (55)
తే.గీ|| సాయి సాయి యటంచును సతమునీదు
రమ్యనామ సుధారస రక్తిజూచి
మనెడివారల జన్మము మహితమౌను
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (56)
తే.గీ|| శాశ్వతులమంచు దలచుచు జగతియందు
వంచనావృత్తి చేనుండు వారికెల్ల
కొంచెమైనను విజ్ఞాన ముంచుమయ్య;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (57)
తే.గీ|| దేహబాధల దొలగించు దివ్యమైన
“ఊధి” యనెడియౌషధముగల్గ నుర్విజనులు
దుఃఅఖమగ్నతచేనేల దూలుచుంద్రు?
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (58)
తే.గీ|| దుష్టసంకల్పములు మదిదోచకుండ
కష్టసుఖములలో మది కదలకుండ
ఇష్టఫలముల నందించి యేలుకొనుము
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (59)
తే.గీ|| "షరిడి” యందునెగలననుచింతయేల?
సర్వమందున వెలసెడి సాక్షి నేను;
అర్తితోబిల్వ రక్షింతు నంచుబల్కు
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (60)
తే.గీ|| నింబవృక్షము నీడననియమమొప్ప
తపము గావించనావట ధన్యచరిత!
ఏమిఫలముల నందంగ నెంచినావో
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (61)
తే.గీ|| “అల్లటాలిక” టంచును నధికభక్తి
బల్కుచు, మసీదు నందున బహుదినాలు
ప్రకృతి సంసర్గముల్ వీ డు ప్రభుడవీ వు
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (62)
తే.గీ|| తల్లియును తండ్రియెవ్వరో ధరణినీకు
తెలియదని పల్కుచున్నారు దివ్యచరిత!
తలపజీవులకిల తల్లి దండ్రినీవ
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (63)
తే.గీ|| నిప్పు నీరును గాలియు నింగి భువియు
నీదునాజ్ఞను జరియించు నిక్కమంచు
దెలుపజలమున దీపంబు నిలిపినావు
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (64)
తే.గీ|| దేహమస్థిర మంచును దెలుపుకొరకు
చిరుగు చొక్కాను ధరియించి చిత్రముగను
తత్వమెంతయు బోధించు దైవరాయ!
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (65)
తే.గీ|| “నిష్ట” యు“సబూరి” యనియెడునిరుపమాన
దక్షిణలనిండు భక్తితో నక్షయముగ
మోక్షఫలమిచ్చు నవియని దీక్షబలుకు
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (66)
తే.గీ|| భక్తుడగులోహకారుని బాలయోర్తు
కొలిమిలోబడ దూరాన గూరుచున్న
నీవురక్షించినావట నేర్పుమిగుల
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (67)
తే.గీ|| ఏడనో“హజరత్ బాబ” యిల్లుగాల
ధునిని నీళ్ళుంచి చల్లార్చి దొడ్డమహిమ
జేసి చూపించినావట చిత్రముగను
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (68)
తే.గీ|| భోజనముసేయరమ్మని పొలతిబిల్వ
కుక్కరూపంబుతోనేగి, కొట్టితరుమ
గునిసినావట కొరవితో గొట్టితివని
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (69)
తే.గీ|| దొంగయొక్కడుసొమ్ముల దొంగలించి
“సాయి” యొసగెనటంచును సాక్ష్యమిడగ
ఇచ్చినానని బల్కితివేమి దేవ!
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (70)
తే.గీ|| వృద్ధురాలిచ్చు రొట్టెకుప్రీతిఁజెంది
మెసవినావటినీవు సంతసముతోడ
ఎంత కరుణామయుండవో యెరుగవశమె?
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (71)
తే.గీ|| పాదనఖమునగంగను బారజేసి
“నేనె” హరినంచు దెల్పిన నిన్ను దెలియ
జాలకున్నట్టి యజ్ఞాని నేలినావు
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (72)
తే.గీ|| ప్రేమ“కాకా”ను “పంతు”ను సేమమరసి
బాధ లెడబాపినట్టియో భద్రమూర్తి!
నాదుబాధల మాన్పగ రాదెనేడు?
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (73)
తే.గీ|| శ్వేతఛత్రముబట్టీ నీసేవజేయు
భాగ్యమిచ్చిన “నానాకు” భక్తితోడ
వందనమొనర్చు చున్నాడ వాంఛదీర
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (74)
తే.గీ|| వెండిపళ్ళెరముందున విమలమైన
పాదములనుంచి కడిగిన భాగ్యశాలి
యైన “జోగు” పదంబుల నఖినుతింతు
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (75)
తే.గీ|| గద్దెపైపెద్దవేల్పువై ముద్దులొలక
యొద్దికగఁ గూరుచున్న నీ యొద్దజేరి
“తాత్య” మొదలగుభక్తులు దండమిడరె;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (76)
తే.గీ|| చిలుమునందింపగా “శ్యామ” చేతబట్టి
హొయలుమీరగ పొగబీల్చు యోమహాత్మ!
నరుల యజ్ఞానమున్ గాల్చినావు దాన
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (77)
తే.గీ|| గీతనృత్యాదులన్ భక్తజాతమెల్ల
పరవశంబున నీనామ భజనసేయ
“జోగి” డెడియారతిఁగొను శుభచరిత్ర!
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (78)
తే.గీ|| ఎందరోభాగ్యవతులనేక విధుల
సేవలందింప వచ్చిన చిన్న బుచ్చి
వారిగర్వంబు బాపిన వందనీయ!
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (79)
తే.గీ|| సాయిశ్రీసాయి సాయిశ సాయియనుచు
సతమునీనామ జపమును సలుపువారి
యండ నేయుండి రక్షించు ఆప్తుడవట
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (80)
తే.గీ|| మృతులజీవింప జేయుటా; మేలుమేలు
వంధ్యలకుబిడ్డ లొసగుటా; వహ్వ!భళిరె
అంధులకుదృష్టి నిచ్చుటా; అద్భుతంబు
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (81)
తే.గీ|| అభయమొసగెడినీదగు హస్తమాన,
కరుణ యుప్పొంగుచున్న నీ కనులయాన
ఎదను నీనామ భజనంబు నేపుడుమాన
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (82)
తే.గీ|| గురుతరంబులనన్నిట గురువు నీవ
లఘుతరంబుల నన్నిట లఘువునీవ
గురులఘువున్న లౌకికగోష్టియెగద
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (83)
తే.గీ|| “నేను” గల్గినలోకాలనేక మొదవు
“నేను” లేకున్నలేదేది నిక్కముగను
“నేను” మూలము, తెలియంగ నీకునాకు
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (84)
తే.గీ|| జన్మమందినబిడ్డ కాక్షణమునందు
ప్రకృతియందించు ఫలమేమి? భయముగాదె
భయమువీ డుటయే ముక్తి పథముదేవ!
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (85)
తే.గీ|| జగములన్నిటనిండిన శక్తి వీ వు
ఏది నీరూపమని యెంతు? నేదివిడుతు?
ఎటులపూజింతు? వేరుగా నెచటనుందు?
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (86)
తే.గీ|| శుక్తి రజితంబటంచు నాసక్తి చేత
పరువులిడుచుండు ముఢుడు భ్రమనుదవలి
అట్లె విషయానుభవముల యందుసుఖము!
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (87)
తే.గీ|| అవగతంబౌదువయ్యనీవందఱకును;
అరయు యిచ్ఛయే లోపించెనయ్యామాకు
అరయు నేర్పున్న యన్నిట నగపడుదువు
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (88)
తే.గీ|| దేహబంధముచేనిన్ను దెలియలేక
మ్రగ్గుజీవుల యజ్ఞాన మలిన మణప
జ్ఞానదీప్తుల వెదజల్లు మాననీయ!
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (89)
తే.గీ|| వేదములకునువర్ణింప వీ లుగాని
నిన్నుభావించి మదిలోన నిజముదెలిసి
శాంతులై నీవెయైరెల్ల సాధువరులు
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (90)
తే.గీ|| పలుకవిన శబ్దమున్నది బహువిధాల
అర్ధమగుభావ మందది యన్ని విధుల
భాషగాకున్న మున్నేమి భావమొగద?
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (91)
తే.గీ|| తనువుచాలించినను నెను ధరణియందు
నా మసీదున నెలకొనినమ్మియున్న
భక్తులన్ గాతునంచును పలికినావు
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (92)
తే.గీ|| ధర్మమునునిల్చజగతిని “దత్తదేవు”
డనెడి నామంబుదాల్చియు నవతరించి
ఆత్మతత్వము నెరిగించు నవ్యయుడవు
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (93)
తే.గీ|| యోగమెల్లనునేర్చిన యోగియైన
నీదు పదభక్తిలేకుండెనేని ఫలము
సున్నయంచును దెలియడు చోద్యమిదియె
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (94)
తే.గీ|| బ్రహ్మరుద్రేంద్రు లాదిగా భక్తపరులు
పూజలొనగూర్ప నందని పుణ్యపదము
మోపగబడ్డ శిలయెంత ముక్తిపరుడొ?
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (95)|
తే.గీ||పాడుబడిన మసీదులో పదిలముగను
వాసమువంటివి యదియె కైలాసమయ్యె
భక్తజనులకు నేడిల పరమపురుష
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (96)
తే.గీ||నా ధనాగారమున నున్న నాణ్యమైన
జ్ఞానధనమును గోరరీ హీనమతులు
ఏమిసేయంగ దగునని ఎంచినావు?
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (97)
తే.గీ||సర్వభారముల్ వహియింప జాలునేను
నీదుభారము భరియింప నేరనేమి?
భయము విడుమంచు పలికిన బాంధవుడవు
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (98)
తే.గీ||కలుషమగు మాయచేజిక్కి కలతజెంది
ఆర్తితో నిన్నె పిలుతునోయయ్య! నాకు
చేయినందించి నీదరిజేర్చు కొనుము
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (99)
తే.గీ||తల్లివై తండ్రివై నీవె దాతవగుచు
జీవులను గాచుచుంటివో చిద్విలాస!
నీకు నెనయగు వారేరి నీవెదప్ప
సకలకళ్యాణగుణధామ! సాయిరామ! (100)
తే.గీ|| నిత్యమును సత్యమును నివే నిర్మలాత్మ
కార్యమును కారనము నీవె కమలనేత్ర!
కర్తయును భోక్తయునునీవెగాదె యరయ
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (101)
తే.గీ|| ఎందరో సాధువుల్ నివె “యీశు” డవని
వందనమొనర్చి నారలు వసుధలోన;
మందబుద్దు లెరుంగరు మహినినిన్ను
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (102)
తే.గీ|| నాదమే నీ స్వరూపమన్నారు బుధులు
నాదమునకేది భావమో వేదవేద్య!
ప్రకృతిభావము నాదమౌ ప్రణవమీవు;
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (103)
తే.గీ|| గురుడవగజీవి హృదయాన గుర్తునెరుగు
ప్రజ్ఞయని తోచుచున్నదో పరమపురుష
గురుని గుర్తించినంత తా గురువెయగును
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (104)
తే.గీ|| నీదుబోధలు చేతలు, నేర్పుమిగుల
మది విచారించినంతనే విదితమగును
సకల నిగమాగమంబుల సరమెల్ల
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (105)
తే.గీ||నీదుపాదపద్మ మకరంద నిరుమాన
మధురిమనెరింగియున్న నామనసునిన్ను
క్షణము విడనాడి బ్రదుకగా జలదయ్య
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (106)
తే.గీ||భక్తితోడ నీ శతకము పఠనసేయు
వారికెల్ల సుఖంబుల వారిగాగ
నొసగి రక్షింప వేడెద నోకృపాబ్థి!
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (107)
తే.గీ||గీతమాలికనల్లి సంప్రీతినిడుదు
కంఠసీమను ధరియింప కరుణతోడ
సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (108)
తే.గీ||జయము! దత్తప్రభూ! నీకుజయము! జయము!
జయము! నరసింహభారతీ జయయే! జయము!
జయము! షిర్డీ పురాధిపా జయము! జయము!
జయము! శ్రీసాయిసద్గురూ జయము! జయము! (109)
ఓం తత్సత్
శ్రీ సాయీనాధ పాదార్పణమ్
మంగళమ్ మహత్
ఆలయం ఆలయం ఆలయం
ప|| ఆలయం ఆలయం ఆలయం
శ్రీ సాయిప్రేమాలయం - శ్రీ సాయిప్రేమాలయం
అ||ప|| ఆనందనిలయం - అనురాగవలయం
అదిసాయిప్రేమాలయం – అదిసాయిప్రేమాలయం
చ|| శిఖర దర్శనం చింతలహరణం
మూర్తి దర్శనం మోక్షకారణం
నాలుగు పురుషార్ధాలను అందజేయు ఆలయం
నమ్మిన భక్తుల పాలి సొమ్మైన ఆలయం ||ఆ||
చ|| దత్త దేవుకరుణా – ధర్మాచరణ
చిత్తశాంతి చేకూర్చే - చిన్మయనిలయం
సద్గురుడౌ సాయివని – చక్కనైన ఆలయం
నిత్యసత్యమౌప్రమనునేర్పే యీ ఆలయం ||ఆ||
చ|| పూజ చేసినా, భజన చేసినా
పుండరీకవరదుని జపము చేసినా
ఎంచలేని ఫలమిచ్చు యీ సాయి ఆలయం
ఇలలో నందనివనిలో వెలసిన యీ ఆలయం ||ఆ||
ప్రథమ ముద్రణః 1983
ద్వితీయ ముద్రణ: 1996
(నందనవనంశ్రీసాయీ ప్రేమాలయ ప్రచురణ -12 – శ్రీ నందనవనం వెంకట సుబ్బరామయ్య శర్మ గారు రచించిన“శ్రీ సాయిరామ శతకము” నుండిసేకరించబడిన పద్యములు)