Translate

08 May, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 079(391 – 395)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]


1.              దేనిని విడిచి మానవుడు అందరికీ హితుడవుతాడు?
2.             ధర్మరాజు తరువాత హస్తినకు రాజు ఎవరు?
3.             యుద్ధములో శల్యుడు కర్ణుని నిరుత్సహపరుస్తూ ఒక ఉపాఖ్యానం కూడా చెప్పాడు, ఏమా ఉపాఖ్యానం?
4.             గాంధారీ ధృతరాష్ట్రులు ధర్మరాజు దగ్గర ఎన్నాళ్లున్నారు?
5.             యయాతి ముసలితనాన్ని తీసుకున్న వాడెవరు?
                                  
సమాధానములు (జవాబులు):
1.              గర్వం ఆరణ్యపర్వము సప్తమాశ్వాసము 452పద్యము
తే|| సర్వజనసమ్మతుండగు గర్వముడిగి
     క్రోధమడఁచి శోకమునకుఁ గొలువుగాఁడు
     వినవెయర్ధాఢ్యుఁడగులోభమొనరవిడిచి
     తృష్ణవర్జించిసౌఖ్యంబు తెరువుఁగాంచు. (452)

2.             పరీక్షితుడు; మహామంత్రి యుయుత్సుడు మహాప్రస్థానికపర్వము ఏకాశ్వాసము – 9 పద్యము
|| ఆయనుజుని నట్లు మహా
    నాయకుఁ గావించి భటజనముఁ గూర్చి మహీ
    నాయకుఁ డార్యలు కీర్తన
    చేయఁ బరీక్షితుని రాజుఁ జేసె ధరణికిన్. (9)

3.             హంసకాకీయోపాఖ్యానం కాకి గుంపు ఎంత ఉన్నా హంసతో దీటురాదని తెల్పే ఒక కథ కర్ణపర్వము 
   ద్వితీయాశ్వాసము – 53వచనం; 54-80 & 81వచనం.
|| ఏ నేమితప్పు చేసిన గదం దల పగులవ్రేసెదవు నీ వి ట్లంటివి గదా యని హితోపదేశంబు మాననేర్తునే యిది  
     యొక దృష్టాంతంబు వివరించెద వినుము విని నీవు నాచెప్పినట్ల చేసి తేనియు మేలు చేయ కుండినం  
     గడుమేలని యిట్లనియె. (53)
|| ఇవ్విధంబునం దెచ్చి యెప్పటినెలవున డించి రాయంచ యక్కాకి తెప్పిఱిన దానితో నచ్చటికాకులు విన నింక      నిట్టియవినయంబు లెన్నడును జేయకు మని పలికి నిజసహచరంబు లగు మరాళంబులుం దానును వలయు      చోటికిం జనియె నీవు నాకోమటికొడుకుల యెంగిలికూటం బెరిగిన యక్కాకంబుచందంబునఁ గురుకుమారుల  
     యెంగిళులు కుడిచి క్రొవ్వి యెక్కుడువారల ధిక్కరించెదవు నీకొలఁది యెఱుంగవు దీనం జేటు పాటిల్లుఁ గాన
     తేటపడ నెఱింగించెద నాకర్ణింపుము. (81)

4.             15 సంవత్సరములు; తరువాత వారు వాన ప్రస్థాశ్రమంలో వనవాసానికి వెళ్లిపోయారు    
        ఆశ్రమవాసపర్వము – ప్రథమాశ్వాసము 20 వచనము & 29 పద్యము
||..రట్టిభంగిఁ బంచదశవత్సరంబులు చనియె నంత నొక్కనాఁ డయ్యంధనృపతి బంధుజనంబులం గూర్చి
   ధర్మనందను రావించి యతండు వినుచుండ గద్గగకంఠుం డగుచు నిట్లనియె. (20)
తే|| ఏను గాంధారియును దపోమాననీయ
     మునులచేరువ వల్కలములు ధరించి
     కందమూలఫలముల నాఁకలి హరించి
     నిన్ను దివించుచుండెద మన్న నతఁడు. (29)

5.             పూరుడు: యయాతికి 5గురు కొడుకులు. అతనికి శుక్రుని శాపం వల్ల ముసలితనం వచ్చింది.  అతడు  
         కొడుకులను  పిలిచి మీరెవరైనా నా ముసలితనం కొంతకాలం భరించండి, మీ యవ్వనం నాకివ్వండి 
       అన్నాడు.  చివరివాడు  పూరుడు ఒప్పుకొన్నాడు.  అతనికే యయాతి రాజ్యమిచ్చాడు.  అతని పేరుమీదనే 
       పౌరవవంశం అయింది.    ఆదిపర్వము తృతీయాశ్వాసము – 195 వచనము
|| శర్మిష్టాపుత్త్రుఁ బూరుం బిలిచి యడిగిన వాడు తండ్రి కోరినయట్ల చేసిన నవయౌవవనుం డై    యయాతి యభిమతసుఖంబులు సహస్రవర్షంబు లనుభవించి తృప్తుం డై పూరుజవ్వనంబు వానికి నిచ్చి తన జరాభారంబుఁదానతాల్చినిజాజ్ఞావిధేయచతురంతమహీతలబ్రహ్మక్షత్త్రాదివర్ణ ముఖ్యుల నెల్ల రావించి మంత్రిపురోహితసామంతానంత పౌరజనసమక్షంబున సకల క్షోణీచక్రసామ్రాజ్యంబునకుఁ బూరు నభిషిక్తుం జేసిన సర్వప్రకృతి జనంబు లారాజున కి ట్లనిరి. (195)
****************************************************************************************

No comments:

Post a Comment