Translate

26 October, 2014

దసరా పద్యములు-Dasara Padyamulu




దసరా పద్యములు:

జయాభిజైభవ!దిగ్విజైభవ!!

[మా తాత గారు (మాతామహులు) స్వర్గీయ శ్రీ పోలూరి రామారావుగారు, ఉపాధ్యాయునిగా పిల్లలను దసరా పండుగకు గ్రామములో (రాజుపాలెం-ఒంగోలు దగ్గర) గ్రామ దేవతల మీద ప్రార్ధనా పద్యములు, వివిధ వర్గ గ్రామస్తుల మీద పాడించే దీవెనల పాటలు. వారు వ్రాసి పెట్టుకున్న స్వదస్తూరి పుస్తకము (7.10.1951 వచ్చిన బహుమానముల జాబితా కూడా వ్రాసారు- మొత్తం వచ్చినది - 34-4-0; ముప్ఫై నాలుగు రూపాయల నాలుగు అణాలు) నుండి సేకరించడమైనది. నేను ఒకసారి మాత్రమే అందులో పాల్గోనే అవకాశము కలిగింది.]


జయాభిజైభవ!దిగ్విజైభవ!!
 
శ్రీవినాయకుని దలచి| శంకరుని దలంచి|
దేవదేవుని విష్ణు| దేవుని తలంచి|
కమలాసనుని గొల్చి కాళి సేవించి|
కమల సరస్వతులను ఘనతతో నెంచి|
కమలాప్తుడాదియౌ| గ్రహములదలంచి|
అమరేంద్రుడాదియౌ అమరులనుతించి|
శ్రీమహర్నవమి నే సేవించుటకును||జయాభిజైభవ!దిగ్విజైభవ!!||

విఘ్నేశ్వరుని మీద పద్యం:
విఘ్నద్వాంత నివారుణైక తరుణీ|
ర్విఘ్నాబ్దికుంభోద్భవా|
విఘ్నవ్యాళా| గళోపమత్తగరుడో|
విఘ్నేపపంచాననా|
విఘ్నత్తుంగ గిరిప్రభేదనఫవీ|
ర్విఘ్నాటవిహవ్యరాట్|విఘ్నఘౌఘ|
ఘనప్రచండ పవనో విఘ్నేశ్వరః పాతుమాన్ ||జయాభిజైభవ!దిగ్విజైభవ!!||

తొలుత నిను దలచెదను| దూర్జాటి తనూజ|
ఎలుక వాహనమైన| వినకోటతేజ|
ఇలమోయువాడు| జన్నిజముగలరాజ|
కలియుగపు జనులకును| ఘనకల్పపూజ|
ఫణిరాజ భూషణుని పట్టి జగదీశ|
ఘనముగా నిను దలతుగణనాధ వేగ|
సంతతము నిన్నునే| చాల నుతియింతు|
యింతిముక్కల నిలయ| ఈశ్వరుని తనయా||జయాభిజైభవ!దిగ్విజైభవ!!||

శ్రీవినాయకుని జాతశ్రితపారుజాత|
దేవతానుతమహాదేవతనుజాత|
లాలితంబుగమించు| లంబోధరంబు|
కేలకైకొన్న చక్కెరమోదుకంబు|
చెలులు గుంపులు| నమర్చిన మంచి సొమ్ము తళుకు లీనగ జాలుతగినట్టి సొమ్ము|
తళుకు లీనగ జాలుతగినట్టి సొమ్ము|
రాజిల్లు భక్తులను రక్షించు మేదిటి| యీ
జగంబులవేల్పు లెవరు మీసాటి|
సముదమూషక వాహ సంతతోత్సాహ ప్రమద జన సందోహ|
భవ్యతరగేహ| సరసవైభవ సాధుజన కల్ప పూజ|
శిరులిచ్చి రక్షించు| శ్రితజనోద్ధార|
సంతతము నిన్ను నే చాలను తియింతు|
యింతిముక్కుల నిలయ| యీశ్వరుని తనయా||జయాభిజైభవ!దిగ్విజైభవ!!||

కుడుములను వుండ్రాళ్ళు కొబ్బరి యుపాలు|
పొడిచక్కెర యుతేనె| తడినానబాలు|
కడుపు నిండా బెట్టు| ఘనభాగ్యవతులు|
కడువేడ్కతో ఘృతము ఖంద చక్కెరలు|
నీకు దెచ్చెదరయ్య| నిఖిలలోకేశ|
మాకు సంపదలిమ్ము| మహిత ప్రకాశ|
సంతతము నిన్నునే| చాల నుతియింతు|
యింతిముక్కల నిలయ|ఈశ్వరుని తనయా||జయాభిజైభవ!దిగ్విజైభవ!!||

ఏక స్వరూపాయ| ఏకదంతాయ|
నాగేశ వరదాయ| నాగ భూషాయ|
లోకజనభజితాయ| లోక నేత్రాయ|
శ్రీకంఠతనయాయ| సృష్టి కర్తాయ|
శాశ్వితంబుగ కీర్తి సఫలంబు శాయ|
విశ్వసించెద నిన్ను విఘ్నేశ్వరాయ|
సంతతము నిన్ను నే చాల నుతింతు|
యింతిముక్కల నిలయ|ఈశ్వరుని తనయా||జయాభిజైభవ!దిగ్విజైభవ!!

సరస్వతి అమ్మవారి మీద పద్యం:
వాణి నా వాఃక్కునను వసియింపమ్మ|
నీల నీరద వేణి నిత్య కల్యాణి|
చారుపులినాశ్రోణి| సయికతా శ్రోణి|
పరగంగ నినుగొల్తు| పద్మజుని రాణి|
గరిమె ముద్దులపల్కు గల వీరవాణి|
విలసిల్లు సకల విద్యలకు పూబోణి|
యెలమిసంపదలిచ్చి| యేలవగదమ్మ|
వరయింతిముక్కుల పరగ వెలసిన్న|
కరుణాకదాంబ చక్కని శారదాంబ||జయాభిజైభవ!దిగ్విజైభవ!!||

కమలసంభవురాణి| కంజాత పాణి|
ప్రమదషట్పద వేణి| పద్మజుని రాణి|
ప్రమదముగ నిను గొల్తు| పరమ కల్యాణి|
అమిత భాగ్యములొసగు| అమ్మ పూబోణి|
ప్రకటించు నేత్రావిభాగైననెమి|
సకల విద్యల ఠీవి| శారదా దేవి|
జయ యింతిముక్కల జనములనెల్ల|
దయజూడవమ్మ నీదయ కృపామతిని ||జయాభిజైభవ!దిగ్విజైభవ!!||

శ్రీ రుక్మణీ అమ్మవారి మీద పద్యము:
క్షీరసాగరమందు చెలువొప్పగాను|
కామధేనువు శశియు కల్పవృక్షంబు|
అమృత భాండము నిదులు అవతరింపంగ|
జగము గావగ బుట్టి జనులు| బొగడంద|
శిరులకును మన్కిలై శ్రీ పంచవటిలో వెలసి మము గావంగ|
వేంచేసినట్టి శ్రీ రుక్మిణీ తల్లి చేతులెత్తియును|
దండంబు| లిడెదను దీవింపవమ్మ|| జయాభిజైభవ!దిగ్విజైభవ!! ||

శ్రీ పాండురంగస్వామి వారి మీద పద్యం:
శ్రీ పంచవటి నిలయ శ్రిత జనపోషణ|
కారుణ్య హృదయ హేకంజాత నేత్ర|
పండరీదేవ హేశ్రీపాండురంగ|
అండజేరితిమయ్య ఆదరింపగదే|
రాజుపాలెంనందు పూజలందుచును|
తోజరూపముతోడ డివ్యత్వమొంది|
బాలురము మము బ్రోవు|
పదిలంబుగాను శ్రీ పాండురంగయ్య శ్రీ రుక్మిణీశ|| జయాభిజైభవ!దిగ్విజైభవ!! ||

శ్రీజ్వాలాముఖి అమ్మవారి మీద ద్యం:
అంబ జగదాంబ| భ్రమరాంబికా కాళి|
శంభురాంతకవైరి| శంభు పదహాళి|
లోకైక మాధవీ| లోక సంరక్షి|
నీకన్న లోకంబులగు ప్రాపుగలదె|
మహిషాసురోధ్వంసి| మహిత ప్రకాశి|
అహిరాజ భూషణాల్| అమిత గుణతేజ|
ఆదిపరంజ్యోతి| అఖిలాండ కుక్షి|
మేది నీప్రజకు నీ మీదనే తలపు|
యింతిముక్కుల పురంబేలు| మీదయను|
కాంతి నీ సతి కాంతి గలిగి వేడుకను|
జనులకును| వరవమొసగు|
జ్వాలమ్మ తల్లి| వినుతింతుమమ్మ|
నిన్వేయు విధములును|| జయాభిజైభవ!దిగ్విజైభవ!! ||

యీతముక్కులమ్మ అమ్మవారి మీదద్యం :
కూటమై యీతముక్కుల మడునూళ్ళు|
పేటంచు చీరెలను| పాలకావళ్ళు|
ఏటేట ప్రజలు సేవించు తిరునాళ్ళు|
కోటి బానలతోను| వేట పొంగళ్ళు|
కట్టకట్టలు మేక కదవు పొట్టేళ్ళు|
అట్టేడు మిన్నండు ఆమానుసిళ్లు|
చటచట ప్రాకటావీర శబ్దాళ్లు|
అట్టహాసంబుచే| పట్టు రంజిల్లు|
శివసాంబశివ కృపా|చేపట్టవమ్మా|
భాసురాయసుగావు| ప్రాభవంబిమ్మూ|
ధరణి జనులను బ్రోయుచు|
తల్లివోయమ్మా| అవురాణి గౌరమ్మ|
అంబమాయమ్మా|
ఘోర్శక్తి మహిషాసురుని మర్దించి|
యిరువంద నీకన్న ఈతముక్కులమ్మ|| జయాభిజైభవ!దిగ్విజైభవ!! ||

శ్రీ కృష్ణమూర్తి మీద పద్యం:
రేపల్ల్లె వాడలో గోపమ్మ మేము| కాపురంబులు వుండి కడలేము|
మా పాలు పెరుగులు| మననీయడమ్మ|
యీ పాపడితనితో వోర్వలేమమ్మ|
చట్లలో పాలన్ని సరిపెట్టెనమ్మ|
ఉట్ల మీద పాలన్ని ఉంచనీయడమ్మ|
పట్టుకుందామంటే| పట్టుబడడమ్మా|
చంటివాడితడు చాలుగోపమ్మ|
బొట్టేలకు పితిజుట్లు|ముడిపెట్టెనమ్మ|
యెట్లు వేగింతుమో యశోదమేము|
పుట్టి బుద్ధెరుగ నీకొడుకెట్టి కొడుకు|
కంటిమా వింటిమా| కలలోననైనా|
సఖియ మీ కొమరుండు| జారుడోయమ్మా|
బాలుండు గాడమ్మ పణతి కృష్ణమ్మ|
చూడనల్లని వాడు| సుకుమారుడమ్మ|
కొల్లగా గొనుచుండు| గోపికల నెల్ల|
సన్నపు పాములను జంధ్యము వేసి|
కిన్నెర యొక చేత గీవించిపట్టి|
వన్నెగాగల యోగ పాగాలు దొడగి|
భద్రకాళీశ్వరుడ బాహుబలఘనుడు|
రౌద్రమూర్తివి వీరభద్రావతార|| జయాభిజైభవ!దిగ్విజైభవ!!

శ్రీరాములవారి మీద పద్యం:
రధ పుత్రులై ధరనుద్భవించి|
యశముచే తాటకిని వేగమెదృంచి|
మునియాగ మొనరించు| ముదముతోడుతను|
ఘనముగా శివువిల్లు ఖండించి మించి|
పతివ్రతా జానకిని పరిణయంబాడి|
అతిప్రీతితో ని వయోధ్యకును జేర|
పరశురాముని భంగ పరచి మోదమున|
పురికేగుదెంచితివి భూసురులు పొగడ|
పట్టంబుగట్టి భూపతి నుత్సహించి|
అట్టికైకయు విఘ్నమపుడు గావించి|
వనవాసమున కేగి| వైరులను దృంచి|
కనకమృగమును జూచి| జనకజను బాసి|
వానరులను గూడి వార్ది బంధించి|
దానవా మూకలను| దరిమి ఖండించి మించి|
దశకంఠు శిరములు ధర గూలనేసి|
యశ్ము జన్నొందితివి వేల్పులను మెచ్చ|
పరవి భూషణు లంక వాసిగను నిచ్చి|
ధరణి జనుగూడియును| దగ సంతసించి|
క్షేమమున పట్టాభిషేకుండవగుచు|
ప్రేమతో భక్త జన ప్రీతిగా నీవు|
ధర మంగళాచల ధామమున వెలసి|
శిరు లిమ్ముమాకిపుడు శ్రీరఘురామా || జయాభిజైభవ!దిగ్విజైభవ!!||

శ్రీ ఆంజనేయుల వారి మీదపద్యం:
అంజనీ వరపుత్ర| అమిత బలవంత|
కంజాతదళ నేత్ర| కడు శౌర్య వంత|
శ్రీరామముద్రికయు| శిరసావహించి|
రాము సతి వెదుక| యబ్ధిలంఘించి|
లంక వాకిట నున్న లంకిణి దృంచి|
శంకలేకను లంక చాల శోధించి|
మండోధరుణి సీత మణిగాను నెంచి|
సందేహపడి రాముసాధ్వి కాదనుచు|
చింత నొందుచు వెదుక వైదేహియపుడు|
చింత నొందుచు మదిలో శ్రీరామ యనుచు|
స్మరణ జేయుచునున్న సాద్వినీగాంచి|
కరములను ముకుళించి| కడు వేడ్కతోను|
వందన మొనరించి| వనరుహాక్షికిని|
అందముగ రాముని యానవాలిచ్చి|
వనమెల్ల పొడిచేశి| వైరులను దృంచి|
ఘనుడక్షయుండాది ఖలుల ఖండించి|
లంక దహనము చేశి లలన బొడగాంచి|
పొంకముగ శిరోమణి బుచ్చుకొని వేగ|
రామునికిచ్చిన| రణకోవిదుడవు|
నీ మహా ధైర్యంబు నీ సాహసంబు|
విధియునెన్నగదరమె| వీర హనుమంత|
సాధుజన పోషణ| సముం ప్రచండ|
ధర మంగళాచలధామ నివాస|
శిరులిచ్చి రక్షీంచు శ్రీ ఆంజనేయా || జయాభిజైభవ!దిగ్విజైభవ!!

జయాభి జైభవ! దిగ్విజైభవ!!
శ్రీ హరి కరుణా కటాక్ష వీక్షణాలంకార అర్ధిజన కుముద చంద్రోదయా|
ఆశ్రీత విద్వజ్ఞనాధార|
సత్యభాష హరిశ్చంద్ర|
సంగీతవిద్యా నారద|
సాహిత్యవిద్య చతుర్ముఖ|
సజ్జన భక్త కటాక్ష|
సాహస విక్రమార్క|
శతృవజకంఠీరవ|
వయ్యారి కోలాహల కదన విజయ మార్తాండ|
కామినీ పంచ బాణావతార|
కలియుగరామ|
కలియుగభీమ|
మనుజ మందార|
దాన రాధేయ|
సంగ్రామ ధనుంజయా||జయాభిజైభవ!దిగ్విజైభవ!!||
శ్రీమంతులై మహా శ్రేయములుగలిగి
భూమిలో వెలలేని భోగములుగలిగి
ధనధాన్యములుగలిగి
ధర్మములుగలిగి
ఘనవస్తుగజతురంగంబులుంగలిగి
రాజసన్మానంబు రాజ్యంబు గలిగి
తేజంబు ప్రాభవాస్తోమంబు గలిగి
అందలంబులు గలిగి
అతికీర్తి గలిగి
పొందైన నవరత్న భూషణాల్ గలిగి
బంధుజాలంబులో ప్రఖ్యాతి గలిగి
పుడమి వర్ధిల్లుడీ పుణ్యములు గలిగి ||జయా||

పెట్టెలోనిది మంచి ప్రియమైన శాలు
పట్టుమనివుడుగరలు పదిమాడలిచ్చి
విందు బియ్యము పెసలు విడియంబు లిచ్చి
పొందుగా నెయ్యిచ్చి భోంచెయ్యమనుచు
అందముగ అయ్యవార్ని అనుపుడింటికిని ||జయా||

రేపురా మాపురా మళ్ళి రమ్మనక
జాగుచూపులు చూచి చాలు పొమ్మనక
అటుపోయిరమ్మనక
ఆయలెమ్మనక
యీపాట్ల యిష్టార్ధ మిప్పించరయ్యా ||జయా||

బలవంతులముగాము - బిలచి మిమ్మడుగ
అల్లుండ్లవలెగాదు - అలగి మిమ్మడుగ
పాతప్పులునుగావు - పలుమారు అడుగ
నిలువు జీతము గాదు - నిలచి మిమ్మడుగ
వెయ్యారులేమైన - వేడేది లేదు ||జయా||

అయ్యవారికి చాలు అయిదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు ||జయా||

పరగ మహర్నవమి పండుగకు మేము
గరిమితో దీవించగా వచ్చినాము
బాలకుల దీవెనలు - బ్రహ్మ దీవెనలు
చాల గలుగును మీకు
సకల సంపదలు
యాడాది కొకసారి వేడుకతో మేము
పుడమిలో మిమ్మెపుడు పొగుడుచున్నాము ||జయా||

యివ్వలేని లోభి వారిండ్లకును బోము
రాయి కరగించి సారము తీయగలము
పశిబిడ్డలము మేము
పలుమారు తిరుగ పశివాడితిమి
ఎండ వానలుకు సొలసి
తేప తేపకు మమ్ము త్రిప్పగాబోకు ||జయా||

యీ పాట్ల బాలకులకేమిత్తు మనక
చేపట్టి మామనవి చిత్తమందునిచి
మాపాట్ల నెనరుంచి
మమ్ము కరుణించి
కట్టువర్గములిచ్చి
కట్నంబులిచ్చి
అయ్యవారిని అనుపుడింటికిని ||జయా||

సతులతో హితులతో సౌఖ్యములుగలిగి
సుతులతో హితులతో శోభానాల్ గలిగి
గంధమాల్యంబరా గ్రాకుములు గలిగి
బంధుజ్వాలంబులో ప్రఖ్యాతి గలిగి
తనయులకు తనయులకు తనయులం గలిగి
మనమలకు మనమలకు మనములాం గలిగి
వన్నెవాశియు గలిగి వర్ధిల్లరయ్యా ||జయా||

సన్నుతాచారములు చదివించరయ్యా
పుట్టంబు లొక తూము
బెల్లంబు మణుగు
పట్టుమని మాకిచ్చి
పంపించరయ్యా ||జయా||

కరణముల మీద పద్యం:
రాజాధిరాజవు రాజ సభలందు| రాజేంద్రుడను మెచ్చ|
రాజ సద్భందు| రాచకార్యములందు| ప్రాజ్ఞుడనివిందు|
రాచ నియ్యోగులలో రశికుడని విందు|
చాల వజ్రాలు పగడాలు వరహాలు|
మేలుముత్యాలు కెంపుల తురాయీలు|
శ్రీలు పచ్చల పల్లకీలుంగరాలు|
మేలుగా శ్రీ హరి మెచ్చ మిమ్మేలు|| జయాభిజైభవ!దిగ్విజైభవ!! ||
ఘల్లు ఘల్లు నీ చేతిఘంటము నటింప|
ఝులుఝుల్లున నీ వైరి| గుండెలు తల్లడింప|
లీలగా బహు శాయ| లెఖ్ఖలు గణింప|
బహు తెఅంగుల నిన్ను ప్రభు వెచ్చరింప|
స్నానసంధ్యాహోమ| జపసమాధులను|
మానవుల్ నీ సాటి| మహిమలో లేరనుచు|
వసుధలో …………. వంశాబ్ధి చెంద్ర|
అసహాయశూరుడవు యమిత గుణ సాంత్ర|
మృదువుగా …………… ముదుల కుమార|
భళి! భళి! భాగ్య దేవేంద్ర || జయాభిజైభవ!దిగ్విజైభవ!! ||
పావలాబేడైతే పట్టేదిలేదు|
అర్ధరూపాయైతే అంటేదిలేదు|
ముప్పావలాలయితే ముట్టేదిలేదు|
రూపాయ అయితేను చెల్లుబడి కాదు|
రెండు రూపాయలైతేను రొక్కంబు మాకు|| జయాభిజైభవ!దిగ్విజైభవ!!||
జయాభిజైభవ!దిగ్విజైభవ!!

ఇతరులమీద పద్యం:
సత్యంబు హరిశ్చంద్రునకు సాటి|
నిత్య భోగము లెల్ల నింద్రునకు సాటి|
హత్యంత సాహసము బర్జునకు సాటి|
అత్తుకొని మీ కీర్తి అఖిల జగములను || జయాభిజైభవ!దిగ్విజైభవ!! ||
పావలాబేడైతే పట్టేదిలేదు|
అర్ధరూపాయైతే అంటేదిలేదు|
ముప్పావలాలయితే ముట్టేదిలేదు|
రూపాయ అయితేను చెల్లుబడి కాదు|
రెండు రూపాయలైతేను రొక్కంబు మాకు|| జయాభిజైభవ!దిగ్విజైభవ!!||
జయాభిజైభవ!దిగ్విజైభవ!!

వర్తకుల మీద పద్యం:
పట్టణ ప్రాకారబాంధవాధికులు|
వన్నెకెక్కితి వమ్మా| వరపసిడిబొమ్మ|
కన్యకా దేవమ్మ| కరుణించవమ్మ|
కోర్కెతో నూటొక్క గోత్ర వర్ధనులు|
చారుమతి భాస్కరాచార్య సేవకులు|
మేర దప్పని యట్టి| మిత్ర పోషకులు|
వారధి గాంభీర్య వైశ్యరత్నములు|
శ్రీ కరంబుగ పెనుగొండ పట్టణమున|
జోకతోబుట్టించి| సూక్ష్మరుపమున|
కుసుమశెట్టికి| ముద్దు కూతురై తగను యొసగజేసిన వారిని|
హెచ్చరింపగను || జయాభిజైభవ!దిగ్విజైభవ!! ||
కోటికిని పడిగెత్తి కోమట్లలోను|
నూటొక్క గోత్రాన|నుతికెక్కినారు|
హాటకోజ్వల రత్న| హారములతోను|
మాటవాసియుగ గలిగి మరి వెలసినారు|
వన్నె కెక్కితివమ్మ| వరపసిడి బొమ్మ|
కన్యకాదేవమ్మ| కరుణించ వమ్మ|
కోర్కెతో నూటొక్క గోత్ర వర్ధనులు|
చారుమతి భాస్కరా| చార్య సేవకులు|
కుబేరునితో సరిగ| కుశలాబు గలిగి|
యెడలేని నీతియును| యే ప్రొద్దు గలిగి|
పుడమి వర్ధిల్లు డీ| పుణ్యములు గలిగి వసుధలో|
నిలువెల్ల సత్యంబు| నీవాడు మాట|
నిలచి ధర్మంబు నీ వున్నచోట|
నిలచెరా నిన్నుంచి యిలలోను కీర్తి పంకజాసను రాణి|
పలుకు నీ యింట పొంకముగ వరలక్ష్మి|
వుండు నీ యింట కండ చక్కెర పానకంబు నీ మాట|
నిండు చంద్రు ని బ్రోలు| నీ మోము తేట|
కోటికిని పడిగెత్తి| కోమట్లలోను|
మాట వాశియు గలిగి మరి సభలలోను|
నూట సిబ్బందిలో| సాటికెక్కితివి|
నగరంబు వారిలో నాగరీకుడవు|
నవరత్న సింహ్వాసనాయకంబైన|
వైశ్యరత్నంబున వన్నెకెక్కితివి|
దండిగా మాకిమ్ము దయచేత వరహాలు|
……………… వంశాబ్ధిశ్చంద్ర|
అసహాయ శూరుడవు అమిత గుణసాంద్ర|
…………… ముద్దుల కుమార| భళి! భళి!
……………. సౌభాగ్య దేవేంద్ర || జయాభిజైభవ!దిగ్విజైభవ!! ||
జయాభిజైభవ!దిగ్విజైభవ!!

గమళ్ళ మీద పద్యం:
తాళ్లు వధులు మీకు ధరలోన గలిగి
కల్లు బానలు మీకు సొంపుతో గలిగి
సారు బానలు మీకు యింపుతో గలిగి
కీతకు కీతకు చాల స్నేహంబు గలిగి
వంట వంటకు లక్ష వరహాలు గలిగి
యేవేళ జూచిన ఉండునింటింట
తనయులకు తనయులకు తనయులాం గలిగి
మనములకు మనములకు మనములాం గలిగి
శ్రీ వెంకటేశ్వర్లు చెలగు మీ యింట
సకల సామ్రాజ్య ప్రసన్నపదవే|| జయాభిజైభవ!దిగ్విజైభవ!!||
జయాభిజైభవ!దిగ్విజైభవ!!

మహమ్మదీయుల
మీద పద్యం:
డాలు డమాడీలు డాపల్లకీలు|
గారాల్ గాడాల్ యనెడి దయవాలు|
ఆదుం జూదం యెనడి నామములు|
అయ్య వారికి మిప్పించు సారములు|| జయాభిజైభవ!దిగ్విజైభవ!!||

జయాభిజైభవ!దిగ్విజైభవ!!
జయాభిజైభవ!దిగ్విజైభవ!!
జయాభిజైభవ!దిగ్విజైభవ!!
__/\__





2 comments:

  1. ఇరువది సంవత్సరాల నుండి దొరకని ఈపద్యాలు మీదగ్గఱ దొరికినందుకు ధన్యవాదాలు. నందనవనం ప్రభాకర రావు (తండ్రి)వెంకటసుబ్బయ్య :నందనవనం ప్రకాశం జిల్లా .94935 80889.

    ReplyDelete
  2. బాబాయి గారికి నమస్కారములు.
    మీరు అనుమతిస్తే వార్తాపత్రికల ద్వారా వెలుగులోకి తేవాలని నాకోరిక.బహుశా ఇవి తెలుగు రాష్ట్రం లో ఇవి ఎక్కడా దొరకవు.
    భవదీయుడు
    నందనవనం ప్రభాకరరావు కలిగిరి నెల్లూరు జిల్లా.

    ReplyDelete