Translate

27 October, 2014

మహర్షి - సద్గురు శ్రీశ్రీశ్రీ మలయాళస్వాములవారి ధర్మ బోధ



శ్రీ గురుభ్యోనమ:🙏🏼

మహర్షి సద్గురు శ్రీశ్రీశ్రీ మలయాళస్వాములవారి ధర్మ బోధ





[శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి పంతొమ్మిదవ సంపుటము (2001) నుండి సేకరించడమైనది]

1. మహర్షి - సద్గురు శ్రీశ్రీశ్రీ మలయాళస్వాములవారి ధర్మ బోధ  (28-3-1940 – దోనేపూడిలో ప్రవచనము)

శ్రేయాన్ర్దవ్యమయాద్య జ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరన్తవ”- ద్రవ్యయజ్ఞములకంటెజ్ఞానయజ్ఞము లధిక మాహత్యము గలవనియు, సర్వోత్కృష్టము లనియు శ్రీకృష్ణపరమాత్మ వచించియుండిరి.

ఓం గీతాకల్పతరుం భజేభగవతా కృష్ణేన సంరోపితం
వేదవ్యాసవివర్ధితంశ్రుతిశిరోబీజం ప్రబోధాంకురమ్|
నానాశాస్త్రరహస్యశాఖరతిక్షాన్తిప్రవాళాఙ్కితం
కృష్ణాంఘ్రిద్వయభక్తిపుష్పసురభింమోక్షప్రదం జ్ఞానినామ్||

గీతాకల్పతరుం భజే’ – “గీతయను కల్పవృక్షమునునేను భజించెదను. ఆ కల్పవృక్ష మెటువంటిదనగా, ‘భగవతా కృష్ణేన సంరోపితం‘ - భగవంతుడైనశ్రీకృష్ణపరమాత్మచేత నాటబడినదై యున్నది. సామాన్యముగా ఏదైనా ఒక ఉద్యానవనమునిర్మించునపుడు, పుణ్యపురుషుడగు మహనీయునిచే ప్రప్రధమమున నొక వృక్షమునటనాటింపింతురు. అట్లనే, భవిష్యత్కాలమున అనంత శాఖోపశాఖలుగ విస్తరించి మానవకోట్లసంసారతాపము నెల్ల నడించి (తగ్గించి) ఆత్మశాంతియను వినిర్మలచ్ఛాయ నొసంగి సంతృప్తిపఱుపనున్న యీగీతా కల్పవృక్షము ప్రప్రమమునశ్రీకృష్ణపరమాత్మచే లోకమున నాటబడెను. కృష్ణపరమాత్మ సూత్రప్రాయముగ రణరంగముననర్జునకు బోధింపబడిన సూత్రవాక్యములను, గైకొని శ్రీవ్యాసమహర్షి యమునానదీ మధ్యస్థద్వీపమునందు నేకాంతమునగూర్చుండి బాగుగ చింతనజేసి శ్రుతార్ధమును విస్తరించిచంధోబద్ధ మొనర్చి శ్లోకరూపేణ లోకమునకు బహిర్గతమొనర్చెను. అదియే నేడు దాదాపు 700 శ్లోకములతో గూడివిఖ్యాతిగాంచిన ఈ మన గీతాశాస్త్రము.

అల్పాక్షరమసందిగ్దంసారవద్విశ్వతో ముఖమ్|
అస్తోభమనవద్యం చ సూత్రంసూత్రవిదో విదుః||

అల్పాక్షరములు గలదియు, సందిగ్ధము కానిదియు, సారవంతమైనదియు, పెక్కు అర్ధములు గలదియు, ఎదిరి లేనిదియు, లోపరహితమైనదియుసూత్రమనంబడును.

“‘శ్రుతిశిరో బీజం’ – ఆ గీతాకల్పవృక్షమునకుబీజము శ్రుతిశిరస్సు అనగా ఉపనిషత్తులు. కనుకనే సర్వోపనిషదో గావోదోగ్ధా గోపాలనందనఃఅని గీత ఉపనిషత్సారముగ పేర్కొనబడినది. వేదమంత్రములుసామన్యులకు దురవగాహమైనందున సర్వులను తరింపజేయు నుద్దేశ్యముతో వాని సారమంతయు సుబోధకమగునట్లు సులభశైలిలో వచించెననియు దీనిచే స్పష్టమగుచున్నది.

“‘ప్రబోధాంకురమ్’ – ఇంకను ఆ గీతాకల్పతరువెటువంటిదనగా, సాక్షాత్కారజ్ఞానమే అంకురముగా గలదియు, ‘నానాశాస్త్ర రహస్యశాఖమ్’ – వృక్షమునకు శాఖలవలే సకలశాస్త్రరహస్యములే శాఖలుగా గల్గినదియు, ‘అరతిక్షాన్తిప్రవాళాంకితమ్’ – విషయాసక్తి లేకుండుట, ఓర్పు, (తితిక్ష) అనునవే చిగుళ్ళుగ గలదియు, ‘కృష్ణాంఘ్రిద్వయభక్తిపుష్పసురభిం’ – కృష్ణ పరమాత్మయొక్కపాదకమలములందలి భక్తియే సుగంధపుష్పముగా గలదియు, ‘మోక్షప్రదం జ్ఞానినామ్’ – జ్ఞానులకు బంధరాహిత్యమనుముక్తిఫలమును గలుగజేయునదియునై యున్నది.” ||12-04-2013||

*********************************************************************************
2.మహర్షి - సద్గురు శ్రీశ్రీశ్రీ మలయాళస్వాములవారి ధర్మ బోధ (28-3-1940) – దోనేపూడిలో ప్రవచనము)

 “ఎన్ని పూజ్యములున్నను (సున్నలు-0) ప్రక్కన ఒక సంఖ్యలేనిచో వాటి కేమాత్రము విలువ యెట్లుండదో, అట్లనే దేహేంద్రియ ప్రాణమనంబులును, దృశ్య పదా ర్ధములున్నుఆత్మయను చైతన్యముచేతనే ప్రకాశింపజేయబడుచున్నవి. కావున అది లేనిచో శూన్యములగును.దేహేంద్రియములు జడములు గనుక స్వప్రకాశనశక్తి గలవి కావు.

నీరున్ను, నూనెయున్ను కలువనట్లు, హీన గుణములు కలిగిన వారు అనుష్ఠానరహితులు పవిత్రాత్ములతోనెన్నటికి కలియజాలరు. క వేళ నీటిని, నూనెను క పాత్రలో కలబోసి యుంచినను నూనె పైకిన్ని నీరు క్రిందకున్ను చేరుకొనునట్లుపవిత్రాత్ములు ధ్యేయైక స్థితిగలవారు ఎల్లప్పుడు ఉచ్చస్థానమునే యలంకరించుచుందురు.కాన మమ్ములను గౌరవించలేదని యెవరున్ను తలంపరాదు. అట్టి గౌరవమునకు తగిన యోగ్యత, పవిత్రత సంపాదించుకొనినచాలును. లోకమే మీకు బ్రహ్మరము పట్టును.


ఆధ్యాత్మికరంగమున ముముక్షువులు ప్రారంభముననే కఠిన సాధన లవలంబింపరాదు. ఒకమిణుగురు నిప్పు దొఱికిన వెంటనే దానిపై పెద్దపెద్ద కట్టెలు పడవైచిన అదిచల్లారిపోవును. కాన జప, వ్రత, స్వాధ్యాయ, పూజనాది చిన్న చిన్న పుడకలు వేయుట ద్వారావైరాగ్యస్ఫులింగమును క్రమశః ప్రజ్వలింపజేయవలెనేగాని కఠిన తపశ్చర్యలచే దానినణగద్రొక్కి నశింపజేయరాదు. దీపపు వత్తిని మెల్లగా పైకెత్తి మితముగానుంచవలెనేగాని కే పర్యాయము పెంచి పెద్దదిచేసినచో చిమ్ని మసిబట్టును లేక పగిలి పోవును. దూరదేశమునకు నడచిపోవునపుడుత్వరత్వరగా పరుగెత్తినచో, కొంతదూర మేగు సరికి అలపు వచ్చి, దేహమునకు అధిక శ్రమకలుగును. ముందు ప్రయాణమునకు ఆటంకమున్ను గలుగవచ్చును. అట్లుగాక మెల్లగా శక్తివంచనలేక నడుచుచుపోయిన కొంతకాలమునకు నిరాటంకముగా గమ్య స్థానము చేరవచ్చును. సాధకులీవిషయము ముఖ్యముగా గమనింపవలెను.

[మనము ఈ సూచనను, మన దైనందిక జీవనంలో కూడా ఉపయోగించుకొని మనము మంచిఫలితములుపొందవచ్చును. ఏదేని పనిని, ఒక లక్ష్యమును పూర్తిచేయుటకు, ముందు దాని గురించిచక్కటి అవగాహన ఏర్పరుచుకొని, ప్రణాళికా బద్ధంగా తగు విధానములో కార్యము నిర్వర్తించిన, జయప్రదముగాపూర్తిచేయగలుగుదుము.]

పాత్ర మంచిదైనను అందు కళాయి లేనిచో (స్టీలు పాత్రలు వాడుకలో లేనప్పుడు) దానిలోవండిన పప్పుపులుసు చిలుమెత్తి నిరుపయోగమగునట్లు, ఏనాడు జనులు అపవిత్రులై, విషయాసక్తులైక్రూరకృత్యముల సల్పుచు అసన్మార్గమున నిర్భయముగ వర్తించుచు, పైకి మాత్రముపవిత్రులవలె నటించుచుందురో నాడే లోకము పతనమొందును.

దివ్యచైతన్య శక్తి కలిగించు ప్రభోధకు లెపుడు లేకపోయిరో అపుడే ప్రపంచములో జ్ఞానశక్తిసన్నగిల్లినది. హృదయక్షేత్రమున శాంతి, సత్యము, అహింస, దయ, పుణ్యశీలము మున్నగు ఉత్తమ సస్యములన్నియు వర్షములేని పైరువలె ఆత్మ జ్ఞానాభావముచే నెండిపోయినవి. కనుకనే శుష్కవాదములు పెరిగినవి.విశలమైన రోడ్డైనను ప్రతిసంవత్సరము రిపేర్ చేయనిచోవృక్షములు పెరిగి క్రమముగ నది యరణ్యమై గమనయోగ్యము ఎట్లు కాకపోవునో, అట్లే ఆధ్యాత్మికప్రభోధకులు లేని కారణము చేతనే గమ్య స్థాన మిదమిత్ఠమని స్పష్టముగా జూపుననుభూతిపరులు లేకుండటంబట్టియు, జనులందు కామక్రోధాది దుర్గుణంబులు పెరిగి గమ్యస్థానము తెలియకపోవుటకుసంభవించుచున్నది. అదంతయు జనుల దోషము కాదు. సరియైన బోధకులు లేని కారణమే యగును.


మేఘజలమెంత స్వచ్ఛమైనను చవిటినేలపై బడిన యోగ్యముగాక అనారోగ్యమునకు నెట్లు హేతువగునో, అట్లే అతి స్వచ్చమైనవేదాంత బోధ యైనను రాగద్వేషాదియుతములగు కలుష హృదయములలో (కుత్సిత, కపట సాధువులు, సన్యాసులు, భక్తులు) బడి చెడిపోయివిపరీతఫలము నొసంగుచున్నది. కనుకనే భక్తులపై, బ్రహ్మవేత్తలపై, సాధవులపై అవిశ్వాసమేర్పడుచున్నది. సామాన్య గృహస్థుని కుండవలసిన యోగ్యతకూడలేనిచో నిక నా సాధువుల స్థితి యేమని చెప్పవచ్చును. అందఱును పైవిధమున నున్నారనితలంచుట పొరపాటు. అట్టి రకమువారు గూడా గలరని మాత్రమే విజ్ఞులు తలంచి యూరకుందురు” ||13-04-2013||

*********************************************************************************
3.మహర్షి - సద్గురు శ్రీశ్రీశ్రీ మలయాళస్వాములవారి ధర్మ బోధ (28-3-1940 ) – దోనేపూడిలో ప్రవచనము)

మనస్సును ఏకాగ్రపఱచి భావయుక్తముగా చేయు జపమె ఎక్కువగఫలించును. అట్లనే అర్చన చేయునపుడున్ను, అనన్యభక్తియుతమై ఇతర విషయములుస్ఫురింపక, మనస్సు కేవలము అర్చింపడు మూర్తియందే లగ్నమైనపుడు మాత్రమే పుష్పమును మూర్తిపైవదలవలెను. అపుడే తను చేసిన జపముగాని, పూజగాని పూర్ణఫలమునుగలుగజేయును.”

సాధకులకు సాధనాదులందు కాలనియమ మేల యుండవలయునని కొందఱుప్రశ్నింతురు. ప్రపంచములో నొక రహస్యము గలదు. తనకు లేని ప్రభావమునుగూర్చిచెప్పుకొన్నచో తనకు రానున్న ప్రభావము కూడ రానేరదు. కాన ప్రారంభావస్థయందేనిస్త్రైగుణ్య పదమందు జరించు అవధూతలతో తమ్ములను బోల్చుకొనక, కాలనియమాదుల ననుసరించివర్తించుచు క్రమానువర్తియై తుదకు శ్రేయమును పొందుటయే మేలు.”

ధ్యానాదులకు సంధ్యాకాలమేల శ్రేష్టమని చేప్పబడినదనని –అపుడుసర్వజీవుల యంతఃకరణవృత్తియు సన్నగిల్లి, సూక్ష్మావస్థను జెందుచుండును.దేవతాకాలమనియు, మానుషకాలమనియు, అసురకాలమనియు కాలము త్రివిధము.అదియే సాత్త్వికమనియు, రాజసమనియు, తామస మనియు కూడ పేర్కొనందగును. ఉదయము బ్రహ్మముహూర్తమునుండి 9 గంటల వఱకు సాత్వికకాలము. అనగా దేవతా కాలము. 9గంటలనుండి మధ్యాహ్నము 3గంటలవఱకు రాజసకాలముఅనగా మానుషకాలము. మఱల 3గంటలనుండి రాత్రి 9గంటలవఱకు సాత్వికకాలము. రాత్రి 9గంటలనుండి ఉదయం 4గంటలవరకు రాక్షస కాలము.అది తమోగుణ యుతమైనది. పంచీకరణశాస్త్ర ప్రకారము పంచభూతముల తమోంశముచేస్థూలశరీరమున్ను, రజోంశముచే కర్మేంద్రియములున్ను, సత్త్వాంశముచేజ్ఞానేంద్రియములును ఏర్పడినవగును.”






ప్రాతఃకాలమున సర్వజీవరాసులున్న కరేంద్రియ వ్యాపారములెవ్వియులేక పరమశాంతిని బొందియుండును. ఇది దేవతాకాలము. సత్త్వగుణ మయము. మఱల 8 లేక 9 గంటలనుండి అందఱునుకర్మేంద్రియ వ్యాపార నిమగ్నులగుదురు. మనుజులు వారివారి కార్యములకై గృహములనువీడిచనుదురు. అక్కాలమున వారు తమ కరేంద్రియములచే విరామము లేక పనిచేయుదురు.”

మఱల సంధ్యాకాల మగుసరికి అందరున్నువిశ్రాంతి నొందుదురు. ఇంక కొంతసేపటికి గాఢసుషుప్తిని బొందుదురు. అనగా ఏమియుతెలియని దేహసుఖమును పొందుచుందురు. ఆది తమోగుణకాలము. రజస్తమోగుణయుతమగు కాలముధ్యానాదుల కనుకూల మైనది కాదు. సత్త్వగుణమయకాలమే యుక్తమైనది. ప్రవాహవేగమునకనుకూలముగ వాయువు వీచునపుడు నావయొక్కగమనమింకను త్వరితమగు చందమున, అట్టి కాలమున ధ్యానము చేయుచు రాగా రాగ జీవుడుతురీయమగు ఆత్మవిశ్రాంతియను రేవులోనికి శీఘ్రముగా చేరగల్గును. ఈ తత్త్వమునేదివ్యజ్ఞానసంఘము వారెక్కువగ నమ్ముచుందురు.”

అయతే, ‘ఆ దివ్య (ఆత్మ) జ్ఞానము మా హృదయములలో ఏల నిలచుటలేదని కొందఱు సంశయింపవచ్చును. ఋషులు చెప్పిన విద్య (బ్రహ్మవిద్య) వైజ్ఞానికమే (Scientific)గానిబూటకము గాదు. కాని దానిని విప్పి చెప్పునట్టి అనుభవజ్ఞులవలననే దానినెఱుంగవలసియుండును. స్వయముగ తెలిసికొన యత్నించిన ప్రమాదము సంభవించును. ఏయింట్లోరేడియో యంత్రముండునో, ఆయింట్లో జపాన్, అమెరికా, ఇంగ్లాండు, జర్మనీ మున్నగునన్నిచోట్లను పాడునట్టి పాటలన్నియు స్పష్టముగా వినిపించును. రేడియో యంత్రము లేనిచో,ఆపాడునట్టి చోటునకు సమీపమున నున్న ఇంటిలో నైనను, ఆ పాట వినిపించదు. అదే విధముగ,ఎవరు తమహృదయమను రేడియోయంత్రమును ఈశ్వరోన్ముఖ మొనర్తురో, అట్టివారికే యాఋషుల దివ్యవాణి వినిపించును.అట్లు చేయనిచో తాము ఎచట వసించినను, భూలోక మందున్నను లేక చంద్రలోక మందున్నను, అంగారక, బుధ, సూర్యాది గోళములందున్నను; ఆఋషివాణి దైవవాణి వినరాదు.”

మనస్సును శుద్ధపఱచి సర్వేశ్వరశక్తిలో నైక్యమొనర్చిన,నికసంకల్పమాత్రము చేతనే మనుజుడు సమస్త కార్యములను చేయగల్గును. అయితే దానితోకలియవలెనన్న, అదియును దాని వలె శుద్ధమై, నిష్కళమై, తేజోవలయమై, యుండవలెను. లేనిచోకలియదు. తెల్లకిరసనాయిలు, నీరు చూచుట కొకేవిధముగ నున్నను, కలియనట్లు ఈశ్వరస్థితిజీవునకు కలుగనంతవఱుకున్ను ప్రాకృతమైన సంస్కారము లుండును. అంత వఱకున్ను, జ్ఞేయమగు ఆత్మలోనాతనికి నిలుకడ కలుగనేరదు. ఒక వేళ కలిగించుకొనుటకు యత్నించినను నిలువక క్రిందికుదిగిపోవును. దీపము వెలిగించునపుడు ప్రమిదలోని చమురులో నీరుపడిన ఆ దీపమువెలుగజాలనట్లు, హృదయమందు విషయవాసనాదు లణుమాత్రమైన నున్నచో జ్ఞానజ్యోతిప్రకాశింపదు. అట్టి వాసనాదోషము 
లున్నంతవఱకు దేవతలైనను, ఇంద్రుడైనను, త్రిమూర్తులైనను కూడాఆత్మ నెఱుంగజాలకుందురు. ఇదే వేదాంతము మనకు బోధించు పవిత్రబోధ.”

ఇంకొక రహస్యము కూడా కలదు. ప్రతిదినము నియమపూర్వకముగధ్యానాదులను శీలించుచు వచ్చిన, కొంతకాలమునకు నిర్యత్నముగనే మనస్సు ఆ సమయమునకుమనలను అపాకృతమగు దైవస్థిలోనికి తీసుకొని వెల్లుచుండును. అట్లనే నియమపూర్వకముగ ఆహారమును గ్రహించు వారికి ఆ భుజించుకాలముననే సరిగా జఠరాగ్నిప్రజ్వరిల్లును.”

కొన్ని దినములు పిల్లికిగాని, కుక్కకుగాని, ఉడుత, పక్షి, పావురములకు ప్రతిదినముఏదో ఒక సమయమున ఆహారమిచ్చుచు వచ్చిన ఇక ప్రతి దినము సరిగ ఆకాలమునకే అవి యట వచ్చిచేరుచుండును. వాటికా సమయమెట్లు తెలిసెను? గడియారము లేవైన వాటికి గలవా?ఆ లగ్ననిశ్చయమును వాటికెవరు తెలిపినారు? కాన ఆసన, నిష్టాదులను ప్రతిదినమునియమపూర్వకముగ ననుష్టించుచుండిన, క్రమముగ నప్రయత్నముగనే యాసమయమునకు మనస్సు ధ్యేయాకారస్థితికిబోవుచుండును. ఒక రైలింజను ముందునకు సాగిన, తక్కిన పెట్టెలన్నియుదానిననుసరించియే సాగునట్లు, నియతిబద్ధులైనచో ఆ నియతియే మనలను గమ్యస్థానము చేర్చగలదు.”

(దీనిని విద్యార్ధులు తమ విద్యాభ్యాసము నందు చక్కగఉపయోగించుకొన్న సత్ఫలితములు పొందవచ్చును.)
నిద్రాహారాదులను నియమపూర్వకముగా గ్రహించుచు మీజీవితములనెపుడు నియమబద్దములుగ నొనర్చెదరో అపుడా నియతియే ఆప్రయత్నముగమిమ్ములను భవసాగరమును దాటింపగలదు. కాన నియతిని ప్రాణమువలె సంరక్షింపవలెను.సంసారమను నదిని దాటుట కది యొకటియే వంతెన. ఆచరణ యొక్క మహిమ అటువంటిది.”


అనుష్ఠానము మఱువరాదు. అదియే మిమ్ములను రక్షించును.ఋష్యాదులు ఎంతయో కష్టపడి, ఎన్నియో శ్రమలకోర్చి, ఎన్నియో విఘ్నముల నెదుర్కొనిధ్యానానుష్టానములను సల్పిరి. కనుకనే వారు మహాప్రభోధకులై “తీర్ణాస్స్వయంభీమభవార్ణవం జనానహేతునా2న్యానపి తారయన్తః’ అనునట్లు తము తరించి ధన్యులగుతయేగాక అనేక ముముక్షువులను కూడ తరింపజేసి కృతార్ధులైరి. తామనుష్టించి యితరులననుష్తింపజేసిరి. ఇపుడట్టి యనుష్టానము చాలా అరుదైనందుచేతనే వేదాంతమునకు పతనముగల్గినది. “

కటియను సంఖ్య ప్రక్కన సున్నయుంచిన పదియగును. మఱియొక సున్నయుంచిన నూఱగును,ఇంకొకసున్న నుంచిన వెయ్యి అగును. ఇంకొక సున్ననుంచిన పదివేలగును. మఱియొక సున్ననుంచినలక్ష యగును. ఆ రీతిగనే యేకమగు ఆత్మయందు క్రమముగ మనస్సు చేరినయెడల సంకల్పవికల్పములు గలదగును. (రెండవ సున్నయను) బుద్ధినుంచి యెడల ఆసంకల్పమునేనిశ్చయించునదగును. (మూడవ సున్నయను) జ్ఞానేంద్రియముల నుంచినయెడల
 దృశ్యప్రపంచముతోసంబంధము గల్గియుండును. నాల్గవదగు కర్మేంద్రియముల నుంచిన ఆయా కర్మేంద్రియవ్యాపారములు గల్గియుండును. అయిదవదగు దృశ్యము నుంచిన విషయాదులందు జిక్కు కొని, పెక్కు తలంపులు గల్గి అధోగతిని పొందును. ఇదియేసృష్టి క్రమము. కాని ఒక్కక్క సున్నను తీసి వేయుచు వచ్చిన ఒకటియను సంఖ్యశేషించునట్లు మనస్సును అంతరమునకు త్రిప్పుచు వచ్చిన క్రమశః దాని చేష్టలుడిగి,వృత్తులుసన్నగిల్లి, ఏకమగు ప్రత్యగాత్మయందు లయింప ఆత్మ యొక్కటి మాత్రమే శేషించును. ఇదియే లయయోగమనంబడును. ధ్యాన పద్ధతియు నిదియే.” ||14-04-2013||

*******************************************************************************

4.మహర్షి - సద్గురు శ్రీశ్రీశ్రీ మలయాళస్వాములవారి ధర్మ బోధ (4) - (29-3-1940 – దోనేపూడిలో ప్రవచనము)

 “సంస్కృతముఖర్జూరకాయవంటిది. ఖర్జూరకాయ మొదట నమలు నప్పుడు కఠినముగా నుండి క్రమముగ మెత్తబడిద్రవమగునపుడు అమృతతుల్య మగునట్లు సంస్కృతభాషయు ప్రారంభమున కఠినముగాను, ఉచ్చరించుటకుకష్టసాధ్యముగాను నుండినను క్రమముగ నభ్యసించినకొలది అలవడి అతిమధురమై, శ్రావ్యమై యొప్పారును.”

మన జీవితమంతయు నిద్దఱు దొంగలపహరించుకొనిపోవుచున్నారు. వారునిద్రాహారాలే. నిద్ర వచ్చినపుడు పరుండుట. ఆకలి కలిగి నపుడు భుజించుట యలవఱచుకొన్నచోనిక నారెండును జయింపబడినట్లే. అట్లు గాక మనమే నిద్రనుఆహ్వనించిన, - దిండున్నదా, పరుపున్నదా, గాలి తగులుచున్నదా, - ఈ విధముగా సవాళ్ళువేయును. లేకున్న ఏరాతిమీద పరుండినను గాఢనిద్ర పట్టిపోవును. అట్లే, మనమే ఆకలిని పిలిచినమంచి కూరలున్నవా, పచ్చళ్ళున్నవా, ఊరగాయలున్నవా, అప్పడములున్నవా యనిఇవ్విధముగ వేధించును. అట్లుగాకున్న ఏ అంబలియో,గంజియో,సంకటియో యైనను సంతృప్తికరముగనే యుండును. ఇదియే యిందలి రహస్యము. ఇట్లీ రెంటిని జయించిన నిక మన జీవితము నిరపాయముగా గడచిపోవును.”

మనస్సును పరమాత్మయందు లీనము చేయుటమనస్సుయొక్క తపస్సు, భజన కీర్తనాదులను జేయుట వాక్ తపస్సు; ఆశ్రమ సేవ, దేశసేవ మొదలగునవి చేయుటశారీరక తపస్సు - ఈ మూడు తపస్సులు చేసిన త్రికరణములు శుద్ధమగును. ఋష్యాదులు త్రివిధశుద్ధులుపడసినవారే. అన్ని జాతులవారున్ను, మతములవారున్ను, స్త్రీలున్ను, పురుషులును కూడా వీటినాచరించవచ్చును.”

ఆత్మానం రధినం విద్ధిశరీరం రధమేవ తు|
బుద్ధిం తు సారధింవిద్ధి మనః ప్రగ్రహమేవ చ||
ఇంద్రియాణి హయానాహుర్విషయాం స్తేషు గోచరాన్|
ఆత్మేంద్రియమనోయుక్తంభోక్తేత్యాహుర్మనీషిణః|| (కఠోపనిషత్తు)

శరీరమే రథము, ఆత్మయే రథికుడు, బుద్ధి సారధి, మనస్సు కళ్ళెము,ఇంద్రియములుగుఱ్ఱములు, దృశ్యవిషయములు బాట. సామాన్యముగా ఒకటి, రెండు గుఱ్ఱములుగల బండినేజన్సమూహముగల రోడ్డుపై నడుపుట ఎంతయో ప్రయాసము! అట్లైన నిక 10 గుఱ్ఱములు కట్టబడినఈశరీరరథము నడుపుటకు సారధికెంత చాతుర్యముండవలెను? అవియు, అన్ని ఒకే వైపునకుకట్టబడియుండలేదు. కొన్ని ముందు (నేత్రాదులు), కొన్ని వెనుక, కొన్ని ప్రక్కల(కర్ణాదులు), కొన్ని క్రింద, కొన్ని పైన ఇవ్విధమున - ఈ ఇంద్రియహయములు శరీరరథమునకు కట్టబడియున్నవి.తర్బీదు లేని గుఱ్ఱములైనచో బండిని త్రోవలో పడగొట్టి రధికున కపాయము గల్గించి,గమ్యస్థానమెట్లు చేర్చజాలకుండునో, అట్లే వశీకృతముకాని యింద్రియములైనచో జీవుని స్వస్థానమునుజేర్పజాలకుండును. కనుకనే        ‘తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ’

అనగా ఇంద్రియములనేమొమ్మొదట నిగ్రహించుకొనుమని భగవాను లానతిచ్చిరి. కాన, ఇంద్రియములను జయించి బుద్ధినిఅతిసూక్ష్మ మొనర్చి కడుజాగరూకతతో వర్తించిననే, జీవుడు స్వస్థానమగు ఆత్మనుజేరగలడు.”

సంజయుడగా, సమ్యక్ జయుడు – లెస్సగ సర్వేంద్రియములను జయించినవాడని యర్ధము. ఆతడుసూతపుత్రుడు. అబ్రాహ్మణుడు. మొట్టమొదట నాతడే గీతను లోకమునకు బోధించినవాడు.సంజయత్వమనునది ఒక బిరుదు. ఇంద్రియాదుల సమ్యక్ జయత్వము గలవారందఱును ఆజయపదవికిఅర్హులే.”

 “ఏకాంతమున గాక రణరంగమందుసర్వజన మధ్యముననే భగవానులు గీతనుపదేశించి యుండగా ఇక దానియందు దాపరికమేల? రహస్యమేల? స్త్రీ పురుషాదులందఱును,సర్వజాతులవారునునిరాటంకముగా దానిని పఠించి, యనుష్ఠించి తరింపవచ్చును.”

ఆదిలో భగవద్భక్తుల సంఘమందు ఐదుగురే యుండిరి. వారేపంచభూతములు (పృథివి, జలము, అగ్ని (సూర్యుడు), వాయువు, ఆకాశము) వారే భగవంతునిఆంతరంగిక భక్తులు. ఆ సంఘములో జేరదలంచినవారందఱున్ను ఆ పంచభూతముల వలే సమబుద్ధిగల్గియుండవలెను. సర్వజీవరాసులయెడల సమదృష్టి, ప్రేమ గలవారే నిజమైన భక్తులగుదురు. వారే భగవంతుని ఆంతరంగికభక్త కోటిలో జేరినవారు,వారేఈశ్వర ప్రియులు, తదితరులు భక్తులు కాదు, భోక్తలే.”

నిజమైన భగవద్భక్తుల యొక్క, గురుభక్తులయొక్క, ధర్మభోధకులయొక్క లక్షణమేమన,వారెట్టిదైవ, గురు కార్యములు సంప్రాప్తించినపుడు తదితర కార్యములన్నింటిని వదలి తదేకనిష్ఠతో వాటినే నెరవేర్చుచు ఆనందభరితులై యుందురు. తదితరులకు మాత్ర మాకార్యము మహాభారమనిపించును.” ||15-04-2013||


*************************************************************************************************************
 5.మహర్షి - సద్గురు శ్రీశ్రీశ్రీమలయాళస్వాములవారి ధర్మ బోధ (5) - (29-3-1940 – దోనేపూడిలో ప్రవచనము)

 “తన దేహమను పట్టణములోగలసర్వేంద్రియములను నిగ్రహించినచో నిక ప్రపంచమంతయు నిగ్రహించినట్లే యగును. ఏలన,ఎపుడువ్యష్టిత్వము నశించునో, అపుడు మిగులునది సమష్టిత్వము, లేక ఈశ్వరత్వము. కాన తనకు తనుగురువైనచో లోకమున కంతకునుకూడ గురు వగును.”

సన్నని వటబీజమునందు గొప్పదైన వటవృక్షము ఇమిడి యున్నట్లు,చిన్నభూతద్దమునందు విశాలమైన పర్వతములు, క్షేత్రములు ఇమిడి యున్నట్లు, పరమేశ్వరునియందుఈసర్వమున్ను ఇమిడియున్నది. అనగా సర్వేశ్వరుడు చరాచరము లందంతట వ్యాపించి యున్నాడనియర్ధము.”

అజ్ఞానవృత్తులను ఆంతర్యమున నణగద్రొక్కక బాహ్యమున మాత్రముడాంబికముగా మనోవాక్కాయముల నిగ్రహమును ప్రదర్సించుట తమోగుణతపస్సే యగును. ఇతరులను మోసపుచ్చవలెనని చేయు తపస్సుకూడాతామసతపస్సే యగును. తీర్ధప్రసాదముల నేమియు గైకొనకయోగము చేసినచో, ఆకటిబాధచే జీవుడు తపన పడి, శరీరము కృశింపవ్యాధిగ్రస్తుడగును. అట్టి తపస్సున్ను తామసతపస్సే యగును. దానిచే యోగసిద్ధి గలుగదు.పది చిల్లులు గల కుండలో నీరుపోసిన నిలువనట్లు భక్తి, జ్ఞాన, వైరాగ్య, ఇంద్రియ నిగ్రహములులేని యోగము యోగికి సిద్ధిని గలుగ జేయజాలదు. అట్లుగాక, ఇంద్రియనిగ్రహము,బ్రహ్మచర్యము,భక్తిజ్ఞానధ్యానాదులుగలిగి యోగము సల్పెనేని, ఆయోగ మంతకంతకు వృద్ధియై భోగాదులందు విరసత్వము జనింప, త్వరలో జీవుడు పరబ్రహ్మైక్యమునొందగలడు.” ||17-04-2013||

*************************************************************************************************************
6आ.మహర్షి-సద్గురు శ్రీశ్రీశ్రీ మలయాళస్వాములవారి ధర్మ బోధ (6a) - (29-3-1940 – దోనేపూడిలో ప్రవచనము)

ఒక బీజమును మంచి భూమిలో నాటి నీరు కొంచెము కొంచెముగాపోయుచున్నయెడల, అది క్రుళ్ళిపోక,మొలకెత్తిక్రమముగా పెరుగు చుండును. అత్తఱి ఎఱువును, నీటిని భరించగలదు. అపుడదిక్రమశః శాఖోపశాఖలుగ విస్తరించి పుష్ప పత్రఫలపల్లవాదులతో శోభించును. అట్లుగాకభూమియందు విత్తనము పెట్టినదాదిగ ఎరువు, నీరు విశేషముగా నుంచుచు వచ్చినఅయ్యది క్రుళ్ళి నశించిపోవును. ఒక వేళ మొలచినను నభివృద్ధి నొందక క్రమేణిక్షీణించిపోవును. అట్లే భూమియందు బీజముంచి ఒక పర్యాయము నీరు పోసి మఱల నెన్నడుపోయకున్నను మొలక మొలచినప్పటికి చెమ్మ లేనందుచే వేరు ఎండి వృక్షము నశించిపోవును.ఆరీతిగనే గురుని సన్నిధిజేరి మంత్రోపదేశ మొందినను, ధ్యానానుష్టాన భక్తివైరాగ్యాదులు లేనిచో జ్ఞానాభివృద్ధి కానేరదు. ఇక తీర్ధప్రసాదములను విశేషముగాపుచ్చుకొనుచు వచ్చిన, ఆయాసము మెండయి నిద్ర జాస్తియై యోగదశనుండి భోగదశకు దిగిపోవును. కాన సాధకుడు కడు జాగరూకుడై యుక్తాహార, వివిక్తవాస, బ్రహ్మచింతనములనసల్పుచు క్రమముగ సాధింపవలసియుండును.”

అందఱును మనస్సును ఏకాగ్రపఱచి, తాబేలు తన సకలావయములను లోనికిముడుచుకొనునట్లుసర్వేంద్రియములను నిగ్రహించుకొని ఓంకారము యొక్క నాల్గవపాదమైన తురీయస్థానములోనికిప్రవేశించవలెను.”

నామసంకీర్తనాదులు వాక్ క్రియలు, తాళవాద్యనర్తనాదులు కాయిక క్రియలు. చింతన, ధ్యానాదులు మానసికక్రియలు. ఈ మూటికంటెను పరమై, సర్వేంద్రియముల కతీతమై ప్రణవాగ్రమైనట్టి నాల్గవ పాదమగు తురీయానందము ఏస్థానమున ననుభూత మొనర్పబడునో, ఏస్థానమునుండి చెప్పిననది తెలియబడునో అదియే వేదము.”||19-04-2013||

*************************************************************************************************************
శ్రీశ్రీశ్రీ మలయాళస్వాములవారి ధర్మ బోధ (6b ) - (29-3-1940 – దోనేపూడిలో ప్రవచనము)

చింతనా ప్రవాహము (ఆలోచనా ప్రక్రియ) ఇసుకలో మోటతోలినట్లుండును. అనగా మోటను త్రెంపులేక తోలుచున్ననే జలము ప్రవహించుచుండునుగాని,ఆగినచోవెంటనే నీరంతయు ఆయిసుకలో నింకిపోవునట్లు మనశ్శక్తియు స్వస్థానమునకు చేరునపుడుమధ్యలో త్రెంపు గల్గిన చేరజాలదు. కనుకనే గొప్ప గొప్ప వక్తలు ఉపన్యసించునపుడు వారిచింతనా ప్రవాహమున కడ్డు కల్గింపక అందఱును నిశ్శబ్దముగాను, నిశ్చలముగాను (attentive)నుందురు.

దృశ్యమునకు సమీపము దేహము. దానికి సమీపము కర్మేంద్రియములు, దానికి జ్ఞానేద్రియములు; దానికి మనస్సు; దానికి ప్రత్యగాత్మ- ఈరీతిగా చాల మెట్లు గలవు. ప్రణవాగ్రమైన ఆప్రత్యగాత్మను, వేదముయొక్క అంతమును ప్రారంభముననే యవగాహన మొనర్చుకొనుటకష్టసాధ్యముగాన క్రమేణ జపములు, కీర్తనలు, భజనలు, పురాణకథలు మున్నగువాటిని సాధనలుగా నేర్పఱచిరి.

 ‘మెయిల్’ వచ్చుటకు ముందుగనేఅందఱును టికెట్లుకొని ఫ్లాటుఫారముపై సిద్ధముగా నుండునట్లు, దేహవియోగకాలమువచ్చుటకుమునుపే పరబ్రహ్మసాక్షాత్కారమను టికెట్టు కొని సిద్ధముగా నుండవలెను.

ఒక స్టేషనుకు అర్ధరాత్రి మెయిల్ బండి వచ్చు మామూలైనచో ఆ స్టేషను మాస్టరు రాత్రి యా సమయమునకు మేలుకొని కడుజాగరూకుడై, సుసన్నుద్ధుడై యుండును. ఇట్లొక చిన్న ప్రపంచపదవియందే మనుజులెంతో ప్రయత్నము,జాగరూకత,కార్యశూరత్వము,దక్షతజూపవలసియుండ నిక మోక్షప్రాప్తికై ముముక్షువు ఎంత ప్రయత్న పరుడై యుండవలెను? సోమరితనము, నిద్ర – వీటి నాశ్రయించిన నింకనేమైనా గలదా? “

ప్రపంచములో రాజులు మున్నగువారు తమ రాజకీయ రహస్యములనుఆంతరింగికులకు మాత్రమే తెలుపుదురు. అప్పుడు వారు, హో! ఇందరు జనులుండ, మాకే యీ రహస్యములను దెల్పుచున్నారని, రాజునకు వారి యెడగల విశ్వాసమును దలంచి సంతోషపడుదురు. అట్లే పుణ్యజీవులకు మాత్రమేపుణ్యకార్యములజేయు ఈశ్వరుడు సంకల్పము గలుగజేయును. అప్పుడే వారు ఆహా! ప్రపంచములోనెందరో ధనవంతులు, విద్యావంతులగు జీవులుండ నన్నే యీ పనికై భగవంతుడునియోగించెను, నేనెంత “భాగ్యవంతుడను” అని భగవత్కరుణను జూచి యానందించుచుందురు.

ధర్మమును బోధించువారు తమ కెన్ని యడ్డంకులు వచ్చినను, రణరంగమందలి యోధునివలెముందునకే పోవుచుండవలెను. వెనుక దృష్టి యుంచరాదు. అప్పుడు వారు తప్పక విజేతలగుదురు.కాని తాను బోధించు దాని యందు దూషణ యేమాత్రమున్ను ఉండరాదు.” 


తాను నాటిన విత్తనమే తనకు ఫలించును. ముష్టి (ఒక విధమగు చేదు చెట్టు) విత్తనము పెట్టి తానుపెట్టినది చీనీ (బత్తాయి) విత్తనమని యెన్ని ఉపన్యాసము లిచ్చినను, పబ్లిక్  వీధులలో టాంటాం గావించినను మొలచునదిముష్టిచెట్టే. అట్లే చీనీవిత్తనము పెట్టి, దానిని గూర్చి యొకరికిజెప్పకున్నను, వానికి చీనీఫలమే తప్పక లభించును. అదేవిధముగనే, అపవిత్రతావిషయ దోషముగల్గి తాను శుద్ధుడనని లోకములో నెంత ఆర్భాటముచేసినను తుదకు పాపఫలమే వానికి లభించును. తాను శుద్ధుడైనచో తన శుద్ధత్వమునుగూర్చి విజ్ఞాపన జేయకున్నను సర్వేశ్వరుడు పుణ్యఫలమునే తప్పక యొసంగును.


రాత్రిళ్ళు కుక్కలుగాని, నక్కలుగాని స్వప్నములో ఏదో ఒకటి అరచినచో అది యేమోఅనుకొని అరచుట ప్రారంభించును. అట్లే సంఘములో ఒకరు లోపము చేసిన, తక్కిన వారు కూడా దానిననుసరించుట చాల పొరపాటు.


భోగమునకును, యోగమునకును ఉత్తరధ్రువ, దక్షిణధ్రువములకు గల తారతమ్యముగలదు.


సింహము – ఏనుగు, గరుడపక్షి - సర్పము లొకేస్థలములో నుండ నట్లు యోగ భోగములు రెండునునొక్కరియందు నుండజాలవు. యోగ మపేక్షించెదరా భోగములను వర్జింపుడు, భోగము లాశించెదరా, యోగమునకు తిలోదక మిండు.” ||26-04-2013||


__/\__ __/\__ __/\__ __/\___ __/\__ __/\__

No comments:

Post a Comment