పరమహంస యోగానందగారి “ఒక యోగి ఆత్మకథ” లో నేను గుర్తించగలిగిన (నన్నుఆకర్షించిన) కొన్ని జ్ఞాన సుధా వాక్కులు……
- మామూలుగా ఇట్టే మరుపుకు వచ్చే ఈ తొలి (బాల్యంలోనివి) విజయాలే ఆత్మ విశ్వాసానికి సహజమైన ప్రాతిపదికలవుతాయి. (కనుక తల్లిదండ్రులు దీని పట్ల శ్రద్ధ వహించడము చాలా అవసరమన్నది తెలుస్తున్నది.)
- వాళ్ళలో ( మా అమ్మా నాన్నా) ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమ ప్రశాంతమైనదీ గంభీరమైనదీ; హుందాతనమున్న ఆ ప్రేమలో అల్పత్వానికి తావు లేదు. (ఇది తల్లిదండ్రులము గుర్తుంచుకోవలసిన విషయమనిపించింది)
- అన్నిటి విషయంలోనూ సమదృష్టి సాధించాలని తలిచేవాడు లాభం వచ్చినపుడు పొంగిపోడు, నష్టం వచ్చినపుడు కుంగిపోడు.
- ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనిషి డబ్బు లేకుండానే వస్తాడనీ, పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా పట్టుకుపోడనీ అతనికి తెలిసి ఉంటుంది.
- ఈ అహంకారం (నేను చేస్తున్నాననే భావన) అన్నది ద్వంద్వానికి లేదా, మనిషికీ అతన్ని సృష్టించినవాడికీ మధ్య గోచరించే వేరుపాటుకు మూలకారణం. ఈ అహంకారం మానవుల్ని మాయలో పడెస్తుంది; దాని వల్ల కర్తే (అహం) ‘కర్మ’గా మిథ్యారూపంలో కనిపిస్తాడు. ఒకరు సృష్టిస్తే ఏర్పడ్డవాళ్ళు తామే సృష్టికర్తలమని ఊహించుకుంటారు.
- తామసిక కామాలనే ఈ యోధులు, మనల్ని అందరినీ హతమార్చడానికి చూస్తుంటారు.
- తన ఆదర్శాల్ని భూస్థాపితంచేసి సాధారణ ప్రారబ్ధానికి తలవంచినవాడు ఆలోచనా శూన్యుడు. అతడు నిర్వీర్యుడుగాను, మూర్ఖుడుగాను, అవమానకరుడుగాను తప్ప మరో రకంగా కనిపిస్తాడా?
- నీ మనస్సులో ఉన్నది పక్కకి పెట్టేయ్యడం (స్వార్థంతో కూడిన కోరికలు, ఆశయాలు); నీ చేతిలో ఉన్నది ఉదారంగ ఇతరులకు ఇవ్వడం; ఆపదలు పిడిగుద్దులు వేస్తున్నప్పుడు ఏనాడు చలించకపోవడం! ధార్మిక జీవనము - అబూ సయీద్ – పారశీక మార్మికుడు
- లోపల తిరిగే క్రూరమృగాల్ని (మానవుల కోరికలనే అడవుల్లో తిరిగే పులులు- మనో వికారాలు) జయించు.
- మానవమనస్సనే అడవుల్లో సంచరించే అజ్ఞానమృగాల్ని అణచడం నేర్చుకో.
- ప్రక్రియే లక్ష్యమనుకుని పొరపాటుపడకు.- ధ్యానంకన్నా భగవంతుణ్ణే ఎక్కువ ప్రేమించాలి.
- భగవంతుడు ఏర్పరిచిన జీవిత క్రమం, భీమా కంపెనీకంటే కూడా తెలివిగా మన భవిష్యత్తును అమిర్చి ఉంచుతుంది.
- ఏమీ సాధించకుండా, సంఘర్షణకు నిరాకరించే దుర్భలుడికి త్యాగంచెయ్యడానికి ఏమీ ఉండనే ఉండదు. కష్టించి పనిచేసి జయం పొందినవాడే విజయవంతమైన తన అనుభవ ఫలాల్ని ప్రపంచానికి అందించి దాన్ని సుసంపన్నం చేయగలడు.
- భ్రాంతులకు వెనక ఉండే సత్యసూత్రాల్ని బయల్పరచగల నిజమైన ప్రయోగశాల మనస్సు.
- నీ భయానికి కారణమైన దానికి ఎదుటపడి చూడు; అది నిన్నింక ఇబ్బంది పెట్టదు.
- మోహం మనుషుల్ని గుడ్డివాళ్ళని చేస్తుంది. మనం కోరుకొనే వస్తువు చుట్టూ అది, ఊహాకల్పితమైన అందమైన ఆకర్షణ ఒకటి ఏర్పరుస్తుంది.
- మంచివి, ప్రోత్సహకరాలయిన సూచనలు పిల్లల సూక్ష్మగ్రహణ శక్తిగల చెవులకు ఎక్కేటట్టు చెయ్యాలి. వాళ్ళకు చిన్నప్పుడు ఏర్పడే అభిప్రాయాలు లోతుగా నాటుకొని చాలాకాలం ఉంటాయి.
- నీకున్నదాంట్లోనే సుఖంగా ఉండు. విచ్చలవిడిగా ఖర్చుచేస్తే తరువాత దుఃఖపడతావు. -
– దీన్ని ఆచరించడానికి నేను చేస్తున్న నా చిరుప్రయత్నంలో ఆ సర్వేశ్వరుడు ఎంతవరకు కరుణిస్తాడో మరి!!! - తమ ఆలోచనల్ని, మాటలనే బాహ్యమైన దుస్తులు ధరించడానికి అనుమతించేముందు ఆయన (శ్రీ యుక్తేశ్వర్ జీ), విచక్షణ అనే సున్నితపు త్రాసులో తూచేవారు.
- విశ్వాసఘాతుకుడైన స్నేహితుడిలాంటిది శరీరం. దానికి ఇయ్యవలసినంత మట్టుకే ఇయ్యండి; అంతకు మించి వద్దు.
- కష్టం, సుఖం అనేవి అస్థిరమైనవి. ఈ ద్వంద్వాలప్రాబల్యం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూనే వాటి నన్నిటినీ నిబ్బరంగా ఓర్చుకోండి.
- జబ్బు, స్వస్థతా కూడా ప్రవేశించే ద్వారం ఊహ; మీకు జబ్బుగా ఉన్నప్పుడయినా సరే, జబ్బు అనే వాస్తవాన్ని నమ్మకండి; గుర్తింపు పొందని ఆ సందర్శకుడు పలాయనం చిత్తగిస్తాడు !
- చిత్తశుద్ధి లేని సభ్యత నిర్జీవమైన సుందరాంగి వంటిది.
- సభ్యతలేని ఋజుత్వం, వైద్యుడి కత్తిలాగ, పనికి వచ్చేదే కాని అప్రియమైనది. మర్యాదతో కూడిన నిష్కాపట్యం సహాయకరమైనదే కాక, ప్రశంసనీయమైనది కూడా.
- ఈ భూమిమీద ఉచితంగా లభించే గాలి పీలుస్తున్నంత కాలం, కృతజ్ఞతాపూర్వకమైన సేవ చెయ్యవలసిన బాధ్యత మనమీద ఉంటుంది. ఊపిరి అవసరంలేని సమాధిస్థితిని పూర్తిగా సాధించినవాడు మాత్రమే ప్రాపంచికవిధులనుంచి విముక్తి పొందుతాడు.
- అహంకారం పోయిన తరువాతే భగవత్ప్రవేశానికి అవరోధాలు లేని మార్గమేర్పడుతుంది. స్వార్ధంతో బండబారిన గుండెల్లోకి చొరబారడానికి దేవుడు చేసే ప్రయత్నం వృథాయే అవుతుంది.
- మెత్తని మందలింపులకే ఎదురుతిరిగే సున్నితమైన మానసిక బలహీనతలు, సున్నితంగా తాకేలోగానే ఎదురుతిరిగే, రుజాగ్రస్తమైన శరిరావయవాల వంటివి.
- అహంకారం చొరబారిన మానవులు అనే ముడిఖనిజాన్ని మార్చడానికి పూనుకొన్న గురువే నిజంగా ధైర్యశాలి!
- యోగ్యుడైన నాయకుడికి సేవ చెయాలన్న కోరికే కాని అధికారం చలాయించాలన్న కోరిక ఉండదు.
- ఇంద్రియ ప్రలోభాలు ఎప్పటికీ పచ్చగా ఉండే గన్నేరు మొక్కలాంటివి; సువాసన వెదజల్లుతూ, గులాబి వన్నెపూలు గల ఆ మొక్కలో ప్రతి భాగమూ విషపూరితమైనది.
- స్వస్థత చేకూర్చే లోకం లోలోపల ఉంటుంది; ఏ సుఖంకోసం బయట వెయ్యివైపుల మనం గుడ్డిగా వెతుకుతూ ఉంటామో ఆ సుఖం, ఆ లోకంలో ప్రకాశిస్తూ ఉంటుంది.
- తీక్షణమైన బుద్ధి రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. దాన్ని కత్తిలా నిర్మాణాత్మకంగా అజ్ఞనమనే కురుపును కొయ్యడానికి కాని, విధ్వంసాత్మకంగా తల తెగ్గోసుకోవడానికి కాని ఉపయోగించవచ్చు.
- అసహ్యమైన బురదలో పొర్లాడుతున్నప్పుడు, ప్రపంచపు సూక్ష్మసుగంధాలు వాళ్ళకు సోకవు. పాంచభౌతిక సుఖాలకు లోబడ్డ మనిషికి సున్నితమైన విచక్షణలన్నీ నశిస్తాయి.
- చెడ్ద కోరికల్ని ఇప్పుడు నాశనం చెయ్యి; లేకపోతే అవి, నీ సూక్ష్మశరీరం భౌతికకోశంనుంచి విడివడ్డ తరువాత కూడా నీతోనే ఉంటాయి.
- శరీరం, వాటిని (కోరికల్ని) నిగ్రహించలేనంత బలహీనంగా ఉన్నప్పటికీ మనస్సు ఎప్పుడూ నిరోధిస్తూ ఉండాలి. వాటి ఆకర్షణ కనక, క్రూరమైన శక్తితో నీమీద దాడి చేస్తున్నట్లయితే నిష్పాక్షిక విశ్లేషణతోనూ అజేయమైన సంకల్పబలంతోనూ దాన్ని జయించాలి.
- ప్రకృతిసహజమైన ప్రతి వాంఛనూ జయింపవచ్చు.
- మీ శక్తుల్ని పదిలపరుచుకోండి. ఇంద్రియాలనే ఉపనదులన్నింటినీ తనలో కలుపుకొనే విశాలమైన మహాసముద్రంలా ఉండండి.
- ప్రతి నిత్యం మళ్ళీ మళ్ళీ కలిగే ఇంద్రియవాంఛలు మీ అంతరంగంలో ఉన్న శాంతిని తొలిచేస్తాయి. అవి జలాశయానికున్న బెజ్జాలలాంటివి; దానిలోని అమృతతుల్యమైన జలాన్ని భౌతికత్వమనే ఎడారి నేలలో వ్యర్థమయ్యేట్టు చేస్తాయవి.
- చెడుకోరిక తాలుకు బలీయమైన ప్రచోదకప్రేరణ మానవుడి సంతోషానికి మహాశత్రవు.
- ఆత్మనిగ్రహ సింహంలా ఈ ప్రపంచంలో తిరగండి; ఇంద్రియ దౌర్బల్యాలనే కప్పలు మిమ్మల్ని లోకువకట్టి ఆటపట్టించకుండా చూసుకోండి!
- దైవసాక్షాత్కారం పొందడమంటే అన్ని దుఃఖాలికీ అంత్యక్రియ జరిపించడమే నన్న సంగతి గుర్తుంచుకోండి.
- పెద్ద పెద్ద మాటలు వాడడం, ఒక విషయం బాగా అవగాహనచేసుకోడం ఒకటేనని పొరబడకండి.
- కొందరు ఇతరుల తలలు తెగ్గోసి తాము ఎత్తుగా కనబడాలని చూస్తారు!
- కోపం నిదానంగా వచ్చేవాడు బలవంతుడికన్నా బలిష్ఠుడు; తన ఆత్మను తాను పాలించుకొనేవాడు ఒక పట్నాన్ని పట్టుకున్న వాడికన్నా గొప్పవాడు.- సామెతలు 16:32(బైబిలు)
- కోపం, అహంభావం అనే ఆంతరిక దుర్గాల్ని కూలగొట్టడంమే (వాటి పతనమే) మానవుడి ఔన్నత్యానికి నిదర్శనం.
- కోపమన్నది తీరని కోరికలవల్లే పుడుతుంది.
- బాహ్య కామనలు మనని లోపలున్న స్వర్గం నుంచి తరిమేస్తాయి; అవి కేవలం ఆత్మానందపాత్రను అభినయించే మిథ్యాసుఖాల్ని మాత్రమే చేకూరుస్తాయి. పోయిన స్వర్గాన్ని దైవధ్యానం ద్వారా తొందరగా తిరిగి పొందడం జరుగుతుంది.
- నీవు దేవుణ్ణి నీ వేసవి (పడుచుతనం) అతిథిగా ఉండమని ఆహ్వానించకపోతే, నీ జీవితపు చలికాలం (ముసలితనం) లో ఆయన నీ దగ్గరికి రాడు. (శ్రీశ్రీలాహరీ మహాశయులు)
- ఇసకా పంచదారల మిశ్రమంలాగ ఈ భూమిమీద ఉన్న ప్రతీదీ మిశ్రమ స్వభావం కలిగినదే. పంచదార మాత్రమే తీసుకుని ఇసకను ముట్టకుండా వదిలేసే తెలివైన చీమ మాదిరిగా ఉండు. (శ్రీశ్రీబాబాజీ మహాశయులు)
- చెడును విషం కలిపిన తేనెతో పోల్చవచ్చు; అది మనకి మోహం పుట్టిస్తుంది, కాని అందులో మృత్యువు పొంచి ఉంది.
No comments:
Post a Comment