Translate

26 October, 2014

నిచ్చెన తెచ్చిన తంటా - 1991 భద్రతాదినోత్సవాల సందర్భంగా నేను వ్రాసిన ఓ చిన్న కథ

నిచ్చెన తెచ్చిన తంటా
(1991 భద్రతాదినోత్సవాల సందర్భంగా నేను వ్రాసిన ఓ చిన్న కథ)
సాయత్రం అయిదు గంటలయింది…
లక్ష్మి మాటిమాటికి పెండ్లికి తన స్నేహితురాళ్ళు – మంగ, మేరి, ముంతాజ్ కలసి ఇచ్చిన గడియారం వంక తమ ఒంటిగదివాటా గుమ్మం వంక అసహనంగ చూసుకొంటోంది.
“బావ మధ్యాహ్నం భోజనానికి వచ్చినపుడు సైరన్ కాగానే ఇంటికి వస్తానన్నాడు… ఇంకా రాలేదేమిటిచెప్మా….అనుకొంటూ ఇంకొకసారి గుమ్మం బయటకు వచ్చి వీధి చివర దాక దృష్టి సారించి, తన బావ జాడ కానరాక నీరసంగా మరల లోపలికి వెళ్లింది.
ఆరోజు తమ పెండ్లిరోజవటంతో సాయంత్రం “కొబ్బరిబొండం”సినిమాకు, అటుతర్వాత హోటల్కి వెల్దాం రెడీగాఉండమని చెప్పివెళ్లటంతో, పాపం లక్ష్మి తన బావకు ఇష్టమైన తెల్ల ఆర్ట్ సిల్క్ చీర కట్టుకొని, ఇంటిగలవరమ్మాయి ఇచ్చిన సన్నజాజిపూవులతో మాలకట్టుకోని, బావచేత తలలో పెట్టించుకొందామని దాచిఉంచుకుంది.  మంచం మీదనున్న ఆమాల, తన్ను చూసి వెక్కిరిస్తూ…
“ఏడీ! మీబావ! ..”అన్నట్లనిపించి, దాన్ని విసురుగా ప్రక్కకు నెట్టింది. వెంటనే ఏదో స్ఫురించినట్లు… “ఓటీకి ఏమన్నా ఉన్నాడా అబ్బా! … అయినా ఈ మధ్య ఓటీలు లేవుగా! మరి…. ఆలస్యం ఎందుకైనట్లు??? బావకు బాతాఖానీలు కొట్టే అలవాటు కూడాలేదే! కొంపదీసి….ఏమన్నా ప్రమాదం జరిగిందా???…” అని మనస్సు పరిపరివిధాలుగా పరిగెత్తుతుంటే, ఆలోచనలకు కళ్ళెం వేద్దామనట్లు మరలా ఒకసారి గోడకు వ్రేలాడుతున్న అద్దంలో ముఖం చూసుకొని, అనవసరం అనిపించినా  మరలా ఒకసారి దువ్వెనతో ప్రక్కవంకీలు సరిచేసుకొని, చీర కుచ్చెళ్ళు సరి చేసుకుంది.
ఆరు గంటలయింది.  లక్ష్మిలో స్త్రీ స్వభావపు అసహనం, అనుమానం, ఉక్రోషం, భయం ఒకదాని వెంట ఒకటి చోటు చేసుకుంటున్నాయి.
“అయ్యో! నా మతి మండ! ఆలోచనలోపడి, సంధ్యవేళ దీపం వెలిగించకుండా ఇలాకూర్చున్నానేమిటీ?” అనుకుంటూ గదిలో ఉన్న 40కాండిలు బల్బు స్విచ్ వేసింది.  పసుపుతాడు, సూత్రాలు బయటకు తీసుకొని, భక్తితో కళ్లకద్దుకొని, తన ఇష్టదైవాలైన ఆ ఏడుకొండలవానికి, సాయిబాబాకు తన భర్త క్షేమంగా ఇంటికి చేరాలని మొక్కుకుంది.  గుమ్మం తలుపు జారవేసి వచ్చి కూర్చుంది.
కాని బల్బునుండి వెదజల్లే కిరణాలు, గుచ్చిగుచ్చి .. “ఏడీ మీ బావ? సినిమాకు తీసుకొనివెల్తానన్నాడుగా? అని శూలపుపోట్లు పొడుస్తున్నట్లు అనిపించి, మూలగనున్న మంచంమీదవాలి, ప్రక్కకుతిరిగి పడుకొంది. క్రిందపడిఉన్నప్రక్కవాటావారి సితార తీసుకొని పేజీలు తిరగవేయటం మొదలుపెట్టింది.  కానీ, దృష్టి బొమ్మలమీదనిలవటంలేదు.  ఎందుకో…ఓమూల కీడు శంకిస్తోంది….
ఇంతలో, గుమ్మంలో అలికిడైంది.  ఆలస్యంగా వచ్చిన బావను చెడామడా దులిపేద్దామని ఒక్క ఉదుటన లేచిన లక్ష్మి నోటిమాటరాక అచేతనమైంది.
ఇంతలో నారాయణను ఇద్దరు భుజాలమీద ఆసరాగ తీసుకొని వచ్చి మెల్లగా మంచం మీద పడుకోబెట్టారు.  కుడికాలి పాదానికి వేసిన సిమెంట్ కట్టు క్రింద ఎత్తు సరిచేసి, వచ్చిన నారాయణ మిత్రులిద్దరూ అవాక్కై చూస్తున్న లక్ష్మితో ఓదార్పుగా –
“కంగారేమిలేదమ్మా … మనవాడు పెండ్లిరోజుకదా … మిల్లులో సర్కస్ ఫీట్స్ చేసి…ఇదిగో ఇలా మాచేత సపర్యలు చేయించుకుంటున్నాడు.  ఎంత! మూడువారాలు…జాగ్రత్తగా ఉంటే విరిగిన పాదం ఎముక పూర్తిగా అతుక్కొని మామూలుగ అవుతుందని పెద్ద డాక్టరుగారు చెప్పారు.  నీవేమి భయపడవద్దు.  నీవు గాబరాపడతావనే ఆంబులెన్సను దూరంగా ఆపించి, మేము వీడిని మోసుకొని తీసుకువచ్చాము.... మరి మేము వస్తాము… రేపు సాయంత్రం మరలా వస్తాము. ఏరా! నారాయణా! వెళ్ళిరామా? " అంటూ వారిద్దరూ గుమ్మందాకా వచ్చిన తర్వాత చేతనావస్థలోకి వచ్చి,
 “అయ్యో! కూర్చోండి! కొంచెం టీ తీసుకొని వెల్దురుగానీ.... మీరీ రోజు చేసిన మేలు నేనెన్నటికి మరువలేను” అని అంటున్న లక్ష్మిని వారింపుగా –
“ఇందులో పెద్ద ఘనతేముందమ్మా! తోటి వారము ఆమాత్రం సహాయం చేసుకోపోతే ఎలా?  రేపు వచ్చినపుడు తప్పక టీ తీసుకుంటాము… ఇప్పటికే ఆలస్యం అయింది, అక్కడ మీ వదినలు కారాలు-మిరియాలు నూరుతుంటారు,”అని నారాయణ మిత్రులిద్దరూ శెలవు తీసుకున్నారు.
వారు బయటకు వెళ్ళగానే గది తలుపు గడియపెట్టి, అంతవరకు కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీటికిక అడ్డుకట్టకట్టలేక నారయణ ఎదమీదవాలి కన్నీటి కడవలతో తడిపిముద్దచేస్తూ, వెక్కుతూ… పసిపిల్లవలే…
“ఏమండీ! ఏమిటిది? ఎందుకిలా అయింది? మిల్లులో సర్కస్ ఫీట్సు చేయటం ఏమిటి? నాకేమి అర్ధం అవలేదు.  ఎందుకిలా జరిగింది? మీకేమన్నా అయితే నేనేమైపోతాను?” అంటూ రోదిస్తున్న లక్ష్మిని అనునయంగా వెన్నుతట్టుతూ…
“ఇపుడు నాకేమైందని! పాదం ఎముకవిరిగింది అంతే! మూడువారాలలో కాలునయమవుతుంది.  దీన్ని గురించి నీవు అనవసరపు అలోచనలు పెట్టుకోకు.”అంటూ మాటమార్చడానికి, “సారీ లక్ష్మీ! ఈరోజు కులాసాగ గడుపుదామని నిన్ను రెడీగా ఉండమన్నాను.  పోనీ! సెకండ్ షోకి వెల్దామా? అంటున్న నారాయణ  నోటికి తన అధరాలతో తనకేమి కోపం లేదనట్లు తాళం వేసింది తను.
తలుపు చప్పుడవటంతో, లేచివెళ్ళి తలుపు తీసి గుమ్మ బయట నిల్చున్న ఇంటివోనరు రామయ్యగారిని ఆదరంగా … “రండి..బాబాయిగారూ, కూర్చోండంటూ” నారాయణ మంచం దగ్గరగా కుర్చీవేసింది లక్ష్మి.
రామయ్యగారు తన సహజ ధోరణిలో – “ఏమయ్యా! నారాయణా!ఏమిటిది? పనిలో జాగ్రత్తగా ఉండాలని తెలియదటయ్యా? నీకు తెలియకపోయినా… మీమిల్లులో భద్రతాశాఖ లేదా ఏమి?”అని అంటుండగా నారయణ అడ్డుకొని,
“భద్రతాశాఖ లేకేమండి, ఉన్నది.  వారు మాకు తరచూ పనిలో చూపవలసిన జాగ్రత్తలు తెలియ పరుస్తుంటారు.  మా పైఅధికారులూ చెప్పుతుంటారు.  ఈ రోజు నాకీ ప్రమాదం కేవలం నా అశ్రద్ధ వల్ల జరిగిందంతే.. నేనీరోజు మధ్యాహ్నం డ్యూటీ ఎక్కగానే, మిల్లులో కిటికీలకు రంగు వేయాలని పురమాయించారు.  ఆ పని చేస్తూ ఓ కిటికీకి రంగు వేసేముందు ఒక మేకు అడ్డుగావుంటే దాన్నిపీకి, శుభ్రంచేసి రంగువేద్దామని లాగుతున్నప్పుడు, ఆమేకు దూరంగా ఉండటంతో, నేను బాలెన్స్ తప్పి, కంగారులో, పడిపోతున్న నిచ్చెన పైనుండి దూకటంతో నిచ్చెన క్రిందనున్న మెట్లపై పడటం వలన కుడిపాదం విరిగింది.” అంటూ తనకు ఎలా ప్రమాదం జరిగింది వివరింఛాడు.
అంతా విన్న రామయ్యగారు, “చూసావా! నారాయణా! అందుకే అన్నారు మనవాండ్లు – ‘పనిలో అలక్ష్యం మన మనుగడకే ముప్పని’, ఇకమీదన్నా నీవు జాగ్రత్తగా మసులుకో; ముఖ్యంగా – నిచ్చెనలమీద పనిచేసేటప్పుడు ప్రక్కకు వంగి పనిచేయడం చాలాప్రమాదకరం.  అలా మనం వంగినప్పుడు, మనిషి యొక్క గరిమనాభి నిచ్చెన కర్రలకు వెలుపలపడి ఆనిచ్చెన ఒరిగిపోయే అవకాశము కల్గి, ప్రమాదం జరుగవచ్చు.  ఒకవేళ, నిచ్చెనకు దూరంగా పని చేయవలసివస్తే, నిచ్చెనదిగి, పని చేయవలసిన చోటికి నిచ్చెన మార్చుకొని, పనిచేయాలి సుమా! అంతే కాకుండా, సేఫ్టీబెల్ట్ వాడటం చాల అవసరం.  దీనివలన ఎన్నో ప్రమాదాలు తప్పింపబడ్డాయి.  వాటి సంగతి తర్వాత మాట్లాడుకుందాము.  ఇప్పటికే ప్రొద్దుపోయింది.  కొంచెం ఎంగిలిపడి విశ్రాంతి తీసుకో.  అమ్మాయ్! లక్ష్మీ! నీవుకూడా అధైర్యపడకుండా నారాయణకు త్వరలో నయమయ్యేటట్లు చూసుకో, ఏదన్నా కావలిసివస్తే మొహమాటపడకుండా వచ్చి మీ పిన్నిని అడగమ్మా..”అంటూ, తన కళ్ళజోడు సరిచేసుకుంటూ బయటకు వెళ్ళిపోయారు.
‘నిచ్చెన తెచ్చిన తంటాకు’, లక్ష్మి బాధపడుతూ, తామూ భోజనం చేయడానికి ఏర్పాట్లు కుపక్రమించింది.

No comments:

Post a Comment