Translate

27 October, 2014

108 ఉపనిషత్తులలో గల 108 మహావాక్యములు

సంకలనముః విద్వాన్ గఱ్ఱెసత్యనారాయణ గుప్తగారు;
ప్రచురణ: ప్రార్ధనా గాన ప్రచార సంఘము (1992)
లోకా స్సమస్తా స్సుఖినోభవన్తు! సర్వే జనా స్సుఖినోభవన్తు! __/\__




1.ఈ శావాస్య మిదగం సర్వం|| (ఈశావాస్యోపనిషత్)
– ఈ చరాచర జగత్తంతయు నామరూప క్రియారహితమగు ఈశ్వర స్వరూప మాత్రముగా దర్శించుము.

2. ఇహ చేదవేదీ దథ సత్యమస్తి || (కేనోపనిషత్)
– ఈ మానవ జన్మయందుపరమాత్మను గురించి తెలిసి కొనినచో సత్యమైన బ్రహ్మానందము సిద్ధించుచున్నది. 

3. ఉత్తిష్ఠత జాగృత ప్రాప్యవరాన్ని బోధతః || (కఠోపనిషత్)
– లెమ్ము మేలుకొనుము! సద్గురువును సమీపించి బ్రహ్మజ్ఞానమును పొందుము!!   

4. ఇన్ద్రస్త్వంప్రాణతేజసారుద్రో2సి పరిరక్షితా || (ప్రశ్నోపనిషత్)
– ఓ ప్రాణమా! నీవే యింద్రుడవు (పరమాత్మవు). నీవేరుద్రుడవు. సర్వజగత్తును పరిపాలించువాడవు.

5. నాయమాత్మా ప్రవచనేన లభ్యోనమేధయా నబహునా శ్రుతేన|| (ముండకోపనిషత్)
– ఈ ఆత్మ, అధికముగ ప్రవచనములు చేయుటచేత పొంద శక్యమైనదికాదు. మేధాశక్తిచేత పొందశక్యమైనదికాదు. అధికముగ శ్రవణము చేయుటవలన గూడ లభ్యముకాదు. (ప్రవచనము, మేధస్సు, శ్రవణముఅనుభవమునకు బలమును మాత్రమొసంగును.)

6. అయ మాత్మా బ్రహ్మ|| (మాండూక్యోపనిషత్)
- స్వయం ప్రకాశమై అపరోక్షమైఅయం శబ్దవాచ్యమైన ఆత్మయే ఆ పరబ్రహ్మము.

7. స్వాధ్యాయా న్మా ప్రమదః|| (తైత్తిరీయోపనిషత్)
- స్వాధ్యాయ విషయుములోప్రమాదమును పొందకుము. (అశ్రద్ధ వహించకుము)

8. ప్రజ్ఞానం బ్రహ్మ|| (ఐతరేయోపనిషత్ )
- సమస్త జీవులలో బ్రహ్మస్వరూపమైన ఏ చైతన్యముగలదో అట్టి ప్రజ్ఞానమే(చైతన్యమే) పరబ్రహ్మము.

9. తత్త్వమసి|| (చాందోగ్యోపనిషత్)
- (తత్) ఆ పరమాత్మయే, (త్వం) జీవాత్మగా (అసి) అయియున్నాడు.  (జీవాత్మయే పరమాత్మగా అనుభవించవలెను.) ||12-06-2013||

10.అహం బ్రహ్మా2స్మి|| (బృహదారణ్యకోపనిషత్)
- నేను ఆ పరబ్రహ్మముగానున్నాను. (ఈ దేహములో పరిపూర్ణముగా బుద్ధికి సాక్షిగానేనున్నాను.)

11. యదక్షరం పరం బ్రహ్మతత్సూత్రమితి ధారయేత్|| (బ్రహ్మోపనిషత్)
- అక్షర పరబ్రహ్మమును యజ్ఞోపవీతముగా భావించి ధరించవలెను.

12.తత్ బ్రహ్మా2 ద్వయ మస్మ్యహమ్|| (కైవల్యోపనిషత్)
- అట్టి అద్వయమైన పరబ్రహ్మమును నేనే అయియున్నాను.

13. యదహరేవ విరజేత్త దహరేవప్రవ్రజేత్|| (జాబాలోపనిషత్)
- ఎప్పుడు సంసారములో సంపూర్ణవైరాగ్యము జనించునో, అప్పుడే అతడు సన్యసించి సన్యాసాశ్రమమును స్వీకరించవలెను.

14. జ్ఞాత్వాదేవం ముచ్యతేసర్వపాశైః|| (శ్వేతాశ్వతరోపనిషత్)
- పరమేశ్వర దేవునితెలిసికొని సర్వపాశముల (బంధముల) నుండి ముక్తుడగుచున్నాడు.

15. శాన్తాయ దాన్తయ గురుభక్తాయ హంస హంసేతి|| (హంసోపనిషత్)
- హంస హంస అను పరబ్రహ్మ స్వరూపము జితేంద్రియుడగు గురుభక్తునకు తెలియబడుచున్నది.

16. ఔషధ వదశన మాచరే దౌషధ వదశనం ప్రాశ్నీయాత్|| (ఆరుణికోపనిషత్)
- ఔషధమును సేవించురీతిగా అన్నమును తినవలెను.  యథాప్రాప్తమగు భోజనమును స్వీకరించవలెను.

17.గర్భవాసే మహద్దుఃఖం మోహోదుఃఖంచ జన్మసు|| (గర్భోపనిషత్)
- గర్భవాసము మహాదుఃఖకరమైనది. జన్మల నెత్తుటయందలి మోహము మహాదుఃఖకరమైనది.

18. ఓం నమోనారాయణా యేతిమంత్రోపాసకః వైకుంఠ భువనం గమిష్యతి|| (నారాయణోపనిషత్)
- ఓమ నమోనారాయణాయ అను నట్టి అష్టాక్షరీ మహామంత్రమును ఉపాసించుభక్తుడు వైకుంఠభువనమునుచేరుచున్నాడు. 

19. జ్ఞాన దండో ధృతోయేనఏకదండీ స ఉచ్యతే|| (పరమహంసోపనిషత్)
- అత్మజ్ఞానమును దండమును ధైర్యముగా ధరించినవాడు ఏకదండి(అనగా మహర్షి) అని చెప్పబడును.   

20. మన ఏవ మనుష్యాణాం కారణంబన్ధ మోక్షయోః|| (అమృతబిందూపనిషత్)
- మనుష్యులయొక్క బంధమోక్షములకు మనస్సేకారణముగా నున్నది. (బంధమునకుగాని,మోక్షమునకుగాని తన మనస్సే కారణము.)

21.ఏక మాత్రస్తథా22కాశో హ్యమాత్రంతు విచింతయేత్ || (అమృతనాదోపనిషత్)
- ఏకమాత్ర ఆకాశతత్వము. అ మాత్రయగు పరమత్మను ధ్యానముచేయవలెను.  

22. హృదిస్థా దేవతా స్సర్వా హృది ప్రాణాః ప్రతిష్టితాః|| (అథర్వశిరోపనిషత్)
- దేవతలందరు హృదయమునందున్నారు; హృదయములో ప్రాణ దేవతలు ప్రతిష్టింపబడి యున్నారు.

23.స ఏష హ్యోంకారః, చతురక్షర శ్చతుష్పాద శ్చతుశ్శిర శ్చతురర్ధ మాత్రః|| (అథర్వశిఖోపనిషత్)
- ఇయ్యదియే ఓంకారము, ఇది ౪ అక్షరములు గలది, ౪ పాదములు గలది, ౪ శీర్షములు గలది, నాల్గవది, అర్ధమాత్రము గలది.

24. చిత్తమేవహి సంసారః తత్ప్రయత్నేన శోధయేత్|| (మైత్రాయణ్యుపనిషత్)
- చిత్తమే సంసారము. ఆ చిత్తము ప్రయత్నించి శోధించ వలెను.

25. విద్వాన్ శ్రైష్ఠ్యంస్వారాజ్య మాధిపత్యం పశ్యేతి|| (కౌషీతకీ బ్రాహ్మణోపనిషత్)
- విద్వాంసుడు శ్రేష్ఠమగు ఆత్మ సామ్రాజ్యాధిపత్యమును అనుభవించు చున్నాడు.

26. అగ్ని షోమాత్మకం విశ్వమిత్యగ్ని రాచక్షతే|| (బృహజ్జాబాలోపనిషత్)
- విశ్వమంతయు అగ్ని షోమాత్మకము. అగ్ని సోముల స్వరూపము.

27. (1) ఏషయోనిస్సర్వస్య ప్రభవా ప్యయౌహి భూతానామ్|| (నృసింహ పూర్వతాపిన్యుపనిషత్)
- పరబ్రహ్మము సకల విశ్వమునకు జన్మస్థానమై యున్నాడు. సకల జీవులయొక్క జనన మరణములకు ఆధారభూతుడై యున్నాడు.

27. (2) యచ్చాన్యత్త్రికాలాతీతం తద ప్యోంకార ఏవ, సర్వం హ్యేతద్బ్రహ్మా|| (నృసింహోత్తరతాపిన్యుపనిషత్)
- త్రికాలా తీతమైనదేదైనఊన్నచో అదియును ఓంకారమే. ప్రపంచ మంతయు బ్రహ్మమే.||13-06-2013||

28. జ్ఞానశక్తి స్సామవేదః తృతీయ సవనం మహాదేవో దేవతేతి|| (కాలాగ్ని రుద్రోపనిషత్)
- జ్ఞానశక్తి, సమవేదము, తృతీయ సవనము, మహాదేవుడు దేవత (అని తెలియవలెను)

29. అభేద దర్శనం జ్ఞానమ్|| (మైత్రేయోపనిషత్)
- అభేద దర్శనమే అత్మ జ్ఞానము.

30. హృద్యాకాశే పరే కోశే దివో౨య మాత్మా స్వపితి|| (సుబాలోపనిషత్)
- హృదయాకాశమున స్వర్గముకన్న పరమైన కోశమున ఆత్మ నిద్రించును.

31. అమృతత్వం సమాప్నోతి యదా కమా న్స ముచ్యతే|| (క్షురికోపనిషత్)
- కామ సంకల్పములనుండి విముక్తుడైనవాడు అమృతత్వమును పొందుచున్నాడు.

32. యస్మిం త్సర్వ మిదం ప్రోతం బ్రహ్మ స్థావర జంగమమ్|| (మంత్రికోపనిషత్)
- స్థావర జంగమాత్మకమైన యీ సర్వ ప్రపంచము ఎవని యందు కూర్చబడి యున్నదో, అతడే పరబ్రహ్మము.

33. బ్రహ్మైవాహం సర్వ వేదాంత వేద్యమ్|| (సర్వసారోపనిషత్)
- సర్వ వేదాంత వేద్యమైన పరబ్రహ్మమును నేనే అయి యున్నాను.

34. అనాద్యంతం శుద్ధం శివం శాన్తం నిర్గుణ మిత్యాది వాచ్య మనిర్వాచ్యం చైతన్యం బ్రహ్మ|| (నిరాలంబోపనిషత్)
- ఆద్యంతములు లేనిదియు, శుద్ధమైనదియు, మంగళకరమైనదియు, శాన్తమైనదియు, నిర్గుణమైనదియు, అనిర్వచనీయమైనదియు నగు చైతన్యమే పరబ్రహ్మము.

35. ఏకమేవా౨ద్వితీయం సన్నామరూప వివర్జితమ్|| (శుకరహస్యోపనిషత్)
- ఏకమైనది అద్వితీయమైనది నామరూప వివర్జితమైనది ఆ పరబ్రహ్మము.

36. సచ్చిదానంద మాత్మాన మద్వితీయం బ్రహ్మ భావయేత్|| (వజ్రసూచికోపనిషత్)
- పరమాత్మను సచ్చిదానంద స్వరూపునిగను, అద్వితీయునిగను, పరబ్రహ్మగను భావించవలెను.

37.బ్రహ్మై వాస్మీతిసద్వృత్త్యా నిరాలంబతయా స్థితిః || (తేజోబిందూపనిషత్)
- నేనే బ్రహ్మను అను సద్వృత్తితో నిరాలంబముగా మనస్సు నుంచటయే (ధ్యానము) జ్ఞాన సమాధి. 
 
38. మన స్తత్ర లయం యాతితద్విష్ణోః పరమం పదమ్|| (నాదబిందూపనిషత్)
- మనస్సు ఎక్కడ లయమును చెందుచున్నదో అయ్యదియే శ్రీమహావిష్ణువుయొక్క పరమపద(స్థాన)  మై .యున్నది

39. ఓ మిత్యేకాక్షరం బ్రహ్మధ్యేయం సర్వ ముముక్షుభిః|| (ధ్యానబిందూపనిషత్)      
- ఓం అను ఏకాక్షరరూప బ్రహ్మము ముముక్షువులందరికి లక్ష్యమై యున్నది.

40. అశబ్దో౨హ మరూపో౨హమస్పర్శో౨హ స్మ్యహమద్వయః|| (బ్రహ్మవిద్యోపనిషత్)
- నేను అశబ్దుడను, అరూపుడను, అస్పర్శుడను, అద్వయుడను .

41. సర్వ విఘ్నహరో మంత్రః ప్రణవః సర్వదోషహా|| (యోగతత్త్వోపనిషత్)
- ప్రణవ మంత్రము సర్వ విఘ్నములను హరించుచున్నది. సర్వదోషములను పోగొట్టుచున్నది.

42. ప్రత్యగానందంబ్రహ్మపురుషం ప్రణవస్వరూపమ్||   (ఆత్మ భోధోపనిషత్)
- ప్రత్యగానంద స్వరూపుడు ఓంకార స్వరూపుడునగు పరమ పురుషుడే పర బ్రహ్మము.  

43. ఆత్మన్యేవ స్థితో యస్తుసయాతి పరమాం గతిమ్|| (నారద పరివ్రాజకోపనిషత్)
- పరబ్రహ్మమునందే రమించు (స్థితుడై యుండు) జ్ఞానిపరమగతిని పొందుచున్నాడు. 

44. సో౨హం చిన్మాత్ర మేవేతి చిన్తనం ధ్యాన ముచ్యతే|| (త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్)
- ఆ పరబ్రహ్మమే నేను, నేను చిన్మాత్రుడను, అని చిన్తన చేయుచుండుట ధ్యానమని చెప్పబడుచున్నది.

45. మూల ప్రకృతి రూపత్వా త్సాసీతా ప్రకృతిః స్మృతా|| (సీతోపనిషత్)
- ఆ సీతాదేవి మూల ప్రకృతియొక్క రూపమే అయియున్నందు వలన ప్రకృతి అనిచెప్పబడుచున్నది.||29-06-2013||

46. యావత్ దృష్టిఃభ్రువోర్మధ్యే తావత్కాలం భయం కుతః? || (యోగచూడామణ్యుపనిషత్)
– భ్రూమధ్యప్రదేశములో దృష్టినినిలిపినంత కాలము నీకు భయమెక్కడ నున్నది? (భయములేదు)

47. అద్వైత సదానందో దేవతా, నియమః స్వాంతరింద్రియనిగ్రహః|| (నిర్వాణోపనిషత్)
 - అద్వైతానందమే దేవత. తనయొక్క అంతరింద్రియ నిగ్రహమే నియమము.

48. శీర్షోపరి ద్వాదశాంగులమానజ్యోతిః పశ్యతి, తదా అమృతత్వమేతి|| (మండల బ్రాహ్మణోపనిషత్)
- శిరస్సుపైన 12 అంగుళములకు మీదజ్యోతిస్సమూహము కనిపించినచో అమృతత్వము ప్రాప్తించుచున్నది.

49. ప్రభోధ పూర్ణ పాత్రేతు జ్ఞప్తిదీపం విలోక యేత్|| (దక్షిణామూర్త్యుపనిషత్)
- ప్రబోధము అను పుర్ణపాత్రయందు జ్ఞానమను దీపమును దర్శించవలెను.

50. ఏకో విష్ణుర్మహ ద్భూతంపృథ గ్భూతా న్యనేకశః|| (శరభోపనిషత్)
- శ్రీ మహావిష్ణువొక్కడే మహాభూతము. అనేకములుగా నున్న తక్కిన భూతములు చిన్నవి.

51. దేహో దేవాలయః ప్రోక్తో, జీవో దేవ స్సదా శివః|| (స్కందోపనిషత్)
- దేహము దేవాలయమని చెప్పబడుచున్నది. జీవుడు సదా మంగళస్వరూపియై దేవుడై యున్నాడు.

52. భక్త్యా వినాబ్రహ్మజ్ఞానం కదాపి నజాయతే||(మహానారాయణోపనిషత్) (త్రిపాద్విభూతి)
- భక్తిలేనిచోబ్రహ్మజ్ఞానము ఎన్నడులభించదు.

53. తస్మాదంతర్ దృష్ట్యా తారకఏవ2ను సంధేయః|| (అద్వయతారకోపనిషత్)
- అందువలన అంతర దృష్టితోతారక యోగాభ్యాసమును చేయవలెను.

54. రామ మంత్రార్ధ విజ్ఞానీ జీవన్ముక్తో, నసంశయః|| (రామరహస్యోపనిషత్)
- రామ మంత్రార్ధమును బాగుగా అర్ధము చేసికొనిన విజ్ఞాని జీవన్ముక్తుడగును. ఇందులో సంశయములేదు. ||30-06-2013||

55(అ). స్వర్భూః జ్యోతిర్మయో2 నంత రూపీ స్వేనైవభాసతే|| (రామపూర్వతాపిన్యుపనిషత్)
- స్వయం ప్రకాశు డగుటవలన ఆతడు (రాముడు) జోతిర్మయుడు. ఆ రాముని ఎవ్వరూ సృష్టిచేయలేదు. అందువలన “స్వర్భూ” అయినాడు.

55(ఆ). ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోం2తర్యా మ్యేషయోని సర్వస్య ప్రభవాప్యయౌహి భూతానామ్|| (రామోత్తరతాపిన్యుపనిషత్)
- ఈ రాముడే సర్వేశ్వరుడు, ఈతడే సర్వజ్ఞుడు, ఈతడే అంతర్యామి, ఈతడేసర్వమునకు కారణభూతుడు, ఈతడేసర్వజీవుల యొక్క ఉత్పత్తి వినాశములకు కారణభూతుడు. 

56. ఏకో విష్ణురనేకేషు జంగమ స్థావరేషు చ|| (వాసుదేవోపనిషత్)  
- ఒకే విష్ణువు అంతర్యామియైసమస్త జంగమ స్థావరముల యందువ్యాపించియున్నాడు.

57. తద్బ్రహ్మ తాపత్రయాతీతమ్|| (ముద్గలోపనిషత్) 
- ఆ పర బ్రహ్మము తాపత్రయములకతీతముగా నున్నది.  
        
58. వేదాంత శ్రవణం కుర్వన్యోగం సమార భేత్|| (శ్యాండిల్యోపనిషత్)
- వేదాంత శ్రవణము చేయుచు యోగాభ్యాసమును ప్రారంభించవలెను.  

59. సత్యజ్ఞానానందం పరిపూర్ణంసనాతనమేక మేవా2ద్వితీయం బ్రహ్మ|| (పైంగలోపనిషత్)
- ఆ పరబ్రహ్మము సత్యజ్ఞానానందమయమైనది; పరిపూర్ణ మైనది; సనాతనమైనది; ఏకముగా అద్వితీయముగానున్నది. 
  
60.అథ భిక్షూణాంమోక్షార్ధినాం కుటీచక బహూదక హంస పరమహంసా శ్చేతి చత్వారః|| (బిక్షుకోపనిషత్)
- మోక్షార్హులైనబిక్షువులలో (4 భేదములు) నాల్గుపేర్లలోనున్నారు;
1.కుటీచకులు 2.బహూదకులు 3.హంసలు 4.పరమ హంసలు.

61. అహం సచ్చిత్పరానందబ్రహ్మైవా2స్మి న చేతరః|| (మహోపనిషత్)
- నేను సత్ చిత్ పరానంద పరబ్రహ్మ స్వరూపుడనై యున్నాను. తదితరుడను కాను.

62. జాగ్రత్ స్వప్నస్సుషుప్తిస్తురీయమితిచ చతుర్విధావస్థాః|| (శారీరకోపనిషత్)
- జాగ్రత్తు, స్వప్నము, సుషిప్తి, తురీయము అని అవస్థలు నాలుగు విధములుగా నున్నవి.

63. ఓమ్ సర్వే జీవాఃసుఖైర్దుఖైః మాయా జాలేన వేష్టితాః|| (యోగశిఖోపనిషత్)
- జీవులందరును మాయాజాలముచే సుఖములచేతను దుఃఖములచేతను చుట్టుకొనబడినవారైయున్నారు. ||02-07-2013||
        
64. స్వవపుః కుణపా౨కారమివపశ్య న్న ప్రయత్నేనా౨నియమేన లాభా౨లాభౌ సమౌ కృత్వా|| (తురీయాతీతోపనిషత్)
- తన శరీరమును శవమువలెచూచుచు,అప్రయత్నముగా నియమము లేకుండ లాభనష్టములను సమములుగా చేసి చూడవలెను.

65. ఔషధ వదశన మాచరే దౌషధవదశనం ప్రాశ్నీయాత్|| (సన్యాసోపనిషత్)
- ఔషధమువలె భోజనము చేయవలెను. అన్నమునుఔషధము వలె తినవలెను. (తక్కువగాను రుచిచూడక తినవలెను.)

66. యదహరేవ విరజ్యేత్తదహరేవప్రవజేత్||(పరమహంస పరివ్రాజకోపనిషత్)
- ఏరోజున విరక్తుడగునో, ఆ రోజుననే సన్యసించవలెను.

67. యే బ్రహ్మ విష్ణు రుద్రా స్తేభ్య స్సగుణేభ్య ఓం నమః|| (అక్షరమాలికోపనిషత్)
- ఏ బ్రహ్మ విష్ణు రుద్రు లున్నారో సగుణులైన ఆ దేవతా మూర్తులకు నమస్కారము.

68. మహావిష్ణు మిత్యాహ| మహతాం వా అయం మహా న్రోదసీ వ్యాప్య స్థితః|| (అవ్యక్తోపనిషత్)
- ఆ విష్ణువు మహావిష్ణువు. మహత్తులకన్న గొప్పవాడు. భూమ్యాకాశములను వ్యాపించి ఉన్నాడు కనుకనే. కావున మహావిష్ణుం అనెను.

69. స సర్వ వేత్తాభువనస్యగోప్తా నాభిః ప్రజానాం నిహితా జనానామ్|| (ఏకాక్షరోపనిషత్)
- ఆతడు సర్వవేత్త, భువనములకురక్షకుడు,జనులకు ప్రజలకు నాభిభూతుడు.

70. ఆత్మవ్యతీతే సర్వస్మాత్సర్వరూపే2థవాతతే| కోబంధః? కశ్చవామోక్షః?|| (అన్నపూర్ణోపనిషత్)
– ఆత్మ అన్నింటికి అతీతమైనది, సర్వరూపమైనది. ఇంక బంధమేమిటి? మోక్షమేమిటి?

71.నమస్తే ఆదిత్య త్వమేవప్రత్యక్షం కర్మ కర్తాసి, త్వమేవప్రత్యక్షం బ్రహ్మాసి|| (సూర్యోపనిషత్)
- ఓ ఆదిత్యదేవా! నీవే ప్రత్యక్షమైన కర్మ కర్త వైతివి.   నీవే కంటి కెదురుగా  కనబడు ప్రత్య క్ష పర బ్రహ్మవు.

72. పాపా ద్బిభేతి సతతంనచభోగమపేక్షతే|| (అక్ష్యుపనిషత్)
- జిజ్ఞాసువు సర్వదాపాపభీతి కలిగియుండును. మరియు నట్టివాడు భోగములనుఅపేక్షించక యుండును. ||03-07-2013||

73.స్వయం విశ్వమిదం సర్వం స్వస్మా దన్యన్న కించన|| (అధ్యాత్మోపనిషత్)
- విశ్వరూపములోనున్న ఉపాధి అంతయు సర్వమును ఆత్మయే. ఆత్మకంటే వేరుగానున్న వస్తువు లేనేలేదు. 

74. నమే దేహేన సంబంధో మేఘేనేవ విహాయ విహాయనః|| (కుండికోపనిషత్)
- నాకు దేహముతో సంబంధము, మేఘముతో ఆకాశమునకు సంబంధము లేనట్లే, లేనేలేదు.

75. మన ఏవ సవితా వాక్సావిత్రీ స యత్ర మనస్త ద్వాక్|| (సావిత్య్రుపనిషత్)
- మనస్సే సవిత, వాక్కు సావిత్రి. ఎక్కడ మనస్సో అదియే వాక్కు.

76. జీవన్నేవ సదాముక్తఃకృతార్ధో బ్రహ్మ విత్తమః|| (ఆత్మోపనిషత్)
- బ్రహ్మవిత్తముడు జీవించియున్నప్పుడే సర్వదా ముక్తుడు, కృతార్ధుడును అగుచున్నాడు.

77. స్వాత్మన్యేవ స్వయం సర్వంసదా పశ్యతి నిర్భయః|| (పాశుపత బ్రహ్మోపనిషత్)
- తన ఆత్మయందే సర్వమును నిర్భయుడై స్వయముగా దర్శించుచున్నాడు.

78. యేన సర్వమిదంప్రోతం సూత్రే మణి గణా ఇవ తత్సూత్రం ధారయేద్యోగీయోగవిత్ బ్రాహ్మణోయతిః||(పరబ్రహ్మోపనిషత్)
- దారమున మణిగణములవలె, ఎవనియందీ సర్వము గ్రుచ్చబడియున్నదో(ఓతప్రోతమై) ఆ సూత్రమును,యోగవేత్త,యోగి, బ్రాహ్మణుడును నగు యతి ధరించవలెను.

79. నకర్మణా నప్రజయా ధనేనత్యాగే నైకే అమృతత్వమానశుః|| (అవధూతోపనిషత్)
- అమృతత్వమును కర్మచే పొందరు; సంతానముచేపొందరు;ధనముచే పొందరు. త్యాగముతో మాత్రమే అమృతత్వమును పొందుచున్నారు.

80. ఓం నమశ్శివాయేతి యాజుషమంత్రోపాసకో రుద్రత్వం ప్రాప్నోతి, కల్యాణం ప్రాప్నోతి|| (త్రిపురతాపిన్యుపనిషత్)
- ఓం నమశ్శివాయ అనుయాజుషమంత్రము నుపాసించువాడు రుద్రత్వమును పొందును. కల్యాణమును పొందును.

81. నమో దేవ్యై మహాదేవ్యైశివాయై సతతం నమః|| (శ్రీ దేవ్యుపనిషత్)
- దేవికి నమస్కారము. మహాదేవికి నమస్కారము. శివకు నెల్లప్పుడును నమస్కారము.

82. శర్వ సర్వస్య జగతో విధాతాధర్తా హర్తా విశ్వరూపత్వమేతి|| (త్రిపురోపనిషత్)
- శర్వుడు సర్వ జగత్తునకు స్రష్ట, ధరించువాడు, హరించువాడును, విశ్వరూపత్వమును పొందుచున్నాడు. ||04-07-2013||

83. స ఏవ జగతస్సాక్షీసర్వాత్మా విమలాకృతిః|| (కఠరుద్రోపనిషత్)
- అతడే జగత్తునకు సాక్షి, సర్వాత్మ విమలాకారము కలవాడు.

84. స్వ వ్యతిరిక్త వస్తుసంగరహిత స్మరణం విభూషణమ్|| (భావనోపనిషత్)
- తనకంటే వేరుగానున్న వస్తువులతో సంగబుద్ధి పెట్టు కొనకుండ ఉండటయే విభూషణము.

85. సర్వ దేవాత్మాకోరుద్రఃసర్వదేవాః శివాత్మకాః|| (రుద్రహృదయోపనిషత్)
- సర్వ దేవాత్మకుడు రుద్రుడు. దేవతలందరును శివాత్మకులు.

86. సో2హమస్మీతి నిశ్చిత్య యస్యదావర్తతే పుమాన్|| (యోగకుండల్యుపనిషత్)
- ఆ పరమాత్మయే నేను అని సర్వదా నిశ్చయభావమును కలిగియుండుము.

87. సర్వగ్ం హవా ఏతదిదంభస్మపూతం పావనం నమామి|| (భస్మజాబాలోపనిషత్)
- ఈ సర్వమును భస్మమే, పవిత్రమైన దానినిగ పావనముగ ఈ భస్మమును నమస్కరించుచున్నాను.

 88. స్వయమేవకృతద్వారం రుద్రాక్షం స్యాది హోత్తమమ్|| (రుద్రాక్షజాబాలోపనిషత్)
- స్వయముగా రంధ్రమున్న రుద్రాక్ష ప్రశస్తమైనది (స్వయముగా రంధ్రమున్న రుద్రాక్ష ధరించుట శ్రేష్టము).

89. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి|| (గణపత్యుపనిషత్)
-ఓం లం గణపతి కొరకు నమస్కారము. నీవు ప్రత్యక్షమైన తత్త్వమయియున్నాను.

90. అజ్ఞాన మలపంకం యః క్షాళయేత్ జ్ఞానతో యతః, స ఏవ సర్వదా శుద్ధః|| (దర్శనోపనిషత్)
-ఎవడు జ్ఞానము వలన అజ్ఞాన మలపంకమును క్షాళనచేయునో అతడే సర్వదాపరిశుద్ధుడు. ||05-07-2013||

91. ఓం నమో నారాయణాయేతి తారకమ్|| (తారసారోపనిషత్)
- ఓం నమో నారాయణాయ అను నీ మంత్రమే తారక మంత్రము.

92. సో2హమర్కః పరంజ్యోతి రర్కజ్యోతి రహగం శివః|| (మహావాక్యోపనిషత్)-పరంజ్యోతిస్సు అను ఆ జ్యోతిస్సే ఆదిత్య రూపములోనున్న నేను అగుచున్నాను.

93. సో2హమస్మీతి జానీయాద్విద్వాన్ బ్రహ్మ2మృతో భవేత్|| (పంచబ్రహ్మోపనిషత్)
- సోహమస్మి అని తెలిసిన విద్వాంసుడు అమృతుడైన బ్రహ్మయే అగుచున్నాడు.
94. అభయం సర్వభూతేభ్యో నమేభీతిః కదాచన|| (ప్రాణాగ్ని హోత్రోపనిషత్)-నేను సమస్త ప్రాణులకును అభయమునిచ్చుచున్నాను. నాకు ఎల్లప్పుడును భయములేదు. నావలన ఏప్రాణికిని భయము కలుగక యుండును గాక!

95(అ). ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయాక్లిష్ట కారిణే నమో వేదాంత వేద్యాయ|| (గోపాల పూర్వతాపిన్యుపనిషత్)-ఓం సచ్చిదానందరూపుడు, అక్లిష్టకారి, వేదాంత వేద్యుడునగు శ్రీకృష్ణపరమాత్మకు నమస్కారము.

95(ఆ). ఏకోదేవః సర్వభూతేషుగూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా|| (గోపాలోత్తరతాపిన్యుపనిషత్)
- ఒక్కడే దేవుడు అన్ని భూతములయందు గూఢముగానున్నాడు. సర్వవ్యాపిగను సర్వ భూతాంతరాత్మగను నున్నాడు.

96. స ఏవ జగదన్త ర్యామీ, సఏవ సర్మాత్మకః|| (కృష్ణోపనిషత్)
- ఆ శ్రీకృష్ణ పరమాత్మయే జగత్తులో అంతర్యామిగా భాసించు చున్నాడు. ఆ శ్రీకృష్ణుడే సర్వాత్మకుడు.

97. తత్ర పరమహంసానామ సంవర్తకారుణి, శ్వేతకేతు, దూర్వాస, ఋభు, నిదాఘ, దత్తాత్రేయ, శుక, వామదేవ, హారీతక ప్రభృతయః|| (యాజ్ఞవల్క్యోపనిషత్)
- పరమహంసలనగా సంవర్తక, ఆరుణి, శ్వేతకేతు, దూర్వాస, ఋభు, నిదాఘ, దత్తాత్రేయ, శుక, వామదేవ, హారీతక మొదలగు మునులు.

98. చిత్తమూలంహి సంసారః తత్ ప్రయత్నేన శోధయఏత్|| (వరాహోపనిషత్)
- సంసారము చిత్తమూలముగా నున్నది. కావున స్వ ప్రయత్నముతో ఆ సంసారమును శోధించవలెను.

99. జ్ఞానయజ్ఞ స్స విజ్ఞేయ స్సర్వ యజ్ఞోత్తమోత్తమః|| (శాట్యాయనీయోపనిషత్)|
- ఆత్మజ్ఞాన యజ్ఞము సర్వయజ్ఞములకంటె ఉత్తమోత్తమమైనది. ||06-07-2013||

100. సర్వేషాం బీజానాం హయగ్రీవైకాక్షరబీజమనుత్తమం మంత్రరాజాత్మకం భవతి|| (హయగ్రీవోపనిషత్)
- అన్ని బీజాక్షరములలోను హయగ్రీవైకాక్షర(బీజాక్షర)ము అనుత్తమమైనది.(సర్వోత్తమమైనది). ఈ హయగ్రీవ బీజాక్షరము మంత్ర రాజాత్మకము. 

101. వట బీజస్థమివ దత్తబీజస్థంసర్వం జగత్|| (దత్తాత్రేయోపనిషత్)
- మఱ్ఱి విత్తనములోమఱ్ఱి చెట్టున్నట్లే దత్తబీజమున ఈ జగత్తంతయు నున్నది.

102. విషం బ్రహ్మాతిరిక్తంస్యాదమృతం బ్రహ్మ మాత్రకం|| (గారుడోపనిషత్)
- బ్రహ్మము కంటే వేరుగా నున్నది విషము. బ్రహ్మము అమృత స్వరూపము.

103. హరేరామ హరేరామ రామరామహరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే|| (కలిసంతారణొపనిషత్)
- ఇదే పదునారు పదములతోకూడియున్నది. దీనినే షోడశనామ మహామంత్రమనియు అందురు.

104. అహంకారావిష్ట స్సంసారీజీవః సఏవ పశుః|| (జాబాల్యుపనిషత్)
- అహంకారముతో వ్యాపించియున్నపుడు (ఈశ్వరుడే) సంసార సహితుడై జీవుడగుచున్నాడు. 

105. యత్ర యత్ర మనోయాతి తత్ర తత్ర పరం పదమ్| తత్ర తత్ర పరంబ్రహ్మ సర్వత్ర సమవస్థితమ్|| (సౌభాగ్యలక్ష్ముపనిషత్)
- ఎక్కడెక్కడికి మనస్సు వెళ్ళునో, అక్కడక్కడ పరమ పదమున పరబ్రహ్మ సర్వత్ర ఉన్నాడు.

106. యా వేదాంతార్ధ తత్వైకస్వరూపా పరమార్ధతః| నామరూపాత్మనావ్యక్త సా మాంపాతుసరస్వతీ||(సరస్వతీ రహస్యోపనిషత్)
- ఏదేవి పరమార్ధమున వేదాంతార్ధతత్వైకస్వరూపయో! నామ రూపములుగా వ్యక్తమైనదో, ఆ సరస్వతీదేవి నన్ను రక్షించుగాక! 

107. సత్యమేకం లలితా22ఖ్యం వస్తుతద ద్వితీయం| అఖండార్ధం పరం బ్రహ్మ|| (బహ్వృచోపనిషత్)
- లలితాఖ్యమైన వస్తువొక్కటేసత్యము,అద్వితీయమును మరియు అఖండార్ధము పరబ్రహ్మ.

108. జ్ఞానం లబ్ధ్వా2చిరాదేవ మామకం ధామ యాస్యసి|| (ముక్తికోపనిషత్)
- ఆత్మజ్ఞానమును పొంది అచిరకాలములో నాయొక్క ధామమును చేరవచ్చును. (అని శ్రీరామచంద్రుడు శ్రీ ఆంజనేయస్వామితో చెప్పెను.) ||08-07-2013||

ఓం తత్ సత్
లోకా స్సమస్తా స్సుఖినోభవన్తుః -సర్వే జనా స్సుఖినోభవన్తుః

*********** _/\_

No comments:

Post a Comment