Translate

27 October, 2014

తెలుగు సుద్దులు-సుమతీశతకము పద్యములు

శ్రీరస్తు
సుమతీశతకము
(పూర్వకవి భద్రభూపతి బద్దెన ప్రణీతము)
Posted during 8th January 2013 22nd April 2013

01) శ్రీరాముని దయచేతను
    నారూఢిగ సకల జనులు నౌరాయనఁగా
    ధారాళమైన నీతులు
    నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ! 
భావం: ఓ బుద్ధిమంతా! శ్రీరాములవారి కృపచేత (అనుగ్రహముచే)ఎటువంటి అవరోధములేకుండా, ముత్యాలాంటి (చవులు=ముత్తెపు కాంతి) సూక్తులు (మంచిమాటలు)తప్పకుండా అందరూ భళా అని మెచ్చుకొనే విధంగా ఆశువుగా చెప్పుతాను (ఆలకించండి). కవి (భద్ర భూపతి బద్దెన గారు) సుమతీ అనే మకుటంవాడటం లోనే ఎంతో విజ్ఞత కనిపిస్తున్నది. ఇతరులను ఏమి తెలియనివారిగా చిన్నచూపుచూడకుండా ఎదుటి వారికి కూడా తెలుసును అనే భావంతో మనమేదైనా చెప్పడానికి ప్రయత్నిచాలన్న(మకుటం) సూక్తితోప్రారంభించారు.  అంతే కాకుండా, మనం చెప్పేదేదైనాఇతరులలో ఉత్సుకత కలిగించాలి (నోరూరించాలన్నట్టు) మరియు నలుగురికి ఉపయుక్తమై భళా అనేటట్లుండాలి.(That`s what we, now days, talking and counseling so called Communication Skills)

02)అక్కఱకు రాని చుట్టము
   మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దాఁ
   నెక్కిన బాఱని గుర్రము
   గ్రక్కున విడువంగ వరయుఁ గదరా సుమతీ!

03)అడిగిన జీతం బియ్యని
    మిడిమేలపు దొరను గొల్చి మిడుగులు కంటెన్
   వడిగల యెద్దులఁ గట్టుక
   మడిదున్నక బ్రతుకవచ్చు మహిలో సుమతీ!
( ప్ర స్తు త ప రిస్థి తు ల లొ వేరే ఉ ద్యొ గ ముచూ సు కో వ ట మె)

04)అడియాస కొలువు గొలువకు,
   గుడిమణియము సేయబోకు కుజనుల తోడన్
   విడువక కూరిమి సేయకుఁ
   మడవినిఁ దోడరయ కొంటిఁ నరుగకు సుమతీ!

05)అధరము కదిలియు కదలక
   మధురములగు భాషలుడిగి మౌన వ్రతుఁడౌ
   అధికారరోగపూరిత
   బధిరాంధక శవముఁ జూడ బాపము సుమతీ!

06)అప్పు కొనిసేయు విభవము
   ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
   దప్పరయని నృపు రాజ్యము,
   దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర  సుమతీ!

07)అప్పిచ్చువాఁడు   వైద్యుడు
   నెప్పుడు నెడతెగక పాఱు నేఱును ద్విజుడున్
   జొప్పడిన యూర నుండుఁము
   చొప్పడకున్నట్టి యూరనుఁ జొఱకుము సుమతీ!

08)అల్లుని మంచితనంబును
    గొల్లనిసాహిత్య విద్య కోమలి నిజమున్
    బొల్లునదంచిన బియ్యముఁ
    దెల్లనికాకులును లేవు తెలియర సుమతీ!

09)ఆఁ కొ న్న కూ డె య మృ తము
   తా గొఁ క క నిచ్చు వాఁ డె దా త ధ రిత్రి న్
   సోఁ కో ర్చు వాఁ డే మ ను జుడు
   తే కు వ గ లవాఁడెవంశ తి ల కు డుసు మ తీ!

10) ఆకలి యుడగని కడుపును
     వేఁకటియగులంజపడుపును విడువని బ్రతుకున్
     బ్రాకొన్ననూతి యుదకము
    మేఁకలపాడియును రోఁత మేడిని సుమతీ!

11) ఇచ్చునదె విద్య రణమునఁ
    జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్
    మెచ్చునదే నేర్పు వాదుకు
    వచ్చునదే గీడు సుమ్మి వసుధను సుమతీ!

12) ఇమ్ముగ జదువని నోరును,
    “అమ్మా!” అని పిలిచి యన్న మడుగని నోరున్
    దమ్ములఁ బిలువని నోరును,
    గుమ్మరి మను ద్రవ్వి నట్టి గుంటర సుమతీ!

13) ఉడు ముండదె నూఱేండ్లును
    బడియుండదె పేర్మిఁ బాము పదినూఱేండ్లున్
    మడువునఁ గొక్కెర యుండదె
    కడు నిల పురషార్థ పరుఁడు కావలె సుమతీ!

14) ఉ త్త మ గు ణము లు నీ చు న
     కె త్తె ఱ గు నగ లు గ నే ర్చు, నె య్యె డ లం దా
     నె త్తి చ్చి క రిన్ గి పోసి న
      నిత్త డి బం గా ర మ గునె యి ల లో సుమ తీ!

15) ఉదకము ద్రావెడు హయమును
    మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్,
    మొదవు కడనుండు వృషభముఁ
    జదువనియా నీచుఁకడఁకు జనకుర సుమతీ!

16) ఉపకారికి నుపకారము
      విపరీతముగాదుసేయ వివరింపంగాఁ
      నపకారికినుపకారము
      నెపమెన్నకసేయువాఁడు నేర్పరి సుమతీ!

17) ఉపమింప మొదలు తియ్యన
    కపటంబెడ నెడను జెఱకు కైవడి నే పో
    నెపములు వెదకును గడపటఁ
    గపటవు దుర్జాతి పొందు గదారా సుమతీ!

18) ఎప్పటి కెయ్యది ప్రస్తుత
     మప్పటి కామాట లాడి యన్యుల మనముల్
     నొప్పింపక తానొవ్వక
     తప్పించుక తిరుగు వాఁడు ధన్యుడు సుమతీ!
(సందర్భానిబట్టి ఆచితూ చి (సమయస్ఫూర్తితో)మాట్లాడితే ఎదుటి వారి మనస్సు నొచ్చుకోదు, తద్వార మనకు ఇబ్బంది కలుగదు.} This is what we, now days, calling communication skillwhich is vital in all walks of life.)

19) ఎప్పుడు దప్పులు వెదకెడు
      నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్
      సప్పంపు పడగ నీడను
     గప్పవసించి నవిధంబు గదరా సుమతీ!

20)ఎప్పుడు సంపద గలిగిన
    నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
    దెప్పులుగఁ జెఱువు నిండినఁ
    గప్పలు పదివేలు చేరుఁగదరా సుమతీ!

21) ఏరకుమీ కసు కాయలు
     దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
     పారకుమీ రణ మందున
     మీరకుమీ గురువు లాజ్ఞ  మేదినిసుమతీ!

22) ఒక యూరికి నొక కరణము
    నొక తీర్పరి యైనఁ గాక మరి దఱుచై న న్
    గకవికలు గాక యుండెనె?
    సకలంబును గొట్టుపడక సహజము సుమతీ!

23) ఒల్లని సతి నొల్లని పతి
     నొల్లనిచెలికాని విడువ నొల్లనివాఁడే
     గొల్లండుగాక ధరలో
     గొల్లండునుగొల్లడౌనె గుణమున సుమతీ!

24) ఓడలు బండ్లను వచ్చును
    ఓడలు నాబండ్ల మీఁద నొప్పుగ వచ్చున్
    ఓడలు బండ్లను వలెనే
    వాడంబడుఁ గలిమి లేమి వసుధను సుమతీ!

25) కడు బలవంతుండై నను
     బుడమినిబ్రాయంపుటాలి బుట్టింనయింటన్
     దడవుండనిచ్చెనేనియుఁ
     బడువుగనంగడికిఁ దానె బంపుట సుమతీ!

26) కనకపు సింహాసనమున
    శునకముఁ గూర్చుండబెట్టి శుభలగ్నమునన్
     దొనరగ బట్టముఁ గట్టిన
    వెనుకటి గుణమేలమాను వినురా సుమతీ!

27) కప్పకు నొరగాలైనను,
    సప్పము కు రోగమైన  సతితులువైనన్
    ముప్పన దరిద్రుడై నను
   తప్పదు మఱి దుఃఖమగుట తధ్యము సుమతీ!

28) కమలములు నీటిఁ బాసిన
     కమలా ప్తుని రశ్మి సోఁకి కమలిన భంగిన్
    దమ తమ నెలవులు దప్పినఁ
    దమ మిత్రులు శత్రులౌట తధ్యము సుమతీ!

29) కరణముఁ గరణము నమ్మిన
     మరణాంతక మౌనుగాని మన లేఁడు సుమీ
     కరణము తన సరి కరణము
     మరి నమ్మక మర్మమీక మన వలె సుమతీ!

30) కరణముల ననుసరింపక
     విరసంబున దిన్న తిండి వికటించుఁ జుమీ
     ఇరుసునఁ గందెన బెట్టక
     పరమేశ్వరుఁ బండియైన బాఱదు సుమతీ!

31) కరణము సాదై యున్నను
     గరి మదముడిగినను బాము కఱవక యున్నన్
     ధరఁ దేలు మీట కున్నను
     గర మరుదగ లెక్కగొనరు గదరా సుమతీ!

32) కసుగాయఁ గఱచి చూచిన
      మసలకతగ యొగరుగాక మధురం బగునా
      పసగలుగు యువతు లుండగఁ
      పసిబాలలఁబొందువాడు పశువుర సుమతీ!

33) కవిగాని వాని వ్రాఁతయు
     నవరస భావములు లేని నాతుల వలపున్
     దవిలి చని పంది నేయని
     వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతీ!

34) కాదు సుమీ దుస్సంగతి
     పోదుసుమీ కీర్తి కాంత పొందిన పిదపన్
     వాదుసుమీ యప్పిచ్చుట
     లేదుసుమీ సతుల వలపు లేశము సుమతీ!

35) కాముకుఁడు తనిసి విడిచిన
    కోమలి బరవిటుఁడు కవయఁ గోరుట యెల్లన్
    బ్రేమమునఁ జెఱకు పిప్పికిఁ
    జీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ!

36) కారణము లేని నగవును
    బేరణములు లేని లేమ పృధివి స్థలిలోఁ
     బూర ణము లేని బూరెయు
    వీరణములు లేని పెండ్లి వృధరా సుమతీ!

37) కులకాంత తోడ నెప్పుడు
     గలహింపకువట్తితప్పు ఘటియింపకుమీ
     కలకంఠికంటి కన్నీ
     రొలికినసిరి యింటనుండ నొల్లదు సుమతీ!

38) కూరిమిగల దినములలో
    నేరము లెన్నడును కలుగ నేరవు మఱియా
     కూరిమి విరసంభై నను,
    నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!

39) కొంచెవు నరు సంగతిచే
     నించితముగఁ గీడు వచ్చు నదియెట్లన్నన్
      గించత్తు నల్లి కుట్టిన
     మంచమునకుఁ బెట్లు వచ్చు మహిలో సుమతీ!

40) కొక్కగ మెల్ల చదివిన
      జక్కనివాడైనరాజ చంద్రుండైనన్
      మిక్కిలిరొక్కము లియ్యక
      చిక్కదురావారకాంత సిద్ధము సుమతీ!

41) కొఱగాని కొడుకు పుట్టినఁ
     గొఱగామియె కాదు తండ్రి గుణముల జెఱచున్
     జెఱకుతుద వెన్ను పుట్టి నఁ
     జెఱకునఁ దీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ!

42) కోమలి విశ్వాసంబునుఁ
     బాములతోఁ జెలిమి యన్య భామల వలపున్
     వేముల తియ్యఁదనంబును,
     భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ!

43) గడనగల మగని జూచిన
     నడుగులకును మడుగు లిడుదురు రతివలు తమలోఁ
     గడనుడగ మగని జూచిన
     నడపీనుఁగ వచ్చె ననుచుఁ నగుదురుఁ సుమతీ!

44) చింతింపకు గడిచిన పని
      కింతులువలతురని నమ్మ కెంతయు మదిలోఁ
     నతఃపుర కాంతులతో
     మంతనములుమాను మిదియె మతముర సుమతీ!

45) చీమలు పెట్టిన పుట్టలు
     పాముల కిరువైన యట్లు పామరుఁడు తగన్
     హేమంబుఁ గూడ బెట్టిన
     భూమీశుల పాలజేరు భువిలో సుమతీ!

46) చుట్టములుగాని వారలు
     చుట్టములమునీ కటంచు సొంపుదలిర్ప న్
     నెట్టుకొని యాశ్రయింతురు
     గట్టిగ ద్రవ్యంబు గలుగ గదరా సుమతీ!

47) చేతులఁకు దొడవు దానము
     భూతలకు దొడవు దానము
     నీతియె తొడ వెవ్వారికి
     నాతికి మానంబు తోడవు నయ ముగ సుమతీ!
48) తడ వోర్వక యొడ లోర్వక,
    కడు వేగం బడిచిపడిన గార్యం బగునే
    తడ వోర్చిన యొడ లోర్చినఁ
    జెడి పోయిన కార్యమెల్లఁ జేకురు సుమతీ!

49) తన కోపమె తన శత్రువు
    తన శాంతమె తనకు రక్ష దయ చుట్టఁబౌ
    తన సంతోషమె స్వర్గము
    తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!

50) తన యూరి తపసి తనమునుఁ
     దన పుత్రుని విద్య పెంపుఁ దన సతి రూపున్
     దన పెరటిచెట్టు మందును
      మనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ!

51) తన కలిమి ఇంద్ర భోగము
     తన లేమియే సర్వలోక దారిద్ర్యంబున్
     తన చావు జగత్ ప్రళయము
     తన వలచిన యదియె రంభ తధ్యము సుమతీ!

52) తన వారు లేని చోటను
     జన వించుక లేనిచో ట జగడము చోటన్
     అనుమానమైన చోటను
     మనజునకు నిలువఁదగదుఁ మహిలో సుమతీ!

53) తమలము వేయని నోరును
      రమణులచను మొనలమీద రాయని మేనున్
      గమలములులేని కొలఁనును
      హిమధాముఁడులేని రాత్రి హీనము సుమతీ!

54) తల నుండు విషము ఫణికిని
    వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్
    దలతోఁక యనక యుండును
    ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

55) తల పొడుగు ధనముఁ బోసిన
     వెలయాలికి నిజము లేదు వివరింపఁగా
     తలఁ దడివి బాస చేసిన
     వెలయాలిని నమ్మరాదు వినురా సుమతీ!

56) తల మాసిన వలు మాసిన
      వలువలు మాసిన ను బ్రాణ వల్లభునైనన్
      గులకాంతలైన రోతురు
     తిలకింపఁగ భూమిలోనఁ దిరముగ సుమతీ!

57) తాననుభవింప నర్ధము
     మానవపతిఁజేరుఁ గొంత మఱి భూగతమౌ
     గానల నీఁగలు గూర్చిన
     దేనియ యొరుఁ జేరునట్లు తిరముగ సుమతీ!

58) దగ్గర కొండెము చెప్పెడు
     ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మరితా
     నెగ్గు ప్రజకాచరించుట
     బొగ్గులకై కల్పతరువుఁ బొడుచుట సుమతీ!

59) ధనపతి సఖుఁడై యుండియు
     నెనయంగాశివుఁడుబిక్షమెత్తగవలసెన్
     దన వారి కెంత గలిగినఁ
     దన భాగ్యమే తనకుఁ గాక తధ్యము సుమతీ!

60) ధీరులకుఁ జేయు మేలది
     సారంబగు నారికేళ సలిలము భంగిన్
     గారవము మీరి మీఁదట
    భూరి సుఖావహము నగుచు భువిలో సుమతీ!

61) నడువకుమీ తెఱువొక్కట
      గుడువకుమీ శత్రునింట గూరిమి తోడన్
      ముడవకుమీ పరధనముల,
      నుడవకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!

62) నమ్మకు సుంకరిఁ జూదరి
      నమ్మకు మగసాలి వాని నటు వెలయాలిన్
      నమ్మకు మంగడి వానినిఁ
      నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ!

63) నయమున బాలుని ద్రావరు
      భయమునను విషమ్మనైన భక్షింతురుగా
      నయమెంత దోసకారియొ
      భయమే చూపంగవలయు బాగుగ సుమతీ!

64) నరపతులు మేరఁదప్పిన
      దిర మొప్పగ విధవ యింట దీర్పరియైనన్
      గరణము వైదికుడైనను
      మరణాంతక మౌఁను గాని మానదు సుమతీ!

65) నవరస భావాలంకృత
      కవితా గోష్టియును మధురగానంబును దా
      నవివేకి కెంతఁ జెప్పినఁ
      జెవిటికి సంకూదినట్లు సిద్ధతము సుమతీ!

66) నవ్వకుమీ సభలోపల
      నవ్వకుమీ తల్లిదండ్రి నాధుల తోడన్
      నవ్వకుమీ పరసతితో
      నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!

67) నీరే ప్రాణాధారము
      నోరే రసభరితమైన నుడువుల కెల్లన్
      నారియె నరులకు రత్నము
      చీరియె శృంగారమండ్రు స్త్రీలకు సుమతీ!

68) పగ వలదెవ్వరి తోడను
     వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్
     దెగ నాడ వలదు సభలను
     మగువకు మనసీయ వలదు మహిలో సుమతీ!
{ఎవ్వరితోను విరోధము పెట్టుకోకుండ ఉండటము; దరిద్రము కల్గినపుడు (సంపదలేనప్పుడు) బాధపడకుండా ఉండటము; సభలలో పరుషంగా, అసభ్యంగా మాట్లాడకుండటం; స్త్రీల యందు మనసు పారేసుకోకుండ ఉండటము మేలు. ఇవి బుద్ధిమంతుని లక్షణములు.}

69) పతి కడకు దన్ను కూర్చిన
      సతి కడకును వేల్పుకడకు సద్గురు కడకున్
      సుతుకడకు రిత్త చేతల
      మతి మంతులు చనరు నీతి మార్గము సుమతీ!
{నీతిమంతులు , యజమాని (పెద్దల) దగ్గరకు, తన్ను ప్రేమించే భార్య దగ్గరకు, దేవుని దగ్గరకు, (మంచి) గురువు దగ్గరకు, పిల్లలు (కొడుకు,కూతురు) దగ్గరకు ఒట్టి చేతులతో వెల్లరు; పంద్లు , పూలు , ఏమన్నా బహుమానమో (gift/presentation) తీసుకొని వెల్లడం పద్ధతి}

70) పనిచేయు నెడల దాసియు
      ననుభవమున రంభ మంత్రి యాలో చనలన్
      ధన భుక్తి యెడలఁ దల్లియు,
      నఁనదగు కులకాంత యుండ నగురా సుమతీ!
{ఉత్తమ ఇల్లాలు – ఇంటిపనిలో సహాయకురాలిలా, పడకటింటిలో రంభ లాగా, సలహా చెప్పడములో (మంత్రాంగములో) మంత్రి లాగా దిట్ట, భోజనసమయములో తల్లి లాగా వుండాలి.}

71) పరనారీ సోదరుఁడై
      పర ధనముల కాసపడక పరులకు హితుఁడై
      పరులు తనుఁ బొగడ నెగడక
      పరులలిగిన నలుగ నతడుఁ పరముడు, సుమతీ!
(పరస్త్రీలను సోదరీ భావముతో చూచువాడు, పర ధనములకు ఆశపడనివాడు, పరులకు మేలుచేయువాడు, ఇతురల పొగడ్తలకు పొంగిపోనివాడు, ఇతురల ధూషణలకు క్రుంగిపోనివాడు ఉత్తమ పురుషుడు.)

72) పర సతి తూటమి గోరకు,
      పర ధనముల కాసపడకు, పరునెంచకుమీ
      సరిచెడి గోష్టి సేయకు
      సిరిచెడి చుట్టంబు కడకు జేరకు సుమతీ!
(పరుల భార్య పొందు కోరుట, ఇతరుల ధనమునకు ఆశపడుట, ఇతరులను ఆక్షేపించుట, వ్యర్ధ ప్రసంగములు, సంపదలేనిసమయములో (లేమిలో) (ధనవంతులైన) బంధువుల దగ్గరకు వెల్లుట తగదని శతకకారుడు హెచ్చరించుచున్నాడు.)

73) పర సతుల గోష్టి నుండిన
      పురుషుఁడు గాంగేయుఁడై గనినింద పడున్
      గరిమ సీసులయె యైనను
      బరుసంగతి నున్న నింద పాలగు సుమతీ!
{పర స్త్రీలు ముచ్చటించుకొనుచుండగా, భీష్ముడు వంటి సత్పురుషుడు సైతము వెళ్ళిన (ఉన్నా) నింద రావచ్చు. ఆలాగే ఎంతో గుణవతియైన స్త్రీ కూడా,పరపురుషులతో ఉన్నచో నింద రావచ్చు.}

74) పరునాత్మ దలచు సతి విడు
     మఱు మాటలుపలుకు నరుల మన్నింపకుమీ,
     వెఱ పెఱుగనిభటునేలకు,
     తఱచుగ సతిగవయ బోకు తగదుర సుమతీ!
{పరపురుషుని పొందు గోరు భార్యను విడువవలెను; ఎదిరించి మాట్లాడే కొడుకును దండించవలెను; మాటవినని (భయ-భక్తులు లేని) భటులను (పనివారలను)తొలగించవలెను; పలుమారులు భార్యతో పొందు గోరుట తగదు సుమా అని శతకకారుని సూచన.}

75) పరుల కనిష్ట సెప్పకు
      పొరుగిండ్లకుబనులు లేక పోవకు మెపుడున్,
     బరుఁగవిసిన సతిఁగవయకు,
     ఎఱిగియు బిరుసైన హయము నెక్కకు సుమతీ!
{ఇతరులకు ఇష్టములేనిదానిని గూర్చి మాట్లాడంకూడదు; ఏ పనిలేకుండా ఇతరుల ఇండ్లకు ఎపుడూ వెళ్ళకూడదు; పరులు పొందిన స్త్రీలను ఆశింపకూడదు; పెంకిగుర్రమని తెలిసినపుడు దానిని ఎక్కకూడదు.}

76) పర్వముల సతుల గవయకు
     ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో
      గర్వింప నాలి బెంపకు
     నిర్వాహము లేని చోట నిలువకు సుమతీ!
{పుణ్యదినములలో (శివరాత్రి,ఏకాదశి,దైవపండుగలుమొ.వి)స్త్రీ సంగమము, రాజు(పాలకుల) దయను (వాగ్దానలను) నమ్ముట, మనస్సులో కుత్సితము, గర్వము పెంపొందుట, బాగుపడని(వసతులేని) ఊరిలో ఉండుట కూడనవి.}

77) పలుదోమి సేయు విడియము
     తలగడిగిన నాఁటి నిద్ర తరుణుల తోడన్
     బొలయలుక నాఁటి కూటమి
     వెల యితని చెప్ప రాదు వినురా సుమతీ!
{పండ్లు తోముకొనగనే వేసుకొన్న తాంబూలము, తలంటుకున్న నాటి నిద్ర, ప్రణయకలహముతీరిన నాటి భార్యా సమాగమము (కలియక) విలువఇంత అని చెప్పలేము (అతి విలువైనవి)}
(ఆ నాటి తాంబూలము లో ఎన్నో సుగంధ భరిత ఆరోగ్యకర దినుసులు ఉండేవి; వాటిని ఇప్పుడు మనము చూడ్లేము, కొనలేముకూడా)

78) పాటెరుగని పతి కొలువును,
     కూటంబున కెఱుక పడని కోమలిరతియున్
     జేటెత్తఁ జేయు చెలిమియు
     నేటికి నెదురిది నట్లు లెన్నఁగ సుమతీ!
{శ్రమను గుర్తించని యజమాని దగ్గర పని, సురతము గురించి తెలియని (యుక్తవయస్సు రాని) స్త్రీతో రతి,చేటును (నష్టము) పెంచేస్నేహము ఏటికి ఎదురీదినంత కష్టము; కనుక వీటిని తప్పక విసర్జించవలెను}

79) పాలను గలిపిన జలమును
     బాల విధంబుననె నుండుఁ బరికింపంగా!
     బాల చవిఁ జెఱచు గావునఁ
     బాలసుఁ డగువాని పొందు వలదుర సుమతీ!
{పాలలో కలిపిన నీరు చూడడానికి పాలలాగే ఉన్నా, పాల రుచిచెడుతుంది. అలాగే చెడ్డ వాని(మూర్ఖుని) సహవాసము మంచిది కాదు.}

80) పాలకునకైన యాపదఁ
     జాలింబడి తీర్పఁ దగదు, సర్వజ్ఞునకున్
     దేలగ్నిఁ బడకఁ పట్టిన
     మేలెఱుఁగునే మీటుఁగాక, మేదిని సుమతీ!
{తేలు మంటలో పడుతుంటే పడకుండా పట్టుకుంటే మేలు చేసామని కుట్టకుండా ఉండదు కదా; అలాగే ఎంత తెలివిగలవాడైనా,చెడ్డవానికి జాలిపడి ఆపదలలోసాయంచేసినా గుర్తించడు.}

81) పిలువని పనులకుఁ బోవుట
     బొలియని సతి రతియు రాజు గానని కొలువున్
     బిలువని పేరంటంబును
     వలువని చెలిమియును జేయ వలదుర సుమతీ!
{పిలువకుండా (అడగకుండా) ఇతరుల పనులలో జోక్యము, సతితోఇష్టపడని రతి, రాజు చూడని సేవ,ఆహ్వానము లేని పేరంటము (శుభకార్యము) నకువెల్లుట తగదు.}

82) వూరికిఁ బ్రాణము కోమటి
     వరికినిఁ బ్రాణంబు నీరు వసుమతి లోనన్
     గరికిని బ్రాణము తొండము
      సిరికిని బ్రాణంబు మగువ సిద్ధము సుమతీ!
{భూమి మీద, ఊరికి కోమటి (దుకాణము),వరి పొలంకి నీరు, ఏనుగుకి తొండము, సంపదకుస్త్రీ ప్రాణము లాంటివి}

83) పులి పాలు దెచ్చి యిచ్చిన
     నలవడఁగా గుండెగోసి యరచే నిడినన్
     దల పొడుగు ధనముఁ బోసిన
     వెలయాలికిఁ గూర్మి లేదు వినురా సుమతీ!
{పులి పాలు తెచ్చి ఇచ్చినా,అడుగగనే గుండె కాయ కోసి అర చేతిలో పెట్టినా, నిలువెత్తు ధనము ఇచ్చినా వేశ్యకు నిజమైన చెలిమి (ప్రేమ)ఉండదు.}

84) పుత్రోత్సాహము తండ్రికిఁ
      బుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా
      పుత్రునిఁ గనుగొని పొగడఁగఁ
      బుత్రోత్సాహంబు నాఁడు పొందుర సుమతీ!
{ తండ్రికి కొడుకు పుట్టగానె పండుగ (సంతోషము కలుగదు) కాదు ; ఆ కొడుకు పెద్దవాడైన పిదప బైటవారు (ఇతరులు) అతని గురించి మంచిగ అనుకుంటుంటే అపుడే తండ్రికి నిజమైన ఆనందము (పండుగ)}
85) పెట్టిన దినముల లోపల
     నట్టడవుల్ కైన వచ్చు నానర్ధములన్
     బెట్టని దినములఁ గనకవు
     గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ!
{పూర్వ జన్మ పుణ్యఫలాలు (ఎన్నిజన్మలెత్తిన) మనకు నట్టడవిలో ఉన్నాఅందుతూనె ఉంటాయి. పాపికిదక్కవు. అదే పూర్వజన్మసుకృతమంటే.}

86) పొరుగునఁ బగువా డుండిన
     నిరువొందగ వ్రాతఁ కాడె, యేలికయైనన్
      ధరంగావు కొండె మాడిన
     గరణాలకు బ్రతుకు లేదు గదరా సుమతీ!
{పూర్వపు గ్రామ పాలనా వ్యవస్థలో కరణము-మునసబు ఉండేవారు. ఆందులోకరణము రెవిన్యూ లెక్కలు చూసేవారు, సహజంగ ఆ రోజులలోచదువుకున్న వారు బహు తక్కువ ఉండేవారు కనుక, అందరూ వారి స్వంత ఆర్ధిక లావాదేవులకు అతని మీద ఆధారపడేవారు. అందుకని, ఆఊరిలో అతనికి శత్రువు ఉన్నా, చదువు వచ్చిన మునసబు ఉన్నా, చాడీలుచెప్పే రైతులున్నా అతను మసలటం (బ్రతకటం) కష్టం.}

87) బంగారు కుదువఁ బెట్టకు
     సంగరమునఁ బాఱిబోకు, సరసుఁడ వైనన్
     అంగడి వెచ్చము లాడకు,
     వెంగలితో చెలిమి వలదు, వినురా! సుమతీ! (౮7)
{కూడని పనులు – బంగారము తాకట్టు పెట్టడం, యుద్ధరంగమునుండి పారిపోవటం, అంగడిలో అరువుపెట్టడం, అవివేకితో స్నేహము.}

88) బలవంతుడ నాకేమని
     బలువరతో నిగ్రహించి పలుకుటమేలా
     బలవంతమైన సర్పము
    చలిచీమల జేతజిక్కి చావదె సుమతీ! (88)
{బలవంతుడు అందరితో దుర్హఃకారముతో ప్రవర్తించడము మంచిదికాదు; ఎంత బలవంతమైన పాము సైతము, అల్పప్రాణులైన చలిచీమలు పట్టిపీడించినప్పుడు చచ్చినట్టు, బలవంతుడు  కూడా అదే పరిస్థితి ఎదుర్కొనవలసివచ్చును.}

89) మండలిపతి సముఖంబున
      మెండయిన ప్రధాని లేక, మెలగుట యెల్లన్
     గొండంత మదపు టేనుగు
     తొండము లేకుండునట్లు తోచుర సుమతీ!
{రాజుకు సమర్ధుడైన మంత్రి లేకపోయినచో, పెద్దమదపుటేనుగుకు తొండము లేకపోతే ఎలా ఉపయౌగములేదో అదేవిధంగా దేశ ప్రజలకు ఉపయౌగంలేదు. రాజు, మంత్రి ఉభయులుతెలివైన వారు, సమర్ధులైనప్పుడే పాలనబాగుంటుంది.}

90) మంత్రి గలవాని రాజ్యము
     తంత్రము చెడకుండ నిలుచుఁ, దఱచుగ ధరలో
     మంత్రి విహీనుని రాజ్యము
      జంత్రము కీలూడినట్లు, జరుగదు సుమతీ!
{యంత్రములో ఇరుసు (Key Boltin a machine) లేకపోతే యంత్రము ఎలా సరిగ పనిచేయదో, అదే విధంగా సరిఐన మంత్రి లేకుండా రాజ్యపాలన సవ్యంగా సాగదని, మంత్రాంగము యొక్క విశిష్టత తెల్పబడినది.}

91) మదినొకని దలచియుండగ
     మదిగెడి యొక క్రూర విటుడు మానక తిరుగన్
     అది చిలుక పిల్లి పట్టిన
      జదువునె యా పంజరమున జగతిని సుమతీ!
[పంజరములోఉన్న చిలుకను పిల్లి ఎలాచేరలేదో అలాగే ఒక స్త్రీ మనసులో ఒకరిని కోరుకుంటున్నప్పుడుఎంతమాత్రమూ ఇతరులు ఆమెను పొందలేరు. (ఆమె ఇతరులనుఇష్టపడదు)]

92) మాటకు ప్రాణము సత్యము
     కోటకు బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన఼్
     బోటికి బ్రాణము మానము
     చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!
[ఈ లోకములో, మాటకు సత్యము; కోటకు సుశిక్షుతులైన భటులు; స్త్రీకి మానము (శీలము); ఉత్తరువు లేక దస్తావేజుకి సంతకము ముఖ్యము (ప్రాణము వంటిది.)]

93) మానధను డాత్మ ధృతిచెడి
     హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
     మానెడు జలముల లోపల
     నేనుగు మెయి దాచినట్టు లెఱుగుము సుమతీ!
{అభిమానవంతుడు ఆత్మను చంపుకొని సంస్కారములేని వానిని ఆశ్రయించడము, చాలి చాలని నీటి మడుగులో ఏనుగు తన శరీరముదాచుకొన్నట్లుండును (అనగ ఉపయోగములేదు)}

94) మేలెంచని మాలిన్యుని
     మాలను నగసాలివాని మంగలి హితుగా
     నేలిన నరపతి రజ్యము
     నేలఁగలసి పోవుగాని నెగడదు సుమతీ!
[రాజు, పరిపాలనలో రాజ్య పాలనాను భవము లేని (కాయ కష్టంతో జీవించేవారితో) వారి సాంగత్యముతో పాలించినచో ఆ రాజ్యము అభివృద్ధిచెందకనశించిపోతుంది.]

95) రా పొమ్మని పిలువని యా
    భూపాలుని గొల్వభుక్తి ముక్తులు గలవే
    దీపంబు లేని యింటను
    జేవుణి కిళ్ళాడినట్టు సిద్ధము సుమతీ!
{పలకరించని (గుర్తించని) రాజు (యజమానిని) సేవించడం ఫలితములేదు. అది దీపములేని ఇంటిలో చీకట్లోవెదుకులాడుకొన్నట్లుంటుంది.}

96) రూపించి పలికి బొంకకు
     ప్రాపగు చుట్టంబు కెగ్గు పలుకకు మదిలో
    గోపించు రాజుఁ గొల్వకు
    పాపపు దేశంబు సొరకు పదిలము సుమతీ!
{మాటిచ్చి మాటతప్పుట, మేలుచేసినవానికిహాని(కీడు) తలపెట్టుట, ముక్కోపి అయినరాజును (ప్రభువు /యజమాని)  సేవించడము, నీచులు సంచరించేదేశమునకు వెళ్ళడం చేయుట తగదు (మంచిదికాదు)}

97) లావుగల వాని కంటెను
     భావింపగ నీతిపరుఁడు బలవంతుండౌ
     గ్రావంబంత గజంబును
     మావంటివాఁ డెక్కినట్లు మహిలో సుమతీ!
{శారిరక బలం కన్నా నీతిపరునికి బలం(ధైర్యము) ఎక్కువ. ఎంత మదించిన ఏనుగును సైతము, మావటి వాడు (తన నైపుణ్యము వలన) అదుపులోనికి తీసుకొని ఎక్కికూర్చొనడం లాంటిది }

98) వరదైన చేను దున్నకు
     కఱవైనను బంధజనుల కడ కేగకుమీ!
    పరులకు మర్మము సెప్పకు
     పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!
{వరద వచ్చి బీడు పడిన (ఇసుక మేటేసిన) పొలము సాగుచేయటం కూడదు (ఉపయోగం ఉండదు); కరువులో (కష్టకాలములో) కూడా బంధువులనుఆశ్రయించకూడదు (చులకన అవుతాము); తన రహస్యములను ఇతరులకు చెప్పకూడదు; పిరికివానికి సాహసకార్యములు ఒప్పచెప్పకూడదు (వారు ధైర్యంగా చేయలేరుకనుక).}

99) వరిపంట లేని యూరును
     దొర యుండని యూరు తోడు దొరకని తెఱువున్
     ధరను బతి లేని గృహమును
     నరయంగా రుద్రభూమియనదగు సుమతీ!
{వరి పంట పండని ఊరు, గ్రామాధికారిలేని ఊరు, తోడుదొరకని దారి (ఒంటరిగ ప్రయాణము), భర్త(యజమాని) లేని గృహమువల్లకాటితో (శ్మశానము) సమానము.బహుప్రమాదభరితము}

100) వినదగు నెవ్వరు సెప్పిన
      వినినంతనే వేగపడగ వివరింపఁదగున్
      గనికల్ల నిజముఁ దెలిసిన
      మనుజుఁడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
{ఇతరులు చెప్పినది విని తొందర పడకుండా బాగా ఆలోచించి, ఏది సత్యము, ఏది అసత్యముఅనేది గ్రహించేవాడే నీతిమంతుడు (తెలివైనవాడు)}

101) వీడెము సేయనినోరును
      జేడెల యధరామృతంబుఁ జెందని నోరున్
      బాడంగ రాని నోరును
      బూడిద కిరువైన పాడు బొందర సుమతీ!
[తాంబూలము తినని నోరు, వనిత (భార్య) అధరామృతమునురుచిచూడని నోరు, పాట పాడని నోరు పాడు బడ్డ బావి లాంటిది (వ్యర్ధము).]

102) వెలయాలి వలనఁ గూరిమి
       కలుగదు మఱి గలిగెనేని కడ తేఱదుగా!
       పలువురు నడిచెడు తెఱవున
       బులు మొలవదు మొలచెనేని పొదలదు సుమతీ!
{వేశ్యతో చెలిమి కుదరదు. ఒకవేళ కుదిరిన, పది మంది నడిచే త్రోవలో గడ్డి మొలచినా ఎలా వర్ధిల్లదో (ఏపుగ పెరుగదో) అలాగే వేశ్యచెలిమి నిలబడదు.}

103) వెలయాలి సేయు బాసలు
       వెలయఁగ నగసాలి పొందు వెలమల చెలిమిన్
       గలలోనఁ గన్న కలిమియు
       విలసితముగ నమ్మరాదు వినుర సుమతీ!
{వేశ్య చేసె వాగ్దానాలు, పైకి కనిపించేకంసాలి స్నేహము, వెలమల స్నేహము, కలలో దొరికినట్టు కనిపించిన సంపద నిజమనుకోకూడదు. 800సంవత్సరముల క్రితం చెప్పినవి కనుక, కొన్ని ఆ కాలమునాటి పరిస్థితులను బట్టి చెప్పిఉండవచ్చు. విజ్ఞులు నేడవసరమైనవాటినిమాత్రమే గ్రహించడం సహజంగదా}

104) వేసరపు జాతికానీ
       వీసమః దాఁ జేయనట్టి వెంగలి గానీ
       దాసికొడుకైన గానీ
        కాసులు గలవాఁడె రాజు గదరా సుమతీ!
{శ్రామిక వర్గం వాడుగాని, వీసమెత్తు (అణా విలువ) చేయనిమూఢుడుగాని, దాసిపుత్రుడుగాని ఎవరికి డబ్బుంటే (సంపద) వాడిదే పైచేయి (అధికారం) (రాజ్యం);  మిగతావాటితోపనిలేదు}

105) శుభముల నొందని చదువును
        నభినయమునురాగరసము నందని పాటల్
        అభిలాష లేనికూటమి
        సభమెచ్చనిమాటలెల్లఁ జప్పన సుమతీ!
{సార్ధకతనొందని విద్య, రశజ్ఞతతో ఉర్రూతలూగించని పాటలు, ఇష్టములేని చేరిక (సురతము/రతి), సభికులనుఆకట్టుకొనని ప్రసంగమూ (మాటలు) చప్పగా ( Insipidity/dull/not exciting) ఉంటాయి (నిరర్ధకము).

106) సరసము విరసముకొఱకే
       పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
      పెఱుఁగుట విరుగుట కొఱకే
      ధరతగ్గుట హెచ్చుకొఱకే తధ్యము సుమతీ!
{హద్దుమీరిన చనువు, హాస్యమువిరోధానికి దారి తీస్తుంది; అలాగే హద్దుమీరిసుఖాలు అనుభవించడంకూడా కష్టాలు కొనితెచ్చుకోవడమే; చెట్టు త్వరత్వరగా విపరీతంగా ఎత్తుపెరిగితే ఎలా తేలికగావిరగటంకి అవకాశముందో అలాగే కీర్తి, ప్రతిష్టలు కూడాతగ్గడానికి అవకాశమ ఉన్నది; ధరలు కూడాతగ్గితే, కొనేవారు అధికమై ధరలు పెరగటం తప్పదు ఓబుద్ధిమంతుడా!}

107) సిరితా వచ్చిన వచ్చును
      సలలితముగ నారికేళ సలిలము భంగిన్
      సిరి దాఁబోయినఁ బోవును,
     కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!
{కొబ్బరికాయలోకి ఎలా కమ్మని నీరు వస్తుందో అలాగే సంపదకూడా మనము ఊహించని విధంగావస్తుంది; ఏనుగు మ్రింగిన వెలగకాయలోని గుజ్జు ఏలామాయంఅవుతుందో (తరిగి పోతుందో) అలాగే తరిగిపోతుంది. వినిర్యాతి యదా లక్ష్మీర్గజ భుక్త కపిత్థవత్|}

108) స్త్రీలయెడ వాదులాడకు
      బాలురతోఁ జెలిమిఁజేసి భాసింపకుమీ
      మేలెన్ను గుణము విడువకు
      మేదిని పతి నిందసేయ కెన్నడు సుమతీ!
{కూడని పనులుః స్త్రీలతో తగువుపెట్టుకొనడం; పిల్లతో స్నేహముజేసి (పోటిపడీ) గొప్పవాడిగా అనుకోవడం (స్నేహానికి సమఉజ్జి ఉండాలి); మంచిచేసే గుణమును విడిచిపెట్టడం; రాజును (పరిపాలకుని) నిందచేయడం.}
సర్వేజనాసుఖినోభవంతు!
భద్ర భూపతి – బద్దెన గారికి (శతకకారునికి) హృదయపూర్వక ప్రణామములు
 __/\__ __/\__ __/\___


No comments:

Post a Comment