Translate

26 October, 2014

పరిష్కారము - 1986లో నేను వ్రాసిన ఓ చిన్నకథ

పరిష్కారము
(“APPM Safety Bulletin, March 1986” లో ప్రచురితమైన – నేను వ్రాసిన ఓ చిన్నకథ)

“కుటుంబరావూ! ఓ కుటుంబరావూ! నిన్నేనయ్యా పిలుస్తూంట…. ఆగూ,నేనూ వస్తున్నాకదా!” అంటూ పిలుస్తున్న ఆనందరావు మాటలు వినిపించుకోలేదు. భుజంమీద చేయి పడేసరికి పరధ్యానము నుండి తేరుకొని, “ఎవరూ, నువ్వా ఆనందరావు! ఏమిటి విశేషాలు?” అంటూ పలకరించాడు.
“రోడ్డు మీద అంత పరధ్యానమా?”- ఆనందరావు
“ఏం చేయమంటావయ్యా?” ఉన్న ఇద్దరూ ఆడపిల్లలే అయినా, నీవు చక్కగా చదివించి, ఏవోమంచి సంబంధాలు చేసి బరువు బాధ్యతలను దించుకొన్నావు.  పేరుసార్ధకం చేసుకున్నావు” భారంగా అన్నాడు కుటుంబరావు.
ఆనందరావు, కుటుంబరావు ఇద్దరూ చిన్నప్పటి నుండి నేస్తులు.  ఒకేసారి ఇద్దరూ పేపరుమిల్లులో ఎలక్ట్రీషియన్సుగా చేరారు.  ఆనందరావు“చిన్న కుటుంబము – చింతలు లేని కుటుంబము” అన్న ప్రభుత్వ ప్రకటనకు విలువిచ్చిఇద్దరూ ఆడపిల్లలైనా తృప్తిపడి కుటుంబ నియంత్రణ ఆపరేషను చేయించుకొని ఒడిదుడులులేని జీవనం సాగిస్తున్నాడు.
కుటుంబరావు మటుకు “అపుత్రస్య గతిః నాస్తి” అంటూ ఆరుగురు ఆడపిల్లల తండ్రై కూర్చున్నాడు.  దాంతో అనారోగ్యపు భార్య, ఆలనాపాలన లేని పిల్లలు –అన్నీసమస్యలే మఱి.
కుటుంబరావు చీకటి జీవితంలో చిరుదివ్వె పెద్దమ్మాయి సుగుణ.  ఆమె ఇంటివద్దే ట్యూషన్స్ చెబుతూ వేన్నీళ్లకు చన్నీళ్ల సాయంగావుంది.  అయితే వచ్చిన చిక్కల్లా యిక్కడే. ఈ మధ్య వచ్చిన పెళ్లి సంబంధాల వారికి సుగుణ నచ్చింది, పాతికవేల కట్నకానుకలతో పాటుగా.  అది తెలిసినప్పటి నుండి కుటుంబరావు మనసు మనస్సులో లేదు.  కానీ, పాపం ఏం చేస్తాడు! ఉద్యోగానికి వెళ్ళకపోతే బాధ మరీ ఎక్కువవుతుందని డ్యూటీకి బయలుదేరాడు.
పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ మిల్లుకు చేరుకున్నారు.  షిఫ్టు ఇంజనీరు నుండి జాబ్స్ లిష్టు తీసుకొని పల్పుమిల్లు దగ్గర మోటారు విప్పి బాగు చేస్తున్నాడు కుటుంబరావు.  రౌండ్సుకు వచ్చిన ఇంజనీరు, సుగుణాకర్ స్థబ్దుగా వున్న కుటుంబరావును పలకరింపుగా అన్నాడు, “ఏం కుటుంబరావుగారూ! అలావున్నారేం? ఆరోగ్యం బాలేదా…? సెలవు పెట్టలేక పోయారా..?” ప్రశ్నల పరంపర. “ఈ మోటారు రడీ అయ్యాక చెప్పండి, నేను చూశాక రన్నింగ్లో పెడ్దాము, అలా పేపరుమెషీను వైపుకు వెళ్లొస్తాను” అంటూ వెళ్లాడు సుగుణాకర్.  మానసికాంధొళనతోనున్న కుటుంబరావు క్రమంతప్పకుండా తాను నిత్యమూ వాడే భద్రతా పరికరాలు లేకుండగనే తిరిగి పనికి ఉపక్రమించాడు.  “గురువుగారూ! భద్రతా పరికరాలు విధిగా వాడాలని చెప్పే మీరే ఈ రోజిలా పని చేస్తున్నారేమిటీ?” అంటూ అతనిహెల్పరు సహాయకరావు ప్రశ్నించేసరికి ప్రస్తుతానికి వచ్చి, రబ్బరుగ్లౌజువేసుకొని పని ప్రారంభించాడు.  మొత్తానికి హెల్పరు సాయంతో ఆ పని అయిందనిపించి ఇంజనీరు కోసం హెల్పరును పంపాడు.
ఇంతలో “అసలే ఈ రోజు మనసు సరిగ్గా లేదు, అంతా ఏమరుపాటుగ చేస్తున్నాను” అనుకుంటూనే ఇంజనీరు కోసం హెల్పరును పంపిన సంగతి విస్మరించి మోటారు స్విచ్ ఆన్ చేసాడు.
అంతే, ఒక్కసారిగా మోటారు ఫేన్ గార్డు విష్ణుచక్రంలా పైకిలేచి కుటుంబరావు తలకు తగిలి క్రింద పడింది.  బరువైన అలోచనలతోనున్న కుటుంబరావు బలమైన దెబ్బకు కుప్పకూలిపోయాడు. తిరుగుతున్న మోటారు మీదపడటంతో తలకు తగిలిన గాయనికి తోడు పనిచేయడానికి అవసరమైన రెండు చేతులు తెగిపోయాయి.
మోటారు చూడ్డానికి సహయకరావుతో వచ్చిన సుగుణాకర్ కుటుంబరావు పరిస్థికి చలించి ప్రక్కకు తీసి వెంటనే హాస్పిటల్ కి పంపి వైద్య ఏర్పాట్లు గావించాడు.  ఇంటికి వెళ్ళి ధీర్ఘాలోచనలోపడిన సుగుణాకర్ “అవును, పరధ్యానం, అజాగ్రత్త ప్రాణాలను తీస్తాయి.” అనుకొని, “తను ఒక తర్ఫీదు పొందిన ఇంజనీరుగా భద్రతానియమాలను , సూచనలను త్రికరణశుద్ధిగా ఆచరిస్తూ, తన తోటివారు, కార్మికులు కూడా తూచతప్పక పాటించేటట్లు చూస్తాను”అని ఆలోచిస్తూ చల్లగా నిద్రలోకి జారాడు.
“భద్రత పాటించు –ఆనందంగా జీవించు”

No comments:

Post a Comment