Translate

26 October, 2014

పరాకేలనయ్యా! రాధామాధవా! (భద్రత తత్వాన్ని విస్తరింపచేయాలని చిన్ని, చిన్ని తపన, ఆశతో…. )

పరాకేలనయ్యా! రాధామాధవా!
(APPM Safety Magazine, March 1995 నందు ప్రచురింపబడినది)

          ట్రింగ్! ట్రింగ్! ట్రింగ్! అంటూ కాలింగ్ బెల్ మోగటంతో కునుకుతీస్తున్న శారదాంబ ఉలిక్కిపడిలేచింది.
          “ఇంత ఎండలో ఎవరబ్బా!!”అనుకొంటూ బద్దకంగా లేచివెళ్ళి తలుపు తీసింది.
          ఎదురుగా టెలిగ్రాముల కట్టతో నిలబడిన తపాలాఉద్యోగిని చూడగానే ఒక్కసారి ఆమెలో కునుకు మత్తు వదలి, ఆంధోలన చోటు చేసుకొంది.
          “టెలిగ్రాం అండీ..” అంటూ కవరు, పెన్ను చేతికిచ్చి సంతకం పెట్టమని అతను చూపించిన చోట యాంత్రికంగా సంతకం బరికి, అతని పెన్నును అలాగే పట్టుకొని నిలబడ్డ తనను, “పెన్నమ్మా..”అంటూ అతను పిలవటంతో చేతనావస్థలోకి వచ్చిన శారదాంబ, కవరు చింపి, టెలిగ్రాం కాగితాన్ని బయటకు తీసింది.
          “రాధామాధవరావ్ మెట్ విత్ యాక్సిడెంట్(.) అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్(.) స్టార్ట్ ఇమ్మీడీయట్లీ(.)
                   - శంకరం. హైద్రాబాద్. ”
అంటూ వచ్చిన టెలిగ్రాం చదువుకొన్న శారదాంబ ఒక్కసారి అచేతనంగా మంచం మీద వాలిపోయింది.
                “ఇపుడేమిచేయాలి?” …. సమయానికి ఈయన ఇంట్లోలేరు… గీతోపన్యాసం వినడానికి వెళ్ళిన ఈయన వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది… ఎలాగా???”అనుకొంటూ తనలోతాను మదన పడుతున్న శారదాంబ, జీవితంలో నేర్చుకున్న సమయస్ఫూర్తితో వెంటనే లేచి ప్రక్కవాటావారింటికి పరుగు తీసినట్లు వెళ్ళి, వారికి తనకు వచ్చిన టెలిగ్రాం చూపించి, వాండ్ల బాబీని –
                “బాబాయిగారిని అర్జంటుగా పిలుచుకొనిరా బాబూ.. రామమందిరంలో గీతోపన్యాసం దగ్గర ఉంటారు.  నీకు పుణ్యం ఉంటుంది. శ్రమనుకొకుండా సాయం చేయి నాయనా…” అంటూ వేడుకోలుగా చెప్పి పంపించింది.
          ప్రక్కింటామె ఊరడిస్తూ శారదాంబ్ను ఇంట్లోకి తీసుకొని వెళ్ళి హైద్రాబాద్ వెళ్ళడనికి ఏర్పాట్లు చేసుకోమని ప్రోత్సహించగా, అన్యమనస్కంగా ప్రయాణానికి ఆదరాబాదరాగా సర్దుకోవటం మొదలెట్టింది. 
          ఆ భగవంతుడే తన ఒక్కగానొక్క వంశాకురాన్ని కాపాడాలని మౌనంగ వేడుకొంటూ రామారావుగారి కోసం మధ్య, మధ్యలో వీధిగుమ్మంవైపు ఆత్రుతగా చూస్తూ సూటుకేసు సర్దటం పూర్తిచేసింది.
          “బహుశా, ఈ ఆపదకు అవసరం అవుతుందని కాబోలు, ఎప్పుడూ ఆలశ్యంగా వచ్చే ఇద్దరి పెన్షనుల్లు ఈ నెల సరిగ టయిముగ రావటంతో ప్రయాణ ఖర్చులకు ఇబ్బందిలేదు.  కాని, అక్కడ పరిస్థితి ఏమిటో? ఎంత డబ్బుకావాలో. ఏమో!!..” అనుకొంటూ వీధి గుమ్మంలోనే చతికిలబడింది.
                రామారావుగారు రామమందిరంలో గీతాచార్యులవారి గీతామృతాన్ని ఆస్వాదిస్తున్నవాడల్లా, తమ ప్రక్కింటి బాబి వచ్చి చెవిలో – “బాబాయిగారు, పిన్నిగారు మిమ్మల్ని అర్జంటుగ పిలుచుకురమ్మన్నారు.  హైద్రాబాద్ నుండి ఏదో టెలిగ్రాం వచ్చిందట” అని చెప్పగానే ఒక్కసారి ఇహలోకంలోకి వచ్చి హడావుడిగాలేచి,బాబి వెంట ఇంటి ముఖం పట్టారు.
                అసలే విజయవాడ ఎండలు.. చీకటిపడినా గాడ్పు ఉదృతం మాత్రం తగ్గలేదు.  దానికితోడు… “టెలిగ్రామ్ ఏమిటబ్బా!! మా అబ్బాయికి ఏమి ఇబ్బంది కలుగలేదు కదా?” అని మధన పడుతూ, అంతలోనే వయస్సుతో ఒచ్చిన నిబ్బరంతో,
          “అన్నిటికీ ఆ సర్వేశ్వరుడే ఉన్నాడు.  చేసేది, చేయించేది అన్నీ ఆయనే”
అనుకొంటూ గీతోపదేశాన్ని వంటపట్టించుకొన్న తత్త్వవేత్తలా, వడివడిగా అడుగులు వేస్తూ ఇల్లు చేరారు.
                గుమ్మంలోనే శోకతప్తురాలైయున్న శారదాంబ చేతిలో పెట్టిన టెలిగ్రాం ఒక్కసారి చూడగానే, ఎంతో గాంభీర్యంగా ఉండే రామారావుగారు ఒక్క క్షణం కలవరపాటుచెందారు. కానీ, ఒత్తిడి తట్టుకొనటంలో తర్ఫీదుపొందిన రామారావుగారు, వెంటనే బీరువాలో చేతికి దొరికిన డబ్బును పర్సులోకుక్కుని, అప్పటికే చేతిలో సూటుకేసుతో సిద్ధంగాఉన్న శారదాంబ వైపు, ఆమె గుండెనిబ్బరనికి, మనోధైర్యానికి, మెచ్చుకోలుగాచూస్తూ –
                “ఇక వెల్దామా?” అంటూ బయటకు నడిచి వీధి గుమ్మానికి తాళంవేసారు. ప్రక్కవాటావారికి చెప్పి, వీధిలో కన్పించిన ఆటో ఎక్కి… బస్ స్టేషన్ కి పొమ్మని చెప్పి, సీటులో కూలబడి, కండ్లు రుద్దుకుంటూ అలోచనలో పడ్డారు.
          ఆదంపతుల అదృష్టమా అన్నట్లు ఒక ప్రైవేటు బస్సు హైద్రాబాదుకు వెళ్ళడానికి సిద్ధంగఉన్నట్లుతెల్సుకొన్న రామారావుగారు వెంటనే ఆటో అతనికి డబ్బులిచ్చి, బస్సు టికెట్లు తీసుకొనిబస్సు ఎక్కి, దైవం మీద భారం వేసి, మనస్సులో తన కిష్టమైన నామ జపాన్ని చేసుకోవడంమొదలుపెట్టారు.
          తెల్లవారుఝాముకిహైద్రాబాదు చేరిన రామారావు దంపతులు, ముందుగా వాండ్ల అబ్బాయి పనిచేసే ఆఫీసులో అతని సహద్యోగైనశంకరంతో అంతకుముందే బాగా పరిచయం ఉండటంతో అతని ఇంటికి ఆటో కట్టించుకొని వెళ్ళారు.
          శంకరమేటెలిగ్రాము ఇవ్వటంవలన, వీరు ఏక్షణాన్నైనా రావచ్చని ఎదురుచూస్తుండటంతో, రామారావుగారుతలుపుతట్టిన వెంటనే తలుపుతెరచి సాదరంగా లోపలికి తీసుకొని వెళ్ళి, వారి ఆంధోళన పసిగట్టి–
“ మాధవరావు కులాసాగనే ఉన్నాడండి.  ఆంధోళనచెందవలసినది ఏమిలేదు.  ఆఫీసులో లిఫ్టు రిపేరులోఉంటే,మనవాడు పగటికలలు కంటూమెట్లు ఎక్కుతూ కాలిజారిపడ్డాడు.  దురదృష్టవశాత్తు ఆ పడటంలో, కుడిచేయికి వత్తిడి తగిలిమోచేతికీళు పట్టుతప్పింది.  దానితో, వెంటనేహాస్పిటల్లో చేర్పించాము.  ఆఫీసు వాండ్లుతగిన ఏర్పాట్లు చేసారు.  నేను రాత్రిపొద్దుపోయిందాకా ఉండివచ్చాను.  మీరు ముఖంకడుక్కొని, కొంచెం కాఫీతీసుకొని, అలసట తీర్చుకోండి.  రాత్రంతా ఆంధోళనతో,బస్సు కుదుపులకు పూర్తిగాడీలా పడిఉంటారు.” అంటూ వారికి వారివిడిది చూపించి, వంటింట్లోఉన్న తన శ్రీమతిని వారికి పరిచయం చేసాడు.
          కుదుటపడ్డమనస్సులతో రామారావు దంపతులు శంకరం శ్రీమతిని కుశలప్రశ్నలువేసి తమ వంశాకురానికి ప్రాణాపాయముకాని,పెద్దప్రమాదంకాని జరగనందుకు లోలోపల తమ ఇష్టదైవాలకు కృతజ్ఞతలు తెల్పుకొంటూ తమకు చూపించినగదిలోనికి దారి తీసారు.
          త్వర,త్వరగ తమ్ పనులు పూర్తిచేసుకొని, శంకరం భార్య ఆప్యాయతతో కొసరి, కొసరి వడ్డిమ్చిన అల్పాహారముతీసుకొని, శంకరాన్నితోడు తీసుకొని ఆసుపత్రికి వెళ్ళారు.  చేతికి కట్టుతో మంచంమీదున్న కొడుకుని చూడగనే నిబ్బరంగఉన్న శారదాంబ కండ్లనుండి కన్నీరు ఒక్కసారి ఉబుకొనిరాగా, కన్నీరుపొరగుండా మసకగ కన్పిస్తున్నతన కొడుకుని, తనివితీర చూసుకోడనికా అన్నట్లు, చీరకొంగుతో కన్నీటిని తుడుచుకుంటూ ఆప్యాయంగా,నుదిటిమీద చేయివేసి నిమురుతూ—
                “పెద్దవాడవై,బాధ్యతాయుతమైన ఉద్యోగివై ఈ పగటికలలేమిటి? ఈ అప్రమత్త ఏమిటిరా కన్నా? ఇదే,ఏరోడ్డుమీదో, స్కూటరుమీద వెల్తున్నప్పుడైతే, ఏమైయ్యేది బాబు!ఒక్కగాని ఒక్కడివైన నీమీద ఆశలుపెట్టుకొని బ్రతుకుతున్న మేమ్ ఏమికావాలిరా నాన్నా!! ….”అంటూ తన పుత్రవాత్సల్యాన్ని వెళ్ళగ్రక్కుతున్న శారదాంబకు అడ్డువస్తూ… రామారావుగారు,
                “అబ్బాయ్! నేను నీకుచిన్నప్పటినుండి నూరిపోస్తున్న భద్రతా సూచనలు అన్నీబూడిదలోపోసిన పన్నీరులాగ అయినవా బాబూ!! నేను,పెద్ద పరిశ్రమలో ఉద్యోగిగాపని చేసిన అనుభవరీత్యాచెప్పుతున్నాను; నాది చాదస్తంఅని కొట్టిపారేయకుమరి!  ప్రమాదాలు సంభవించవురా…వాటిని మనమే కొనితెచ్చుకుంటాము.  నీ సంగతే చూడూ… నీవు నిన్నపరాకుగా మెట్లు ఎక్కకపోతే,నీకాలుజారదు; జారినా, హ్యాండ్రైలింగ్పట్టుకొని మెట్లుఎక్కిఉంటే ఇంత ప్రమాదం జరిగేదికాదుకదా?  ఏ బెణుకుతోనో సరిపెట్టేది.  కాబట్టి, భద్రతా సూచనలుపాటించడం అనేది కర్మాగారాల్లోఉద్యోగులకు మాత్రమే కాక,మనందరికి నిత్యజీవితంలో కూడా ఎంతో అవసరము.ఇకముందైనా, జాగరూకతతో మెలుగుతూ, ఎటువంటి ఉపద్రవాలను కొనితెచ్చుకోకుండా,సురక్షితంగా, చల్లగ జీవించు బాబూ!....” అంటూ అటుగ వస్తున్న డాక్టరును చూసిన రామారావు దంపతులు, శంకరం ముకులిత హస్తాలతోఅభివాదం చేస్తూ నిలబడ్డారు.
భద్రత తత్వాన్ని విస్తరింపచేయాలని చిన్ని, చిన్ని తపన,ఆశతో…. __/\____/\__ __/\__

No comments:

Post a Comment