ఒక కోడలి నుంచి ఏమి ఆశించి ఎన్నుకుంటారు లేదా వారింటికి ఆహ్వానిస్తారు?
ఎవరైనాకోడలు లేదా అల్లుడు తమ కొడుకు లేదా కూతురిని సుఖపెట్టాలని, ఉభయకుటుంబాల పరువు, ప్రతిష్ఠలనునిలబెట్టాలనిఆశించి ఎన్నుకొని తమకుటుంబంలోకి ఆహ్వానించి కలుపుకుంటారు. ఎంతవరకు సఫలీకృతులవుతారనేది, వారి వారి పూర్వజన్మసుకృంతంగా భావించవలసివస్తున్నది. దాని బట్టే ఎన్నికలో పొరపాటు చేయడమో లేకఎంత జాగ్రత్తలు తీసుకున్నాబాధాకరమైన తదనంతర పరిణామాలు చోటు చేసుకోవడమో జరుగుతున్నవి కాబట్టి; దీనితో అందరూఏకీభవించకపోవచ్చు కూడా.
ఒకరిని తమసంస్థలోకి (కుటుంబం అంటున్నారు ఇప్పుడు HR వాండ్లు) తీసుకుంటునప్పుడు కొన్నిప్రాధమిక విషయాలతోపాటు, వారి, వారి సంస్థ/కుటుంబం అవసరాల బట్టి, విలువలను బట్టి, ఆర్ధిక స్థోమత బట్టి, ఆయా ఆయా వ్యక్తులునిర్వర్తించవలసిన బాధ్యతలు, పనులు మొ.వి బట్టి నిర్ణయిస్తారు కదాఅలాగే, ఇక్కడ కూడా. కోడలు/అల్లుడిని కించపరుస్తున్నాని అనుకోకండిసుమా!
భద్రాచలరాములవారి కల్యాణ సందర్భంగా నిర్వహించిన ఎదురుకోల సన్నాహ ఉత్సవంలో తెలిపినట్లుగాఏడు అంశాలు పరిశీలించవలసి యున్నది.
1. గుణగణాలు
2. వంశము, కులగోత్రాలు
3. చదువు
4. అందం,చందం
5. శక్తి సామర్ధ్యాలు
6. బంధువర్గము
7. ఆర్ధిక పరిస్థితి
వీటిలోఇప్పటికీ ఎక్కువ శాతము (ప్రస్తుతము మతం కూడాకలుపుకోవాలి) కుల గోత్రాలకు పెద్ద పీటవేస్తున్నారు; కొన్ని ప్రేమ వ్యవహారాల్లోతల్లితండ్రులు – పిల్లలు తీసుకున్న నిర్ణయం సరిఐనదే అనిభావించినపుడో లేక విధిలేని పరిస్థిలలోనో మాత్రమే దీని గురించి పట్టించుకోవడంలేదు.
తరువాతది కుటుంబ నేపథ్యము – ఇదే పూర్వం వంశంఅన్నారు; దీని గురించి ఇపుడు సరిఐనఅవగాహన రావడానికి కుదరటంలేదు. దూరపు సంబంధాలు పరిపాటిఅయినవి కనుక ఇది సరిగా కుదరటం లేదు. మధ్యవర్తులు చెప్పిన దానిబట్టె ఎక్కువ శాతం నిర్ణయము తీసుకొనవలసివస్తున్నది. మనకే మన మూడు తరాలవారిగురించి అవగాహన లేనప్పుడు, ఎదుటివారి గురించి ఏమి అడగగలము; ఎవరన్నా అడిగినా ఇంకా ఈచాదస్థాలేమిటి, అసలు ఆడపిల్ల దొరకడమే మహా బాగ్యం ఈరోజుల్లో అని మధ్యవర్తులు కన్నెర్రచేస్తారు.
గుణగణాలు – దినికి ఒక 50-40 సంవత్సరాలకు ముందు చాలాపెద్దపీట వేసేవారు. మారిన, మారుతున్న పరిస్థితులదృష్ట్యా, దీని గురించి అంతగాపట్టించుకోవడం లేదు; అందుకనే పెండ్లి తరువాత ఉభయులు ఇబ్బందిపడవలసి వస్తున్నది. ఇది ఆడపిల్లలకు, మగపిల్లలకూ వర్తిస్తుంది. నమ్రత, వినయము, సౌశీల్యము, అణకువ, మృదుభాషిత్వము, కలివిడితనము (కలుపుగోరుతనము), జాలి,దయ,సానుభూతి మొదలైనవి.
జాతకాలు – కొంతవరకు గుణగణాలు కూడా దీని మీద ఆధార పడుతాయని జ్యోతిష శాస్త్ర పండితులుచెప్పుతారు కనుక సరిఐన, సశాస్త్రీయమైన పరిశీలన మంచిదే. ఇటీవల కాలంలో, వైవాహిక జీవితాలలో వస్తున్న ఇబ్బందుల దృష్ట్యాగాని, నేటి TVల వల్లకాని, జాతకాలూ కూడా ఎక్కువ ప్రాధాన్యతసంతరించుకొంటున్నాయి. దురదృష్టం ఏమిటంటే, మిడిమిడి జ్ఞాన సిద్ధాంతుల వల్ల , దాని వల్ల కూడా ఉపయోగం ఉండటంలేదు; పాతరోజులలో ఎక్కువగా నక్షత్ర పొంతన చూసేవారు, ఎందుకంటే గ్రహసంచారస్థితుల దృష్ట్యాఇద్దరూ(భార్య,భర్త) ఒకేసారి బాధలు పడవల్సి వస్తే కష్టం అని.
చదువుకు, దానినుండి లభిస్తున్న ఉద్యోగాలకే గత దశాబ్ధకాలంనుండి, ముఖ్యంగా Softwarejobs boom మొదలైనప్పటినుండి అందరూ ప్రథమ పీట వేయటం మనం గమనించవచ్చు. తద్వారా నేటికోడలు పూర్వంలాగే ఉండాలని భావించడం దురాశే. వీరి అదృష్టాన్ని బట్టి వచ్చిన కోడలుఉద్యోగ రీత్యా కొడుకు లాగే ఎంతో కష్టపడుతున్నా, ఎంతో ఓర్పు, నేర్పుతో ఇంటినిసంభాలించుకుంటూ అత్తమామలకూ, భర్తకూ అభిమానురాలవచ్చు. నా ఉద్దేశ్యముచదువుకున్నవారందరూ వినయంగాఉండరని కాదు; ఉద్యోగ పోటీపరిస్థితులు, వత్తిడుల దృష్ట్యా వారిలో ఓర్పు, సహనం సన్నగిల్లిపోతుంది; పోటీ తత్వం ఇంటిలో కూడా వచ్చేస్తుంది. అదే సమయంలో అత్తామామలు దగ్గర ఉంటే కోడలినిసానుభూతితో అర్ధం చేసుకోకుండా మాకు మర్యాదలు చేయడంలేదనుకొని వారూ నసనసలుమొదలుపెట్టితే తద్వారా చిన్నచిన్న విషయాలకు కూడా ఇంటిలోఘర్షణ వాతావరణంసృస్టించుకుంటారు. కనుక, చదువు, ఉద్యోగంకి ప్రాధాన్యత ఇచ్చినఅత్తామామలు తమ పెద్దరికంనిలుపుకోవాలంటె కోడలు మీద అజమాయిషి కాకుండా సానుభూతితో మెల్లగా ఆమెలో మార్పుతీసుకొనిరావడానికి ప్రయత్నంచాలి; అలాగే కోడలూ తన తల్లిదండ్రులదగ్గర ఎలాస్వాంతన పొందుతుందో అలాగే అత్తామామల దగ్గర స్వాంతన పొందడం అలవాటుచేసుకోవాలి.కొన్ని సందర్భాలలోచదువు పెద్దగ లేకపోయినా, ఉద్యోగం చేయకపోయినా కొంతమంది పెడసరంగా ఉండవచ్చు, అది వారి పెంపకంలోలోపంగా మనం గ్రహించాలి.
అందం,చందం – ఎక్కువగా ఇది తమ కుమారిడికేవదిలి వేస్తారు; ఎవరన్నా మరీ సినీ హీరోయిన్లాగా ఉండాలని కోరుకుంటుంటే మటుకు కొంచెం కళ్లెం వేయడానికి ప్రయత్నిస్తారు. అందం అనేది ఎవరి అబిరువివారిది. ‘బాహ్య సౌందర్యం కన్నా మనో సౌందర్యం మిన్న’అంటాము కాని దాన్ని గుర్తించేనేర్పరితనం కడు కష్టం. పెండ్లిచూపుల వ్యవహారంలో దాన్నిగుర్తించడం అసలు వీలు లేదు, కాని చాలా వరకు పెద్దవారు, తెలుపు, ఎరుపు, పసిడి బొమ్మకాకపోయిన మొఖంలోకాంతి, కళ, వర్ఛస్సు ఉంటే చాలని చెప్పుతారు. ఏది ఏమైనా దైవఘటన ప్రకారంజరుగుతుంటాయి అని నా అభిప్రాయం. దీనితో చాలామంది ఏకీభవించరనికూడా నాకు తెలుసు.
శక్తి,సామర్ధ్యాలు – పూర్వం వంట వార్పు, ఇంటి పనులలో నేర్పరితనం, అల్లికలు, ముగ్గులు పెట్టడం, పాటలు పాడటం, సంగీతం, నాట్యం మీద అభిరుచి ఉన్నవారు వాటిలో ప్రవేశం/ప్రావీణ్యత, బహు కొద్ది మంది పుస్తక పఠనం, చిత్రలేఖనం వగైరా అడిగేవారు. ప్రస్తుతం వంట, ఇంటిపనులు తప్ప మిగాతావాటినిగురించి తెలుసుకుంటున్నారు, ఎందుకంటే వంట గురించి అడిగితే కాబోయేవియ్యపురాలు “మా అమ్మాయితో వంట అది చేయంచలేడండి, దానికి తీరు బడి ఎక్కడ! పిచ్చి పిల్ల 24 గంటలు చదువు, చదువు అంటూ సరిపోయేది; అయినా మీరు మటుకు మీఅమ్మాయిని ఇబ్బంది పెట్టారా ఏమీటి??” అంటూ ముందుకాళ్లకు బందవేస్తుందని భయం. తరువాత వాండ్లే ఏదో తిప్పలు పడుతార్లే, ఎలాగు ప్రతిచోట కర్రీపాయింట్లు, పిజ్జాలు, బర్గర్ల షాపులు కుప్పలు తెప్పలుంటున్నాయిగా అని సమాధానపడుతున్నారు. ఇదే compromisingattitude పెండ్లితరువాత కూడా చూపగలిగితే గొడవలుండవు; కాని, అప్పుడు అత్తగారిపాత్రగుర్తొస్తేమటుకు ఇల్లు కొల్లేరే. పెండ్లికి ముందు వంట రాకపోయినా వంటనేర్చుకోవాలనే తపన కోడలికి, నేర్పాలనే తాపత్రయం అత్తగారికి ఉంటేఇబ్బంది ఉండదు.
బందు వర్గము - గురించి నేడు ఉభయులు పెద్దగాపట్టించుకోవడంలేదు. పేరున్న వారెవరన్నా ఉంటేమటుకు వారిగురించి గొప్పగ చెప్పుకుంటారు; ఒకరకంగా చెప్పాలంటేపరిస్థితుల దృష్ట్యాచాలా వరకు బంధు ప్రీతి తగ్గిపోతున్నది.; దాని స్థానంలో స్నేహ బంధాలుకొంత వరకు ఏర్పడి, స్వాంతన కల్పిస్తున్నాయి. సహజంగా మనం శుభకార్యాలలో చూస్తుంటాము, బంధువులకన్నా మిత్రుల అథిధులసంఖ్య ఎక్కువగా ఉంటుంది.
ఆర్ధిక పరిస్థితి – దీని పాత్ర ఏమాత్రముతగ్గటంలేదు; రోజు రోజుకి పెరుతున్నదే తప్పతగ్గటం లేదు. ఆండంబర జీవితాలాకి అలవాటుపడటం వలన ఇది పెరుగుతున్నదే తప్ప తగ్గటంలేదు, తప్పటంలేదు.
నాకు వచ్చేకోడలిని నేను ఎలా ఎన్నుకోవాలి?
మీకు, మీవారికి, మీ అబ్బాయికి నచ్చే విషయాలు ముందు నోటుచేసుకోండీ, నచ్చని విషయాలు నోటు చేసుకోండి – వాటి కారణాలు కూడావ్రాసుకోండి.. వీటి మీద పునఃచ్ఛరణ చేస్తుండండి; అవి మారే అవకాశం ఉందికనుక. సమయం వచ్చినపుడు మీకు నచ్చిన, నచ్చని విషయాలు మీ రాబోయేకోడలిలో ఉన్నయో లేవో , పెండ్లిచూపలలో కాకుండావిడిగా informal friendly discussions ద్వారా తెలుసుకోవడానికిప్రయత్నించండి. ముందుగా మనము ముచ్చటించుకొన్న 7 అంశాలతో పాటు మీకు ఇంకేమన్నావిషయాలు అవసరమో వాటి ప్రాధాన్యతలను మీరుఎన్నుకోండి.
ఎప్పుడైనా కొడుకుతో, కోడలితో చర్చిస్తారా?
సహజంగాపెండ్లికి ముందు, కొడుకుతో తనకు ఎటువంటి పిల్ల (భార్య) కావాలో తెలుసుకుంటారు. అతని అభిప్రాయం తమ ఆలోచనలకు ఏమన్నా తేడా ఉంటే చర్చించుకొని, అతనికి నచ్చ చెప్పడానికిప్రయత్నిస్తారు. అతను తల్లి తండ్రుల మాటలను వినిఅర్ధంచేసుకొనే రకం అయితే వారిష్టానికి వదిలి వేస్తాడు; లేకపోతే ఆ తల్లిడండ్రులుఅయిష్టంగానే అతనుకోరుకున్న రకం సంబంధాలు చూడటం మొదలు పెట్టుతారు; అక్కడినుంచే దూరం పెరగటంమొదలవుతుంది; అది కోడలు వచ్చిన తరువాత ఇంకొంచెంఎక్కువతుంది; ఆ వచ్చిన అమ్మాయి కూడా వీరుకోరుకొన్నరీతిలో ప్రవర్తనలో) ఉండకపోతే అగాధం పెరుగుతుందే తప్ప తగ్గదు.
కొడుకుతో, కోడలితో వారి ప్రవర్తన గురించి చర్చిస్తేచాలా బాగుంటుంది, కాని అది ఆచరణలో అంత సులభ సాధ్యం కాదు.. కోడలి గురించి కొడుకుతోచర్చిస్తే, అతను తన భార్య మీద పితూరీలుచేప్పుతున్నారని బాధ పడుతాడని, కొంత మంది తమలో తాము మధన పడుతుంటారు . కొంత మంది చర్చించవచ్చు, అపుడు కోడలు తన వాదన వినిపిస్తుంది – ఎక్కువ శాతం వారు తనను ఎంతఇబ్బందిపెట్టుతున్నాతాను కాబట్తి భరాయిస్తున్నాని; అపుడు అతనికి ఏమి చేయాలో పాలుపోదు; అందుకని ఇద్దరిని సర్దుకోండని ఒక సలహాఇచ్చి తప్పుకుంటాడు. దీని వలన సమస్య తరగదు.
తమకు నచ్చని దేమిటో, ఎందుకు నచ్చడంలేదో కోడలితోచర్చించి, వివరంగా చెప్పగలిగిన నేర్పు, ఓర్పు అత్తగారికి ఉండాలి. ఇక్కడ మామగారు ప్రవేశిస్తేకోడలు వేరేగా అనుకోవచ్చు; అనవసర విషయాలలో తలదూర్చి తన్ను ఇబ్బంది పెట్టుతున్నాడనిభర్తకు, పుట్టింటివారికి ఫిర్యాదుకూడా చేయవచ్చు. అపుడు పరిస్థితులు ఇంకొంచంజటిలం అవుతాయి. అలాగే అత్తమామలు చెప్పేది వినే నమ్రత, వినయము కోడలిలో ఉండాలి; వారు చెప్పేది తన మంచికే అనేభావన ఆమెలో ఉండాలి. ఏ సమస్యైనా చర్చించుకుంటె తప్పక పరిష్కారం దొరుకుతుందనిఅందరికి తెలుసు. అహం అడ్డుపడి అగాధాలను ఏర్పరస్తుంది. కాని, విజ్ఞులు ఈ అగాధములలో పడిమగ్గరు. అన్నిటి కన్నాముఖ్యమైనది - అవసరమైన, సరైన మార్పుకు పరిపూర్ణ ఐచ్ఛిక సుముఖత మరియు నేను నాగురించి ‘మారాలి’అనే చిత్తశుద్ధి. ‘Change Management’ అనే దానికి నేడు Modern Management Experts (Guruvulu) సైతం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనందరికి తెలిసిందే. అదే మన జీవితాలకి ఎందుకు అన్వఇంచుకోకూడదు అనిఒక్కసారి ఆలోచించి చూస్తే ???
ఒక కోడలు అత్తామామలతో ఎలా నడుచుకోవాలి?
కోడలి ప్రవర్తనలోఏ అంశాలు అత్తామామలను బాధపెడ్తాయి?
కోడలు వచ్చాకకొడుకు, తల్లిదండ్రుల అనుబంధంలో మార్పు వస్తుందా?
ముందుగా …..
ఒక కోడలు అత్తామామలతో ఎలా నడుచుకోవాలి? కోడలి ప్రవర్తనలో ఏ అంశాలు అత్తామామలను బాధపెడ్తాయి?
ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి (interrelated issues).పై రెండు ప్రశ్నలకు చక్కటి, ఆదర్శవంతమైన సమాధానము “ ఆంధ్రమహాభారతము, ఆరణ్యపర్వము, పంచమాశ్వాసములో” సత్యా ద్రౌపదీ సంవాదములో మనకు కనపడుతుంది. ద్రౌపది, తన ఐదుగురుభర్తలను ఎలా మెప్పించి, వారి అనురాగాన్ని, అభిమానాన్ని, గౌరవాన్ని పొందుతున్నదో సత్యభామకు తెలుపుతూ, అత్తగారిపట్ల తనుఎలా ప్రవర్తిస్తున్నదో తెలుపుతుంది.(ద్రౌపదికి మామగారు లేరుగనుక అత్తగారిగురించి మాత్రమే ప్రస్తావించి యుండవచ్చు.)
ఉ||అత్తకు భక్తి గల్గి మది నాయమ చెప్పినమాడ్కిజీవికా
వృత్తము లావహింతు గురు విప్రజనాతిధిపూజనంబు ల
త్యుత్తమభక్తి నేన తగ నోపియొనర్తుఁ బ్రియంబుఁదాల్మియున్
మెత్తఁదనంబు సన్మతియు మేలుగఁ దాల్తుసమస్తభంగులన్. (304)
సీ||మాయత్తఁ బృథ్వీసమానఁ బృథాదేవిఁ గుంతిభోజాత్మజఁ గోమలాంగి
సతతంబు భోజనస్నానాదికములయం దిమ్ముగఁ బరిచర్య యేన చేసి
సంప్రీతఁ జేయుదు జనవంద్యుఁ డగుధర్మతనయునిబంతి నిత్యంబుఁబసిఁడి
పళ్లెరంబులఁ గుడ్చుబ్రాహ్మణు లతిపుణ్యు లెనిమిదివేలు సమిద్థమతులు
తే||యతులు పదివేలు వారల కనుదినంబు
నన్నపానంబు లర్హసహాయ నగుచు
నొడికముగ నేన కావింతు నుచిత వస్త్ర
భూషణాదులఁబరితోషముగ నొనర్తు. (306)
“అత్తపట్ల భక్తిభావంతో ఉంటూ ఆమెచెప్పినట్లు ఆచారవ్యవహారములు (నిత్యకృత్యములు) భక్తి, శ్రద్ధలతో, ఓర్పుగా, విధేయపూర్వకంగా (నిర్లక్ష్యంలేకుండా), అంకితభావంతో అన్ని విధాలుగా మనస్ఫూర్తిగా చేస్తుంటాను.”
“భూమాతలాంటి, కోమలాంగి అయిన కుంతీరాజు పుత్రిక అయిన మాఅత్తగారు కుంతీదేవి (పృథాదేవి) స్నానపానదులందు (భోజనము వగైరా) నేను చక్కగా (ఇమ్ముగ) సహాయపడుతూ, సేవచేస్తూ ఆమెనుసంతోష పెడుతుంటాను.”
ద్రౌపది అత్తగారి గురించి వాడినవిశేషణాలే తన అత్తగారిపట్ల ఆమెకున్న గౌరవాభిమానాలుతెలుపుతున్నాయి.యుగంమారినా, పాత్ర పోషించవలసిన ధర్మములు అటూ ఇటుగా అవే ఉంటాయికనుక, ధర్మ నిరతి యందు అనురక్తి కలిగినవారికి, నేటికీ అవి కాలానుగుణ మార్పులతో వర్తిస్తాయి. కనుక, అవి శిరోధార్యాలేకదా!
ఇక నేటి నవలాసాహిత్యంలో ఆదెళ్ళ శైలబాల గారు వ్రాసిన‘నాన్న’ నవల్లో (సాయిబాబా పబ్లికేషన్స్,బాపట్ల, ఏప్రియల్,2013) ఉమాదేవి (గీతాంజలి తల్లి) తన అత్తగారిని అడిగి తెలుసుకుంటునట్లు, అమ్ములూ (గీతాంజలి – నేటి యువతరంకి ప్రతినిధి)నడుచుకున్న పద్ధతికి మించి నేటి కాలంలో నడుచుకోవడం ఆశించడం అనాలోచితము, దుస్సాధ్యమని నా భావన.
“అత్తామామలు, కొడుకు దగ్గర (తో) ఉన్నా లేకపోయినా ‘కోడలు’ మమ్మల్ని జాగ్రత్తగాచూసుకుంటుందని ‘నిశ్చంత’గా ఉండగలగాలి.అలాగే కోడలూ, మా అమ్మానాన్నలు దూరంగాఉన్నా మా అత్తామామలు నన్నుకంటికిరెప్పలా చూసుకుంటారు; వాండ్లబ్బాయి నన్ను పల్లెత్తుమాట అననీయరు అని మనస్ఫూర్తిగా చెప్పగలిగినపుడు ఆ కుటుంబంకి నరఘోష దృష్టి తప్పదేమో కదా!!!
కోడలుమెల్లమెల్లగా అత్తామామలలో తల్లిదండ్రులను చూసుకొనడానికి ప్రయత్నించాలి తప్ప వారిలో నరరూపరాక్షసులను, ఆగర్భశత్రువులను వెదుక్కోకూడదు. వారిపట్ల గౌరవాభిమానాలతో, కలుపుగోరుతనంతో (నేడు ద్రౌపదిలాగాసపర్యలుచేయడం అశించలేము, కష్టంకనుక) వారికి ఉచితరీతిగాచేదోదువాదోడుగా ఉంటూ, అనారోగ్యంగాఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా సపర్యలు చేస్తుంటే వారే ఆమెను నెత్తినపెట్టుకుంటారు. అప్పుడు తనూ చనువుగా వారి సపర్యలు అమ్మానాన్నల దగ్గర పొందినట్లు పొందవచ్చు.
మెల్లమెల్లగా అని ఎందుకంటున్నానంటె – సుమారు 25 (నేడు వివాహపు సమయానికి స్త్రీ వయస్సు 20-30 సం||గా తీసుకుంటే) సంవత్సరములు వేరే ప్రదేశంలో, వేరే కట్లుబాట్లు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కొన్నిసార్లు భాష (మాండలీకాలు, యాస); ఆర్ధిక స్థోమత వగైరా , వగైరా నేపథ్యములో పెరిగిన అమ్మాయి, అంతకు ముందు పరిచయము, అవగాహనలేని క్రొత్తచోట అనేకానేక అపోహలతో, అనుమానాలతో , భయాలతో, ఆంధోలనలతో (ఎక్కువగాపుట్టింటివారి అతి జాగ్రత్తల నూరిపోతల వలన; స్నేహితుల మిడిమిడి జ్ఞానబోధల వలన, నేటి ప్రసార మాధ్యమాలఘోషలవలన, సహజంగా ఉండే స్వావాభిక లక్షణాలవలన) ప్రవేశిస్తుంది కనుక మార్పుకు కొంత సమయము తప్పదు. కాని, నేనెందుకు మారాలి? నేను నా మొగుణ్ణి కొనుకొన్నాను కనుక నా పద్ధతిలోకి వారేరావాలి; నే చెప్పినట్లు అత్త, మామలు, భర్త నడుచుకోవాలి;
నాకవసరం అయితే (పనులు చేయడానికి) అత్తామామలను ఉండనిస్తా అనే ధృక్పథంలో కోడలు ఉండి, దాని తగ్గట్టు ఆమె తల్లి తండ్రులు కూడాప్రవర్తిస్తుంటే ఆ సంసారంలో అత్తామామలు, భర్త నరకం చవిచూడవలసిందే. అట్టి కోడలు వారిని మానసికంగా, శారీరకంగా బాధించగలదేమో కాని, తనకూ, ఎట్టిపరిస్థితులోను, మానసిక ప్రశాంతత ఉండదు. తరువాత తరువాత తన పిల్లలు కూడా చాలా కోల్పోవలసివస్తుంది, వారి ప్రవర్తనమీదకూడా ప్రతికూలప్రభావ ఛాయలు (Negative attitude and thinking) తప్పక పడుతాయి.
అలాగే, అత్తామామలు కూడాకోడలికి మార్పు అవసరమైన వాటి మీద సరిఐన అవగాహన, మార్పుకు తగినంత సమయము ఇచ్చి, పెద్దమనస్సుతో తమ స్వంత కూతురు లేక కొడుకు తప్పుచేస్తే ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించగల సమయస్ఫూర్తి, నేర్పరితనము అలవరుచుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాని, ప్రతిదీ భూతద్దములో చూడ్డానికి ప్రయత్నించకూడదు. ఇక్కడఅత్తగారి పాత్ర ఎక్కువగా ఉంటుంది. మామగారు ఒక చండశాసన హెడ్మాష్టరు /ప్రిన్సిపాల్ గా సమయస్ఫూర్తితో ఆమె (తన భార్య) తన అత్తగారు చేసిన రాగింగ్గుర్తుచేసుకుంటూ సీనియర్స్ జూనియర్సని విడవనట్లు కోడలిని బాధించకుండా, తన్ని దెప్పిపొడుస్తున్నా, చక్రం అడ్డం వేస్తుండాలి. లేకపోతే తనలాగే తన కొడుకూ అడకత్తెర్లో చిక్కిన పోక చెక్కవుతాడు.
కోడలు, తనకు పిల్లలు పుట్టిన తరువాత మరింత జాగ్రత్తగా నడుచుకోవాలి. పిల్లల ముందు ఎట్టి పరిస్థితులలోను అత్త, మామలను కించపర్చేవిధంగా ప్రవర్తించడం, ధూషించడం, హేలన చేయడం, ‘ఆ ముసల్ది, ముసలోడు, ఆ రాక్షసి, రాక్షసుడు’ , “Old articles”, “Junk”- ఇలాంటి ముద్దు పేర్లతో (nick names)- ఏం చేస్తున్నారు అని పిల్లల్నిఅడగటం; పిల్లలు వింటుండగా తన వారితో వారి గురించి చెడుగా మాట్లాడటం, చెప్పడం; పెద్ద, పెద్ద నోరు పెట్టుకొనితన చదువు, సామాజిక స్థితి అన్నీమర్చి పోయి మూర్ఖురాలిగా వారితో ప్రవర్తించకూడదు. పిల్లలు అది చూసి (లేత హృదయంలో చెరగని, చెరపలేనిముద్రపడుతుందంటారు – non erasable tender spot) వారు కూడా తరువాత కాలంలో తన పట్లకూడా అలాగే ప్రవర్తించడానికి ఎక్కువ అవకాశముంది.
టిఫిను, భోజనం, కాఫి, టీ వగైరాలు పనిమనుషులకు, బిచ్చగాళ్లకు పడవేసినట్లుఇవ్వడం (వారు కూడా ఇపుడు సరిఐన విధంగా పెట్టకపోతే క్లాసు పీకి శృంగభంగం చేస్తున్నారు); తిన్నారో, లేదో కూడా పట్టిచ్చుకోకపోవడం; ఎప్పడు వదులుతారా వీళ్ళన్నట్లు ప్రవర్తించడం కూడదు; ఇది ముఖ్యంగా పొమ్మనలేకపొగపెట్టినట్లుంటుంది. మన సంప్రదాయాల ప్రకారం తల్లి తండ్రులను చూడటం కొడుకు(ల)ధర్మం; కనుక అతని అర్ధాంగిగా తనకూ అదే ధర్మం.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎక్కువమంది అమ్మాయిలకు వంటనేర్చుకొనే అవకాశం, ఆవశ్యకత ఉండటం లేదు. తల్లి తండ్రులు కూడా మితిమీరిన గారంవలనో లేక వంటచేయనీయకపోవడం స్టేటస్ సింబల్ గా పరిగణించడం వలనో ఇదిజరుగుతున్నదని నా అభిప్రాయం. కనీసం పెండ్లైన తరువాతన్నా, ఉద్యోగస్తులైనా సరే వారి మంచిగురించే (ఉద్యోగరీత్యావిదేశాలకు వెళ్లినపుడు ఇబ్బంది ఉండదు) బేషజాలు పోకుండా అత్తగారిదగ్గర కావాలంటే భర్త సాయం కూడా తీసుకుంటూ వంటా-వార్పు నేర్చుకోవడానికిప్రయత్నించాలి; తాను వండి తన భర్తకు, పిల్లలకు తన చేతితోవడ్డించి, తినిపించే మధురానుభూతిని ఐదు నక్షత్రాల హోటలులో అందరూ కలసితిన్నా
సరితూగదుకదా!!
అలాగే ముందుగానే రేపు ఏమి వంటలు (Menu) వండుకోదల్చుకున్నారో మనస్సువిప్పిఅత్తాకోడళ్లు ఇద్దరు చర్చించుకొని ఏర్పాట్లు చేసుకుంటే ఉదయం క్యారేజీలు పెట్టుకోవడానికి, పిల్లల్ని స్కూలుబస్సులకు తయారుచేయడానికి; తను, భర్త టైముకి ఉద్యోగానికి హైరానా పడకుండా వెళ్లడానికి వీలుంటుందికదా! ఇద్దరూ ఎడమొహం పెడమొహం ఐతే శ్రమకి శ్రమఆంధోలన, చికాకులు, ఈసడింపులు…….
అత్తామామలను బాగా బాధించే ఇంకో విషయం – మనుమలను దూరం చేయడం. పిల్లలు అత్త,మామలకి దగ్గరైతే తనను లక్ష్యపెట్టరనే అపోహతోకాని, వారిని గారంతో చెడగొట్టుతున్నారన్ననెపంతో కాని, చిరుతిండ్లు పెట్టుతున్నారన్న వంకతో గాని పిల్లలను వారి దగ్గరికి చేరనీయకపోవడం. వారు వెళ్లడానికి ప్రయ్నత్నిస్తుంటె బర, బరా లాక్కెల్లి తలుపు మూసి శాపనార్ధాలు పెడుతూ చావగొట్టడం. భర్త, అత్తామామలమీద కోపంవచ్చినప్పుడెల్లా పసిపిల్లలమీద తన ప్రతాపం చూపడం.దీనివలన, అసలు కన్నా వడ్డీ ముద్దన్నట్టు అత్తామామలు ఆ పిల్లల బాధ చూడలేకఅవకాశముంటె తామె అక్కడనుండి (కొడుకు దగ్గర నుండి)బయటపడటం జరుగుతుంటుంది. అవకాశం లేని పరిస్థితులలో (ఆరోగ్య, ఆర్ధిక కారణాల వల్లనుకాని, ఒంటరివారావటం వలనకాని, ఎక్కువ శాతం ఒకరు, ఇద్దరే పిల్లలుండటం వలన, అందులో ఒకరు విదేశాలలో ఉండటం మొ.వి) మానసిక క్షోభతో మరింత అనారోగ్యాలపాలై వారికి (కొడుకు-కోడలు) మరింత భారమై, మరింత ఛీత్కారాలకు గురికావలసివస్తుంది. కనుక విజ్ఞులైన కోడళ్లు పిల్లల గురించి అత్తామామలతో స్నేహపూర్వకంగా, ఆత్మీయంగా తీసుకొనవలసిన జాగ్రత్తలు చర్చించుకొంటే, ఆ పిల్లలు తాత,నాయనమ్మ/ బామ్మల ఆప్యాయతనుపొందుతారు. వారూ మరలా పసిపిల్లలాగా చలాకీగా, ఆనందంగా, ఉల్లాసంగాఅనారోగ్యాలకి దూరంగా, కొడుకు-కోడళ్లకు భారంకాకుండా ఉంటారు. వారి గృహం శాంతినివాసం, ఆనందనిలయం; వారి కుటుంబంఆదర్శ కుటుంబం అవుతుంది.
అత్తామామలు తరచు పితూరిచేస్తుండేది, గింజుకుంటుండేది, ముఖ్యంగా అత్తగారు, తమ వారు (తన ఇతర కొడుకులు, కూతుళ్లు, దగ్గిర చుట్టాలు) వచ్చినపుడు కోడలువారిని తనవైపు వారిని చూసుకున్నంత ప్రేమగా చూడలేదనేది, మర్యాదలు చేయలేదనేది. కోడలు ఇది గుర్తించాలి; మీ ఇల్లు మాఇంటికి ఎంత దూరమో, మా ఇల్లు మీ ఇంటికి అంతే దూరం కదా! మమతానురాగాలు ఇచ్చిపుచ్చుకుంటేనే గదా బంధాలు పెరిగేది. రెండవది
భర్తవైపువారిని కించపర్చిన, చులకనగా చూసినా, దూరంచేసినా, భర్త ఆమె నోటికి, ఆమె బెదురింపులకు ( నుయ్యో,గోయ్యోచూసుకుంటానో, చస్తాననో black mail లాంటిది) భయపడో, అల్లరి అవుతుందనో చూసి చూడనట్లున్నా, అంతరంగంలో ఎంత క్షోభ పడుతుంటాడో – తద్వారా అతను ఆమె పట్ల చూపేది తన బాధ్యతా నిర్వర్తన లేక భయమేకాని, హృదయపూర్వకఆప్యాయత, అనురాగం కాదు కదా !
కోడలు,(ఆమె తరుపువారు కూడాగుర్తుపెట్టుకోవల్సినది), అత్తామామల ఎదుట, తన పిల్లల ఎదుట తన భర్తను ఎప్పుడూ కించపర్చకూడదు, అతనితో పోట్లాడాటాలు చేయకూడదు. ఇదివారిని బాగా గాయ పరుస్తుంది. అలాగే, భర్త కూడా భార్యను అత్తామామలముందు కించపర్చడం, దండించడంచేయకూడదు; ఇది కొంతమంది అత్తామామలకుఆనందగాఉండవచ్చునేమోకాని, కొంతమందికి మటుకు చాలా వేదన కల్గిస్తుంది. తాము ఏరి కోరి చేసిన సంబంధం వల్ల పిల్లవాడు సుఖపడటం లేదుకదాఇబ్బంది కూడా పడుతున్నాడని తమ్ము తాము నిందించుకుంటుంటారు. తాము ఉండటంవల్ల అలా జరుగుతున్నదని కూడా అనుకొనే అవకాశం వస్తుంది.
“తల్లిదండ్రులుకొడుకు దగ్గర ప్రశాంతంగా ఉండాలంటే Watchdogలా ఉండాలి. వారు ఎక్కడుకు వెల్లుతున్నది చెపితే వినటం, లేకపోతె చూస్తూ ఉండటం, వారు వెళ్ళగానే జాగ్రత్తగా తలుపులు వేసుకోవడం. పొరపాటున ఎక్కడికని (సహజంగా పెద్దవాండ్లు సెంటిమెంటుగాని, మూఢనమ్మకాల వలనకాని అడగటానికి వెనుకంజవేస్తారు) అడిగారో ‘స్వతంత్రంగా కనీసం బయటకు వెళ్లేయోగ్యతకూడాలేదు ఈ కొంపలో; అన్నీ వీడ్లంకు చెప్పిచెయ్యాలి కాబోలు ……’ అనే కోడలిగారి ఈసడింపులు, నసనసలు తప్పవుసుమా!” ఇది మనం తరచూ వినే మరియొక ఆవేదన కాని, అభియోగమనండి- కాని, ఆ కొడుకు-కోడలు చెప్పి వెళ్ళితె వచ్చే నష్టమేమిటి? పెద్దవారు వస్తామని మారం చేయరుగా? వీండ్లకు చెప్పేదేమిటి? ఎందుకు చెప్పాలి? అనే అహం తప్ప! అదే తన తల్లితండ్రులు ఇంట్లో ఉంటె ఆమె చెప్పకుండా వెళ్లగలుగుతుందా? ఈ కాలం పరిస్థితులను బట్టి బయటికి వెళ్లేటప్పుడుచెప్పి వెళ్లితె ఆలస్యమైనా ఇంట్లొ ఉన్న పెద్దవారికిఆంధోలన ఉండదు కదా!
పెద్దతనంలో, తల్లిదండ్రులు మాపిల్లలుఇప్పటికీమాకు చెప్పకుండా ఏపని చేయరు, ఎక్కడికివెళ్లరు అనేఒక రకమైనా మానసికసంతృప్తి, భరోసా కోసంఆరాటపడుతుంటారు.వీరు ఎందుకు చెప్పరూ? అని భీష్ముంచుకుంటె మటుకు చివరికి ఇబ్బందిపడేది పెద్దవారె కనుక, నాఉద్దేశ్యం లో, కాలానుగుణంగా అటువంటివి పట్టించుకోకపోవడం అలవాటూచేసుకోవాలి. వయస్సు పెరిగేకొద్దిసంసార లంపటం నుండి బయటపడటానికి ప్రయత్నిస్తుండాలి. భగవంతుడు కోడలి రూపంలో తమకు భవబాంధాల మాయను నుండి విముక్తి కల్గిస్తున్నాడనే భావన తెచ్చుకొంటే ప్రశాంత జీవనం చేయ వచ్చు. మొదట్లోఆచరణకష్టంగా, ఇబ్బందిగా ఉన్నా దుస్సాధ్యంమటుకుకాదు.
అర్దంగాని మరోవిషయం ఎమిటంటే ఒకే వ్యక్తికూతురు తల్లి,/తండ్రిగా ఒక రకంగా; కొడుకు తల్లి/తండ్రిగా ఒక రకంగా ఆలోచించడం. అందరూ ఇలా ఆలోచిస్తున్నారని కాదు, కొద్ది మందైనా ఇలా ఆలోచించి ఇతరులను ఎందుకు హింసిస్తున్నారని? దురదృష్టం ఏమిటంటె వారూ ఆక్షోభ పడ్తూఉండిఉంటారు.
మన కుటుంబ వ్యవస్థలో సాంప్రదాయకంగాతల్లితండ్రులను చూసుకొనే బాధ్యత కొడుకు(ల)ది. నేటిపరిస్థిల దృష్ట్యా (కొడుకులు లేనివారు; కొడుకులు ఉన్నా వారు విదేశాలలోఉండటం వలన) కొన్ని సందర్భాల్లో కూతురు(లు) కూడా తన తల్లితండ్రులను, అత్త మామలతో పాటు చూసుకొనవలసి వస్తున్నది. ఇది స్వాగతించవలసిన విషయమే. మానవత్వం ఉన్న ఏ అత్తమామలుదీన్ని వ్యతిరేకరించరు, వ్యతిరేకించకూడదు కూడా. కనుక వారు వచ్చి ఉండటానికి భర్త అంగీకారం ఉంటుంది. కాని, కొంత మంది, అల్లుడి తల్లితండ్రుల్తో కలసి ఉండటానికి ఇష్టపడనికారణంగా (It’s also a kind of ego problem) వారు కూతురు దగ్గరకు రావడానికి సుముఖత చూపరు. అపుడు సహజంగా ఆమెకి అప్పటిదాక ఆప్యాయంగా చూసుకుంటున్నారనుకొంటున్న అత్తామామలు ఆమెదృష్టిలో విలన్లుగా మారిపోతారు. అంతే, కలసి మెలసి అన్యోనంగా ఉంటున్న కోడలి ప్రవర్తనలో మార్పువచ్చి ఏదోవిధంగా వారిని బయటకు పంపి తన తల్లిదండ్రులనుతెచ్చుకోవాలని పట్టుదలతో ప్రయత్నిస్తుంది.అదే సమయంలో అత్తామామలుకూడా ఆపరిణామానికి తట్టుకోలేక వారూ తప్పటడుగువేస్తే , వారి నిష్క్రమణకి వారే బాధ్యులుగా చూపడానికి కోడలికి మరింత ఆస్కారం కలుగుతుంది. ‘రోగికోరుకుంది, వైద్యుడు ఇచ్చింది ఒకటే మందు’ అవుతుంది. ఇక కొన్నిపరిస్థితులలో, తను కోరుకొన్నట్లు తన తల్లిదండ్రులుతన దగ్గరకు వచ్చి ఉండలేకపోతే, రెండిటికి చెడ్డ రేవడవుతుంది ఆమె పరిస్థితి.
పెద్దవారు విజ్ఞితతో తమ కుటుంబ వాతావరణంమరింత జటిలం, కలుషితం కాకుండా ఎడంగాఉండి, ఒకరికి ఒకరు సాయంగా ఉండటమూ మంచిదే. కాని, ఇలా ఎడంగా ఉండటానికి అవకాశంలేని పరిస్థితులలో అది వారికిఎంత ఇబ్బందికలిగిస్తుందోకదా!!! కనుక, ఇలాంటి సందర్భాలలోకోడలు విజ్ఞతో అత్తమామలతో చర్చించి, తన తల్లిదండ్రులను ఒప్పించడానికి వారి సాయంకూడా తీసుకుంటే కథ సుఖాంతంగా ఉంటుంది. తన మంచితనము మరింత గుభాలిస్తుంది.
సామరస్యంగా ఉన్న సందర్భాలలోనూ, తనపట్ల అత్తామామలు ఇబ్బందిగా ప్రవర్తిస్తున్నారనుకొన్నప్పుడు కోడలు మంచిగా తనఇబ్బందిని వారితో చర్చించుకొంటే బాగుంటుంది. అలాగే అత్తామామలుకూడా చేస్తే బాగుంటుంది. అలాకాకుండా ఉభయులు కోడలి తల్లితండ్రుల దగ్గరకు కేసును తీసుకొని వెళ్లితే కొన్ని సందర్భాలలో, ముఖ్యంగా అవతలివారు అవకాశంకోసం ఎదురుచూస్తున్నప్పుడు కాని; అహంభావులు, కొపిష్టులు అయితేఅది మరింత జటిలంగా మారడానికి అవకాశమిచ్చినట్లవుతుంది. అంతకుముందు ముగ్గురి సమస్య – ఇపుడు ఐదుగురి సమస్య. తద్వారా కుటుంబం పరువు బజారున పడటం కూడా జరుగవచ్చు.
ఒకరి కన్నా ఎక్కువ కొడుకులున్నప్పుడుఅందరికి బాధ్యత వర్తిస్తుంది; కాని, మన సంప్రదాయంలో పెద్దవాడికి ఎక్కువ బాధ్యతను నిర్దేశించారు, తద్వారా పెద్దకోడలికికూడా. అలాగే గౌరవం కూడా, తల్లిదండ్రుల తర్వాత పెద్దన్న, వదినలే తల్లిదండ్రులు. కాని, నేటి సామాజికపరిస్థితులలో ఇది మెల్లమెల్లగా కనుమరుగవుతున్నది. అసలు కుటుంబ వ్యవస్థనేమహావృక్షాన్నినేడు విదేశి సంస్కృతి, విచ్చలవిడితనమనే కాండంపురుగు పట్టి తొలుస్తున్నది.
కోడలు వచ్చాక కొడుకు - తల్లిదండ్రుల అనుబంధంలో మార్పు వస్తుందా?
అంతర్గతంగా (basic) మార్పు ఉండదుకాని, బహిరంగా (outer behavior)ఎంతోకొంత మార్పు అనివార్యము. లేకపోతెకొడుకు తన కొత్త బాధ్యతలు – భర్తగా, తన పిల్లలతండ్రిగా సంపూర్ణ న్యాయం చేకూర్చలేడు, మరియు న్యాయం చేకూరుస్తున్నట్లు ప్రస్ఫుటంగా ప్రకటించుకోవలసిన అవసరంకూడాఉన్నది. అత్యధికశాతం తల్లితండ్రులు, కొడుకు నిరాదరణకు గురైనా , అట్టిపరిస్థితులలోకూడా, విధి నిర్ణయం అనుకొని బాధపెట్టడానికి ఇష్టపడరు; కాని, భార్య, పిల్లలు అలాకాదు – ఏమాత్రము తేడా వచ్చినా తట్టుకోలేరు , కొన్ని సందర్భాలలో నిలదీస్తారు కూడా , వారు అశించేవి (expectations) వేరు. అది వారి హక్కుగా(derived rightsas a wife and children) భావిస్తారు. తనూ ఒక కొడుకుగా ఆస్థితినుండి వచ్చాడు కనుక తన పిల్లల ఆలోచనలు; తన తల్లి, భార్యగా తన తండ్రి దగ్గర కోరుకున్నవి తప్పకుండా గుర్తుకువస్తుంటాయి; అవే అతనికి మార్గదర్శకాలు కూడా.
అసలు ఈ ప్రశ్నే ఎందుకు ఉత్పన్నం అవాలి?
ఒక తల్లికి రెండవబిడ్డ పుట్టినపుడు మొదటి బిడ్డ చంటిబాబు/పాపకు చేసే ఉపచారాలు, గారం చూసి అంతవరకు తను గుత్తమొత్తంగా అనుభవిస్తున్నవి (అదేదైవ లీల! మిగతావాటిలో ఏమి తెలియదుకాని, ఇది మటుకు గుర్తించేటట్లు జ్ఞానానిప్రసాదిస్తాడు) చంటివాడు కొట్టేస్తున్నాడని ఉడుకుమోతుతనంతో, చంటిపాపను గిల్లడం, పాప వస్తువులు లాగడం వగైరా చేస్తారు. అలాగే, 25-30 సంవత్సరాలు తమ పూర్తిసొంతం గా (dedicated sole property) భావిస్తున్నకన్న కొడుకు, ముఖ్యంగా తల్లి, అదిసహజంకూడా,( పెండ్లి జరగటం ఆలశ్యమవుతుంటె ఆపిచ్చి తల్లి మ్రొక్కని దేవుడుండడు, వెళ్లని తీర్ధం, పుణ్యక్షేత్రం ఉండవు, దర్శించని బాబాలు, గురువులు ఉండరు) ఇంకొకరికి స్వంతం అవుతున్నాడు అనే నైరాశ్యమాయలో పడి, విచిత్రం ఎమిటంటే తామే స్వయంగ ఆపనిని ఎంతో ఆనంద ఉత్సాహాలతో, వైభవంగానిర్వర్తించి కూడా; తమకు దూరం అవుతాడేమో అన్న దిగులు, బేల తనంతో కొట్టుమిట్టాడుతుంటారు .
అగ్నికి ఆజ్యం తోడైనట్టు కొడుకు కూడామానవసహజమైన వయస్సు ఉరకలవల్లన, క్రొత్తగా తన జీవితంలో ప్రవేశించిన భార్య వైపు తన సావధానతను (attention) మరల్చడం జరుగుతుంది. అది అవసరంకూడా, ఎందుకంటె తమ కుమారుడు తను చేపట్టిన (భర్తగా) నూతన బాధ్యతలుసరిగా నిర్వర్తించలేకపోయినా అదీ వారికే బాధ. అంతేకాకుండా తామూ కూడా (అత్తమామలు) ఆస్థితి నుండే కదా అత్తమామలస్థికి వచ్చింది.
ఈ సంకట స్థితి నుండి త్వరగా తేలుకొనేదిమామగారు; ఎందుకంటే తండ్రి కొడుకు మీదవాత్సల్యాన్ని ఎప్పుడు మనసులో దాచుకుంటాడు అలాగే కొడుకు కూడా తండ్రిమీద ప్రేమను లోపలదాచుకొని, గౌరవాన్ని మాత్రం చూపుతుంటాడు. అందుకని వారిద్దరి మధ్యఅంతగాదూరం పెరగదు. కాని తల్లి ప్రేమ అలాంటిదికాదు. అలాగే భార్యకూడా ఓ స్త్రీ, ఎన్నొ ఆశలపల్లకిలో వచ్చింది. కనుక వారిద్దరి మధ్య ఒకరకమైన పోటిలాంటిది, ఘర్షణ నలుగుతుంటుంది. అందుకే వారు ఒకరికి ఒకరు విలనుల్లాగా ఊహించుకుంటూ ఉంటారు. ఏమాత్రం చిన్న తేడా వచ్చినా అది చిలికి, చిలికి గాలి వానలాగా మారుతుంది. అందుకని, క్రొత్త కోడలు రాగానే తండ్రి కొడుకులు చాలా జాగురూకతతో, సమయస్ఫూర్తిగా వ్యవహరించవలసి ఉంటుంది.
నేడు, ఎక్కువ మంది తల్లిదండ్రులు, వారి, వారి ఉద్యోగ, వ్యాపార, ఇతరత్రా బాధ్యతల వల్ల(వారి తల్లిదండ్రులను చూసుకోవడం వగైర)కొడుకుల దగ్గర ఉండే అవకాశం ఎలాగు ఉండటము లేదు. అలాగే, విదేశాలలో ఉంటున్న పిల్లల్ల దగ్గరకూడా ఉండే అవకాశం తక్కువ. అందుకనే వారూ విడిగానే ఉంటున్నారు. కనుక కలుసు కున్నప్పుడు ఏమాత్రం చిన్న ఇబ్బంది, మార్పు కలిగిన (shifting of attention or paying more attention towardsother) దానినిఉభయులుభూతద్దంలో చూసుకొని, సాధింపులుమొదలెట్టి, అపోహలనే కలుపుమొక్కలు స్వయంగా నాటుకొని, అనురాగాప్యాతలనే పరిమళ భరిత మొక్కలను ఆదిలోనే కనుమరుగుచేసుకొంటున్నారు. కొండకచో కోడలు తల్లిదండ్రులు, ఆడపడుచు(లు) కూడా కలుపమొక్కలకుగట్టిపోషణ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కనుక కోడళ్లూ బహుపరాక్. భావి జీవితం మీదే కనుక మీ శక్తి యుక్తులన్నిమీ స్వంతఇంటిని ఆనందమయంగా నడుపుకొనడానికి విజ్ఞత చూపండి.
అమ్మాయి పెళ్ళైన కొత్తలో పుట్టింటి వారితో ఎలా వుండాలి?
అత్తగారింట్లో ఎలా ఉంటే మరింతగా సర్దుకుపోవటానికీ, వారితో కలిసిపోవటానికీ, అక్కడి పరిస్థితులకి తగిన విదంగా తనని తను మార్చుకోవటానికీ అవకాశం ఉంటుంది?
పూర్వం మనవాండ్లు ‘ఆడపిల్ల’అని సంబోధించడంలోనే పై ప్రశ్నకు స్థూలంగా సమాధానం ఉన్నది. ఆదెళ్ళ శైలబాల గారు వ్రాసిన ‘నాన్న’ నవల్లో (సాయిబాబా పబ్లికేషన్స్, బాపట్ల, ఏప్రియల్,2013)ఈ ప్రశ్నకు చక్కటి పరిష్కారాలు, సమాధానాలు మనకు కనుపిస్తాయి.
అత్తారింటికివచ్చిన ఆడపిల్ల, కష్టతరమైనా (ఇపుడు అంతకష్టతరం కాదనుకొంటాను – ఎక్కువమంది చదువులు, ఉద్యోగాలరీత్యా, తమవారికి దూరంగానే ఉంటున్నారు) పుట్టింటి వారితో అవసరమైన మేర సాన్నిహిత్యాన్ని ఉంచుకొంటూ; భర్త, అతని కుటుంబసభ్యులకు దగ్గర అవుతుంటే వారితో అనుబంధంపెరగడానికి అవకాశం ఉంటుందికదా!
ముఖ్యంగాచరవాణిలో అవసరమున్నా లేకున్నా ప్రతిదీ అమ్మలకు ఫోను చేసి అడిగి తెలుసుకొనడానికి ప్రయత్నించే బదులుదగ్గరున్న అత్తగారిని (లేదా అదేచరవాణిని అమ్మకు బదులు అత్తగారికి చేస్తే) అడిగితే, అది ఆవిడికీ సంత్రుప్తిగా ఉంటుంది, వారి పద్ధతి ప్రకారం నడుచుకొనడానికి తేలికగ ఉంటుంది; వారికి ‘మాకోడలు పిల్ల నన్నడకుండా ఏమి చేయదు’ అనే ఒక భరోసా, ఆనందం. తద్వార ఘర్షణకు తావుండదు.
మనం ఒక చోటపనిచేసి, ఆ అనుభవంతో క్రొత్త సంస్థలో చేరినపుడు, మనకు సందేహము వచ్చినపుడు అక్కడి మేనజర్లసలహాల ప్రకారమ నడుచుకుంటాము కాని, పాత సంస్థలో వారిని ముందు సంప్రదించము కదా; వీరు మనకు దారి చూపలేకపోతె అప్పుడు మాత్రమే మనం మనకు నమ్మకంఉన్నవారిని సంప్రదిస్తాము. అలాగేఇక్కడాకూడా.
ఇంకొకటి, పుట్టింటివారు అత్తింటివారికన్నాసంపన్నులైనా, హోదాలోఉన్నా మరింత జాగ్రత్తఅవసరము. అత్తింటివారిని ఎప్పుడూకించపరస్తూ, చిన్నబుచ్చుతూ మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. పుట్టింటివారు వారి ఆధిక్యతను తమ అత్తవారిపై చూపకుండా వారికి నచ్చచెప్పాలి. అలాగే పుట్టింటివారు, తరచూ అత్తింటివారింటిలో అమ్మాయిని సరిగా చూసుకుంటున్నారో లేదో అనిరోజూ ఫోనులుచేసి గంటలు తరబడి ఆ అమ్మాయిని అత్తింటివారితో పొసగనీయకుండా చేయకూడదు. అలా జరుగుతున్నప్పుడు, అమ్మాయే, సున్నితంగా, వారికి తనకు ఏమి ఇబ్బందిలేదని, అవసరమైతే తనే ఫోను చేస్తానంటే కొంతసమస్యకు పరిష్కారము అవుతుందికదా!
ఏదైనామార్పు జరగినపుడు కొంత ఇబ్బందులు తప్పవు; వాటిని ముందే మనము గుర్తెరిగి, వాటికి సరిఐన ప్రణాలిక తయారుచేసుకొని, మన మార్పులో భాగస్వామ్యం ఉన్నఇతరులకు కూడావాటిని, వారు నొచ్చుకొనకుండా, జాగ్రత్తగా, మృదువుగా తెలియచెప్పి, అమలు చేసుకుంటే మనం అనుకొన్నది సాధించడానికి ఎక్కువ అవకాశంఉన్నది. ఏమైనా వారి, వారి పరిస్థితుల బట్టి సరిఐన పరిష్కారం ఎన్నుకొని ప్రయత్నించవలసి ఉంటుంది.
క||వినదగు నెవ్వరు సెప్పిన
వినినంతనే వేగపడగవివరింపఁదగున్
గనికల్ల నిజముఁ దెలిసిన
మనుజుఁడెపో నీతిపరుడు మహిలోసుమతీ!
(ఎవరు చెప్పినా వినాలి; కాని వాటి ప్రకారం తొందర బడి నిర్ణయాలు తీసుకొనకుండా మంచి, చెడు (అబద్ధం,నిజము) గుర్తించి జాగ్రత్తగా ఆలోచించే వారే (నిర్ణయాలు తీసుకొనేవాడు)నేర్పరులు (న్యాయము,ధర్మము తెలిసినవారు).
సర్వే2 త్ర సుఖినస్సన్తు|
సర్వేసన్తు నిరామయాః|
సర్వే భద్రాణి పశ్యన్తు|
మాకశ్చిద్దుఃఖ భాగ్భవేత్||
******