Translate

25 November, 2014

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి)-113



తెలుగు సుద్దులు…..(113)
               
కం||తను వలచిన దా వలచును
     తను వలవక యున్న దన్ను దా వలవడి`లం
     తనదు పటాటోపంబులు              
     తన మాయలు పనికిరావు ధరలో వేమా!.         
భావముః
ఎవరైనా ఎదుటవారిని (ఇతరులను) అభిమానిస్తే, ఆదరిస్తే, ప్రేమిస్తే, వారు తిరిగి అభిమానిస్తారు. ప్రపంచంలో తను ఇతరులను అభిమానించకపోతే వారు తనని అభిమానించరు. కేవలము తన డాబు, దర్పము, హంగామా, అనవసర ఆడంబరము ఎంత చూపినా (ప్రదర్శించినా), ఆర్భాటం చేసినా, అభిమానము పొందలేరు. తన వలే ప్రపంచము కూడా (ఇతరులూ) ఉంటుంది కనుక తన మాయలు ఏవీ ఉపయోగించవు. కనుక ప్రేమించబడాలంటే ప్రేమించడం నేర్చుకో మానవా అని వేమన హితవు పలుకుతున్నారు.
అంతేకాకుండా, భగవంతుని అనుగ్రహము, దయ, ప్రేమ పొందాలంటే ఆడంబర పూజాపునస్కారాలు, క్రతువులు కాదు హృదయపూర్వక ఆర్తితో కూడిన భక్తి (ప్రేమ, ఆరాధన, సమర్పణ) అవసరమని కూడా బోధిస్తున్నట్లున్నది.
||25-11-2014||

24 November, 2014

मंगलकर नाद्स्वर...మంగళకర డోలు, సన్నాయి మేళం....South Indian Traditional Auspicious Music


Puppet Show...జీవితమే ఓ తోలుబొమ్మలాట...సూత్రధారి ఆ పరమాత్మే...कटपुतली शॉ




తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి)-112

తెలుగు సుద్దులు…..(112)
ఆ.వె||వెదుక వెదుక దొరుకు వేదాంత వేద్యుండు;
        వెదుకువాని దాను వెదుకుచుం`డు;
        వెదుకనేర్చిన`ట్టి వెరవర్లు గలరకో?
        విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
వెదకంగా, వెదకంగా వేదములనుగురించి సంపూర్ణజ్ఞానముగల మహాత్ముడు (బ్రహ్మతత్వము తెలిసినవాడు) – మంచిగురువు లభిస్తాడు; అలాగే గురువుకూడా తనకు సరిపడిన శిష్యుని గురించి వెదుకుతుంటాడు. కాని, ఎక్కడైనా ఓపికగా వెదకి, సరిఐనవానిని (గురువు/శిష్యుడు) పొందగల నేర్పరులున్నారా? అట్టివారు అరుదు అని వేమన మనకు తెలిజెప్పుతున్నట్లున్నది. అంతేకాక, సాధకుడు తన గురువును ఎన్నుకొనేటప్పుడు; అలాగే శిష్యునిగా ఒకరిని అనుగ్రహించేటప్పుడు గురువు తీసుకోవలసిన జాగ్రత్తకూడా ఇందులో వ్యక్తపర్చినట్లున్నది. వేదాంత వేద్యుడు అంటే పరమాత్ముడని (సర్వేశ్వరునిగా) భావిస్తే, పరమాత్మ అందరిలొ కలసిపోయిఉంటాడు కనుక అతనిని గుర్తించడం కష్టతరము, దానికి నేర్పరితనము (అంతరదృష్టి అవసరముకనుక) అవసరమని, పరమాత్మకూడా అట్టివానికోసం అనుగ్రహించడానికి వెదుకుతుంటాడని (ఎదురుచూస్తుంటాడని), తనను తానుతెలుసుకోవటం యొక్క ఆవశ్యకతను కూడా వేమన తెలుపుతున్నట్లున్నది. ||23-11-2014||

23 November, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 006 (026 – 030)


ఓం గణేశాయనమఃగురుభ్యోనమః  
__/\__

నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|

[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి(క్విజ్)పుస్తకము (1994) ఆధారంగా]
  1. లాక్షా గృహం నిర్మించినదెవరు?  నిప్పు పెట్టినదెవరు?
  2. దేవయానిని నూతిలోకి త్రోసినదెవరు? ఉద్ధరించినదెవరు?
  3. సుదర్శనచక్రం కృష్ణునికి ఎలా వచ్చింది?
  4. లక్కయింటి నుండి సొరంగం త్రవ్వటానికి ఖనకుని పంపించినదెవరు?
  5. భీష్ముడు ఎవరి అంశతో పుట్టాడు?                                                                                         

సమాధానములు (జవాబులు):

1. (అ) పురోచనుడు (ఆ) భీముడు.
    దుర్యో ధనుడునిర్ణయించిన సమయానికి కొద్దిముందుగానే భీముడు,తల్లినీ,సోదరులనూ సొరంగంలో ప్రవేశపెట్టి,
    లక్కయిల్లుకు నిప్పుపెట్టి సొరంగంలోకి వెళ్ళిపోతాడు.– ఆది పర్వము - షష్ఠాశ్వాసము – 160 వచనము
వ॥ఆకృష్ణచతుర్దశినాఁడు కుంతీదేవి యప్పురంబునం గల బ్రాహ్మణ పుణ్యాంగనా జనంబుల కెల్ల
     నిష్టాన్నపానదానంబులం దుష్టి సేసి దేవపూజగావించియున్నెడం బురోచను పంపిన నిషాదవనిత సపుత్ర యై
     బహువిధ వన్యమూలఫలంబులు దెచ్చి యిచ్చుచ్చుం గుంతీదేవిం బాయక సేవించి పాండవకృత్యంబులు
     నిత్యంబును నెఱింగించు చుండెడునది నాఁటిరాత్రి యుత్సవంబునం గాల చోదిత యై తానునుం
     దనయేవురుగొడుకులు నధిక మధుపానమదంబున మెయి యెఱుంగక లక్కయింటి పక్కంబున నిద్రవోయిన
     నర్ధరాత్రంబు నప్పుడు భీముండు మేల్కని పురోచనుకంటె ముందఱఁ దాన యుత్సహించి
     వానిశయనగృహద్వారంబున ఘోరానలంబు దరికొలిపి చెచ్చెరఁ దల్లిని నన్ననుం దమ్ములను బిలంబులోని
     కనిచి యాయుధాగారంబుతోడన లాక్షాగారంబు హుతాశనున కశనంబు సేసి ఖనకునకుం దమకుశలగమనం
     బెఱింగించి బిలప్రవిష్టుం డయి కుంతిని ధర్మార్జున నకుల సహదేవులను బిలంబు వెలువరించి తోడ్కొని
     చనునప్పుడు. (160)

2. (అ) వృషపర్వు కూతురు, శర్మిష్ట  (ఆ) యయాతి.
    శర్మిష్ట, తన చెలులు, దేవయానితో కలసి ఉద్యానవనానికి వెళ్ళి, ఒక సరోవరంలో జలక్రీడలాడుకొన్నాక,
    ముందుగా వచ్చి, సుడిగాలి వలన వారి వస్త్రములు కలసిపోగా, దేవయాని చీర కట్టుకొంటుంది. అందువలన,
    శర్మిష్ట దేవయానిని తన  చీర కట్టుకొనమంటుంది.దేవయాని శర్మిష్ట విడిచిన చీర కట్టనంటుంది.  ఇద్దరూ ఎవరకు
    వారు తాము గొప్పని,  పరస్పరము వాదులాడుకొంటారు. అప్పుడు శర్మిష్ట కోపంతో తన సఖులతో కలసి
    దేవయానిని నూతిలోకి త్రోసి వెళ్ళుతుంది.  వేటకై వచ్చిన యయాతి మహారాజు చూసి దేవయానిని ఉద్ధరించాడు
    (రక్షించాడు).– ఆది పర్వము - తృతీయాశ్వాసము – 134,136,138,141,143,145 వచనములు &
    135,137,139,140,142,144 పద్యములు

వ॥ఇట వృషపర్వుకూఁతురు శర్మిష్ట యనుకన్యక యొక్కనాఁడు కన్యకాసహస్రపరివృత యయి
     దేవయానీసహితంబు వనంబునకుం జని యొక్కసరోవరతీరంబునఁ దమతమ్ పరిధానంబులు పెట్టి జలక్రీడ
     లాడుచున్న నవి సురకరువలిచేతం బ్రేరితంబు లయి కల్సిన నొండొరులం గడవఁ గొలను వెలువడు
     సంభ్రమంబున నక్కన్యక లన్యోన్యపరిధానంబులు వీడ్వడం గొని కట్టునెడ దేవయానిపుట్టంబు శర్మిష్ఠం గట్టికొనిన
     మఱి దానిపరిధానంబు దేవయాని పుచ్చుకొనక రోసి శర్మిష్ఠం జూచి యి ట్లనియె. (134)

క॥లోకోత్తర చరితుం డగు
     నాకావ్యుతనూజ నీకు నారాధ్యను నేఁ
     బ్రాకటభూసురకన్యక
     నీకట్టినమైల గట్ట నేర్తునె చెపుమా. (135)

వ॥అనిన శర్మిష్ఠ యి ట్లనియె. (136)

క॥మాయయ్యకుఁ బాయక పని
     సేయుచు దీవించి ప్రియముసేయుచు నుండున్
     మీయయ్య యేటి మహిమలు
     నాయొద్దనె పలుక నీకు నానయు లేదే. (137)
వ॥నాకట్టినపుట్టంబు నీకుం గట్టంగాదు గాకేమి యని గర్వంబున నెగ్గులాడి దేవయాని నొక్కనూతం ద్రోచి శర్మిష్ఠ
      కన్యకాసహస్రపరివృత యయి క్రమ్మఱి వచ్చి నిజనివాసంబున నుండె నంత. (138)
ఉ॥ఆనహూషాత్మజుం డగుయయాతి యధిజ్యధనుస్సహాయుఁ డై
     యానత శాత్రవుండు మృగయాలస్లొలనిబద్ధబుద్ధిఁ ద
     త్కానన మెల్లఁ గ్రుమ్మరి నికామపథిశ్రముఁ డేగుదెంచె నం
     దానలినాక్షి యున్నవిపినాంతరకూపతటంబునొద్దకున్. (139)
సీ॥చనుదెంచి యమ్మహాజనపతి జల మపేక్షించి యచ్చో విశ్రమించి చూచి
     తత్కూపమున విలసత్కూలఘనవల్లి యన్నిష్టసఖి సూఁది యున్న దాని
     గురుకుచయుగముపైఁ బరువడిఁ దొరఁగెడు కన్నీరు పూరించుచున్న దానిఁ
     దనసమీపమునకు జనులయాగమనంబు పన్నుగాఁ గోరుచు నున్నదాని
ఆ॥వరుణ దేవుతోడఁ గర మల్గి జలనివా
      సంబు విడిచి భూస్థలంబువలని
      కరుగుదేర నున్న వరుణేంద్రు దేవియ
      పోనిదాని దేవయానిఁ గనియె. (140)
వ॥కని నీ వెవ్వరిదాన వి ట్లేల యేకతంబ యివ్విపినాంతరకూపంబున నున్నదాన వనిన విని దేవయాని
     యెప్పుడుం దమవిహరించు చున్న యవ్వనంబునకు మృగ యావినోదార్థంబు యయాతి వచ్చుటం జేసి
     తొల్లియుఁ జూచినది గావున నాతని నెఱింగి యి ట్లనియె. (141)
తరలము॥అమరసన్నిభ యేను ఘోరసురాసురాహవభూమి న
                య్యమరవీరుల చేత మర్దితు లైనదానవులన్ గత
                భ్రములఁగాఁ దనవిద్య పెంపునఁ బ్రాప్తజీవులఁ జేసి య
                త్యమితశక్తిమెయిన్ వెలింగినయట్టిభార్గవుకూఁతురన్. (142)
వ॥దేవయాని యనుదానఁ బ్రమాదవశంబున నిన్నూతం బడి వెలువడ నేరకున్న దానను న న్నుద్ధరించి రక్షింపు
      మనిన నవ్విప్రకన్యకయందుఁ దద్దయు దయాళుం డై. (143)
చ॥జలధివిలోలవీచివిలసత్కలకాంచిసమంచితావనీ
     తలవహనక్షమం  బయిన దక్షిణహస్తమునం దదున్నమ
      ద్గళదురుఘర్మవారికణకమ్రకరాబ్జము వట్టి నూతిలో
      వెలువడఁ గోమలిం దిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్. (144)
వ॥ఇఅట్లు దేవయాని నుద్ధరించి యయాతి నిజపురంబున కరిగె....    (145)                                                                                                          

3.కృష్ణునికి సుదర్శన చక్రము అగ్నిదేవుడిచ్చాడు. - ఆది పర్వము - అష్టమాశ్వాసము – 254 వచనము
వ॥....సహస్రకరసహస్రదుస్సహమహఃపటలభాసురం బగుచు దేవ దైత్య దానవ యక్ష రాక్షస పిశా
     చోరగప్రశమనంబయి వెలుంగు చున్న సుదర్శనం బను చక్రంబును గౌమోదకి యనుగదయును నారాయణున
     కిచ్చె నట్లు సంప్రాప్తదివ్యచాపరథాయుధులయి యున్ననరనారాయణులం జూచి యగ్ని దేవుం డి ట్లనియె.
     (254)

4.విదురుడు. -  ఆది పర్వము - షష్ఠాశ్వాసము – 158 వచనము
వ॥అట హస్తిపురంబున విదురుండు దుర్యోధనుదుర్మంత్రం బంతయు నిమ్ముగా నెఱంగి కడువిశ్వాసి నొక్కఖనకు
     నతికుశలుం బాండవులపాలికిం బుత్తెంచిన వాఁడును వచ్చి రహస్యంబునం బాండవులం గని తన్ను
     నమ్మునట్లుగా విదురు సాభిజ్ఞానవచనంబు లెఱింగించి యీ కృష్ణచతుర్దశినాఁటిరాత్రి పురోచనుండు లక్కయింట
     దహనంబు దరికొల్పుం గావున నిం దుండి మీకు వెలువడి పోవు నట్టియుపాయంబు మారాజునియోగంబునం
     జేయ వచ్చితి నని చెప్పి లక్కయిల్లు వెలువడునట్లుగా నొక్కబిలంబు నెవ్వరు నెఱుంగకుండం జేసి వారల
     కెఱింగించిన భీముండు దాని నిమ్ముగా శోధించి యెఱింగి యుండునంత. (158)

5.అష్టవసువులలో ఎనిమిదవ వాడయిన ప్రభాసుని అంశతో భీష్ముడు పుట్టాడు. - ఆది పర్వము –
   తృతీయాశ్వాసము – 77 పద్యము
క|| ముదమునఁ బ్రభాసుఁ డను నెని
     మిదియవ వసునంశమునను మేదినభీష్ముం
     డుదయించె సర్వవిద్యా
     విదుఁ డపజితపరశురామవీర్యుఁడు బలిమిన్. (77)
******

22 November, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 005 (021 – 025)

 ఓం గణేశాయనమః గురుభ్యోనమః 
__/\__
నారాయణం నమస్కృత్య  నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి(క్విజ్)పుస్తకము (1994) ఆధారంగా]


1. కుమారాస్త్ర విద్యాప్రదర్శనం తరువాత దుర్యోధనుడు “ఱొమ్ము మీదచేయి వేసుకొని హాయిగా నిద్రపోయాడు”
    ఎందుచేత?
2. కృపుని తండ్రి ఎవరు? అతడు చిన్నతనంలో ఎవరి దగ్గర పెరిగాడు?
3. తన అల్లునికి ముసలితనం కలుగుగాక అని శపించినది ఎవరు? ఆ అల్లుడెవరు?
4. శతశృంగం నుండి వచ్చిన తరువాత పాండవులు హస్తినలో ఎన్నేళ్ళు ఉన్నారు?
5. లక్కయింటికి వెళ్ళేటప్పటికి ధర్మరాజు వయస్సెంత?

సమాధానములు (జవాబులు):

1. కర్ణుని సాయంతో అర్జునుని మీద భయం పోయింది. – ఆదిపర్వం – షష్ఠాశ్వాసము – 63 పద్యం.
క|| వినుతధనుర్విద్యావిదు,
     ఘనుఁ గర్ణు సహయుఁ బడసి కౌరవవిభుఁ డ
     ర్జునువలనిభయము సెడి ఱొ,
     మ్మునఁ జే యిడి నిద్రవోయె ముదితాత్ముండై. (63)

2. శరద్వంతుడు. గౌతముని పుత్రుడైన శరద్వంతు ఘోరతపస్సుకు భయపడి, ఇంద్రుడు, జానపది అనె ఆమెను
    పంపగా, ఆమెను జూసి మోహితుడై రేతఃపాతము (వీర్యము పడుట) గావించె. అది తెలుసుకొని, శరద్వంతుడు
    అక్కడినుండి తప్పస్సు చేసుకొనుటకు వేరే ప్రదేశమునకు పోయెను. ఆ వీర్యము ఒక శరస్తంబంబున (రెల్లు)
    పడి, రెండు భాగములై, ఒక పిల్లవాడు, ఒక పిల్ల గా జన్మించిరి.  తదనంతరము వేటకు వచ్చిన శంతనుని,
    సేనాధిపతి ఆ పిల్లలను, శరచాపకృష్ణాజినంబులను జూచి, శంతనునికి చూపగా, అతను కృపతో (దయతో)
    వారిని తీసుకొని వెళ్ళి పెంచెను.  అందుకని వారిని, కృపుడు, కృపి అని పిలవబడిరి. కృపుడు చిన్నతనంలో
    శంతనుని దగ్గర పెరిగాడు.ఆదిపర్వం –  పంచమాశ్వాసము -185-187 పద్యములు &188 వచనము
సీ॥వినవయ్య గౌతముం డనఁ బ్రసిద్దుం డైనమునికి శరద్వంతుఁ డనుమహాత్ముఁ
     డురుతర తేజుఁ డై శరసమూహంబుతో నుదయించి వేదముల్ చదువ నొల్ల
     కతి ఘోరతపమున నుతభూసురోత్తముల్ వేదముల్ చదువున ట్లాదరమున
     సర్వాస్త్రవిదుఁడు ధనుర్వేద మొప్పఁగఁ బడసి మహానిష్ఠఁ గడఁగి తపము
ఆ॥సేయు చున్న దివిజనాయకుఁ డతిభీతి
      నెఱిఁగి వానితపముఁ జెఱుపఁ బనిచె
      జలజనయనఁ దరుణి జానపది యనెడు
      దాని నదియు వచ్చె వానికడకు. (185)
క॥అమ్ముదితఁ జూచి కాముశ
     రమ్ములచేవిద్ధుఁ డై శరద్వంతుఁడు చి
     త్తమ్మలర మదనరాగర
     సమ్మునఁ ద న్నెఱుఁగ కుండెఁ జంచలతనుఁ డై. (186)
క॥ఆతరుణి కటాక్షేక్షణ
     పతము గౌతమున కపుడు పటుబాణధనుః
     పాతముతోడన రేతః
     పాతము గావించె రాగపరవశుఁ డగుటన్.(187)
వ॥దాని నెఱంగి శరద్వంతుం డయ్యాశ్రమంబు విడిచి చని యొండు చోటం దపంబు సేయు చుండె నవ్వీర్యం
     బొక్కశరస్తంబంబున ద్వివిధం బయి పడిన నందొక కొడుకునుం గూఁతురుం బుట్టి రంత శంతనుండు
     మృగయావినోదార్థం బరిగి వానిసేనాగ్రచరుండాశర స్తంబంబున నున్నకొడుకుం గూఁతుఁదత్సమీపంబున నున్న
     శరచాపకృష్ణాజినంబులుం జూచి యివి యెయ్యేనియు నొక్కధనుర్వేదవిదుం డయినబ్రాహ్మణునపత్యం బగు నని
     శంతనునకుం జూపిన శంతనుండును వారలఁ జేకొని కృపాయత్తచిత్తుం డయి పెనుచుటం జేసి
     యయ్యిరువురుఁగృపుడును గృపియు ననం బెరుగు చున్నంత. (188)

3. శుక్రుడు.  యయాతి – ఆదిపర్వం – తృతీయాశ్వాసము – 187 వచనము
 వ॥అయ్యయాతియు దానిం బట్టువఱచుచుఁ దోడన చని శుక్రుం గని నమస్కరించి యున్న నద్దేవయాని
      గద్గదవచన యై యధర్మంబున ధర్మంబు గీడ్పఱిచి యిమ్మహీశుం డాసురంబున నాసురియం దనురక్తుండై
      పుత్రత్రయంబు వడసి నా కవమానంబు సేసె ననిన విని శుక్రుండు యయాతి కలిగి నీవు యౌవన గర్వంబున
      రాగాంధుండ వై నాకూఁతున క ప్రియంబు సేసితివి కావున జరాభారపీడితుండవు గమ్మని శాపం బిచ్చిన
      నయ్యాయాతి శుక్రున కిట్లనియె. (187)

4. 13 సంవత్సరములు. ఆదిపర్వం – షష్ఠాశ్వాసము – 142 వచనము
 వ॥అని పంచినం బురోచనుం డతిత్వరితగతి నరిగి దుర్యోధను కఱపినరూపున వారణావతంబున లాక్షాగృహంబు
      రచియించుచుండె నిట యుధిష్ఠిర భీమార్జున యములుంగ్రమంబునం దొల్లి షోడశపంచదశ చతుర్దశ
      త్రయోదశవర్ష జాతులయి శతశృంగంబున నుండి హస్తిపురంబునకు వచ్చి యందుఁ గౌరవులం గలసి
      యస్త్రవిద్యలం గఱచుచుం బదుమూఁడేం డ్లుండి యపుడు ధృతరాష్ట్రునియోగంబున వారణావతంబునకు
      జననీసహితంబుగాఁ బోవ సమకట్టి మహాజవసత్త్వ సమేతంబు లయిన హయంబులం బూనినరథంబు లెక్కి
      ధనుర్ధరు లయి హస్తిపురంబు వెలువడునపు డప్పురంబునం గలబ్రాహ్మణక్షత్రియ ప్రముఖానేకజనంబులు
      శోకసంతప్త హృదయు లయి. (142)

5. 29 సంవత్సరములు (16+13=29; ధర్మరాజుకు పదహారు సంవత్సరము లప్పుడు శతశృంగమునుండి హస్తినకు
    వచ్చెను; అచట పదమూడు సంవత్సరములు ఉన్న తరువాత వారణావతమునకు (లక్క ఇంటికి)
    పంపబడెను.). – ఆదిపర్వం - షష్ఠాశ్వాసము – 142 వచనము
*****

“Sai Inspires from Prasanthi Nilayam” నుంచి వచ్చిన టపాలనుండి సేకరించిన శ్రీ సత్యసాయిబాబా వారి పొటోలు, “Radio Sai” నుండి సేకరించిన వాద్యసంగీతం ఉపయోగించి తయారుచేసిన అంజలి పూర్వక వీడియో…


21 November, 2014

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి)-111

తెలుగు సుద్దులు…..(111)
ఆ.వె||గాలి గాలి గలసె గగనంబు గగనంబు,
        మన్ను మన్ను గలసె మంట మంట;
        నీరు నీట గలసె నిర్మలంబై`యుండె
        విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
గాలి గాలితో కూడినపుడు, ఆకాశము ఆకాశముతో కూడినపుడు, మట్టి మట్టితో కూడినపుడు, నీరు నీటితో కూడినపుడు స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటాయి. పంచ భూతాత్మకమైన - గాలి, ఆకాశము, మట్టి, అగ్ని, నీరు – శరీరము లోని ఆత్మ, పంచభూతలకు మూలాధారమైన పరమాత్మ ఒకటే అని గ్రహించినపుడు, ఐక్యతపొందినపుడు ముక్తి (స్వచ్ఛత, నిర్మలత్వము) పొందవచ్చని వేమన తెలుపుతున్నట్లున్నది. ||21-11-2014||

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 004 (016 – 020)

 ఓం గణేశాయనమః గురుభ్యోనమః 
__/\__
నారాయణం నమస్కృత్య  నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి(క్విజ్)పుస్తకము (1994) ఆధారంగా]

  1. దుష్యంతుని కొడుకు భరతుని మొదటి పేరేమి?
  2. భారతంలో “కణికనీతి” అని ఒక ప్రసిద్ధ ఘట్టం – అది ఎవరు ఎవరికి చెప్పారు?
  3. జనమేజయుని సర్పయాగమును మాన్పించినదెవరు?
  4. శకుంతల జన్మతః ఎవరి కూతురు?
  5. అగ్నికి అజీర్ణరోగం ఎందువల్ల వచ్చింది? ఎలా పోయింది?

సమాధానములు (జవాబులు):

1. సర్వదమనుడు. భరతుడు అడవిలోని జంతువులన్నిటినీ దమియించుటచే(అణఁచు), ఆశ్రమములోని
    మునులు అతనికి ‘సర్వదమనుడ’ ను పేరు పెట్టారు. - ఆదిపర్వం – చతుర్థాశ్వాసము – 65 వచనం
వ॥ఇట్లు వనంబులోని సర్వసత్త్వంబులను దనమహాసత్త్వంబునంబునంజేసి దయియించుచున్నయాతనిం జూచి
     యాశ్చర్యం బంది యందలిమును లెల్ల నాతనికి సర్వదమనుం డనునమంబుఁ జేసిరి కణ్వమహామునియు
     నక్కుమారు నుదార తేజోరూపవిక్రమగుణంబులకు సంతసిల్లి వీఁ డఖిలభువన యౌవతరాజ్యాభిషేకంబునకు
     సమర్థుం డగు (సమయం బరుగు) దెంచె నని విచారించి యొక్కనాఁడు గూఁతునకి ట్లనియె.(65)

2. కణికుఁడు, శకుని ఆప్తమంత్రి, దుర్యోధనునకు చెప్పిన రాజనీతియే ‘కణికనీతి’. - ఆదిపర్వం – షష్ఠాశ్వాసము –
   101-119 పద్యములు; 120 వచనము
ఆ॥ననిన వినియుఁ గణికుఁ డనువాఁడు సౌబలు
      నాప్తమంత్రి నీతులందుఁ గరము
      కుశలుఁ డైనవాఁడు కురుకులవల్లభు
      నిష్టమునకుఁ దగఁగ నిట్టు లనియె.(101)
తరువోజ॥ధరణిశుఁ డుద్యతదండుఁ డై యుచితదండవిధానంబుఁ దప్పక ధర్మ
               చరితులఁగా మహీజనుల రక్షించి సద్వృత్తుఁ డగునది సర్వవర్ణములు
               వరుసన తమతమవర్నధర్మముల వర్తిల్లుదురు గడవక దండభీతి
               నరిమిత్రవర్జితుఁ డై సమబుద్ధి యగుమహీవలభుననుశాసనమున.(102)
క॥గుఱుకొని కార్యాకార్యము
     లెఱుఁగక దుశ్చరితుఁడయి యహితుఁ డగునేనిన్
     మఱవక గురు నైనను జను
     లెఱుఁగఁగ శాసించునది మహీశుఁడు బుధ్ధిన్.(103)
క॥ధీరమతియుతులతోడ వి
     చారము సేయునది మును విచారితపూర్వ
     ప్రారబ్ధమైనకార్యము
     పారముఁ బొందును విఘాతపదదూరం బై. (104)
క॥జనపాలుఁడు మృదుకర్మం
     బున నైనను గ్రూరకర్మమున నైనను నే
     ర్పున నుద్ధరించునది త
     న్ననపాయతం బొంది చేయునది ధర్మంబుల్. (105)
క॥అమలినమతి నాత్మచ్ఛి
     ద్రము లన్యు లెఱుంగ కుండఁ దా నన్యచ్ఛి
     ద్రము లిమ్ముగ నెఱుఁగుచు దే
     శముఁ గాలము నెఱిఁగి మిత్రసంపన్నుం డై. (106)
క॥బలహీను లైనచొ శ
     త్రులఁ జెఱచుట నీతి యధికదోర్వీర్యసుహృ
     ద్బలు లైనవారిఁ జెఱుపఁగ
     నలవియె యక్లేశసాధ్యు లగుదురె మీఁదన్. (107)
క॥అలయక పరాత్మకృత్యం
    బుల మది నెఱుఁగునది దూతముఖమునఁ బర భూ
    ములవృత్తాంతము లెఱుఁగఁగఁ
    బలుమఱుఁ బుచ్చునది వివిధపాషాండతతిన్. (108)
క॥నానావిహారశైలో
     ద్యానసభాతీర్థదేవతానుగృహమృగయా
     స్థానముల కరుగునెడ మును
     మానుగ శోధింపవలయు మానవపతికిన్. (109)
తే॥వీరు నమ్మంగఁ దగుదురు వీరు నమ్మఁ
     దగరు నాఁగను వలవదు తత్త్వబుద్ధి
     నెవ్వరిని విశ్వసింపక యెల్లప్రొద్దు
     నాత్మరక్షాపరుం డగునది విభుండు. (110)
ఉ॥ఇమ్ముగ నాత్మరక్ష విధియించువిధంబున మంత్రరక్ష య
     త్నమ్మునఁ  జేయఁగా వలయుఁ దత్పరిరక్షణశక్తి నెల్ల కా
     ర్యమ్ములు సిద్ధిఁ బొందుఁ బరమార్థము మంత్రవిభేద మైనఁ గా
     ర్యమ్ములు నిర్వహింపఁగ బృహస్పతికై నను నేరఁ బోలునే. (111)
క॥పలుమఱు శపథంబులు నం
     జలియును నభివాదనములు సామప్రియభా
     షలు మిథ్యావినయంబులుఁ
     గలయవి దుష్టస్వభావకపురుషులకున్. (112)
క॥తన కి  మ్మగునంతకు దు
    ర్జనుఁ డిష్టుఁడపోలె నుండి సర్పమపోలెం
    దన కి మ్మగుడును గఱచును
    ఘనదరుణకర్మగరళ ఘనదంష్ట్రలచేన్. (113)

క॥కడునలకయుఁ గూర్మియు నే
    ర్పడ నెఱిఁగించునది వానిఫలకాలము పె
    న్బిడుగును గాడ్పును జనులకుఁ
    బడుటయు వీచుటయు నెఱుక పడియెడుభంగిన్. (114)
క॥తఱి యగునంతకు రిపుఁ దన
     యఱకటఁ బెట్టికొని యుండునది దఱి యగుడుం
     జెఱుచునది ఱాతిమీఁదను
     వఱలఁగ మృద్ఘటము నెత్తివైచినభంగిన్. (115)
క॥తన కపకరము మదిఁజే
     సినజనుఁ డల్పుఁ డని నమ్మి చేకొని యుండం
     జన దొకయించుకము ల్లయి
     నను బాదతలమున నున్న నడవఁగ నగునే. (116)
క॥బాలుఁ డని తలఁచి రిపుతో
     నేలిదమునఁ గలసి యునికి యిదికార్యమె యు
     త్కీలానలకణ మించుక
     చాలదె కాల్పంగ నుగ్రశైలాటవులన్. (117)
క॥మొనసి యపకారిఁ గడనిడి
     కొనియుండెడుకుమతి దీర్ఘకుజఖాశాగ్రం
     బున నుండి నిద్రవోయెడు
     మనుజునకు సమానుఁ డగుఁ బ్రమత్తత్వమనన్. (118)
చ॥తడయక సామభేదముల దానములన్ దయతోడ నమ్మఁగా
     నొడివియు సత్య మిచ్చియుఁ జనున్ జననాథకృతాపకారులం
     గడఁగి వధింపఁగా ననుట కావ్యమతం బిది గాన యెట్టులుం
     గడుకొని శత్రులం జెఱుపఁ గాంచుట కార్యము రాజనీతిమైన్. (119)
వ॥కావున సర్వప్రకారంబుల నపకారు లయినవారిం బరుల నయిన బాంధవుల నయిన నుపేక్షింపక
     యాత్మరక్షాపరుండ వయి దూరంబు సేసి దూషించునది యనినకణికుమతంబు విని దుర్యోధనుం డొడంబడి
     చింతాపరుం డై యొక్కనాఁడు ధృతరాష్ట్రున్ కి ట్లనియె. (120)
   

3. తన తల్లి జరత్కారువు కోరికమేర, ఆస్తీకుడు (నాగుల, వాసుకి మేనల్లుడు) జనమేజయుని సర్పయాగమును
    మాన్పించెను.- ఆదిపర్వం –  ద్వితీయాశ్వాసము – 231&232 పద్యములు; 221,230&233 వచనములు.

వ॥బ్రహ్మవచనంబు నిట్టిద కా విని యేలాపుత్రుండు మాకుఁ జెప్పె జరత్కారు మహామునికి నిన్ను వివాహంబు
      సేయుటయు నేతదర్థంబ యిం కొక్కనిమేషంబేని యుపేక్షించిన సకలసర్పప్రళయం బగుం గావున నాస్తీకుండు
      జనమేజయ మహీపాలుపాలికిం బోయి సర్పయాగం బుడిగించి రక్షింపవలయు ననిన నయ్యగ్రజువచనంబులు
      విని జరత్కారువు గొడుగుమొగంబు సూచిభవన్మాతులనియోగంబు సేయు మనిన నాస్తీకుం డి ట్లనియె. (221)
వ॥అని జనమేజయ నాతనియజ్ఞ మహిమను ఋత్విజులను సదస్యులను నగ్నిభట్టారకు
     ననురూపశుభవచనంబులఁ బ్ర్స్తుతించిన నాస్తీకున కందఱును బ్రి తులయిరంత జనమేజయుం డాస్తీకుం జూచి
     మునీంద్రా నీ కెద్ది యిష్టంబు దానిన యిత్తు నడుగు మనినఁ గరంబు సంతసిల్లి యాస్తీకుం డి ట్లనియె. (230)

ఉ॥మానితసత్యవాక్య యభిమన్యు కులోద్భవ శాంతమన్యుసం
      తానుఁడ వై దయాభి నిరతస్థితి నీవు మదీయబంధుసం
      తానమనోజ్వరం బుపరతంబుగ నాకుఁ బ్రియంబుగా మహో
      ర్వీనుత సర్పయాగ ముడివింపుము కావుము సర్పసంహతిన్. (231)
చ॥అనిన సదస్యు లందఱుఁ బ్రియంబున నిట్టివిశిష్టవిప్రము
     ఖ్యునకు మహాతపోధనునకుం దగుపాత్రున కెద్ది యిచ్చినన్
     ఘనముగ నక్షయమ్ బగును గావున నీద్విజనాథుకోర్కిఁ బెం
     పున వృథ సెయఁగా దగదు భూవలయేశ్వర యిమ్ము నెమ్మితోన్. (232)
వ॥అనిన సర్వజనానుమతంబుగా జనమేజయుం డాస్తికప్రార్థనం జేసి సర్పయాగం బుడిగించె నయ్యవసరంబున.
     (233)


4. మేనకావిశ్వామిత్రుల కూతురు. - ఆదిపర్వం – చతుర్థాశ్వాసము – 46&48 వచనములు; 47 పద్యము
వ॥మేనకయు విశ్వామిత్రునిష్టంబునకుం దగినకామోపభోగంబులం బెద్దకాలంబు రమియించిన నయ్యిద్దఱకు
     నిక్కన్యక పుట్టిన దీని మాలిని యనునొక్కయేటి పులినతలంబునం బెట్టి మేనక దేవలోకంబునకుం జనియె
     విశ్వామిత్రుండును దపోవనంబునకుం జనియె నంత నమ్మునిప్రభావంబున. (46)
ఆ|| చెలఁగి లేవ నేడ్చుచిఱుతుక దానిఁ గ్ర
      వ్యాద ఘోరమృగము లశనబుద్ధిఁ
      బట్ట కుండఁ జెట్టుపలఁ గప్పి రక్షించు
      కొని శకుంతతతులు గూడి యుండె. (47) 
వ|| అంత నేను శిష్యగణంబులతోడ సమిత్కుసుమఫలాహరణార్థం బక్కడకుంజని యమ్మాలినీపులినతలంబున
     శకుంతరక్షిత యై యున్నకూఁతునత్యంత కాంతిమతి నవనీతలంబున కవతరించినతరుణశశిరేఖయుంబోని
     దాని నెత్తుకొని వచ్చి శకుంతరక్షిత యగుటంజేసి శకుంతల యనునామం బిడి కరంబు గారవంబునం
     బెనిచితిమి. (48)

5.శ్వేతకి యను రాజర్షి చేసిన శతవార్షిక సత్త్రయాగములో సమర్పించిన నిరంతర ఘృతవసుధారా (నెయ్యి త్రాగడం)
   కారణంబున అగ్నిదేవునికి అగ్ని మాంద్యము (అజీర్ణరోగము)వచ్చింది. దివ్యౌషధయుక్తమైన ఖాండవవనము
   దహించడమువలన ఆ వ్యాధి తగ్గినది. ఆదిపర్వం – అష్టమాశ్వాసము – 247,250& 318వచనములు &
   248-317 పద్యములు
వ॥శ్వేతకియుఁ దనకు దుర్వాసుండు ఋషిగణంబులతో ఋత్విజుండుగా నభిమతంబయిన సత్త్రయాగంబు సేసె
     నట్లా శ్వేతకి చేసిన నిరంతర ఘృతవసుధారా కారణంబున నగ్నిదేవుండు దన కగ్నిమాంద్యంబును
     దేజోహీనతయు దప్పియు నైనఁ బితామహుపాలికిం జని శరీరస్థితి చెప్పినఁ బితమహుండును దాని నపరిమిత
     ఘృతోపయోగంబున నయిన మహావ్యాధిఁగా నెఱింగి యగ్నిదేవున కి ట్లనియె. (247)
క॥ఈవ్యాధి యొంటఁ దీఱదు
     దివ్యౌషధయుక్త మైనదివిజవనంబున్
     హవ్యాశన భక్షింపు మ్
     హావ్యాధిశమంబు దన నగు నీ కనినన్. (248)
క॥చని ఖాండవంబుఁ గాల్పఁగ
     మొనసి మహాహస్తియూధములఁ బోనిఘనా
     ఘనములచే బాధితుఁ డయి
     వనజుకడ కరిగి హవ్యవహుఁడిట్లనియెన్. (249)
వ॥ఏను మీయానతిచ్చినవిధంబున ఖాండవం బుపయోగింపం బోయి తద్రక్షకులు గావించువిఘాతంబులు
     వారింపనేరక యేడుమాఱులువిఫలప్రయత్నుండనైతి నింక నెద్ది యుపాయంబు నాకు నెవ్విధంబున
     ఖాండవభక్షణంబు దొరకొను నని దుఃఖించిన వానిం జూచి కమలభవుండు కరుణించి భావి కార్యంబు అప్పుడు
     దలంచియుఁ గొంతకాలంబునకు నరనారాయణు లనునాదిమునులు నరలోకంబున దేవహితార్థం
     బర్జునవాసుదేవు లయి జన్మించి యా ఖాండవసమీపంబున విహరింతురు వారు భవత్ప్రార్థితు లై
     తమయస్త్రబలంబున నఖిలవిఘ్నంబుల నపనయించి నిరాకులంబున నీకు ఖాండవోపయోగంబు ప్రసాదింతు
     రనిన నగ్ని దేవుండు కరంబు సంతసిల్లి కమలజువచనం బవలంబంబుగాఁ బెద్దకాలం బుండి
     తద్వచనమార్గంబున నప్పుడు కృష్ణార్జునులం గని ఖాండవదహనాథంబు ప్రార్థించిన నగ్ని దేవున కర్జునుం డి
     ట్లనియె.(250)
 వ॥.....నగ్ని దేఉండు నిట్లు నిర్విఘ్నంబున ఖాండవవనౌషధంబు లుపయోగించి విగతరోగుం డయి కృష్ణార్జునుల
      దీవించి చనియె నంత. (318)
****

19 November, 2014

The Voice of Swami Vivekananda...స్వామి వివేకానంద అమృతవాక్కులు (The Voice of VIVEKANANDA-Sri Ramakrishna Math, 1975 ఆధారంగా)


తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి)-110



తెలుగు సుద్దులు…..(110)
               
.వె||నిన్ను జూచుచుం` నిండును తత్వంబు;
        న్నుజూచుచుం` తగులు మాయ
        నిన్ను నె`రిగిన`పుడె తన్ను దానె`రుగును         
        విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
నిన్ను (పరమేశ్వరుని, పరమాత్మను) గుర్తించి దర్శించగలినపుడు పరమాత్మ తత్వము, స్వభావము గ్రహించగలగడం పరిపూర్ణమవుతుంది. అలాకాకుండా కేవలము తన్నుమాత్రమే (అజ్ఞానంలో ఉండి భౌతిక శరీరమును మాత్రమే దర్శిస్తుంటే) చూస్తుంటే, మాయలో (వాస్తవంగా ఏది లేదో అది ఉన్నట్లుగా తోచడం) పడుతాడు.  నిన్ను (పరమాత్మను), నీ ఉనికిని తెలుసుకుంటేనే తన్ను తాను తెలుసుకోగలుగుతాడు. ఈ పద్యంలో వేమన, మనలను మాయనుండి బయటపడి మనోస్థిరంగా పరమాత్మను (పరమేశ్వరుని) దర్శించమని బోధిస్తున్నారు.  ||18-11-2014||