ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. దుర్యోధనుని కేతనం ఏమిటి?
2. 18వ రోజు రాత్రి పాండవులు ఎక్కడున్నారు?
3.
దుర్యోధనుడు ఎవరి అంశతో పుట్టాడు?
4.
దుర్యోధనుని తమ్ములలో చివరగా చనిపోయినదెవరు? ఎవరిచేత?
5.
ఆశ్రమవాసానికి వెళ్లే ధృతరాష్ట్రునితో
ఇంకా ఎవరెవరు వెళ్లారు?
**********************************************************************************
సమాధానములు (జవాబులు):
1. నాగం – నాగం అంటే ఏనుగు అనీ పాము అనీ రెండర్ధాలు.
సంస్కృతంలో ఏనుగును చెపుతారు. తెలుగులో తిక్కన ఉరగకేతనుడంటారు.
–
భీష్మపర్వము – ప్రథమాశ్వాసము – 95
వచనమ
వ॥….బదునొకండవయక్షౌహిణితోఁ
గురుక్షోణీవల్లభుండువిస్ఫురిత భూషణభూషితం బైనగంధసింధురంబు నెక్కి వెలిగొడుగులు మెఱయం
దొడవులం దఱచైనవజ్రంబులయుద్దామంబు లగుదీధితిస్తోమంబులును జామరంబులుం గలయం బొలయ బహురత్నప్రభావిభాసితం
బయినభుజంగ కేతనంబు గ్రాల్ఁ గెలంకుల దుశ్శాసనదుర్మర్షణవివింశతివికర్ణాదు లగుసోదరులు
వాహనఛత్రంబుల మెఱసి మెఱుఁగారుతమతమ సిడంబు లుల్లసిల్లం జెవులు మిగిలి చనుదేరంజనియె నిట్లు
కౌరవసైన్యంబు గూడికొని కోదండగదాదండకుంతక్షురికా ముసలముద్గర తోమరపరశుభిందిపాలశూలప్రముఖ
నిఖిల హేతివ్రతంబులును భర్మపరికర్మనిర్మాణశోభిత వర్మంబులును వివిధవర్ణవిచిత్ర తనుత్రాణంబులును
మణిగణోజ్జ్వలజ్వాలాజతిలని కేతనంబులం బరమాభీల సుందరసమ్మర్దం బయ్యె నట్లున్న యప్పుడు.
(95)
2. ఓఘవతి నదీ తీరాన – శల్యపర్వము – ద్వితీయాశ్వాసము – 353&378 పద్యములు
తే॥ఓఘవతి యనఁ బరఁగినయొక్క పుణ్య
తటిని చేరువఁ గల్గినదానితీర
భూమియం దర్హ మగుతలమున
వసించి
రమ్మహాత్ములు చిత్తంబు
లలర నధిప. (3543
క|| విను మోఘవతీతీరం
బున కమ్మెయిఁ
బాండురాజపుత్రులు ప్రీతిం
జనిన తెఱఁగు సంజయుచే
విని ధృతరాష్ట్రుండు శోకవిహ్వలుఁ
డగుచున్. (378)
3.కలి – ఆదిపర్వము
– తృతీయాశ్వాసము – 80వచనము & పంచమాశ్వాసము
-105 పద్యము;
వ॥మఱియు నేకాదశ రుద్రుల యంశంబునఁ గృపుఁడు పుట్టె
సూర్యునంశంబునఁ గర్ణుండు పుట్టె ద్వాపరాంశంబున శకునిపుట్టె నరిష్టాపుత్రుం డయిన హంసుండను
గంధర్వవిభుండు ధృతరాష్ట్రుం డయి పుట్టె మతియనువేల్పు గాంధారియై పుట్టె మఱియు నయ్యిద్దఱకుం
గలియంశంబున దుర్యొధనుండుపుట్టెఁ బౌలస్త్యభ్రాతృవర్గంబు దుశ్శాసనాది దుర్యొధనానుజశతంబైపుట్టె
హిరణ్యకశిపుండు శిశుపాలుండై పుట్టె….(80)
క|| అనిలజుపుట్టినదివసము
నన యట దుర్యోధనుండు నరనుత ధృతరా
ష్ట్రునకున్ గాంధారికి న
గ్రనందనుఁడు ఘనుఁడు పుట్టెఁ గలియంశమునన్.
(105)
4.సుదర్శనుడు – భీమునిచే 18వరోజు – శల్యపర్వము – ప్రథమాశ్వాసము -380 వచనము
వ॥ఇవ్విధంబునఁ ద్రిగర్తపతిం బ్రేతపతిపలి కనిచి
మనదెస జనంబులు ఖేదంబుం దమవరు మోదంబు నొంద నతనినందనుల నేడ్వుర నెనమండ్ర ముప్పదుండ్ర
మూఁడుమూఁడుకోలలం దలలు నఱికెఁ దత్సైన్యశేషంబు బారి సమరె భీమసేనుబారిం బడిన సుదర్శనుండు
తదీయశరజాలంబు సుదర్శనగతుండై పదంపడి తచ్ఛరవిఖండితకంఠుం డైనఁ గోపంబు దీపింప పగ మిగుల
నక్కుమారుమూఁక యమ్మారుతసుతుఁ జుట్టుముట్టిన నతండు బెట్టిదంబు లగు తూపుల నది రూపడంగున
ట్లేపున విహరింపఁ గనుంగొని సహింపక మహీపతి ముందటిబలంబు బరవసంబునం గవిసిన… (380)
5..గాంధారి 2.కుంతి
3.విదురుడు 4.సంజయుడు –
ఆశ్రమవాసపర్వము – ప్రథమాశ్వాసము – 177 వచనము
వ|| అట్లు పురప్రవేశంబు చేసి
ధర్మనందనుండును తమ్ములం దగినవర్తనంబులనుండి రట యక్కురువృద్ధుండు నిశ్చింతుండై గాంధారియుం
గుంతియు విదుర సంజయులు నగ్నిహోత్రంబునకు వలయుఋత్విగ్జనంబులతోడ నరుగుదేర నలయక భాగీరథీతీరంబునకుం
బోయి యొక్క యోగ్యప్రదేశంబున విడిసెఁ దదనంతరంబ యతండు. (177)
********************************************************************************
No comments:
Post a Comment