శ్రీసూర్యనారాయణా! వేదపారాయణా! లోకరక్షామణీ! దైవచూడామణీ! యార్తరక్షా నమో! పాపశిక్షా నమో! విశ్వకర్తా నమో, విశ్వభర్తా నమో, దేవతా చక్రవర్తీ, పరబ్రహ్మమూర్తీ, త్రిలోకైకనాథా! మహాభూతభేదంబులన్నీవయై బ్రోతు వెల్లప్పుడున్ భాస్కరా! పద్మినీ వల్లభా! గానలోలా! త్రిమూర్తిస్వరూపా! విరూపాక్ష నేత్రా!మహాదివ్యగాత్రా! యచింత్యావతారా! నిరాకార ధీరా! పరాకయ్య! యోయయ్య! తాపత్రతయాభీల దావాగ్ని రుద్రా! తనుద్భూతమింపార గంభీర సంభావితానేక కామాద్యనేకంబులుం దాక నేకాకినై చిక్కి ఏదిక్కునున్ గానకున్నాడా, నీవాడనో తండ్రీ! జేగీయామానాకటాక్షంబులన్ నన్ గృపాదృష్టి వీక్షించి, రంక్షించు వేగన్; మునీంద్రాది వంద్యా! త్రిగజన్నేత్రమూర్తీ! ప్రచండ స్వరూపుండవై యొంటి సారధ్యమున్, గుంటి అశ్వంబులేడింటిని, న్నొంటి చక్రంబునుందాల్చి మార్తాండ రూపుండవై చెండవా? రాక్షసాధీశులన్ గాంచి కర్మానుసారంబుగన్ దోషంబులన్ ద్రుంచి కీర్తిప్రతాపంబులన్ మించి, నీ దాసులన్ గాంచి,ఇష్ఠార్థములన్గూర్తువో, దృష్టివేల్పా! మహాపాపకర్మలకున్నాలయంబైన ఈ దేహభారంబు భారంబుగానీకో సురోత్తమా! యొప్పులం దప్పులం నేరముల్ మాని, సహస్రాంశుండవై నట్టి నీకీర్తి కీర్తింపగన్ నేర్తునా! ద్వాదశాత్ముండవై దయాళుత్వమున్ చూపి నాయాత్మ భేధంబులన్ బాపి పోషింప నీవంతు, నిన్న్ ప్రశంసింప నావంతు; నిన్ శేషషాధిపుల్ గానంగ (పొగడంగ), నీ దివ్యరూప ప్రభావంబులన్ గానంగ, నేనెంత! ఎల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్, మహాకష్టుడన్, నిష్టయున్ లేదు, నిశ్చింతగన్ చేయవే, కామితార్థప్రదా! యిమ్మహిన్ నిన్ను కీర్తించినన్ మహాజన్మ జన్మాంతరవ్యాధి, దారిద్ర్యముల్ పోయిఁ గామ్యార్థముల్ కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్, భాస్కరా! నమస్తే, నమస్తే నమ:.
__/\__
No comments:
Post a Comment