Translate

06 November, 2015

అమ్మవారి దండకము

శ్రీమన్మహాదేవ దేవీ మహీమండలావాసమైయున్న యో దేవతా సార్వభౌమామణీ! ధీమణీ! లోకసంచారిణీ! భక్తచింతామణీ! దుష్టశిక్షామణీ! మంజుభాషామణీ! పాపసంహారిణీ! పుణ్య సంచారిణీ! ముక్తికాంతామణీ! పావనీ! నిన్ను వర్ణింప  బ్రహ్మాది శేషుఁడు నున్నోపగాలేరు నేనంతవాడన్ మరిన్ మున్ను యాదానవానీక దుర్మార్గముల్బాపగా బెక్కు రూపంబులన్ బెక్కునామంబుల న్నుద్భవంబందవే! తొల్లి ఇంద్రాదిలోకంబులం జేరితాజేయు కల్లోలమున్ జూచి భీతాత్ములైయుండ పుణ్యాత్ములౌ దేవసంఘంబులన్ ద్రుంచగా జూచి మాంసాదికానేకశల్యాపురీషాదులన్ కల్గు కూపంబులన్ ద్రోయగా, దేవతానీక మాబాధలన్ జిక్కి తాజేయునం దేదియున్ గానకన్నోదేవి! యోశాంభవీ! శాంకరీ! కనకదుర్గాంభ! యో కంచికామాక్షి! యోకాళి! యోపార్వతీ! శ్రీభవానీ! సురాపూజితా దేవదేవీయటంచుం గడుం దీనతంబొంది విన్నార్తులై వేడనౌనికముల్ బొందియున్ పెక్కుతాబాహువుల్ ఖడ్గశూలాద్య నేకాయుధాల్ బట్టి ఘుంకార మొప్పార క్రోధాగ్ని జ్వాలాప్రకాశంబుచే వెల్గుంచున్ వచ్చు నీ మోములున్ గాంచి యాదానవానీకబృందంబు అబ్బబ్బ ఈరూపమేనాడుజూడంగ లేదంచు యోతల్లీ! యోమాత యోదేవీ! రక్షింపమంచున్ దగన్ వేడుచున్నట్టి యవ్వారినిన్ వీడి మహిషాసురున్ ద్రుంచి దేవాదులన్ గాంచి రక్షించవా?  భూమినిన్ గల్గు నేడే లోకంబులన్ బట్టి వర్ధిల్ల నీ మానవానీక మయ్యయ్యో! నీ యాగ్రహంబందునన్ జిక్కి బందీకృతుల్లాగ క్రోధంబుచే నీవు తీవ్రంబుగ తాపమున్ గల్గగాజేసితే, కేక లార్బటముల్ గల్గగన్ జేసితే, గొప్పగన్ పెక్కుగన్ పొక్కు లెక్కించితే దేహమాయాసమున్ నొప్పులన్ దీవులన్ గల్గగన్ చేసితే, నోటికారోగ్యము న్భాసియున్నోటిరుచుల్, నేత్రరోగంబులన్ గల్గగాజేసితే, వారు నిన్ గొల్చి నీయుత్సవం బొప్పుగా జేతుమోతల్లీ! యోదేవీ! యంచున్ గడుం బెక్కుదండబులన్ బెట్టగన్ జాలియున్ బొంది యారోగ్యమున్నొందగన్ జేసితే వారు ఆరోగ్యమున్ బొంది స్నానంబులన్ జేసి యానందవారాసినిన్ దేలి నీయుత్సవం బొప్పుగా జేయుచున్ జంతుజాలంబులన్, బండ్లు, పక్వాన్న, పానియముల్ భక్తితో దెచ్చి నీకర్పితం బొప్పుగా జేయ సంతోషమున్ జెంది నూకాలమారేళ్ళమారీమహంకాళి నామాద్యనేక నామంబులన్ జేర్చియున్ తాముండు నీరూప తేజంబులన్ జేర్చి భూత సంఘంబులన్, గాలిదయ్యంబులున్ ఢాకిని, మోహిని, రాక్షసానీకమున్ జేర్చియుం విందుకావించి సంతోషమున్ జెందుచున్నట్టి యోదేవి! యోమాత! ఈనాడు ఈగ్రామమందుండి ఈరీతి మాబిడ్డలన్ బాధ నొందింపగా నేల? మేమెన్నడున్ నీకు నేయొగ్గు గావింపలేదే? లేకున్న, యీపాపలిక్కూనలేమైన గావించినన్ తల్లి చందాన శాంతంబునన్ జెంది జ్ఞానంబులన్ గల్గగన్ జేయరాకిట్టి ఘోరంబుగన్ బాధ నొందింపగన్నేల నోయంబికా! శాంభవీ! పావనీ! లోకమాతా! మముంకావ నీకన్న వేరెవ్వరున్ లేరు, కాపాడి రక్షించు, మాబిడ్డలన్ జెందు యీపాప లాయసమున్ బాపి ఏబాధ లేకుండగా జేసి మాబిడ్డలన్ మాదుపొత్తిళ్ళలోజేర్చి  మీడేర్చినన్ నీకు మాశక్తి లోపంబు లేకుండ పండ్లు, పక్వాన్నముల్, భక్ష్య, లేహ్యంబాదిగాదెచ్చి నీకర్పితం బొప్పుగన్ జేతుమోతల్లి! దేవి భవానీ! పార్వతీ! శంభురాణీ! కృపాదృష్టిచే మమ్ముగాపాడు! నీకన్న మాకెవ్వరున్ వేల్పులున్నారు! నిన్గొల్చి యేటేట నీయుత్సవంబాదిగ జాతరల్ జేసి తీర్ధంబుగావించి యానందమున్ బొందుచుచున్నుండ, మాయందు నీకింత క్రోధంబు గలుగ మాజేయు లోపంబు లేమైననుండెనే? నుండినన్, మాతవై గాచి రక్షింపరాద, మాయాపదల్ బాపి కాపాడుచున్ పంటయున్, పాడియున్, సంపదైశ్వర్యమున్నిచ్చి బ్రోవంగ రాదేయటంచున్ వడిన్ నిన్ను యీరీతి స్తోత్రంబునున్ జేయు మాపిల్లలంగాంచి మా యాపదల్ దీర్చి మాబిడ్డలుఁబొందు నీతాపమున్ బాపి రక్షించు! మాతల్లివై చూడుమా! దాతవై బ్రోవుమా! తండ్రివై గావుమా! నేతవై బ్రోవుమా! దేవివై బ్రోవుమా! యమ్మ నూకాలమ్మ, మాహాకాళీదేవి, సురాపూజవల్లీ, మహామ్మారికాళీభవానీ, విశాలాక్షి, యోకంచికామాక్షి, యోశాంభవీ, శాంకరీ, పార్వతీ, యన్నపూర్ణా, మహాదేవి మీరందరున్నేక భావంబుతో మమ్ము రక్షింపుడీ! బ్రాహ్మణుల్, క్షత్రియుల్, వైశ్యులున్, సూద్ర సంఘంబులున్ నీదు నామంబులున్ మానసంబందు సద్భక్తితో సల్పి స్తోత్రంబులున్ జేయు నవ్వారికిన్ గాక, యీ దండకం బెప్పుడున్ భక్తిచేపల్కు నవ్వారికిన్,  శ్రద్ధచే వ్రాయు నవ్వారికిన్, పాపముల్ బాపియున్ మోక్షమున్ గల్గజేయంగ నేగోరితిన్! నాదు వాక్యంబులందుండు లోపంబులన్ నెంచ కేప్రొద్దు,నీదాసునిన్ గాంచి రక్షించుమీ, లోకమాతా నమస్తే నమస్తే నమ:. 
__/\__
 
 
 
 
 

3 comments:

  1. ఈ దండకం పోస్ట్ చేసినందుకు బహుధా కృతజ్ఞతలు సార్.

    ReplyDelete