భర్తృహరి
నీతి శతకము
భర్తృహరి
5వ శతాబ్ధి కవి,యోగిగ మారిన రాజు.
వారి
“త్రిశతిని” – నీతి, శృంగార, వైరాగ్య శతకములలోని శ్లోకములను శ్రీ ఏనుగు లక్ష్మణ
కవి 18వ
శతాబ్ధములో “సుభాషిత రత్నావళి” పేరుతో
తెలుగులోకి అనువదించారు. గతంలో, 25సంవత్సరముల క్రిందటవరకు వారి పద్యములు లేని తెలుగు పాఠ్యాంశ పుస్తకముండేది కాదు. కొన్ని పద్యములు ముఖ్యంగ – ‘తివిరి యిసుమున...’,
‘ఆకాశంబున నుండి..’, ‘తెలియని మనుజుని...’,భూషలు గావు మర్త్యులకు....’, ఆరంభింపరు
నీచమనవులు...’, 'విద్య నిగూఢ గుప్తము...' మొ.వి. చదువుకోనివారుండరేమో!
నీతి
శతకములో, పది విషయముల మీద, ఒకొక్క విషయము గురించి పది శ్లోకముల చొప్పున, వంద
శ్లోకములు (తెలుగులో పద్యములు) ఉంటాయి. ఆ పది విషయములు – మూర్ఖ పద్ధతి, విద్వ త్పద్ధతి,
మానశౌర్య పద్ధతి, అర్థ పద్ధతి, దుర్జన పద్ధతి, సుజన పద్ధతి, పరోపకార పద్ధతి, ధైర్య
పద్ధతి, దైవ పద్ధతి మరియు కర్మ పద్ధతి.
ఇటీవల
అంతర్జాలములో ఉభయుల నీతి శతకములు (శ్లోకములు, పద్యములు) చదివిన తరువాత వాటినుండి
నాకు అవగాహన కల్గినంతవరకు భావము జోడించి నా ఈ బ్లాగు, ముఖపుస్తకములో ‘నోట్’ గా
ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను.
శ్లోకములు, పద్యములు అంతర్జాలమునుండి
సేకరించబడ్డవి. తెలుగు భాషమీద నాకు గట్టి
పట్టు లేనందున, వీటిలో దోషములేవన్నా ఉన్నయెడల పెద్ద మనసుతో విజ్ఞులు సరిదిద్దఁగలరు.
నేను
ప్రస్తుతము పొందుపరుస్తున్న (ఉపయోగించుకుంటున్న) శ్లోకములను, తెలుగు పద్యములను బహు
శ్రమలకోర్చి సేకరించి, క్రోడీకరించి గతంలో అంతర్జాలములో పొందుపర్చిన వారందరికి పేరు,
పేరునా నా వినయపూర్వక కృతజ్ఞతాభివందనములు. __/\__
మంగళాచరణమ్:
శ్లో. దిక్కాలాద్యనవచ్ఛిన్నానంత చిన్మాత్ర మూర్తయే ।
స్వానుభూత్యేక మానాయ నమః శాంతాయ తేజసే ॥
ప్రార్ధన:
క. అచ్చము దిక్కాలాద్యన
వచ్చిన్నానంత చిద్ద్రువఘనంబు నిజ
స్వచ్చానుభూతిమానము
సచ్చాంతము తేజ మే నజస్రముం దలం తున్.
భా. దైవజ్ఞులకు మాత్రమే అర్ధమయ్యే సర్వాంతర్యామి,
శాంతచిత్తుడు, సర్వమునెరింగిన జ్యోతిస్వరూపుడైన
పరబ్రహ్మమును
తలచి (నమస్కరించి) శతకమును
ప్రారంభిస్తున్నాను.
మూర్ఖపద్ధతి:
శ్లో. బోద్ధారో మత్సర గ్రస్తాః ప్రభవః స్మయ దూషితాః ।
అబోధోపహతాః చాన్యే జీర్ణమంగే సుభాషితమ్
॥ (1)
తే.గీ. బోద్ధలగువారు మత్సరపూర్ణమతులు
ప్రబలగర్వ విదూషితుల్ ప్రభువు
లెన్న
నితరమనుజు లబోధోపహతులు గాన
బావమున జీర్ణమయ్యే సుభాషితంబు.
భా.
పండితులా పూర్తిగా అసూయాపరులు; రాజులా అధికార గర్వముతో నిండియున్నారు, ఇక సామాన్య
జనులకు చెప్పినా అర్థముకాదు; అందుకని ఈ సుభాషితము
నాలోనే భావరూపములోనే అణగారిపోయింది.
(ఉండిపోయింది.)
నాటి పరిస్థితులను తెలుపుతున్నది.
శ్లో.
అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః ।
జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి తం నరం న రంజయతి ॥ (2)
క. తెలియని మనుజుని సుఖముగఁ
దెలుపం దగు సుఖతరముగ దెలుపఁగ వచ్చున్
దెలిసినవానిం దెలిసియుఁ
దెలియనినరుఁ దెల్ప బ్రహ్మదేవుని వశమే!
భా. తెలియనివానికి తేలికగా నచ్చచెప్పవచ్చు
(తెలియదు కనుక తెలుసుకోవాలని ఆసక్తిగా వింటాడు),
తెలిసినవానికి
ఇంకా తేలికగా బోధించవచ్చు (చెప్పేవిషయము మీద అవగాహన ఉంటుంది కనుక శ్రద్ధగా
వింటాడు). కాని, మిడిమిడి జ్ఞానంతో నాకంతా తెల్సనుకొనే
వానికి (మూర్ఖునికి) బ్రహ్మదేవుడుకూడా
(ఎవరూ)
బోధించలేడు (సమాధాన పర్చలేడు).
శ్లో.
ప్రసహ్య మణిముద్ధరేన్మకర వక్త్ర దంష్ట్రాంతరాత్
సముద్రమపి సంతరేత్ప్రచలదూర్మి మాలాకులమ్
।
భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్
న తు ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తమారాధయేత్
॥ (3)
చ. మకర ముఖాంతరస్థ మగుమానికమున్ బెకలింపవచ్చుఁ బా
యక దలదూర్మి
కానికరమైన మహోదధి దాటవచ్చు మ
స్తకమునఁ బూవుదండవలె సర్పమునైన భరింపవచ్చు మ
చ్చిక
ఘటియించి మూర్ఖజన చిత్తముఁ దెల్ప నసాధ్య మేరికిన్.
భా. మొసలినోట్లోని రత్నాన్ని బయటకుతీయవచ్చు,
నిరంతము పెద్దపెద్ద అలలు ఎగససిపడే సముద్రాన్ని
సైతమూ దాటవచ్చు,
పామును సైతము నెత్తిమీద పూలచెండులాగా ధరింపవచ్చు. కాని, మూర్ఖునితో
మాత్రమూ అతని
మనసు తెలుసుకొని మసలుకోవటం ఎవరికీ సాధ్యము కాదు.
శ్లో.
లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్
పిబేచ్చ మృగ తృష్ణికాసు సలిలం పిపాసార్దితః ।
కదాచిదపి పర్యటన్ శశ విషాణమాసాదయేత్
న తు ప్రతినివిష్ట మూర్ఖ జనచిత్తమారాధయేత్
॥ (4)
తే.గీ. తివిరి యిసుమునఁ దైలంబు దీయవచ్చుఁ
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ
దిరిగి
కుందేటికొమ్ము సాధింపవచ్చుఁ
జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
భా. కష్టపడి(ప్రయత్నించి) ఇసుక నుండి నూనె
పిండవచ్చు, ఎండమావులనుండి నీరు సంపాదించి త్రాగవచ్చు,
వెదకి
వెదకి కొమ్ములున్న కుందేలు పట్టుకొని కొమ్మును సాదించవచ్చు. కాని, మూర్ఖుల మనసును
మాత్రము
సమాధానపర్చలేము (సంతోషపెట్టలేము). లౌకింగా అసాధ్యమైన పనులన్నా
సుసాధ్యమౌతాయేమో
కాని, మూర్ఖున్ని మార్చటం మాత్రము అంత తేలికకాదు.
శ్లో.
వ్యాళం బాల మృణాల తంతుభిరసౌ రోద్ధుం సముజ్జృంభతే
భేత్తుం వజ్రమణిం శిరీషకుసుమ ప్రాంతేన సన్నహ్యతి ।
మాధుర్యం మధుబిందునా రచయితుం క్షారాంబుధే రీహతే
మూర్ఖాన్యః ప్రతినేతు మిచ్ఛతి బలాత్సూక్తైః సుధా స్యందిభిః ॥ (5)
మ.
కరిరాజున్ బిసతంతు సంతతులచేఁగట్టన్ విజృంభించువా
డురువజ్రంబు శిరీషపుష్పములచే నూహించు
భేదింపఁ దీ
పు రచింపన్
లవణాబ్దికిన్ మధుకణంబుం జిందు యత్నించు ని
ద్దరణిన్
మూర్ఖులఁ దెల్పునెవ్వడు సుధాధారానుకారోక్తులన్.
భా. మంచిమాటలతో మూర్ఖులను సమాధానపర్చడం, మదపుటేనుగును
తామరతూడులతో కట్టడిచేయడము,
దిరిసెన
పువ్వుతో వజ్రాన్ని కోయడం, ఉప్పుసముద్రాన్ని ఒక తేనెచుక్కతో తియ్యగామార్చాలనుకోవడం
వంటిది. అనగా
సాధ్యముకాదు, వృధా ప్రయాస మరియు తెలివితక్కువతనము.
స్లో.
స్వాయత్త మేకాంతహితం విధాత్రా
వినిర్మితం ఛాదనమజ్ఞతాయాః ।
విశేషతః సర్వ విదాం సమాజే
విభూషణం మౌనమపండితానామ్ ॥ (6)
తే.గీ. స్వవశము హితంబు మూఢతాచ్చాదనంబు
గాఁగ
నీగతి నిర్మించెఁ గమలభవుఁడు
సర్వవిదు
లగుసుజనులు సభలోన
మౌనమె విభూషణము మూఢమానవులకు.
భా. పండితులముందు మూఢులు ( తెలియనివారు, విషయ పరిజ్ఞానము
లేనివారు) మౌనంగా ఉండటము
వారికి గౌరవమిస్తుంది
(మర్యాద కాపాడుతుంది). బహుశా బ్రహ్మదేవుడు వీరి గురించే (తెలివిలేనితనమును
కప్పి పుచ్చుకొనడానికి)మౌనాన్ని
సృజించాడామో. అనగా మిడిమిడి జ్ఞానంతో పండితులతో చర్చకు
దిగకూడదు.
శ్లో.
యదా కించిద్జ్ఞోఽహం ద్విప ఇవ మదాంధః సమభవం
తదా సర్వజ్ఞోఽస్మీత్యభవ దవలిప్తం మమ మనః ।
యదా కించిత్కించిద్బుధజన సకాశాదవగతం
తదా మూర్ఖోఽస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః
॥ (7)
చ.
తెలివి యొకింత లేనియెడ దృప్తుఁడ నై కరిభంగి సర్వమున్
దెలిసితి నంచు గర్విత మతిన్ విహరించితిఁ
దొల్లియిప్పు డు
జ్జ్వలమతు లై నపండితుల సన్నిధి నించుక బోధశాలి
నై
తెలియని వాడ నై మెల గితిం గతమయ్యె
నితాంతగర్వమున్.
భా.
ఏమి తెలియనప్పుడు నాకంతా తెల్సని మదగజంవలే విర్రవీగి ప్రవర్తిస్తుండేవాడిని. కాని, ఇప్పుడు
పండితులద్వారా కొంత తెల్సుకొని (వివేకము
పొంది), నాకేమి తెలియదనే సత్యాన్ని గ్రహింఛి పూర్వపు
అహంభావం (గర్వము) పోయి సుఖంగాఉన్నాను.
శ్లో.
కృమి కుల చిత్తం లాలా క్లిన్నం విగంధి జుగుప్సితం
నిరుపమ రసం ప్రీత్యా ఖాదన్ఖరాస్థి నిరామిషమ్
।
సురపతిమపి శ్వా పార్శ్వస్థం విలోక్య న శంకతే
న హి గణయతి క్షుద్రో జంతుః పరిగ్రహ ఫల్గుతామ్
॥ (8)
చ. క్రిమిసముదాయ సంకులము గవల నింద్యము పూతిగంధహే
యమును
నిరామిషంబును ఖరాంగభవం బగునెమ్ము గుక్క దా
నమలుచుఁ
జెంతనున్న సురనాథునిఁ గన్గొని సిగ్గుఁ జెంద ద
ల్పమని
నిజస్వభావముఁ దలంపదు నీచపుఁ బ్రాణి యెయ్యెడన్.
భా. మాంసము ఏమాత్రమూలేని, కంపుకొట్టుతున్న
పురుగులుపట్టిన గాడిద ఎముక ముక్కను నమలుతూ
ఆనందిస్తున్న
కుక్క, తన ప్రక్కకు దేవేంద్రుడు వచ్చినా సిగ్గు పడదు (పట్టిచ్చుకోదు). అనగా
నీచప్రాణులు
(మూర్ఖులు)
తమ అలవాట్లప్రకారము నడుచుకుంటారే తప్ప ఉచ్ఛ,నీచములు గ్రహింపలేరు.
నేటి
జంతు (కుక్కల) అభిమానులకు ఇది కోపము తెప్పిపింవచ్చు. కవులు, ముఖ్యంగా శతకకారులు
ఎందుకనో
కుక్కను చాలాచోట్ల నీచప్రాణిగా పేర్కొన్నారు.
కాని, మన పురాణాలలో సమ్మున్నత స్థాన్నాని
ఇచ్చారు
– కాలభైరవుడు; మహాభారతంలో (మహాప్రస్థానమప్పుడు యముడు కుక్క రూపంతోనే
ధర్మరాజును పరిక్షిస్తాడు
కదా!
శ్లో.
శిరః శార్వం స్వర్గాత్పశుపతి శిరస్తః క్షితిధరం
మహీధ్రాదుత్తుంగాదవనిమవనేశ్చాపి జలధిమ్
।
అధో గంగా సేయం పదముపగతా స్తోకమథవా
వివేక భ్రష్టానాం భవతి వినిపాతః శతముఖః ॥ (9)
శా. ఆకాశంబుననుండి శంభునిశిరం బందుండి శీతాద్రి
సు
శ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి య
స్తోకాంభోధిఁ బయోధి నుండి పవనాంధోలోకముం జేరె గం
గాకూలకంష పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్.
భా. గంగానది ఆకాశమునుండి శివునిజటాజూటముమీదకు,
అక్కడినుండి హిమవత్పర్వతము మీదకురికి,
అక్కడినుండి
భూమిమీదకుపారి చివరకు సముద్రంగుండా పాతాళలోకం చేరింది. ఇదేవిధంగా వివేకవంతులు
వివేకభ్రష్టులైనప్పుడు
(దైవ ఘటన వలన అధోగతిపాలైనప్పుడు సైతము) బహు కష్టములు ఎదుర్కొనవలసి
వస్తుంది.
శ్లో.
శక్యో వారయితుం జలేన హుతభుక్ఛత్రేణ సూర్యాతపో
నాగేంద్రో నిశితాంకుశేన సమదో దండేన గౌర్గర్దభః ।
వ్యాధిర్భేషజ సంగ్రహైశ్చ వివిధైర్మంత్ర ప్రయోగైర్విషం
సర్వస్యౌషధమస్తి శాస్త్ర
విహితం మూర్ఖస్య నాస్త్యౌషధమ్
॥ (10)
చ. జలముల నగ్ని ఛత్రమునఁ జండమయూఖుని దండతాడనం
బుల
వృషగర్దభంబులను బొల్పగుమత్తకరీంద్రమున్ సృణిం
జెలఁ
గెడురోగ మౌషధముచే విషముందగుమంత్ర యుక్తి ని
మ్ములఁదగఁజక్కఁజేయనగు మూర్ఖునిమూర్ఖత
మాన్పవచ్చునే.
భా. నిప్పుకు నీరు; ఎండకు గొడుగు; మదించినఏనుగుకు
అంకుశము; ఎద్దు, గాడిదలకు కర్ర; ప్రబలిన వ్యాధులకు మందులు;
విషవిరుగుడుకు (పాము.తేలు మొ.వి) మంత్రములు నివారకములుగా ఉపయోగించి వాటిని
అదుపు
చేయవచ్చు. కాని, మూర్ఖుని మూర్ఖత్వాన్ని
మాన్పవచ్చునా? దీనికి మటుకు ఏ మందు లేదా
సాధనము
లేదు.
__/\__