Translate

15 February, 2015

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) -151

తెలుగు సుద్దులు…..(151)
ఆ.వె॥పర్వత వనవాసి పరిణామ వర్తన
కూప వాసికె`ట్లు గురుతు పడును?
బ్రహ్మ విష్ణు వెంట ప్రాకృతు డ`రుగునా?
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
పర్వతములమీదా, వనములలో కఠోర తపొదీక్షలతో బ్రహ్మజ్ఞానము పొందిన వారి గురించి నూతిలో (లౌకిక లంపటములతో) పడి కొట్టుకుంటున్నవానికి ఎలాతెలుస్తుంది? బ్రహ్మ, విష్ణువును (బ్రహ్మజ్ఞానము, పరమాత్మ గురించి) పామరుడు (శాస్త్రాధ్యాయనము చేయనివాడు, తత్వము తెలియనివాడు) అనుసరించగలడా? అని వేమన ప్రశ్నారూపకంగా మనకు ఉద్భోధ చేస్తూ లౌకిక లంపటములనుండి (బావిలోని కప్పలాగా జీవించకుండా) బయటపడి కష్టమైనా బ్రహ్మజ్ఞానము పొందడానికి కృషిచేయమని హితవు పలుతున్నారు. ||14-02-2015||

14 February, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 062 (306 – 310)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

  1. సుశర్మ ఏ దేశానికి రాజు?
  2. యక్ష ప్రశ్నలు వేసిన యక్షుడు ఎవరు?
  3. భారత యుద్ధంలో పాండవ పక్షానికి సైన్యాధ్యక్షుడెవరు?
  4. పాండవుల పెద్ద కొడుకు ఎవరు?
  5. అర్జునిచేత సారధ్యం చేయించుకొన్న గౌరవం దక్కిన వీరుడెవరు?
-----------------------------------------------------------------------------------------------------

 సమాధానములు (జవాబులు):


1. సుశర్మ త్రిగర్త దేశానికిరాజు విరాటపర్వము తృతీయాశ్వాసము -118 వచనము
దీని కనురూపమ్ బగునుద్యోగంబు సేయుం డనినఁ ద్రిగర్తాధీశ్వరుం డగుసుశర్మ దొలుతఁ గర్ణదుశ్శాసనులతోఁ గొండొక ప్రసంగించి వారలయనుమతి నవనీపతితో ని ట్లనియె. (118)

2. యమధర్మరాజు ఆరణ్యపర్వము సప్తమాశ్వాసము – 462 పద్యము
మత్తకోకిలముఏను ధర్ముఁడఁ జువ్వె రాజకులేంద్ర సత్యము శౌచమున్
                  దానముం దపమున్ శమంబును దాంతియున్ యశముం బరి
                  జ్ఞానయుక్తియు నాదుమూర్తులు సమ్మదంబున నిప్డు మ
                  త్సూను నుత్తమధార్మికున్ నినుఁ జూచువేడుక వచ్చితిన్. (462)

3. ద్రుపదుని కొడుకు, ద్రౌపది అన్నగారైన ధృష్టద్యుమ్నుడు – 113 వచనము
శ్వేతవంశజాతుం డగుటంజేసి శ్వేతుం డనం బ్రఖ్యాతుండగు ధృష్టద్యుమ్నునకు నుత్కృష్టప్రకారంబున నభిషేకం బొనర్చి సర్వసేనాధిపత్యంబునకుం బట్టంబు గట్టి యయ్యెనమండ్రును (పాంచలపతి దృపదుడు, మత్స్యవిభుడు విరటుడు, సాత్యకి, జరాసంథాగ్రతనయుడు శౌర్యఘనుడు, సహదేవుడు, చేకితానుడు, శిశుపాలతనయుడుధృష్టకేతుడు, శిఖండి) దక్కటిదొరలను గనుమ్గొని మధుర వాక్యంబుల నగ్గించి కౌరవులతోడికయ్యంబునకుం గురుక్షేత్రంబునకు విడియంబోద మని చెప్పి వారి నెల్ల ధనంజయునకుం జూపి. (113)

4. ఘటోత్కచుడు ఆదిపర్వముషష్ఠాశ్వాసము – 235 పద్యము & 236 వచనము
నరవరుఁడైన భీమువలనం బ్రభవించె హిడింబకున్ సుతుం
    డురుతరభీమరూపుఁడు ఘటోత్కచనాముఁడు విస్ఫురద్భయం
    కరవదనంబు శంఖనిభకర్ణములున్  వికృతాక్షులుం బయో
    ధర వరవర్ణమున్ వికటదారుణదంష్ట్రలు నొప్పుచుండఁగన్. (235)
ఇట్లు సద్యోగర్భంబునం గామరూపధరుండైన ఘటోత్కచుండు పుట్టి తత్క్షణంబ నవ యౌవనుండును ననేకాస్త్రశస్త్రకుశలుండును నపరిమిత రాక్షస పిశాచ బలపరివృతుండును నై తల్లి దండ్రులకుం గుంతీదేవికి మ్రొక్కిన నగ్రనందనుం డగుట నందఱును గరంబు గారవంబునఁ గొనియాడం గొన్ని దినంబులుండి యొక్కనాఁ డంజలి పుటఘటిత మస్తకుండయి తండ్రుల కి ట్లనియె రాక్షస పిశాచబలంబులతొడ నాయిమ్ముల నుండెదం బని గలయప్పుడు నన్నుఁ దలమ్చునది యప్పుడ వత్తునని తల్లిం దోడ్కొని యుత్తరభిముఖుండయి యరిగె నిట పాండవులును శాలిహోత్రునొద్ద ననేకధర్మశాస్త్ర నీతిశాస్త్రంబులభ్యసించి యమ్మునివరు వీడ్కొని చని విదర్భమత్సత్రిగర్తకీచక విషయంబులు (దేశంబులు) గడచి యేక చక్రం బను నగ్రహారంబు గని. (336)

5. ఉత్తరుడు - ఉత్తరగోగ్రహణం ముందు ఉత్తరునికి బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు ఉత్తరునికి సారధ్యం చేశాడు విరాటపర్వముచతుర్థాశ్వాసము – 49 వచనము
అనుచు ధనుస్తూణీరకృపాణముద్గరాదివివిధసాధనంబులు రథంబుపైఁ బదిలంబుగా నిడి నొగలెక్కి పగ్గంబుల స్రుక్కు సక్కంజేయ నుత్తరుండును బసులం బట్టినదెస గోపాలకు నడిగిన వాఁడు పితృవణంబువలనని చెప్పిన వినుచు రథా రోహణంబు సేసి వెడలి పౌరవృద్ధపుణ్యాంగనాభూసురసమూహంబులు బృహన్నలం జూచి తొల్లి ఖాండవదహనంబున నర్జునకు నీకతంబున నయిన మాంగల్యం బెట్టి దట్టిద భవత్సహాయ్యంబున భూమింజయున కయ్యెడు మని దీవించి సేసలు సల్లం బురంబు నిర్గమించి నిరర్గళపరాక్రముండయిన యాఫల్గునునైపుణంబున వల్గదశ్వం బగురథంబు రయంబునకు మెచ్చుచుం బరేతనిలయప్రాంతప్రదేశంబు సేరం జని. (49)
************************************************************

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) -149&150



తెలుగు సుద్దులు…..(149)
.వెమిరపగింజ జూడ మీద నల్లగ నుండు
          కొరికి చూడ లోన చురుకు `నును;     
          సజ్జనులగు వారి సార మిట్తులనుం`డు   
         విశ్వదాభిరామ వినర వేమా!.         
భావముః                  
మిరయపుగింజ చూడడానికి పైకి నల్లగ ముడతలుపడి అందవికారంగా ఉంటుంది.  దాని ఘాటు, పరిమళత్వము, ఔషధగుణము కొరికితేకాని (ఉపయోగిస్తే వాడితేకాని) మనకు తెలియదు. అలాగే సాత్వికులు, జ్ఞానులు (పరమ గురువులు) పైకి నిరాడంబరంగా ఉన్నా వారితో మనము కలసిమెలసి శుశ్రూష చేస్తేకాని వారి విద్వత్తు, మంచితనము, ధార్మికత మనకు అవగతమవదు (తెలియదు).  కనుక పైపై డాబు, దర్పాలను, మాటల పటాటోపాలను చూసి, ముఖ్యంగా గురువులను ఎన్నుకునేటప్పుడు, మోసపోవద్దు అని వేమన మనలను హెచ్చరిస్తున్నారు.
ఇదే భావాన్ని ఇంకో పద్యంలో కూడా వేమన చక్కటి ఉపమానంతో మనకు తెల్పారు.
{తెలుగు సుద్దులు …..(150)} 
.వెకస్తూరి యట చూడ కాంతి నల్లగ నుం`డు;
       పరిమళించు దాని పరిమళంబు;      
          గురువులైన వారి గునములీ`లాగు రా   
          విశ్వదాభిరామ వినర వేమా!.  ||12-02-2015||