Translate

06 February, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి – 58 (286-290)




ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. కౌరవపాండవులు ఏ దిక్కు మొగంతో యుద్ధం చేశారు?
2. యుద్ధంలో కర్ణుని చేతికి భీముడు చిక్కితే తూలనాడి విడిచాడు; ఏపర్వంలో ఇది జరిగినది? ఎన్నవరోజున?


3. భగదత్తుడు ఎవరు? అతనిని చంపినదెవరు?
4. శ్రుతాయుధుడెవరు? ఏ పక్షంలో యుద్ధము చేసి చనిపోయాడు?
5. సంజయుడు యుద్ధ విశేషాలే కాకుండా యుద్ధ సమయంలో ఒకరికి వచ్చిన కలకూడ వివరించాడు, ఆ కల
          ఎవరిది?
----------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. కౌరవులు పడమర మొగం; పాండవులు తూర్పు మొగం భీష్మపర్వము ప్రథమాశ్వాసము 103 & 122
  వచనములు
|| ఇట్లు పితామహునెత్తికోలునకుం జిత్తంబు వికసిల్ల ననుజసహితంబుగా నతనిం బరివేష్టించి యన్నరపతి నిబిడచారుసన్నాహంబుగా నుచితవ్యూహంబమర్పుమని యతనికిం జెప్పిన నతండును బడమరమొగం బయి తానును ద్రోణుండును దాలధ్వజంబును వేదికాకేతనంబును గ్రాలుచుండ ముందఱ నిలిచి వలపటఁ గృపాశ్వత్థామలును దాపటం గృతవర్మమద్రేశ్వరులును వెనుక బాహ్లికసోమదత్త భూరిశ్రవసులును నడుమం గురుకుమారసమేతముగా నమ్మహీనాథుండును నతని యగ్రభాగమున నర్జునుఁ జంపుదుము చత్తు మింతియు కాని యొండు లేదని శపథంబులు పలికి సంశప్తకులనం బ్రఖ్యాతులయినసుశర్మ మొదలుగాఁగల పదివేవురురథికకముఖ్యులును గలయ నెడనెడం దక్కినయోధవీరులును నిలుచు నట్లుగా నియమించి. (103)
|| దాని కయ్యుధిష్ఠిరుండు ప్రముదితచిత్తుం డగుచు బ్రీతచేతస్కు లగుతమ్ములుం బాంచాలమాత్స్యాధిపతులును సకలజనంబులును బరివేష్టింపం దూర్పుమొగంబై కౌరవు లున్న చక్కటికిం కట్టెదురుగా నిలిచి యెల్లవారిసైన్యంబులుం గ్రమంబునఁ గొలంది వెట్టుకొనుచు నందఱకు సంజ్ఞలు నదియాలంబులుం గల్పించి. (122)

2.ద్రోణపర్వములో 14వ రోజున. ద్రోణపర్వము చతుర్థాశ్వాసము -239 పద్యము
|| తిండిపోత నీకు భండనం బేటికిఁ
     గడవఁ జేరి మనసు కాంక్ష తీఱ
     నోపుకొలది మ్రింగి యూరక నీ వింటి
     కడన యుండు మింక నడిచిపడక (239)

3. ప్రాగ్జ్యోతిషాధిపతి 12వ రోజున అర్జునుని చేతిలో ద్రోణపర్వము ప్రథమాశ్వాసము 358 పద్యము
    || వాలికదొడ్డనారసము వజ్రము శైలము దాఁకునాకృతిన్
        ఫాలముమీఁదఁ దాఁకిన నిభంబు వెసం బడి కొమ్ము లూఁతగా
        వ్రాలుడు నర్ధ చంద్రరుచిర ప్రదరంబునఁ ద్రుంచె బాణవి
        ద్యాలసితుండు  క్రీడి భగదత్తునికంఠ మకుంఠితోద్ధతిన్. (358)

4.శ్రుతాయుధుడు వరుణుని కుమారుడు, కౌరవ పక్షంలో 14వ రోజున చనిపోయాడు. ద్రోణపర్వము
  తృతీయాశ్వాసము 91 పద్యము & 92 వచనము.
|| అశనికరణి వచ్చి యాశ్రుతాయుధునిపై
    నమ్మహోజ్జ్వలాయుధమ్ము పడినఁ
    బార్ధుచేత మున్ను బాహులు దెగిపడ్డ
    యతఁడు కొండ కూలినట్లు కూలె. (91)
|| ఇట్లు వరునతనయుఁడు పడినం గనుంగొని (92)

5.అర్జునుని కలను. ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము 378 వచనము
|| నిజశిబిరంబు చొత్తెంచి రవ్విధంబున నర్జునుండు కల గాంచెఁ గృష్ణుండు దారుకు తోడం దగుమాటలాడు చుండఁ దెల తెల వేగె నది యాధనంజయస్వప్నాంత సమయం బై సంఘటించె నని యిట్లు సంజయుండు సవ్యసాచివర్తనంబు తెఱంగు  ధృతరాష్ట్రున కెఱింగించె ననుటయు. (378)

****************************************************************

04 February, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 057 (281 – 285)




ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. ద్రోణుడు సైన్యాధ్యక్షుడయ్యాక దుర్యోధనునకు ఒక వరం ఇచ్చాడు ఏమిటది?

2. ఘటోత్కచుని చంపిన కర్ణుని చంపుతాననిబయలుదేరిన ధర్మరాజును ఆపిన దెవరు?
3. భీముని సారధి ఎవరు?
4. విందాను విందు లెవరు? ఎవరిచేత చనిపోయారు?
5.శల్యుని జెండా ఏమిటి?
----------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.  అర్జను డడ్డపడకపోతే ధర్మరాజును ప్రాణాలతో పట్టితెస్తాను. ద్రోణపర్వము ప్రథమాశ్వాసము 113పద్యము.
. నరుఁ డెడ సొచ్చెనేని విను నా కది దుష్కర మే నొకండనే
     సురగణ మైన వ్రేలిఁ గొని చూపఁగఁ జాలరు వాఁడు లేనిచోఁ
    దిర మయి పోర నిల్చిన యుధిష్ఠిరుఁ ద్రౌపదిపుట్టినింటివే
    వురు వెఱఁ గంది చూడ నలవుం జలముం జెడఁ బట్టి తెచ్చెదన్. (113)

2.  వ్యాసమహర్షి అయిదవరోజుకు నీవు రాజు వవుతావు. ఇంత పరాక్రమ ప్రకటనం, వేదన అవసరం లేదంటాడు.-    ద్రోణపర్వము పంచమాశ్వాసము 258,259 & 264పద్యములు; 260 వచనము.
.తనచేతన సూతసుతుం
   దునుముదుఁ గా కనుచు నలుకతోడ రయమునం
   జనియెడు ధర్మసుతుం డీ
   తని నూరక చూచు చునికి తగునే మనకున్. (258)
.అని రథంబు పెలుచఁ జన నిచ్చె నట్లు క్రో
    ధాంధవృత్తి నరుగునవ్విభునకు
    సమ్ముఖంబు కాఁగ సత్యవతీసుతుఁ
    డరుగు దెంచి కరుణ నాదరించి. (259)
.అతండు ప్రణతుం డైన దీవించి యి ట్లనియె.(260)
.విను మే నగుదివసంబున
   నినుఁ బొందు ననూనమేదినీరాజ్యశ్రీ
   యనుమాన మేమియును లే
   దని గ్రక్కున నమ్మునీంద్రుఁ డరిగె నరేంద్రా. (264)

3.  విశోకుడు 6వ రోజు యుద్ధంలో ఇతని పాత్ర ఉంది. భీష్మపర్వము ద్వితీయాశ్వాసము 365, 367
  పద్యములు; 366 వచనము
తే.ఆర్తుఁడై యవ్విశోకుని నడిగె భీముఁ
    డెచట నున్నాఁడు నాయొడ లెట్లు ప్రాణ
    సహిత మై యుండు నతఁ డొకచంద మైన
    నేమిగతిఁ బోదు నక్కట యెఱుఁగఁ జెపుమ. (365)
. అనిన విశోకుండు ధృష్టద్యుమ్నున కి ట్లనియె. (366)
. గొదగొని ధార్తరాష్ట్రు లతిఘోరవిధంబునఁ జుట్టు ముట్టిన
    న్మదమునఁ దేరు డిగ్గి హరిణంబులపైఁ జనుసింహమో యన్
    గదఁ గొని  నన్ను నియ్యెడ నకంపితసుస్థితి నిల్వఁ బంచి బె
    ట్టిదముగఁ జొచ్చె నాహవపటిష్ఠుఁడు భీముఁడు వారి సైన్యమున్. (367)

4. విందాను విందులు అవంతీనగరరాజులు - అర్జునిచేతిలో చనిపోయారు. - ద్రోణపర్వము తృతీయాశ్వాసము
   144 & 147 వచనములు; 143,146 & 148 పద్యములు.
క.విందానువిందు లేక
   స్యందనగతు లై కడంగి సైన్యంబులుఁ దా 
   రుం దెప్పదెరల నాసం
   క్రందననందనునిమీదఁ గవిసిరి కడిమిన్. (143)
.ఇ ట్లవంతీశ్వరు లురవడించి (144)
.తోడన కడువేగంబునఁ
   గ్రీడి తురంగముల సూతుఁ గేతనమును దు
   న్మాడుచు విందునితల యిల
   పై డొల్లఁగ నేసెఁ దీవ్ర భల్లప్రహతిన్. (146)
. ఇట్లు తలఁదునుముటయు బలుగాలిం గూలుతరువుపోలికం బడినయగ్రజు నాలోకించి  
    యనువిందుం డలుక యు నుమ్మలికంబు నుల్లంబునం బెనంగొన గదగొని సంరంభంబున. (147)
. అరదము డిగ్గి తీవ్రగమనాతిశయంబునఁ గిట్టి బాహువి
    స్ఫురణ తలిర్ప దానవనిషూదనుఫాలము వ్రేసి యార్వ ను
    ద్దరరభసం బెలర్ప గదఁ ద్రుంచి పదంబులు బాహుశాఖలున్
    శిరమును ద్రెంచి వాని బలిసేసె ధనంజయుఁ డాజిభూమికిన్. (148)

5.  అరటిచెట్టు భీష్మపర్వము ప్రథమాశ్వాసము 87 పద్యము
సీ. కాంచనమయవేదికాకనత్కేతనోజ్జ్వలవిభ్రమం బొప్పఁ గలశజుండు
    గనకగోవృషసాంద్రకాంతికాంతధ్వజవిభవవిలాసంబు వెలయఁ గృపుడు
    మణిసింహలాంగూలమహిత కేతు ప్రభాస్ఫురణంబు మెఱయంగ గురుసుతుండు
    రత్నశిలారశ్మిరాజితకదళికామహిమ శోభిల్లంగ మద్రవిభుఁడు
తే. వెడలి తమతమచతురంగవితతు లెల్ల
    నుచితగతి నూల్కొనంగఁ జేయుచుఁ గడంగి
    సంగరోత్సవసంభృతోత్సాహు లగుచు
    నగుచుఁ దగుమాటలాడుచు నడచి రెలమి. (87)
 *******     *****************************************************

03 February, 2015

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) -144



తెలుగు సుద్దులు…..(144)
.వెఎండవేళ చీకటే`కమై యున్నట్లు
           నిండుకుండ నీరు నిలిచిన`ట్లు;               
           దండిని బరమా`త్మ తత్వంబు దెలియరో 
           విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః                  
ఉషోదయంతో చీకటిపోయినట్లనిపించినా, చీకటిని వెలుగు ఎలా ఆవరించి ఉంటుందో; నిండుకుండలో నీరు ఎలా కుండరూపము దాల్చి నిశ్చలంగా ఉంటుందో అదేవిధంగా ప్రపంచంలో మంచి, చెడు కలిసే ఉంటాయని, పరమాత్మ ఎక్కడోలేడో మనలోనే (ప్రతిఒక్కరిలో) అంతర్గతంగా ఉన్నాడని పరమాత్మ తత్వాన్ని సంపూర్ణంగా గ్రహించమని, తెలుసుకొని సద్వర్తనతో మెలగమని వేమన హితవు పలుకుతున్నారు. ||02-02-2015||

మసనోబు ఫుకుఓకా కస్తూరి పలుకులు(35)