Translate

03 July, 2016

శ్రీ మదాంధ్రమహాభాగవతము - దశమస్కంధము - ప్రశ్నోక్తి - 1 వ భాగము

ప్రశ్నోక్తి – 1

. రాక్షసరాజుల దురాగతములకు తట్టుకొనలేక భూదేవి ఏరూపమున, ఎవరికి తన గోడు తెలుపుకొనెను?

2. వసుదేవుని తండ్రి పేరేమి?

3. దేవకి తండ్రి పేరేమి?

4. కంసుని తండ్రి పేరేమి?

5. తృణజలూకా న్యాయమననేమి?

6. వసుదేవుడు, దేవకిల మొదటి కుమారుని పేరేమి?

7. కంసునికి తన పూర్వజన్మగురించి, యాదవుల గురించి తెలిపినది ఎవరు?

8. పూర్వజన్మలో కంసుడెవరు?

9. కంసుడు తన తండ్రిని, దేవకి, వసుదేవులను చెఱసాలలో ఎందులకు బంధించెను?

10. లోకమునరాజ్యాధికార వ్యామోహములో పడిన రాజుల ప్రవర్తన ఎట్లుండును?

11. కంసుని సహాయకులెవరు?


జవాబులు (సమాధానములు):

1. భూదేవి గోరూపమున బ్రహ్మదేవుని కడకు చేరి తన గోడు తెలుపుకొనెను. (దశమస్కంధము – పూర్వభాగము – 14 పద్యము.)

సీ. రాజేంద్ర! విను తొల్లి రాజలాంఛనముల,

         వేల సంఖ్యల దైత్యవిభులు తన్ను

      నాక్రమించిన భారమాఁగఁజాలక భూమి

           గోరూప యై బ్రహ్మఁజేరఁ బోయి

      కన్నీరు మున్నీరుగా రోదనము సేయఁ

         గరుణతో భావించి కమలభవుఁడు

      ధరణి నూఱడఁ బల్కిధాత్రియు వేల్పులుఁ

          గదలిరా విష్ణునిఁగాన నేఁగి

తే. పురుషసూక్తంబుఁ జదివి యద్భుతసమాధి

      నుండి యొకమాట విని వారిజోద్భవుండు

      వినుఁడు వేల్పులు ధరయు నే విన్న యట్టి

       పలుకు వివరింతునని ప్రీతిఁ బలికెఁ దెలియ. (14)

2. మథురా నగరమునకు రాజైన శూరసేనుడు. (దశమస్కంధము – పూర్వభాగము – 20 పద్యము.)

సీ. ఆ శూరసేనున కాత్మజుం డగు వసు

         దేవుఁడా పురి నొక్కదినమునందు

     దేవకిఁ బెండ్లియై దేవకియును దానుఁ

         గడు వేడ్క రథమెక్కి కదలువేళ

     నుగ్రసేనునిపుత్రు డుల్లాసి కంసుఁడు

         చెల్లెలు మఱఁదియు నుల్లసిల్ల

     హరులపగ్గములఁ జేనంది రొప్పఁదొడంగె

        ముందట భేరులు ముఅరజములును

తే. శంఖ పటహములును జడిగొని మ్రోయంగఁ

      గూతుఁతోడి వేడ్క కొనలుసాఁగ

      దేవకుండు సుతకు దేవకీదేవికి

      నరణ మీఁదలంచి యాదరించి. (20)

3. దేవకుడు. (దశమస్కంధము – పూర్వభాగము – 20 పద్యము.)

4. దేవకుని తమ్ముడైన ఉగ్రసేనుడు. యదు వంశమువాడు. భోజ, అంధక రాజ్యములకు ప్రభువు. (దశమస్కంధము – పూర్వభాగము – 20 & 54 పద్యములు.)

సీ. ఆ శూరసేనున కాత్మజుం డగు వసు

         దేవుఁడా పురి నొక్కదినమునందు

      దేవకిఁ బెండ్లియై దేవకియును దానుఁ

         గడు వేడ్క రథమెక్కి కదలువేళ

      నుగ్రసేనునిపుత్రు డుల్లాసి కంసుఁడు

           చెల్లెలు మఱఁదియు నుల్లసిల్ల

       హరులపగ్గములఁ జేనంది రొప్పఁదొడంగె

           ముందట భేరులు ముఅరజములును

తే. శంఖ పటహములును జడిగొని మ్రోయంగఁ

      గూతుఁతోడి వేడ్క కొనలుసాఁగ

      దేవకుండు సుతకు దేవకీదేవికి

      నరణ మీఁదలంచి యాదరించి. (20)

మ. కలఁగంబాఱి మఱందిఁ జెల్లెలి నుదగ్రక్రోధుఁడై పట్టి బ

      ద్దులఁ గావించి హరిం దలంచి వెసఁ దోడ్తో వారు గన్నట్టి పు

      త్రులఁ జంపెన్ గురు నుగ్రసేను యదుఁదద్భోజాఁధకాధీశు ని

       ర్మలుఁబట్టెన్ గడు వాలి యేలెఁ జలమారన్ శూరసేనంబులన్. (54)

5. గడ్డిపురుగు (గడ్డి జలగ) ప్రాకునపుడు వేరొక గడ్డిపోచ కనిపిస్తేకాని (దొరికితేకాని) తనున్న గడ్డిపరకను వదలదు (విడిచి పెట్టదు). దీనినే తృణజలూకా న్యాయము అని అఁటారు.

అలాగే జీవుడు కూడా వేరొక దేహమును (శరీరమును) చూచుకొనకుండ పూర్వదేహమును వీడడు అని సూచింపబడుచున్నది. (దశమస్కంధము – పూర్వభాగము – 29 పద్యము.)

సీ. మేనితోడన పుట్టు మృత్యువు జనులకు

          నెల్లి నేఁడైన నూఱేండ్లకైనఁ

      దెల్లఁబు మృత్యువు దేహంబు పంచత

         నందఁ గర్మానుగుఁడై శరీరి

      మాఱుదేహము నూఁది మఱితొంటి దేహఁబుఁ

         బాయును దనపూర్వభాగమెత్తి

      వేఱొంటిపైఁ బెట్టివెనుకభాగఁబెత్తి

         గమనించు తృణజలూకయును బోలె

ఆ. వెంట వచ్చు కర్మవిసరంబు మును మేలు

      గన్న వేళ నరుఁడు కన్నవిన్న

      తలఁపఁబడిన కార్యతంత్రంబు కలలోన

      బాడితోడఁ గానఁబడినయట్లు.(29)

6. కీర్తిమంతుడు. (దశమస్కంధము – పూర్వభాగము – 46 పద్యము.)

ఆ. సుదతి మున్ను గన్న సుతుఁగీర్తిమంతునిఁ

      బుట్టు తడవ కంసభూవరునకుఁ

      దెచ్చి యిచ్చెఁ జాల ధృతి గల్గి వసుదేవుఁ

      డాసపడక సత్యమందు నిలిచి. (46)

7. నారదుడు. (దశమస్కంధము – పూర్వభాగము – 52 పద్యము .)

సీ. ఒకనాఁడు నారదుం డొయ్యన కంసుని

        యింటికిఁ జనుదెంచి యేకతమున

      మందలోపల నున్న నందాదులును వారి

           భార్యలుఁ బుత్రులు బాంధవులును

       దేవకి మొదలగు తెఱవలు వసుదేవుఁ

          డాదిగాఁ గల సర్వయాదవులును

      సురలు గాని నిజంబు నరులు గా రని చెప్పి

          కంసుండ! వీవు రక్కసుఁడ వనియు.

ఆ. దేవమయుఁడు చక్రి దేవకీదేవికిఁ

      బుత్రుఁడై జనించి భూతలంబు

      సెఱుపఁబుట్టినట్టి చెనఁటి దైత్యుల నెల్లఁ

      జంపుననుచుఁ జెప్పి చనియె దివికి. (52)

8. శ్రీమన్నారాయణునిచే చంపబడ్డ కాలనేమియను రాక్షసుడు. (దశమస్కంధము – పూర్వభాగము – 53 పద్యము.)

క. నారదుమాటలు విని పె

    ల్లారాటముఁ బొంది యదువులనిమిషులనియున్

    నారాయణ కరఖడ్గ వి

    దారితుఁడగు కాలనేమి దాననియు మదిన్. (53)

9. యాదవులెల్లరును దేవతలే అనియు, శ్రీమన్నారాయణుని చేతిలో చావబడ్డ కాలనేమియే తానని నారదుని వలన తెలుసుకున్నతరువాత, తన తఁడ్రి ఉగ్రసేనూడు యదు వంశజుడగుటచే, శ్రీహరిని గుర్తునకు తెచ్చుకొనుచు క్రోధముతో బంధుత్వమును మఱచి తఁడ్రిని, దేవకీవసుదేవులను చెఱసాలలొ బంధించెను. మొదట చంపనన్న దేవకీవసుదేవుల ఆరుగురు పుత్రులను వధించెను. (దశమస్కంధము – పూర్వభాగము – 53&54 పద్యములు .)

క. నారదుమాటలు విని పె

    ల్లారాటముఁ బొంది యదువులనిమిషులనియున్

    నారాయణ కరఖడ్గ వి

    దారితుఁడగు కాలనేమి దాననియు మదిన్. (53)

మ. కలఁగంబాఱి మఱందిఁ జెల్లెలి నుదగ్రక్రోధుఁడై పట్టి బ

      ద్దులఁ గావించి హరిం దలంచి వెసఁ దోడ్తో వారు గన్నట్టి పు

      త్రులఁ జంపెన్ గురు నుగ్రసేను యదుఁదద్భోజాంధకాధీశు ని

      ర్మలుఁబట్టెన్ గడు వాలి యేలెఁ జలమారన్ శూరసేనంబులన్. (54)

10. ఈ లోకములో రాజ్యాధికార వ్యామోహములో పడిన రాజులు అజ్ఞానముతో ‘తమ జీవితములు    శాశ్వతములు’ అని తలపోయుచు, మంచిచెడ్డలను మఱచి, తల్లితండ్రులను, అన్నదమ్ములను, మిత్రులను, బంధువులను సైతము తఱచు చఁపివేయుచందురు. (దశమస్కంధము – పూర్వభాగము – 55 పద్యము.)

ఆ. తల్లిఁ దండ్రినైన దమ్ముల నన్నల

      సఖులనైన బంధుజనుల నైన

      రాజ్యకాంక్షఁజేసి రాజులు చంపుదు

      రవనిఁదఱచు జీవితార్థు లగుచు. (55)

11. కంసునకు బాణుడు, నరకుడు, జరాసంధుడు, అఘాసురుడు, కేశి, ధేనుకుడు, బకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, చాణూరముష్టికులు, అరిష్టుడు,ద్వివిధుడు, పూతన మొదలగు రాక్షసులు సహాయకులుగ ఉండిరి. (దశమస్కంధము – పూర్వభాగము – 56 వచనము.)

వ. మఱియు, బాణ భౌమ మాగధ మహాశన కేశి ధేనుక బక ప్రలంబ తృణావర్తచాణూర ముష్టికారిష్ట ద్వివిధ పూతనాది సహాయ సమేతుండై, కంసుండు కదనంబున మదంబులణంచిన, వదనంబులు వంచికొని సదనంబులు విడిచి, యదవలై యదువులు పదవులు వదలి, నిషద కురు కోసలవిదేహ విదర్భ కేకయ పాంచాల సాల్వదేశంబులు సొచ్చిరి. మచ్చరంబులు విడిచి, కొందఱు కంసునిం గొలిచినిలిచి రంత. (56)

హరిఓం‌‌





16 June, 2016

శ్రీమదాంధ్రమహాభాగవతము- దశమస్కంధము – ప్రశ్నోక్తి


ప్రార్థనా పద్యములు


శ్లో. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం|

      దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్||


శా. శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర

      క్షైకారంభకు భక్తపాలనకళాసంరంభకున్ దానవో

      ద్రేక స్తంభకుఁ గేళిలోలనిలసద్దృగ్జాలసంభూతనా

      నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్.


ఉ. వాలినభక్తి మ్రొక్కద నవారితతాండవకేలికిన్

      శాలికి శూలికిన్ శిఖరిజాముఖపద్మమయూఖమాలికిన్

      బాలశశాంకమౌలికిఁ గపాలిక్ మన్మథగర్వపర్వతో

      న్మూలికి నారదాదిమునిముఖ్యమనస్సరసీరుహాలికిన్.


ఉ. ఆతతసేవఁ జేసెద సమస్త చరాచరభూతసృష్టివి

     జ్ఞాతకు భారతీహృదయసౌఖ్యవిధాతకు వేదరాశిని

     ర్ణేతకు దేవతానికరనేతకుఁ గల్మషజేతకున్ నత

     త్రాతకు దాతకున్ నిఖిలతాపసలోక శుభప్రదాతకున్.


ఉ. ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగసం

      పాదికి దోషభేదికిఁ బ్రసన్న వినోదికి విఘ్నవల్లి కా

      చ్ఛేదికి మంజువాదికి నశేషజగజ్జననందవేదికిన్

      మోదక ఖదికిన్ సమదమూషక సాదిక్ సుప్రసాదికిన్.


ఉ. క్షోణితలంబునన్ నుదురు సోకగగ మ్రొక్కి నుతింతు సైకత

     శ్రోణికిం జంచరీకచయసుందరవేణికి రక్షితామర

     శ్రేణికిఁ దోయజాతభవచిత్తవశీకరణైకవాణికిన్

      వాణికి నక్షదామశుకవారిజపుస్తకరమ్యపాణికిన్


శా. పుట్టం బుట్ట శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్

     నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ

     దెట్టేవెంటఁజరింతుదత్సరణినాకీవమ్మ యోయమ్మ మేల్

     పట్టున్ నాకగుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీదయాంభోనిధీ.


ఉ. శారదనీరదేందుఘనసారపటీరమరాళమల్లికా

      హారతుషారఫేనరజతాచలకాశఫణీశకుందమం

      దారసుధాపయోధిసితతామరసామరవాహినీశుభా

      కారత నొప్పునిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు భారతీ!


ఉ. అంబ నవాంబుజోజ్జ్వలకరాంబుజ శారదచంద్రచంద్రికా

     డంబరచారుమూర్తిప్రకటస్ఫుటభూషణరత్నదీపికా

     చుంబితదిగ్విభాగ శ్రుతి సూక్తివివిక్తనిజప్రభావ భా

     వాంబరవీథివిశ్రుతవిహారిణి నన్ గృపఁజూడు భారతీ!


ఉ. అమ్మలఁ గన్నయమ్ ముగురమ్మలమూలపుటమ్మ చాలఁ బె

     ద్దమ్మ సురారులమ్మకడు పాఱడివుచ్చినయమ్మ దన్నులో

     నమ్మినవేల్పుటమ్మలమనమ్ముల నుఁడెడియమ్మ దుర్గ మా

     యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వపటుత్వసంపదల్.


మ. హరికిం బట్టపు దేవి పున్నెములప్రోవర్ధంపుఁబెన్నిక్క చం

      దురుతోఁబుట్టువు భారతీగిరిసుతుల్ దోనాడుపూఁబోడి దా

      మరలం దుండెడిముద్దరాలు జగముల్ మన్నించునిల్లాలు భా

       సురతన్ లేములు వాపుతల్లి సిరియిచ్చున్ నిత్య కల్యాణముల్.


క. శ్రీకంఠచాప ఖండన!

     పాకారి ప్రముఖ వినుతభండన! విలస

     త్కాకుత్స్థవంశ మండన!

     రాకేందుయశోవిశాల! రామనృపాలా!!


హరిఓం